సంపాదకీయం

దౌత్యనీతికి గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియాలో..ముఖ్యంగా దక్షిణాసియాలో అత్యంత ప్రభావశీలత కలిగిన దేశంగా భారత్ మరింతగా తన ఉనికి చాటుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం సహా ప్రపంచ సవాళ్లను ఎలుగెత్తి చాటడమే కాకుండా వాటి పరిష్కారానికి మార్గనిర్దేశం చేయడం రోజురోజుకు ఇనుమడిస్తున్న భారత ఖ్యాతికి, బలమైన ఆర్థిక వ్యవస్థగా లభిస్తున్న గుర్తింపునకు నిదర్శనం. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇరుగుపొరుగు దేశాలతోనే కాకుండా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను పెంపొందించుకోవాలన్న పట్టుదల మరింతగా పదునెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ వేదికలపై భారత్ లేవదీస్తున్న అంశాల పట్ల అనివార్యంగానే ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద ధోరణిని ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ఎండగట్టడమే కాకుండా ఈ జాఢ్యాన్ని రూపుమాపే విషయంలో ప్రపంచ దేశాలను సంఘటితం చేయడంలోనూ భారత్ కృతకృత్యమైందని చెప్పడానికి చైనాలో జరిగిన పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సు, అలాగే తాజాగా ముగిసిన తూర్పు ఆసియా-్భరత్ శిఖరాగ్ర భేటీలే నిదర్శనం. ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పథంలో పయనించి వృద్ధి రేటును ఇనుమడించుకోవాల్సిన తరుణంలో ఉగ్రవాదం పెనుభూతం కావడం క్షంతవ్యం కాదు. ముఖ్యంగా పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచే భారత్‌కు నిరంతరం ఉగ్ర సెగలు సోకుతూనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని ప్రపంచ దేశాల కళ్లకు కట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానం ప్రశంసనీయం. ఎప్పటికప్పుడు పాక్‌కు చెక్ పెట్టడం ద్వారానే దాన్ని దారికి తెచ్చే అవకాశం ఉంటుందన్నది ఎంతైనా వాస్తవం. నిన్న మొన్నటి వరకూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలకెక్కించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు శాయశక్తులా ప్రయత్నించిన పాక్‌కు భారత ప్రధాని మోదీ తాజాగా పెట్టిన మెలిక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఆక్రమిత కాశ్మీర్, గిల్జిత్ తదితర అంశాల్ని ఎప్పుడైతే మోదీ లేవనెత్తారో..పాక్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ రకమైన వ్యూహాత్మక పాచికలను గత ప్రభుత్వాలూ విసిరి ఉన్నట్టయితే కాశ్మీర్ సమస్య ఇంత తీవ్రతను సంతరించుకునేది కాదనడం ఎంతైనా నిజం.
ప్రతి విదేశీ శిఖరాగ్ర సదస్సునూ సద్వినియోగం చేసుకుని పాక్ ఉగ్ర స్వరూపాన్ని ప్రపంచ దేశాల కళ్లకు కట్టేందుకు మోదీ ప్రయత్నించడం..అందుకు అనుగుణంగానే భారత వాదన పట్ల అన్ని దేశాల్లోనూ సదవగాహన పెరగడం అన్నవి ఇటీవలి కాలంలో ఎన్నడూ సంభవించని పరిణామాలే! ఓ బలమైన, స్థిరమైన రాజకీయ వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌లో ఇనుమడిస్తున్న ఆత్మ విశ్వాసం ఇందుకు నిదర్శనం. 125కోట్ల జనాభాకు ప్రతినిధిగా తనకున్న అంతర్జాతీయ హోదానూ మోదీ ఈ విషయంలో అత్యంత చాకచక్యంగానే వినియోగించుకుంటూ వస్తున్నారు. ఆసియాలో రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఉనికిని అదే స్థాయిలో చాటుకోవడం అర్థరహితమేమీ కాదు. అదే విధంగా పొరుగున ఉన్న పాకిస్తాన్ వల్ల తనకు కలిగే కష్ట నష్టాల గురించే కాదు..ప్రపంచ శాంతికి వాటిల్లే ముప్పు గురించీ అంతర్జాతీయ వేదికలకెక్కడం ఎంతైనా సమంజసం. ఇందుకు చైనాలో జరిగిన జి-20సదస్సును ఎంతగా మోదీ సద్వినియోగం చేసుకున్నారో..14వ ఆసియా-్భరత్ శిఖరాగ్ర సదస్సులోనూ అంతగానూ విజయం సాధించారు. ఉగ్రవాదం విషయంలో భారత్ నిస్సహన విధానాన్ని అనుసరిస్తోందని చెప్పడమే కాకుండా ప్రపంచ శాంతి పరిరక్షణకు ప్రతి దేశం ఇదే ధోరణితో వ్యవహరించడమూ ఎంతో అవసరమన్న చైతన్యాన్ని దాదాపు అన్ని దేశాల్లోనూ భారత్ తీసుకొచ్చింది. గతానికి భిన్నంగా పాకిస్తాన్ విషయంలో పదునైన విధానంతో వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. గతంలో ఎప్పుడు అంతర్జాతీయ సమావేశాలు జరిగినా, శిఖరాగ్ర భేటీలు జరిగినా కాశ్మీర్ అంశానే్న పాడిందే పాటగా ఎత్తుతున్న పాకిస్తాన్ ఇప్పుడు అలాంటి అవకాశమే లేని పరిస్థితి! ఎందుకంటే పాక్ ఉగ్రవాద నైజాన్ని మోదీ విశ్వ వ్యాప్తం చేసినట్టుగా ఇప్పటి వరకూ వచ్చిన ఏ భారత ప్రధానీ చేయక పోవడం. ఉగ్రవాదమే అజెండాగా అటు జి-20, ఇటు లావోస్‌లో జరిగిన 11వ తూర్పు ఆసియా-్భరత్ శిఖరాగ్ర సదస్సులను మార్చిన మోదీ ఆ విధంగా అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న శక్తిని, సవాళ్లను ఎదుర్కోవడంలో అనుసరించే యుక్తినీ చాటిచెప్పారు.
ఉగ్రవాదానికి ఎల్లలు లేవు. దీనికి పాక్ నుంచి మద్దతు లభించినా..మరో దేశం దీనికి వంత పాడినా దాని తీవ్రత అంతర్జాతీయంగానే ఉంటుంది. ఇప్పటికే భారత్, ఫ్రాన్స్ సహా ప్రపంచ వ్యాప్తంగా ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉగ్ర బీభత్సాన్ని చవిచూశాయి. మొత్తం మానవాళికి, నాగరిక సమాజాలకు ముప్పు కలిగించే ఉగ్రవాదం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సాహం ఇస్తున్న దేశాలు ఏవైనా, వాటి వెనుక ఉన్న శక్తులు ఎలాంటివైనా ఉమ్మడి బలంతో ఎదుర్కొని మట్టుపెట్టాల్సిందే. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రాంతీయ కూటములన్నింటితోనూ బలం గా మమేకమవుతున్న భారత్..అదే స్థాయిలో ఉగ్రవాదాన్ని తుదముట్టించే చర్యలకూ ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉంది. అన్ని స్థాయిల్లోనూ సమన్వయం, సహకారం, సయోధ్యలను పెంపొందించుకుంటే తప్ప ఈ భూతానికి సమూలంగా పాతరేయడం సాధ్యం కాదు. ఈ లక్ష్యంతోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకోన్ముఖ లక్ష్యంతో ప్రపంచ దేశాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించడం ఎంతైనా అభినందనీయం. ప్రధానంగా పాక్‌ను వెనకేసుకొస్తున్న చైనా ముందే అదీ అమెరికా, జపాన్ వంటి దేశాల సమక్షంలోనే మోదీ చాలా బలంగానే తన గళాన్ని విప్పడం, అందుకు అన్ని దేశాల మద్దతునూ పొందడం దేశ విదేశాంగ వ్యూహాన్ని మరింత పదునుగా వ్యక్తీకరించే ప్రయత్నం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత దేశ విదేశాంగ విధానాన్ని నిగ్గుదేల్చడం అత్యంత అవసరం. అన్ని దేశాలతోనూ ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలు ఎంత అవసరమో..అభివృద్ధికి గొడ్డలి పెట్టులా పరిణమించే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల భరతం పట్టడమూ అంతే అవసరం. కేవలం తన ప్రభావాన్ని, ప్రభావశీలతనూ దక్షిణాసియా ప్రాంతానికే పరిమితం చేసుకోకుండా ఆసియా పసిఫిక్ సహా అన్ని ప్రాంతాలకూ విస్తరించుకోవడం, తద్వారా ఆయా ప్రాంతాల్లోని దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం భారత్ సాధించిన విదేశీ దౌత్య విజయాలు. అతి స్వల్ప వ్యవధిలో జరిగిన రెండు కీలక అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుల్లో భారత్ సాధించిన దౌత్య విజయం అనేక రకాలుగా దేశాభివృద్ధికి దోహదం చేసేదే అవుతుంది. ఇటు ఉగ్రవాదంపైనా సంఘటిత పోరుకు ప్రపంచ దేశాలను సమాయత్తం చేయడంతో పాటు ప్రగతి, అభివృద్ధి, అణు వ్యాప్తి నిరోధం వంటి అంశాలపైనా అన్ని దేశాల దృష్టినీ కేంద్రీకరించగలిగారు. కయ్యంతో సాధించలేని లక్ష్యాలను వ్యూహాత్మక వియ్యంతో సాధించవచ్చు. ఇప్పుడు భారత్ దౌత్య విజయాలకు ఇదే గీటురాయి.