సంపాదకీయం

కామెరాన్ చూపిన బాట...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రపంచంలో మరో సంచలనం! ఆయన రాజకీయాలనుంచి తప్పుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడలేదు. నిజానికి గత జూన్ నెలలో ప్రధానమంత్రి పదవీ త్యాగం చేయవలసిన అగత్యం డేవిడ్ కామెరాన్‌కు కలగలేదు. అయినప్పటికీ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్టు డేవిడ్ కామెరాన్ గత జూన్‌లో ప్రకటించాడు. బ్రిటన్ రాజకీయ వర్గాలను వోటర్లను మాత్రమేకాక అంతర్జాతీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. గత జూన్‌లో ఆయన ఎన్నికలలో ఓడిపోలేదు, ఆయనను పార్లమెంటరీ నాయకత్వంనుండి అధికార కన్సర్వేటివ్ పార్టీవారు తొలగించలేదు! ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పార్టీలో కాని ప్రతిపక్షాలలో కాని ఎవ్వరూ కోరలేదు కూడ. బ్రిటన్ కామన్స్-ప్రతినిధుల-సభలో ఆయన ప్రభుత్వానికి మెజారిటీ ఉంది, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామన్స్ సభలో అవిశ్వాస తీర్మానం కూడ ఎవ్వరూ ప్రతిపాదించలేదు. అయినప్పటికీ అక్టోబర్‌లోగా తాను ప్రధానమంత్రి పదవీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్టు గత జూన్ 24న కామెరాన్ ప్రకటించాడు. కానీ ఆయన అక్టోబర్ వరకు కూడ పదవిలో కొనసాగలేదు. జూలై 13వ తేదీననే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశాడు, వెంటనే ప్రధానమంత్రి అధికార నివాసమైన లండన్‌లో డౌన్‌వింగ్ వీధిలోని పదవ నంబరు ఇంటిని కూడ ఖాళీ చేశాడు. కన్సర్వేటివ్ పార్టీకే చెందిన థెరీసామాయ్ ప్రధానమంత్రి అయింది! మాయ్ కన్సర్వేటివ్ పార్టీ తదుపరి పార్లమెంటరీ నాయకురాలిగా ఎన్నికయిన వెంటనే కామెరాన్ ప్రధాని పదవిని ఖాళీ చేశాడు, అక్టోబర్ గడువు వరకు ఆగలేదు! ఇప్పుడాయన రాజకీయాలనుంచి కూడ వైదొలగాలని నిర్ణయించడం మరో ప్రజాస్వామ్య విస్ఫోటనం. ఎందుకంటే ఆయన వయస్సు నలబయి తొమ్మిది సంవత్సరాలు...డెబ్బయి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తరువాత కూడ ప్రజలకు సేవ చేయడమన్న సాకుతో ఎన్నికలలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరే రాజకీయ నాయకులు ప్రపంచమంతటా ఉన్నారు. వారందరూ నేర్చుకోవలసిన పాఠం కామెరాన్ రాజకీయ నిష్క్రమణం. అధికార రాజకీయం ఆజీవన వ్రతం కారాదన్నది కామెరాన్ చెబుతున్న పాఠం. ఆక్స్‌ఫర్డ్‌షైర్ ప్రాంతంలోని విట్నీ నియోజకవర్గానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న కామెరాన్ తన సభ్యత్వానికి సోమవారం రాజీనామా ప్రకటించాడు!
మాజీ ప్రధాన మంత్రి అయిన కామెరాన్ పార్లమెంటు సభ్యుడుగా కొనసాగడానికి కాని, మళ్లీ కామన్స్ సభకు ఎన్నిక కావడానికి కాని ఎలాంటి రాజ్యాంగ అవరోధం లేదు. మన దేశంతో సహా అనేకానేక ప్రజాస్వామ్య దేశాలలో మాజీ ప్రధానులు మళ్లీ మళ్లీ పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికవుతునే ఉన్నారు. ప్రధానమంత్రి పదవిని 1979లో అర్ధాంతరంగా వదులుకోవలసి వచ్చిన మన మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ ఆ తరువాత ఎన్నికలలో పోటీ చేయనని ప్రతిజ్ఞ చేశాడు, నిలబెట్టుకున్నాడు. కానీ మురార్జీ దేశాయ్‌కి 1979 నాటికి ఎనబయి మూడేళ్ల వయస్సు! కామెరాన్ వలె ఇంత చిన్న వయస్సులోనే స్వచ్ఛందంగా పార్లమెంటరీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న మాజీ ప్రధానులు ఇటీవలి కాలంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోను బహుశా లేరు! నిరసనలకు, అభిశంసనలకు, మెడపట్టి బయటికి గెంటినప్పటికీ చూరు పట్టుకుని వేలాడుతున్నాడు..వంటి వ్యాఖ్యలకు గురి కాకుండానే రాజకీయాలనుంచి నిష్క్రమించి ప్రజల మన్ననలను పొందడం కామెరాన్ ఆచరించిన ఆదర్శ ప్రజాస్వామ్య సూత్రం..మాజీ ప్రధానమంత్రి హోదాలో తాను కామన్స్ సభలో వెనుక వరుసలలో ఆసీనుడయినట్టయితే ప్రస్తుత ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి అది ఇబ్బందికరమని కామెరాన్ ప్రకటించడం కూడ అతని సౌజన్యానికి నిదర్శనం. నా ఉపస్థితి వల్ల మీరు దేశానికి చేయదలుచుకున్న ప్రతి మేలు ప్రాధాన్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నేను అడ్డుతగులుతున్నానన్న భావం మీకు కలగవచ్చు...అని ప్రధాని థెరీసా మాయ్‌కు ఆయన చెప్పాడు. అందువల్ల దేశానికి అవసరమైన నూతన నాయకత్వం నిర్నిరోధంగా పనిచేయడానికి వీలుగా పార్లమెంటరీ పదవిని సైతం వదలుకోవాలన్నది కామెరాన్ నిర్ణయం. రాజకీయ వేత్తలు-పాలిటీషియన్స్-, రాజనీతిజ్ఞులు-పొలిటికల్ సైంటిస్ట్స్- మాత్రమే అలరారుతున్న వర్తమానంలో కామెరాన్ ఇలా దేశహితానికి ప్రధమ ప్రాధాన్యం ఇవ్వగల జాతీయ నాయకుడు-స్టేట్స్‌మన్-గా ఎదగడం హర్షణీయ ప్రజాస్వామ్య పరిణామం!
సంకీర్ణ రాజకీయాలు, మిశ్రమ మంత్రివర్గాలు, సిద్ధాంత నిబద్ధత లేని పొత్తులు, సర్దుబాట్లు, పదవుల కుమ్ములాటలు ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనాలు కాజాలవు! ఇలాంటి సంకీర్ణ రాజకీయ శకం మన దేశంలో 1989 నుండి 2014 వరకు పాతికేళ్లు కొనసాగింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా ఈ సంకీర్ణ రాజకీయాలనుండి ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు విముక్తిని కలిగింది. బ్రిటన్‌కు దాపురించిన సంకీర్ణ రాజకీయాలనుండి విముక్తి కలిగించగలిగినవాడు కామెరాన్. 2010 నాటి ప్రతినిధుల సభ ఎన్నికల తరువాత ఆయన నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీవారు లిబరల్ డెమోక్రాటిక్ పార్టీతో పొత్తుపెట్టుకోవలసి వచ్చింది. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన నిక్ క్లెగ్‌కు ఉపప్రధానమంత్రి పదవిని కట్టబెట్టవలసి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కన్సర్వేటివ్ పార్టీ మొదటిసారి మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటు చేసింది! తోక కుక్కను ఆడించినట్టుగా లిబరల్ డెమొక్రటిక్ పార్టీ వారు కామెరాన్ ప్రభుత్వాన్ని బెదిరించడం తరువాత కథ...2015నాటి కామన్స్ సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించడం ద్వారా తాను ఆరంభించిన సంకీర్ణ శకానికి తానే భరతవాక్యం చెప్పగలిగిన ఘనత కామెరాన్‌కు లభించింది! కానీ 2015లో ఇలా చరిత్రను సృష్టించిన తరువాత సంవత్సరానికే కామెరాన్ పదవిని వదులుకున్నాడు! ఐరోపా సమాఖ్యలో తమ దేశం కొనసాగరాదని యాబయి రెండు శాతం బ్రిటన్ వోటర్లు జూన్ 23న తీర్పునివ్వడం ఇందుకు ప్రాతిపదిక! కామెరాన్ ప్రభుత్వం బ్రిటన్ ఐరోపా సమాఖ్యలో కొనసాగాలన్న విధానాన్ని అనుసరించింది. కానీ ఈ విధానం పార్టీలకు అతీతమైనది. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీలోని అత్యధికులు కూడ బ్రిటన్ ఐరోపా సమాఖ్యలో కొనసాగాలన్న వాదాన్ని బలపరిచారు. అలాగే కన్సర్వేటివ్ పార్టీలోను కొందరు వైదొలగాలని వాదించారు. కామెరాన్ మంత్రివర్గ సహచరులలో కూడ కొందరు కామెరాన్ విధానాన్ని అంగీకరించలేదు!
అందువల్ల జూన్ 23న జరిగిన జనవాక్య సేకరణ-రెఫరెండమ్-కేవలం బ్రిటన్ ప్రజల జాతీయతా నిష్ఠకు, వాణిజ్య స్వాతంత్ర నిబద్ధతకు మాత్రమే ప్రతీక! ఇరవై తొమ్మిది దేశాల ఐరోపా సమాఖ్య ఆధిపత్యం నుంచి తమ దేశానికి విముక్తి కావాలని మాత్రమే బ్రిటన్ వోటర్లు తీర్పునిచ్చారు. అయినప్పటికీ కామెరాన్ నైతిక బాధ్యతను వహించాడు. విధానానికి పరాజయం లభించినందుకు పదవిని వదిలిపెట్టాడు! బ్రిటన్‌లో 1812 తరువాత అతి చిన్న వయసులో, 42 ఏళ్లకు ప్రధానమంత్రి అయిన కామెరాన్ ఇలా ఆదర్శాన్ని ఆచరించి తనకంటె పెద్దలకు సైతం స్పూర్తికారకుడయ్యాడు!