మెయన్ ఫీచర్

ప్రజల ముసుగులో పాకిస్తాన్ తొత్తులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపిన దినకరుడు
ఒకడు, దురాక్రమణ మతిని
మసి చేసిన నిటలాక్షుడు
ఒకడు, దనుజరీతి కూల్చి
ధర్మం నిలిపిన రాముడు,
ఒక్కొక్కడు సరిహద్దుకు
ప్రాణం పోసిన అమరుడు
కానీ ‘‘నిదురపోయిన’’ మన వీరులను పాకిస్తానీ జిహాదీ దానవులు కారుచిచ్చునకు ఆహుతి చేయగలిగారు. జమ్మూకశ్మీర్‌లో బీభత్సకాండను సమర్ధిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వపు తొత్తులు ‘ప్రజల’ పేరుతో విశృంఖల విహారం చేస్తున్నారు. దేశ ప్రజల రక్షకులైన సైనికులను దుర్మార్గులుగా చిత్రీకరించి కశ్మీర్ లోయ ప్రాంతం నుంచి వారిని వెళ్లగొట్టాలన్నది పాకిస్తాన్ తొత్తులైన నకిలీ ప్రజల వ్యూహం. ఈ వలలో కేంద్ర ప్రభు త్వ నిర్వాహకులు చిక్కుకొని ఉండడం విచిత్రమైన విపరిణామం. సైనికుల విధి నిర్వహణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతుండడం జమ్మూకశ్మీర్‌లో నడుస్తున్న చరిత్ర..సైనికులు నిస్పృహలో నిద్దురపోతున్నారు. మరోవైపు, చిత్ర విచిత్ర పదజాలం ప్రచారవౌతోంది. ‘ప్రయోజనాధికారులు’ లేదా ‘ప్రయోజన అర్హులు’-స్టేక్ హోల్డర్స్- అన్న పదజాలం ఈ విచిత్రాలలో ఒకటి. జమ్మూ కశ్మీర్ ఏదో ఒక ప్రభుత్వేతర వాణిజ్య సంస్థ-ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ-అన్న అర్థం వచ్చేవిధంగా ఈ దుర్మార్గపు పదజాలం వ్యాపించిపోయింది. స్టేక్‌హోల్డర్స్ అందరితోను చర్చలు జరపాలి-అన్న ప్రకటన జాతీయ ప్రాంతీయ ప్రతిపక్షాల నోట పలుకుతోంది...కేంద్ర ప్రభుత్వం వారు కొంతమంది స్టేక్ హోల్డర్సును వదలిపెట్టి మిగిలినవారితో మాత్రమే చర్చలు జరుపుతున్నారన్నది కేంద్ర ప్రభు త్వ విధానంలోని లోపాలను ఏకరువు పెట్టదలచుకున్న ప్రత్యర్థిపక్షాల మాటలలోని ధ్వని...
ఇంతకూ ఈ ‘సటేకు హోలడరుసు’ ఎవరన్నది ఎడతెగని మీమాంస. ఈ మీమాంస కొనసాగుతుండడం జమ్మూకశ్మీర్‌లోని అతి ప్రధాన సమస్యనుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగం. ఆ సమస్య పాకిస్తానీ జిహాదీ బీభత్సకాండ. ఇలా దృష్టి మళ్లినప్పుడల్లా పాకిస్తానీ జిహాదీ తోడేళ్లు ఉక్కు కోరలతో ఆధీనరేఖ వద్ద ఉన్న ఇనుప కంచె కత్తిరించి కశ్మీర్‌లోకి దూకుతున్నాయి. సెప్టెంబర్ పద్ధెనిమిదవ తేదీన మళ్లీ దూకాయి. బారాముల్లా సమీపంలోని ఊరి పట్టణం సమీపంలోని సైనిక శిబిరంలోకి కేవలం నలుగురు పాకిస్తానీ జిహాదీ బీభత్సకారులు ధైర్యంగా చొరబడిపోవడానికి ఏకైక కారణం మన దృష్టి మళ్లి ఉండడం. పదిహేడుమంది మన సమర వీరులను ఈ నలుగురు నరరాక్షసులు పొట్టన పెట్టుకోగలిగారు. భద్రతను ప్రమత్తత ఆవరించి ఉండడం, బీభత్సకాండను ఉక్కుపాదంతో తొక్కివేయడం మాని కశ్మీర్‌లోని స్టేక్ హోల్డర్లతో చర్చలు జరపడం గురించి దృష్టి మళ్లడం ఈ ప్రమత్తతకు కారణం.
ఇరవయ్యవ తేదీన జిహాదీ హంతకులు మళ్లీ దాడులు చేయడం పథకం ప్రకారం విస్తరించిన పాకిస్తాన్ ప్రభుత్వ విషవ్యూహానికి నిదర్శనం. పద్ధెనిమిదవ తేదీన నలుగురు మాత్రమే చొరబడినారు. తర్వాతి రెండవ రోజున మరింత ఎక్కువమంది దూసుకొచ్చారు. అఖిలపక్షం ప్రతినిధులుగా సెప్టెంబరు మొదటివారంలో జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన ప్రతిపక్షాల వారు స్టేక్‌హోల్డర్సు’ అందరితోను చర్చలు జరుపవలసిందిగా ప్రభుత్వానికి ఉచిత సలహాలనిచ్చారు. టెర్రరిస్టులను, పాకిస్తానీ తొత్తులను అణచివేయమని సలహాలనిచ్చినవారు లేరు. బుర్హన్ వనీ వధ తరువాత కేంద్ర ప్రభుత్వం, అధికార పక్షం సైతం వీధులలో చేరి విధ్వం సం సృష్టించిన వారిని ‘ప్రజలు’గా గుర్తించడానికి సిద్ధపడడమే విచిత్రం. వాణి జ్య సంస్థలలో వాటాదారుల-స్టాక్ హోల్డర్లు-వలె జమ్మూకశ్మీర్‌లోని ‘స్టేక్ హోల్డర్లు’ ఎవరు?? నిజమైన ప్రజలను దేశభక్తులను రాజ్యాంగ వ్యవస్థ పట్ల నిబద్ధత కలవారిని స్టేక్ హోల్డర్సుగా గుర్తించిన విపక్షాలవారు చాలా తక్కువమంది. ఈ నిజమైన ప్రజలు జిహాదీ హంతకులకు భయపడి బిక్కుబిక్కుమంటున్న లోయ ప్రాంతంలోని ఇస్లాం మతస్తులు..ఈ నిజమైన ప్రజలు దశాబ్దుల తరబడి జిహాదీల బీభత్సకాండకు బలైపోయి స్వదేశంలోనే శరణార్థులుగా మారిన హిందువులు, కశ్మీరీ పండితులు. ఈ పండితులతో చర్చలు జరుపవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షంలోని ప్రతినిధులు కోరలేదు. సైనికులపై రాళ్లు రువ్వుతున్న వారితోను, వారి ప్రతినిధులతోను చర్చలు జరపాలట. వారు అఖిలపక్షం లోని అధికుల దృష్టిలో స్టేక్ హోల్డ ర్సు! సైనికులపై రాళ్లు రువ్వుతున్న వారి ప్రతినిధులు కశ్మీరీ హురియత్ ముఠాల వారు. ఈ హురియత్ ముఠాలవారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలను జరుపబోమని దశాబ్దులుగా ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ భక్తులు వారు. హురియత్‌లోని మెతకముఠా వారు కొన్ని సందర్భాలలో సిద్ధమయ్యారు. చర్చలు జరపడానికి...ఇప్పుడు వారు కూడ చర్చలు జరుపరు. హురియత్‌లోని ముదురు ముఠా ఎప్పుడు కూడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి సిద్ధం గా లేదు. కానీ కశ్మీర్‌కు అఖిలపక్షం వెళ్లినప్పుడల్లా బృందంలోని ప్రతిపక్షాలు వారు కొందరు హురియత్ నాయకులను దర్శిం చి రావడం ఆనవాయితీ అయిపోయింది.
సెప్టెంబరు నాలుగవ తేదీన ఈ జీలానీ భక్త బృందానికి శృంగభంగమైంది. సయ్య ద్ షా అలీ జీలానీకి గౌరవం ఘటించడానికై ఆయన ఇంటికి వెళ్లిన ఐక్య జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ ఇతరులకు ఆయన దర్శనం లభించలేదు. ఈ జీలానీ హురియత్ ముదురు ముఠా నాయకుడు గతంలో వామపక్షాల వారికి ఇతర ప్రతిపక్షాల వారికి ఇతగాడు దర్శనమిచ్చేవాడు. ఇలా జీలానీ పాకిస్తాన్ ప్రభుత్వపు తొత్తు, ప్రచ్ఛన్న బీభత్సకారుడు. దేశద్రోహి. నిర్బంధంలో కటకటాల ఊచలను లెక్కపెడుతూ పడి ఉండవలసిన జీలానీ ఇలా యధేచ్ఛగా శ్రీనగర్‌కు ఢిల్లీకి మధ్య విహరించగలగడం ప్రభుత్వాల ఘోర వైఫల్యం. పాకిస్తాన్‌కు వెళ్లి రావడానికి సైతం జీలానీ పదే పదే సిద్ధమవుతున్నాడు. ఇలాంటి స్టేక్‌హోల్డర్సు తోడేళ్ల వలె లోయప్రాంతంలో తిరుగాడుతున్నారు. సైనిక దళాలకు విరక్తిని కలిగిస్తున్న ప్రభుత్వ విధానమిది. ఈ విరక్తి వల్లనే సమరవీరులను ప్రమత్తత ఆవహించి ఉంది. ‘‘ఏమఱి రక్షసాలని మృగేంద్రుని నక్కయు కోలుపుచ్చు సంగ్రామము లోన..’’ అని మహాభారత కారుడు అన్నట్టు సింహాలవంటి మన సైనికులను పాకిస్తానీ గుంటనక్కలు హత్య చేస్తుండడానికి కారణం ప్రమత్తత. సైనికులు దేశానికి రక్షకులు. వారి ఉనికిని కన్యాకుమారిలో అయినా కశ్మీర్‌లో అయినా జనం హర్షించాలి. జనం హాయిగా నిర్భయంగా నిద్రపోవడానికి కారణం, నిరంతర నిర్నిద్రులైన సైనికులు. కశ్మీర్ లోయ ప్రాంతంలో సైనికుల ఉనికిని ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకిస్తున్నవారు ప్రజలా? ప్రజల రూపంలోని జిహాదీ బీభత్సకారులా? ఇలా సైనిక దళాలను కశ్మీర్ నుంచి ఉపసంహరించాలని కనీసం సంఖ్య ను తగ్గించాలని లోయ ప్రాంతంలోను దేశంలోను ప్రముఖంగా చెలామణి అవుతున్నవారు దశాబ్దులుగా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం కశ్మీర్ నుంచి కేంద్ర రిజర్వ్ పోలీసులను సైనికులను ఉపసంహరించాలన్న విధానాన్ని పదేపదే అమలు జరుపుతోంది.
ఈశాన్యంలో కాని కశ్మీర్ లోయలో కాని దేశంలోని మరే ఇతర ప్రాంతంలో కాని సైనిక దళాలు నెలకొని ఉన్నందువల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ప్రజలను హత్య చేస్తున్న జిహాదీలను ఇతర బీభత్సకారులకు సైనిక దళాల ఉనికి ప్రధాన నిరోధకం. కానీ ప్రజలకు బీభత్సకారుల ప్రమా దం నుంచి రక్షణ కల్పిస్తున్నది సైనికులు మాత్రమే. అందువల్ల నిజమైన ప్రజలు సైనికుల సంఖ్యను పెంచాలని మాత్రమే కోరుకుంటారు. బీభత్సకారులు, వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం, వారిని సమర్థిస్తున్న వారు, బీభత్స చర్యలను ఆమోదిస్తున్నవారు మాత్రమే సైనికుల ఉనికిని వ్యతిరేకించాలి. కానీ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సైనిక దళాల ఉనికిని వ్యతిరేకించడం చరిత్ర. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-పిపిపి-వంటి ప్రధాన రాజకీయ పక్షాలు సైనిక దళాల ఉనికిని, సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను కల్పించే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని నిరసించవలసిన కేంద్ర ప్రభుత్వం పదే పదే ఉపసంహరణ కోరికలకు లొంగిపోతోంది. మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశ వ్యవహారాల మంత్రి పళనియప్పన్ చిదంబరం కూడ అత్యుత్సాహంతో సైనిక దళాల ఉపసంహరణ కార్యక్రమాన్ని అమలు జరిపాడు. సైనిక దళాల సంఖ్య తగ్గినప్పుడల్లా కశ్మీర్ లోయలో జిహాదీ బీభత్సకారులు పేట్రేగిపోవడం దశాబ్దుల చరిత్ర.
గత రెండేళ్లకు పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడ దాదాపు ఇదే విధానాన్ని అనుసరించడం జాతీయ వైపరీత్యం. ఈ వైపరీత్యానికి ప్రధాన ప్రాతిపదిక ముఫ్తి మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పిడిపి- వారికి సైనిక దళాల ఉనికి పట్ల కొనసాగుతున్న వ్యతిరేకత. పిడిపితో కలిసి భారతీయ జనతాపార్టీ జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మరో జాతీయ వైపరీత్యం. పిడిపి జమ్మూ కశ్మీర్‌కు స్వయంపాలన కోరింది. ఈ కోరికను ఆ పార్టీ ఉపసంహరించుకున్నట్టు సమాచారం లేదు. బీభత్సకాండకు బలైపోయిన నిర్వాసితులై కశ్మీర్ వెలుపల జీవిస్తున్న హిందువులకు లోయ ప్రాంతంలో ఇళ్ల సముదాయాలను, పట్టణ వాటికలను నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సైతం పిడిపి సుముఖంగా లేదు. బుర్హన్ వనీ వధ తరువాత ‘‘అతగాడిని మట్టుపెట్టవలసిన అవసరం ఏమిటి? అని పిడిపి ప్రతినిధి ముజఫర్‌బేగ్ లోక్‌సభలో జూలై 20వ తేదీన ప్రశ్నించాడు. సైనికదళాల చర్యల పట్ల పిడిపి వైఖరికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే...
హంద్వారా పట్టణం సమీపంలో రెండు దశాబ్దులుగా నెలకొని ఉన్న సైనిక స్థావరాన్ని గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వం తొలగించింది. సైనికులు నివసిస్తుండిన నాలుగు సిమెంట్ భవనాలను కూలగొట్టి, అసైనికులను అక్కడినుంచి ఉపసంహరించారు. ఇలాంటి ఉపసంహరణల వల్ల సంయమ నం పాటించమని సైనిక దళాలకు ప్రభు త్వం ఇస్తున్న సలహాల వల్ల సైనికులు నిస్సహాయంగా నిలబడిపోతున్నారు...ఇప్పుడు మళ్లీ కశ్మీర్‌లో సైనిక దళాల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. మొదట తగ్గించడం దేనికి..?

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com