మెయన్ ఫీచర్

ప్రమాదంలో ప్రజారోగ్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షయ వ్యాధి బారినపడి ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూసిన తన భార్యకు సొంత ఊళ్లో అంతిమ సంస్కారం చేసేందుకు ఆ నిరుపేద గిరిజనుడు ఎవరూ చేయని సాహసం చేశాడు. అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి భార్య మృతదేహాన్ని తీసుకుపోయేందుకు ఆస్పత్రి సిబ్బంది కాళ్లుపట్టుకుని బతిమాలినా అతనికి ఫలితం దక్కలేదు. చివరికి చేసేదేమీ లేక భార్య మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి తన భుజాన వేసుకుని కాలినడకన తన ఊరికి బయలుదేరాడు. తన పనె్నండేళ్ల కుమార్తెతో కలిసి మృతదేహాన్ని భుజాన వేసుకుని ఆ గిరిజనుడు రోడ్డుపై నడిచి వెళుతుండడం చూసిన వారందరినీ నివ్వెర పరచింది. దాదాపు పది కిలోమీటర్లు నడిచాక ఒక చోట స్థానికులు అతడి కష్టాన్ని చూసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఒడిశాలో జరిగిన ఈ సంఘటన గురించి పత్రికల్లో, టీవీ చానళ్లలో తెలుసుకుని మానవతావాదులు నిశే్చష్టులయ్యారు. ఈ వార్తా కథనాన్ని చూశాక బహ్రెయిన్ రాజు తీవ్రంగా స్పందించి, ఆ గిరిజనుడికి ఆర్థిక సహాయం చేశారు. ఆకలి చావులకు, అంతుబట్టని వ్యాధులకు నిలయమైన ఒడిశాలోని కలహండి జిల్లాలో ఇలాంటి హృదయ విదారక సంఘటనలెన్నో. బాహ్య ప్రపంచానికి తెలిసేవి కొన్ని మాత్రమే. ఇలాంటి ఉదంతమే ఒడిశాలో మరొకటి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. బాలాసోర్ దగ్గర గూడ్సురైలు ఢీకొనడంతో ఎనభై ఏళ్ల పేదమహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన తీరు అమానవీయంగా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆమె మృతదేహాన్ని నడుం వరకూ విరిచేసి, గుడ్డలో చుట్టి వెదురుబొంగుకు వేలాడదీసి పోస్టుమార్టంకు తరలించారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ గానీ, ఏ ఇతర వాహనం గానీ లేకపోవడంతో స్థానిక పోలీసులే ఇలా చేయించడం దారుణం.
ప్రసవ వేదన పడుతున్న తన కుమార్తెను సైకిల్‌పై కూర్చోబెట్టి ఆస్పత్రికి తండ్రి తీసుకువెళ్లడం, కాన్పు జరిగాక తల్లీబిడ్డలను అదే సైకిల్‌పై తిరిగి ఇంటికి తీసుకుపోవడం మరో దిగ్భ్రాంతికర సంఘటన. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గర్భిణుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 3జనని ఎక్స్‌ప్రెస్2 అంబులెన్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్లు చేసినా అక్కడి సిబ్బంది స్పందించక పోవడం చివరికి నిండు చూలాలైన కూతురిని సైకిల్‌పై ఆ తండ్రి ఆస్పత్రికి తీసుకువెళ్లక తప్పలేదు. ఇలాంటి సంఘటనలు వెనుకబడిన ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల్లోనే కాదు. అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నామని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆస్పత్రులు, అధునాతన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్లనే కాదు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ మధ్య గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువును ఎలుకలు కొరికి చంపేస్తే, విజయవాడలోని సర్కారీ దవాఖానాలో చీమలు కుట్టి శిశువు మరణించడం సభ్య సమాజాన్ని తీవ్ర కలవరానికి గురిచేసింది. సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయామని సంబరపడుతున్న నేటి కాలంలో- ఎలుకలు,చీమలు కుట్టడం వల్ల శిశువుల ప్రాణాలు పోయాయంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఎంతస్థాయిలో ఉందో ఎవరికైనా అవగతమవుతుంది.
సమాజంలోని పేదవర్గాల వారు ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోలేరు గనుక ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాలకులు ఘనంగా చెబుతుంటారు. వృత్తిపై చిత్తశుద్ధి, అధికారుల అజమాయిషీ లేనందున ప్రభుత్వ ఆస్పత్రులు దీనావస్థలో ఉన్నాయి. ఇక్కడ నిరుపేద రోగులను పట్టించుకనే నాథుడే కనిపించడు. పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఎనె్నన్నో పథకాలను అమలు చేస్తోంది. ఏటా బడ్జెట్‌లో దండిగా నిధులను కేటాయిస్తోంది. ఇవన్నీ ఆచరణలో అంతంతమాత్రం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవాభావం కొడిగడుతోంది. ఏదైనా విషాదకర సంఘటన జరిగినపుడు తూతూమంత్రంగా విచారణ కమిటీలు వేయడం, వైద్య సిబ్బందిపై నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ఎనె్నన్ని దారుణ ఉదంతాలు వెలుగు చూస్తున్నా ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మాత్రం మారడం లేదు. ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్య ధోరణి అలాగే కొనసాగుతోంది. సకాలంలో వైద్య సహాయం అందక ఎంతోమంది పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ప్రాణాలను కోల్పోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో అయితే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాల వంటివే.
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా వైద్యరంగంపై పాలకుల తీరు దారుణంగానే ఉంది. ప్రపంచంలోనే అతి తక్కువ మొత్తాన్ని ప్రజారోగ్యం కోసం ఖర్చుచేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. మన దేశంలో ఆరోగ్య సేవల కోసం జనం చేస్తున్న ఖర్చులో ప్రభుత్వం వాటా 15 శాతం మాత్రమే. మిగతా 85 శాతం ఖర్చును ప్రజలే వెచ్చిస్తూ వైద్యం చేయించుకుంటున్నారు. ఆదాయంలో ఎక్కువ భాగం వైద్యం కోసం ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల పేద,మధ్య తరగతి ప్రజలపై అప్పుల భారం పెరిగి, ఖరీదైన వైద్యం కోసం ఆస్తులను అమ్ముకునే దుస్థితి సైతం నెలకొంటోంది. సరైన వైద్యం కోసం ఖర్చు చేయలేని వారు అకాల మృత్యువాతకు గురవుతున్నారు. ప్రపంచంలో వ్యాధుల తీవ్రతకు సంబంధించి భారతదేశం వాటానే 21%గా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
1991 నుంచి దేశంలో అమలులో ఉన్న ఆర్థిక సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు విధానాల ఫలితంగా వైద్యరంగంపై అనేక దుష్ఫరిణామాలకు దారితీసింది. ప్రజల ప్రాథమిక హక్కు అయిన వైద్య సేవలను అంగడి వస్తువుగా మార్చి మార్కెట్ శక్తుల చెప్పుచేతలలో ఉండేలా మార్చింది. కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడపడితే అక్కడ పుట్టుకొచ్చాయి. రోగుల ఆర్థిక పరిస్థితులతో ఈ ఆస్పత్రులకు ఎలాంటి సంబంధం ఉం డదు. ప్రపంచీకరణ కారణంగా వైద్యరంగంపై చేసే వ్యయాన్ని వృధా ఖర్చుగా పాలకులు భావిస్తున్న కారణంగా మన స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో అతి తక్కువగా అంటే కేవలం 1.3 శాతం నిధులు మాత్రమే ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. అంతర్గత ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికా తన జిడిపిలో 17.9 శాతాన్ని ఖర్చు పెడుతోంది. బాగా వెనుకబడిన ఆప్ఘనిస్తాన్ 8.6 శాతాన్ని ఆరోగ్యంపై ఖర్చుచేస్తుంటే భారత్‌లో కేవలం 3 శాతం లోపల మాత్రమే కేటాయిస్తున్నారు. నిన్నటివరకు అంతర్గత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న వెనుకబడిన శ్రీలంక ప్రజారోగ్యంపై చేస్తున్న ఖర్చులో మన దేశం సగం కూడా ఖర్చుచేయటం లేదు. శ్రీలంకలో ఒక్కో వ్యక్తిపై ఏటా రు.5,500కు పైగా ఖర్చుచేస్తుంటే భారత్‌లో రు.2,600 కేటాయిస్తున్నారు. దీన్నిబట్టి 125 కోట్ల భారతీయుల ఆరోగ్యంపై- ఘనత వహించిన పాలకుల వైఖరి ఏపాటిదో రుజువవుతోంది.
క్యూబా ఆదర్శం..
ఇక్కడ ప్రత్యేకంగా క్యూబా దేశంలోని ప్రజారోగ్యవ్యవస్థ గురించి చెప్పుకోవాలి. ఈ దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. క్యూబాలో విద్య, ఉపాధి వలే వైద్యరంగాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఈ దేశం భారత్ లాంటి పెద్ద దేశాల కంటే వైద్యరంగంలో గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రతి 150 మందికి ఒక వైద్యుడు ఉండే విధంగా ఆ దేశం అభివృద్ధి చెందింది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఈర్ష్య కలిగిస్తుంది. ఎందుకంటే యూరప్ దేశాలలో ప్రతి 330 మందికి ఒక వైద్యుడు ఉండగా, అమెరికాలో 417 మందికి ఒక వైద్యుడు ఉన్నాడు. అంతర్జాతీయ సోదర దృక్పధంలో క్యూబా తోటి లాటిన్ అమెరికా దేశాలకు వైద్య బృందాలను పంపిస్తోంది. దాదాపు 40వేల మంది క్యూబా వైద్యులు, సుశిక్షితులైన సిబ్బంది ఇతర దేశాలలో పనిచేస్తున్నారు. క్యూబాలో వ్యాధి వచ్చిన తరువాత వైద్యం చేయటంకన్నా అసలు వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా కుట్రల కారణంగా దశాబ్దాలుగా ఆర్థిక, వాణిజ్య దిగ్బంధానికి గురై బయటి దేశాల నుండి ఎలాంటి సహాయం లేకుండానే ఈ అభివృద్ధిని క్యూబా సాధించింది. సోషలిస్టు వ్యవస్థ వల్లనే ఇది సాధ్యమైంది. క్యూబా లాంటి దేశాలను చూసైనా మన పాలకులు స్ఫూర్తి పొందాలి.
అరకొర నిధులు..
ఇకనైనా ఆరోగ్యం రంగం కోసం మన జిడిపిలో కనీసం 5 శాతాన్ని ఖర్చుచేయాలి. అత్యున్నత ప్రమాణాలతోకూడిన ఆరోగ్య సేవలను ప్రజలకు ఆచరణలో అందుబాటులోకి రావాలి. మన దేశ జనాభాలో అత్యధిక శాతం మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో (83.3 కోట్లు) నివసిస్తున్నారు. గ్రామీణ వైద్యరంగానికి తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు వ్యాధులు రాకుండా ముందే తగు చర్యలు తీసుకోవాలి. పౌష్టికాహారం, పరిశుభ్రమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి జరగాలి. వైద్యరంగం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి. అభివృద్ధికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసులను రోగాల బారినుండి కాపాడాలి. సమగ్ర ప్రజారోగ్య వ్యవస్థను నిర్మించి, దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటంలో మన పాలక వర్గాలు విఫలమైన చరిత్ర మన కళ్లముందు కనబడుతుంది. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రజారోగ్య వ్యవస్థను మెరుగు పరచేందుకు కార్యాచరణతో ముందుకు కదలాలి. లేనిపక్షంలో వైద్య సహాయం అందక నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి కొనసాగుతూనే ఉంటుంది. అంతవరకూ ప్రజారోగ్య వ్యవస్థ కలవరపెడుతూనే ఉంటుంది.

-షేక్ కరిముల్లా