సంపాదకీయం

వికేంద్రీకృత పాలన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ముప్పయి ఒక్క జిల్లాలుగా వ్యవస్థీకృతం కావడం పరిపాలన వికేంద్రీకరణకు చారిత్రక ప్రతీక! వికేంద్రీకరణ అనాదిగా భారతీయ జీవన స్వభావం. స్వయం సమృద్ధ గ్రామం వికేంద్రీకరణకు పరాకాష్ఠ. ఈ వికేంద్రీకరణ వ్యవస్థనే మహాత్మా గాంధీ, దీనదయాళ్ ఉపాధ్యాయ లాంటి జాతీయ నాయకులు, దార్శనికులు ‘గ్రామ స్వరాజ్యం’ అని అన్నారు. ‘అంత్యోదయం’ లేదా అట్టడుగు స్థాయి వికాసం అని వివరించారు. పేర్లు ఏమైనప్పటికీ, వివరణ, విశే్లషణ, వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ సర్వ సమగ్ర సమాజ నిరంతర వికాసానికి వౌలికమైన ఆధారం వికేంద్రీకృత వ్యవస్థ! పది జిల్లాల తెలంగాణ ముప్పయి ఒక్క జిల్లాలుగా పునర్ వ్యవస్థీకృతం కావడం వల్ల ‘వికేంద్రీకరణ’ సర్వ సమగ్రం అయినట్టు కాకపోవచ్చు. కొత్త జిల్లా కేంద్రం వికేంద్రీకరణకు పరాకాష్ఠ కాకపోవచ్చు! కానీ విస్తృత వికేంద్రీకరణకు ఇది వినూతన అంకురార్పణ.. సరికొత్త శ్రీకారం అనడంలో రెండవ అభిప్రాయానికి బహుశా తావులేదు! ఒకచోట కోటి మంది ప్రజలు కేంద్రీకృతం అయినందు వల్ల లభించే సౌలభ్యం కంటె పది చోట్ల పదిలక్షల చొప్పున కేంద్రీకృతం కావడం వల్ల సమకూడగల సౌలభ్యం మరింత హెచ్చు. వందచోట్లకు లక్షమంది చొప్పున విస్తరించడం ‘వికేంద్రీకరణ’ స్వరూపం, వికేంద్రీకృత సమాజ స్వభావం! ఇలా జనాభా విస్తరించడం ప్రతీక మాత్రమే! పరిపాలన కేంద్రాలు, వాణిజ్య వాటికలు, పారిశ్రామిక ప్రాంగణాలు, విద్యావ్యవస్థలు, విజ్ఞాన కలాపాలు, సాంస్కృతిక సమాహారాలు కూడా విస్తరించడం ప్రగతికి పరాకాష్ఠ. ఈ పరాకాష్ఠకు కేంద్ర బిందువు అనాదిగా గ్రామం! ప్రజలు ‘ప్రగతి’ వెంట పరుగులు తీయనక్కరలేదు. ‘ప్రగతి’ గ్రామంలో కొలువుతీరింది. ఇంటి ముందు, ఇంటిలోపల నర్తించింది. ‘ప్రగతి’ ప్రజల వద్దకు వచ్చింది. యుగాలుగా, తరాలుగా సహస్రాబ్దులుగా శతాబ్దులుగా భారతీయుల గ్రామ స్వరాజ్యం ఇదీ, స్వయం సమృద్ధ గ్రామం ఇదీ! ఇలా అట్టడుగు స్థాయి వరకు పరిపాలన, అధికారం, ప్రగతి, పాటవం వికేంద్రీకృతం కావడం నిజమైన జీవన ప్రగతి. ఇదంతా పరిమళాల పచ్చని పంట పొలంలోకి పందుల వలె విదేశీయ దురాక్రమణ మూకలు మన దేశంలోకి చొరబడేవరకు కొనసాగిన వికేంద్రీకృత భారతీయ సమాజ స్వభావం! విదేశీయ దురాక్రమణదారులు- ఈ దేశంపై,ఈ సమాజంపై,ఈ భూమిపై, ఈ జాతిపై మక్కువలేని వారు- పరిపాలకులుగా చెలామణి అయిన దాదాపు వెయ్యేళ్ల కాలంలో ఈ ‘వికేంద్రీకరణ’ వ్యవస్థ ధ్వంసమయింది. విదేశీయ పాలకులు ధ్వంసం చేశారు! ‘కేంద్రీకరణ’ పరాకాష్ఠకు చేరింది. మళ్లీ ‘వికేంద్రీకరణ’ జరగడానికి నూతన జిల్లాల వ్యవస్థ.. అందువల్ల మరో శుభంకరమైన శ్రీకారం..
దేశంలో పరిపాలన కేంద్రీకృతం కావడానికి కారణం విదేశీయుల ‘పాలన’. విదేశీయులు పరిపాలన పేరుతో సాగించింది నిజానికి దోపిడీకాండ. ఈ దేశం పట్ల, ఈ భూమి పట్ల ‘ఆరాధన భావం’ కలిగిన స్వదేశీయులు పాలించిన కాలంలో రాజ్యాంగ వ్యవస్థ మాత్రమే కాదు, సకలవిధ వ్యవస్థలు అట్టడుగు స్థాయి వరకు వికేంద్రీకృతమై ఉండేవి. అందువల్లనే ప్రతి గ్రామంలోను భౌతిక బౌద్ధిక ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక అవసరాలన్నీ తీరేవి. గ్రామీణ ప్రజలకు గ్రామంలోనే ఉపాధి లభించేది. వివిధ రకాల ‘రాజధానుల’ ప్రజలకు అక్కడనే భుక్తి లభించేది. సంస్థానం, మండలం, పరగణా, సామంత రాజ్యం, సమగ్ర రాజ్యం వంటి వ్యవస్థలకు రాజధానులుండేవి. అయితే గ్రామీణులు విద్యాభ్యాసం కోసం కాని, పాలనాపరమైన అనుమతుల కోసం కాని, న్యాయం కోసం కాని, ధార్మిక సాంస్కృతిక అవసరాల కోసం కాని రాజధానులకు పరుగులు తీయవలసిన పని ఉండేది కాదు! ఈ ‘వికేంద్రీకృత’ రాజ్యాంగ వ్యవస్థ మొత్తం సువిశాల భారత సామ్రాజ్యంలో సమీకృతం అయి ఉండేది. ఒకే సామ్రాజ్యం, ఒకే జాతిగా వివిధ రాజ్యాల ప్రజలు సమీకృతిని సాధించడం భారత చరిత్ర! ‘సమీకృత వ్యవస్థ’ కేంద్రీకృత వ్యవస్థ కాలేదు! ‘సమీకృతి’ వేరు! కేంద్రీకరణ వేరు!! ఇలాంటి ‘సమీకృత’ రాజ్యాంగ వ్యవస్థ ఉండిన భారతదేశంలో ‘గ్రామం’ అట్టడుగు స్థాయి పాలనా విభాగం..
విదేశీయులు ఈ పాలనా వ్యవస్థను ధ్వంసం చేశారు. ప్రజలను పీడించి పన్నులను దండుకోవడం మాత్రమే విదేశీయుల లక్ష్యం. అందువల్ల లక్షలాది సంవత్సరాల వికేంద్రీకృత వ్యవస్థ క్రమంగా నశించింది. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని విదేశీయ జిహాదీ బీభత్సకారులు ధ్వంసం చేసిన నాటి నుంచి 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలు విముక్తం చేసే వరకూ తెలంగాణ ప్రాంతం విదేశీయుల దోపిడీకి గురి కావడం చరిత్ర! బ్రిటన్ దురాక్రమణ స్థిరపడిన తరువాత బ్రిటన్ పరమోన్నత అధికార పరిధికి లోబడిన ‘నిజాం’లు తెలంగాణ ప్రాంతాన్ని ‘పాలన’ పేరుతో పీడించారు. ఈ పీడ విరగడయ్యే నాటికి తెలంగాణలో మాత్రమే కాదు దేశమంతటా కూడా కేంద్రీకృత పాలన నెలకొని ఉంది. పెద్ద తాలూకాలు, పెద్ద జిల్లాలు, అతిపెద్ద రాష్ట్రాలు.. ఒకప్పుడు యాబయి ఆరు- ఛప్పన్న రాజ్యాలుగా వ్యవస్థీకృతమై ఉండిన దేశం 1956లో కేవలం పదునాలుగు ‘రాజ్యాలు’- స్టేట్స్-గా ఏర్పడింది! పరిపాలన కేంద్రీకరణకు ఇది ఒక ఉదాహరణ! క్రమంగా ‘వికేంద్రీకరణ’ మళ్లీ వికసిస్తోంది. పదునాలుగు ‘స్టేట్స్’ సంఖ్య ప్రస్తుతం ఇరవై తొమ్మిదికి పెరిగింది. అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ‘తెలంగాణ’గా, నవ్యాంధ్రప్రదేశ్‌గా రెండుగా పునర్ వ్యవస్థీకృతం కావడం కూడా ‘వికేంద్రీకరణ’కు దోహదం చేసిన శుభ పరిణామం! అలాగే దేశంలో 1956 నాటికి 300 జిల్లాలుండగా వీటి సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 71 జిల్లాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రంలో సైతం 14 జిల్లాలున్నాయి. ఉమ్మడి మదరాసు రాష్ట్ర పునర్ విభజన తరువాత ఏర్పడిన తమిళనాడులో 1953లో కేవలం 13 జిల్లాలు.. ప్రస్తుతం 28 జిల్లాలయ్యాయి! 1956లో కర్నాటక-మైసూరు-లో 19 జిల్లాలుండగా వాటి సంఖ్య ప్రస్తుతం ఇరవై ఆరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాలూకాల స్థానంలో చిన్నవైన మండలాలు ఏర్పడినప్పటికీ జిల్లాల సంఖ్య గణనీయంగా పెరగకపోవడం పాలనా వైపరీత్యం!
ఈ వైపరీత్యాన్ని తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించడం అభినందనీయం. పది జిల్లాలు ముప్పయి ఒక్క జిల్లాలుగా ఏర్పడడం వల్ల ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాలలో జనసమ్మర్థనం, కాలుష్యం తగ్గుతాయి. నూతనంగా అవతరిస్తున్న జిల్లాల కేంద్రాలలో సైతం ప్రగతి మరింతగా వికసిస్తుంది! జిల్లా కార్యాలయాలు, న్యాయాలయాలు ప్రజలకు మరింత చేరువ కావడం అతి ప్రధానమైన పరిణామం. ఆ మూలనున్న అచ్చంపేటతో పాటు ఈ మూలనున్న ‘పాలమూరు’ కేంద్రానికి పరుగులు తీయనక్కరలేదు. ఒక వరంగల్లు జిల్లా అయిదు జిల్లాలుగా ఏర్పడడం వల్ల జిల్లా కేంద్రానికి రావలసిన ప్రజలు బోలెడు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కాగలదు. ఆదిలాబాద్ జిల్లా వారికి ప్రయాణ సౌలభ్యం పరాకాష్ఠకు చేరనుంది. తెలంగాణ స్ఫూర్తితో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిన్న జిల్లాలు ఏర్పడాలి..