మెయన్ ఫీచర్

ఇపుడంతా అసహనం.. అరాజకీయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమపై చిన్న నింద వినిపించినా, అది పత్రికల్లో కనిపించినా ఆ రోజంతా బయటకొచ్చేవారు కాదు.. జనం తమ గురించి చెడుగా అనుకుంటారేమోనని బాధపడేవారు.. సున్నిత మనస్కులయితే పదవులకు రాజీనామా చేసేవారు.. ఎలాంటి ఆవేశపూరిత సందర్భంలోనైనా ప్రత్యర్థులపై మాట తూలేవారు కాదు.. సభ్యత, సంస్కారం విస్మరించేవారు కాదు.. ఇది ఒకప్పటి రాజకీయ నేతల సంగతి. విలువలు లుప్తమైన నేటి రోజుల్లో అసెంబ్లీలోనే బూతులు తిట్టుకుంటున్నారు. ఒకరి చరిత్రను మరొకరు తవ్వితీసుకునే క్రమంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. రాజకీయాలంటే ఇలా ‘మాస్ మసాలా’ మాదిరిగానే ఉండాలి. లేకపోతే ‘మజా’ లేదన్నట్లుగా ఉంది ఇప్పటి నేతల వ్యవహారశైలి! మీడియా కూడా బాగా తిట్టగలిగే వారినే మొనగాళ్లుగా చూపిస్తున్నాయి. శాసనసభ, శాసనమండలి పనితీరును పరిశీలిద్దాం. శాసనసభలో నుంచి ఏ అంశంపైనా కూలంకష చర్చ జరిగిన సందర్భాలు లేవు. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దూషణలూ తప్ప! శాసనమండలిలో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నా మీడియా మాత్రం తిట్లకు పరిమితమైన శాసనసభ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చి, శాసనమండలి వార్తలను మాత్రం పట్టించుకోవు. తిట్లను పదే పదే టెలికాస్టు చేస్తేనే రేటింగులొస్తాయి మరి. ప్రింట్ మీడియాకూ శాసనమండలి అంటే చులకన. ఎందుకంటే అక్కడ మాస్ మసాలా ఉండదు కాబట్టి!
ఇక, ఎపిలో గత రెండున్నరేళ్ల నుంచి ఎప్పుడూ లేనంత వ్యక్తిత్వ హనన రాజకీయ ప్రక్రియ ఇపుడు కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌కు చంద్రబాబును సీఎంగా చూడటం ఇష్టం లేదు. ఎంతోమంది సీనియర్లను చూసిన బాబుకు, జగన్ ప్రతిపక్షనేత స్థానంలో ఉండటం ఇష్టం లేదు. టిడిపి, వైకాపాలు వ్యక్తిగతంగా దూషణలతో, రాజకీయ విలువలను భ్రష్ఠుపట్టించడంలో పోటీపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా నిండు సభలో చేసిన దారుణ వ్యాఖ్యలు, ఆమె వెనుక ఉన్న వారు చేసిన రన్నింగు కామెంటరీని లోకమంతా చూసింది. ఆ సందర్భంలో స్పీకర్, సర్కారునుద్దేశించి తిట్టిపోసిన జ్యోతుల నెహ్రూ ఆ తర్వాత టిడిపిలో సేదదీరడం మరో వైచిత్రి. నాటి తిట్ల పురాణంలో తెదేపా తమ్ముళ్లూ శక్తిమేరకు వైకాపాను తిట్టిపోసి, ప్రభుభక్తి చాటుకున్నారు.
ఇక్కడ వైఎస్ సిఎంగా ఉండగా ప్రతిపక్షనేత బాబుపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను గుర్తు చేసుకోకతప్పదు. ‘అసలు నువ్వు మీ తల్లి కడుపులో నుంచి ఎందుకు వచ్చానా? అని బాధపడతావ్. నిన్ను కడిగేస్తా’ అని బాబుపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత- తన మాటలను ఉపసంహరించుకునే సమయంలో కూడా వైఎస్ తన వ్యాఖ్యను మరోసారి గుర్తు చేసి తన మార్కు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు జగన్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యక్తిత్వ హననంలో జగన్ తండ్రిని మించిన తనయుడన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య తెదేపా శిక్షణ శిబిరం సందర్భంగా పార్టీ కమిటీలు, మండల వ్యవస్థ మీద చర్చ జరుగుతోంది. వేదిక మీద పార్టీ అధినేత బాబు, కళా వెంకట్రావుతోపాటు లోకేష్ ఉన్నారు. ఆ సందర్భంలో విప్ కూన రవికుమార్ సంస్థాగతమైన సందేహం లేవనెత్తితే, దానికి లోకేష్ సమాధానం ఇస్తున్నారు. అప్పుడు హోంమంత్రి చినరాజప్ప జోక్యం చేసుకుని తన అనుభవాన్ని వివరించారు. సీన్ కట్ చేస్తే- జగన్ మీడియా, దానికి అనుబంధంగా ఉండే మరికొన్ని సోషల్‌మీడియా సైట్లలో హోంమంత్రిని లోకేష్ అవమానించారని నానా రచ్చ చేశాయి. లోకేష్ వేదిక మీద ఎలా ఉంటారన్నది మరో లాపాయింటు. బిజెపి, కాంగ్రెస్ రాజకీయ శిక్షణ శిబిరాలు, వర్కింగ్ కమిటీ సమావేశాల్లో కేంద్రమంత్రులు వేదికలెక్కరు. ఎంత సీనియర్లయినా కిందనే కూర్చుంటారు. తెదేపా శిక్షణ శిబిరంలోనూ అదే చేసినట్లు కనిపించింది. లోకేష్-రాజప్ప వ్యవహారం రచ్చ కావడంతో దిద్దుబాటు చర్యకు దిగిన లోకేష్, ఆ వీడియోను విడుదల చేసి, ఆరోజు ఏం జరిగిందో వెల్లడించడంతో ఆత్మరక్షణలో పడటం వైకాపా వంతయింది. ఇలాంటి చీప్ ట్రిక్కుల వల్ల ముందు వైకాపా ప్రచారపరంగా కొంత లాభపడినా, వీడియో విడుదలయ్యాక తర్వాత పరువుపోగొట్టుకోవలసి వచ్చింది కదా?! అసెంబ్లీలో కూడా వైకాపా ధోరణి అలాగే ఉంది. చివరకు ఏమైంది? రోజాతోపాటు మరకొందరిని సస్పెండ్ చేయాలనుకున్న సమయంలో, నోరుజారిన మిగిలిన వారు క్షమాపణ చెప్పి బయటపడవలసి వచ్చింది. రాజకీయాల్లో అనుభవం లేకపోతే ఇలాగే దెబ్బతినవలసి వస్తుంది. మళ్లీ దానిని దృష్టి మళ్లించేందుకు మరో అంశాన్ని తెరమీదకు తీసుకురావడం. దానిపై ఉభయ శిబిరాల నుంచి మళ్లీ తిట్ల పురాణాలు!
బాగా మాట్లాడటం, జనాలను ఆకర్షించడం, తనవారి కోసం పోరాడటం వంటి మంచి లక్షణాలున్న జగన్‌కు పక్కన అనుభవజ్ఞులు లేకపోవడం, ఉన్న వారి సలహాలు పట్టించుకోకపోవడమే సమస్యలకు కారణం. రోజా, బుద్దా వెంకన్న వంటి నేతలు ‘మాటల యుద్ధం’లో వాడుతున్న పదాలతో చూసేవారికి చీదర, వినేవారికి రోత! ఇదే రాజకీయమనుకుంటే అలాంటి ‘అరాజకీయాలు’ మనకు అవసరమా?
నిజానికి ఎపిలో రెండు పార్టీల మధ్య కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు కులాల మధ్య పోరు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు 500, 1000 కరెన్సీ నోట్లను నిషేధించాలని ప్రధానికి లేఖ రాస్తే అదొక దుమారం. పదివేల కోట్ల రూపాయల నల్లధనంపై చర్చ కూడా రాజకీయాల్లో విలువలను దిగజారేలా చేస్తోంది. ఆ ‘నల్ల’వీరుడు జగనే అని తెదేపా శిబిరం ఆరోపించడం రాజకీయమే. వైసీపీ చెప్పినట్లు నల్లధనం చెల్లించిన ‘ముసుగువీరుడి’ పేరు తెదేపాకు ఎలా తెలిసింది? కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వారికి చెవిలో చెప్పారా? అలా చెబితే అదీ తప్పే కదా?! ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తన విధేయుల నోటికి చంద్రబాబు కళ్లెం వేయాల్సి ఉంది. జగన్ కూడా తన విధేయుల నోటిని అదుపులో ఉంచాలి. లేకపోతే వీరి కంపు నవ్యాంధ్ర జనాలకు అంటురోగం తెప్పించడం ఖాయం!
* * *
జిల్లాల సంఖ్యను 31గా చేసి తెలంగాణను పెద్ద రాష్ట్రంగా మార్చేసిన ఉత్సాహంలో ఉన్న సిఎం కేసీఆర్ ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీసే వ్యూహానికి తెరలేపినట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఇపుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే విపక్షాలకు ఏడెనిమిది సీట్లే వస్తాయన్నది ఆయన సర్వేలో వచ్చిన ఫలితాలట! కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తామన్న హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషం. దానివల్ల ఒక్క టీఆర్‌ఎస్సే కాదు, అన్ని పార్టీల బలమూ విస్తరిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత- జిల్లాల విభజన తీరుపై వస్తున్న నిరసనలు ఎందుకో మీడియాలో చోటుచేసుకోలేకపోయాయి. జిల్లాల విభజన తర్వాత ఉద్యోగుల గోస ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. కమలనాధన్ కమిటీ మాదిరిగా వారి సమస్యల కోసం ఇక్కడా ఒక కమిటీ వేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి సెలవిచ్చారు. కమనాధన్ కమిటీ తమ సమస్యలను పరిష్కరించకుండా ఏళ్లూ పూండ్లూ గడిపేస్తుందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. సొంత రాష్ట్రంలో అదే సమస్యలపై వేయనున్న కమిటీ వాయువేగంతో నిర్ణయాలు తీసుకోకపోతే కమలనాధన్ కమిటీకి, కొత్త కమిటీకి తేడా ఉండదు.
ఇక- కేసీఆర్ చెప్పినట్లు విపక్షాలకు ఏడెనిమిది సీట్లే వచ్చి విపక్షాల పుట్టిమునిగిపోతే, అది రాజకీయంగా కేసీఆర్‌ను మరో మెట్టు పైకెక్కిస్తుంది. అందుకు విరుద్ధంగా జరిగితే ఏమిటన్నదే ప్రశ్న. సహజంగా అధికారంలో ఉండే వారికి భవిష్యత్తు సానుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ వారి కళ్లతో చూస్తారు కాబట్టి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎంగా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అలాంటి ధీమాతోనే సొంత పార్టీ పెట్టి, చివరకు సొంత సోదరుడిని కూడా గెలిపించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో చాలామంది- కాంగ్రెస్, తెరాస గెలిచే సీట్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయనుకున్నారు. కానీ వచ్చిన ఫలితాలు అందుకు విరుద్ధం. కేసీఆర్ విపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలు, మహాకూటమిలో కలసి పోటీ చేసినప్పుడు వచ్చిన స్థానాలు కూడా ఆయన ‘ఊహకు అందనివే’! కాసేపు కేసీఆర్ అంచనా నిజమేనని, బంగారు తెలంగాణ కోసం ఆయన చేస్తున్న కృషి ఫలితమే ఆ విజయమనుకుందాం. అంత ధీమా ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో రాజీనామా చేయించి, మళ్లీ ప్రజల తీర్పు కోరాలన్న విపక్షాల డిమాండును గౌరవించవచ్చు కదా? విశ్వాసం మంచిదే. మితిమీరిన ఆత్మవిశ్వాసమే అనర్థం! *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144