మెయన్ ఫీచర్

బడుగులకు బడుగు మేధావుల హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడుగులకు రాజ్యం, బిసిలకు రాజ్యాధికారం, ఎస్సీలకు రాజ్యాధికారం అనే మాటలు చిరకాలంగా వినవస్తున్నాయి. ఇటీవలి దశాబ్దకాలంలో ఇంకా ఎక్కువగా. ఇది మంచిదే. అందులో తగినంత అర్ధం ఉంది. కాని ఈ వర్గాలకు రాజ్యాధికారం లభించేలోగా మరేమైనా కూడా కావాలా, లేక ఏదీ అక్కరలేదా? ఈ వర్గాలకు చెందిన సామాన్యులు, యువకులు తమకు ఈలోగా కూడా ఎన్నో అవసరమనే ఆలోచనలోనే ఉన్నట్లు, కాని వారికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్న మేధావులలో కొందరు మాత్రం ఇంకేమీ అక్కరలేదనే ధోరణి చూపుతున్నట్లు కనిపిస్తున్నది.
ఉదాహరణకు విద్యారంగాన్ని చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో, యూనివర్సిటీలకు వెళితే ఒక పరిస్థితి కన్పిస్తున్నది. అవన్నీ దాదాపు బడుగువర్గాల క్యాంపస్‌లు అన్నట్లు మారాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత కాలంలో చదువులు, ఆదాయాల అవకాశాలు పైస్థాయికి చేరటంతో ఉన్నత వర్గాలవారు అధిక భాగం అటువంటి కోర్సులు, ఉద్యోగాలలోకి వెళుతున్నారు. మామూలు యూనివర్సిటీల్లో వారి చేరిక బాగా తగ్గింది. అందువల్ల మిగులుతున్న సీట్లు బడుగువర్గాల వారికి లభిస్తున్నాయి. అదిగాక స్కాలర్‌షిప్‌ల సంఖ్య, సొమ్ము మొత్తాలు, ఇతర సదుపాయాలు పెరుగుతున్నాయి. దానితో క్యాంపస్‌లలో చాలావరకు వీరే కనిపిస్తున్నారు.
ఎందుకోసం జరిగినా ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇట్లా జరగటం వల్ల బడుగువర్గాల వారికి బాగా చదువుకునేందుకు విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇది గతంలో చరిత్రలోనే లేని పరిస్థితి. కేవలం యూనివర్సిటీలు కాదు. నిజానికిది ఈ దేశంలో బడుగు జాతుల వేల సంవత్సరాల చరిత్రలోనే కన్పించని అవకాశం. అటువంటిది లభించినపుడు వారు చేయవలసిందేమిటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని రెండు కోణాలనుంచి చూడాలి. ఒకటి వారి తక్షణ వ్యక్తిగత ప్రయోజనాలు. రెండు, దీర్ఘకాలికమైన విస్తృత ప్రయోజనాలు. లభించిన అవకాశాన్ని వారు ఎంత బాగా ఉపయోగించుకుంటే వారి లక్ష్యాలు అంతగా నెరవేరుతాయి. కాని అది జరుగుతున్నదా? అందుకోసం స్వయంగా ఆ విద్యార్థులు, యువకులు స్వంత చైతన్యంతో కొంత ప్రయత్నిస్తున్నారు. కాని వారికి మార్గదర్శనం చేయవలసిన బడుగు మేధావులు ఈ దిశలో ఎంతవరకు ఆలోచిస్తున్నారన్నది అనుమానాస్పదంగా ఉంది. వారు యువతరాన్ని ఒకవైపు ఈ లక్ష్యాలవైపు నడిపిస్తూ, మరొకవైపు వారిని రాజ్యాధికారంకోసం సిద్ధంచేయాలి. కాని ఈ లక్ష్యాలను గాలికి వదిలి కేవలం రాజ్యాధికారమంటూ మాట్లాడటం కనిపిస్తున్నది. అందువల్ల జరుగుతున్నదేమిటి? రాజ్యాధికారం ఏ పద్ధతిలో, ఎప్పటికి సిద్ధించేదీ తెలియదు. ఇంకా చెప్పాలంటే రాజ్యాధికారం, రాజకీయాధికారం గురించి వారి ఆలోచనలలో స్పష్టత కన్పించదు. అటువంటి అధికారం లభించటం గుర్తింపు రాజకీయాలకోసమా, లేక ఆ తర్వాత ఏమిచేయాలనే ప్రణాళిక ఏదైనా వీరి దృష్టిలో ఉందా తెలియదు. అటువంటివి లేనందుకే ఈ వర్గాల పార్టీలు అధికారంలోకి వచ్చిన చోట్లకూడా ఉన్నత వర్గాల ఆర్థిక, రాజకీయ, పరిపాలనాపరమైన, అభివృద్ధి సంబంధమైన, నైతికమైన మోడల్‌నే అనుసరిస్తూన్నారు.
ఆ విషయం అట్లుంచితే, బడుగు మేధావులనేవారు పలువురు, రాజ్యాధికారం వచ్చేలోగా ఈ వర్గాల విద్యార్థులు, యువకులు ఏమి చేయాలన్న ప్రశ్నపై వారికి మార్గదర్శకత్వం వహించటంలో మాత్రం విఫలమవుతున్నారు. తిరిగి పైన పేర్కొన్న విషయాలకు వెళదాం. వీరి తక్షణ, వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరాలంటే యూనివర్సిటీలలో అపూర్వమైన రీతిలో లభిస్తున్న విద్యావకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. క్లాసులకు సరిగావెళ్లటం, పాఠాలు చెప్పించుకోవటం, చెప్పినవి సక్రమంగా వినటం, లైబ్రరీలను ఉపయోగించుకోవటం, కష్టపడి చదవటం, క్లాసులకు బయటకూడా అపరిమితంగా అందుబాటులోకి వస్తున్న జ్ఞానాన్ని ఆర్జించటం, తద్వారా బలమైన అభ్యర్థులుగా, వ్యక్తులుగా మారి క్యాంపస్‌ల బయటకురావటం జరగాలి. కాని ఏ కొద్దిమందో తప్ప ఈ పనిని అధికులు చేయలేకపోతున్నారు. ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు. పైన అనుకున్నట్లు తమకుగల స్వంత తాపత్రయాలలో కొందరు ఆ పనిచేస్తున్నా, బడుగువర్గాలకు చెందిన మేధావులనుంచి, ఇంకా చెప్పాలంటే ఆ వర్గాల అధ్యాపకులనుంచి కూడా విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం లభించటంలేదు. అది జరిగితే పరిస్థితి ఈసరికి భిన్నంగా ఉండేది. అది లభించకపోగా, రాజ్యాధికార నినాదాలు ఎక్కువై తగినంత మంది నష్టపోతున్నారు. కావలసింది రెండింటిమధ్య తగిన పద్ధతిలో సమతులనం. అది ఉండటం లేదు. యుద్ధం చేయవలసిన సైనికునికి యుద్ధం గురించి బోధించటంతోపాటు, తను ఆ యుద్ధం చేయగల విధంగా భౌతికంగా, శిక్షణలపరంగా తయారుచేయాలి. కానపుడు యుద్ధమెట్లా చేయగలడు? బడుగు యువకులు చైతన్యంతోపాటు మేధోపరంగా, విద్యాపరంగా తయారుకావాలి. బాగా చదివి జీవితాలలోనూ పైకి రావాలి. కానపుడు వారిని కొందరు అధికారం పేరిట సమిధలుగా తయారుచేయటం వరకే జరుగుతుంది. అందువల్ల ఆ మేధావుల అహాలు, మేధో అవసరాలు, సమాజంలో ప్రతిష్ట సంపాదించుకునే కోరికలు తీరవచ్చు. కాని యువకులకు, బడుగు సమాజానికి అంతకుమించి కొన్ని కావాలి.
మేధావుల ఉద్దేశాలు మంచివే. కాని వారు అనుసరిస్తున్న పద్ధతులు మాత్రం ఆబ్జెక్టివ్‌గాకన్నా సబ్జెక్టివ్‌గా ఉంటున్నాయి. అందువల్ల వారు తమ తీరును మార్చుకున్నట్లయి చాలా మంచి చేయగలరు. క్యాంపస్‌ల అవకాశాన్ని సద్వినియోగ పరచుకున్నట్లయితే తక్షణ, వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరే అవకాశాలు లభించటంతోపాటు దీర్ఘకాలిక, విస్తృత ప్రయోజనాలు కూడా సిద్ధించే అవకాశాలుంటాయని పైన అనుకున్నాము. అవేమిటి? అందుకు సమాధానం మరొకవైపునుంచి మొదలు పెడదాము. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌కు దేశ విదేశాలలోగల మేధోఖ్యాతి ఎటువంటిదో చెప్పనక్కరలేదు. ఆయన కఠోరమైన సాధన ద్వారా ఆ శక్తిని సాధించారు. బడుగుల సమస్యకు అంతిమ పరిష్కారం రాజ్యాధికారమేనని కూడా తేల్చి చెప్పారు. తను ఆ మేధాశక్తిని సంపాదించి ఉండకపోతే, కేవలం రాజ్యాధికార పరిష్కారాన్ని చెప్పారంటూ బడుగులు ఆయనను ఇంతగా ఆరాధించేవారా? ఇతరులు అయిష్టంగానైనా విధిలేక తనను అంతగా గౌరవించేవారా? ఆయన రాజ్యాంగ ముసాయిదా తయారీ కమిటీకి అధ్యక్షత వహించటం సరేసరి. కాని రాజ్యాంగ సభలో ఆ ముసాయిదాపై ఆర్టికిల్స్ వారీగా చర్చలు జరిగినపుడు, తన వివరణలు, సవరణలకోసం సభలోని ఉన్నత వర్గాలకు చెందిన మేధావులు కూడా ఎట్లా ఎదురుచూసి తన ప్రతి మాటను సరైనదిగా భావించి ఆమోదించారో గమనిస్తే ఆయన గొప్పతనం ఏమిటో ఇంకా అర్ధమవుతుంది. ఇవి బయటకు ఎక్కువగా ప్రచారమైన విషయాలు కావు.
సరిగా దీనిని ఉదాహరణగా తీసుకొని వర్తమానపు బడుగు మేధావులు, ఆ వర్గాల యువకులు అర్ధం చేసుకోవలసిన కీలకమైన విషయం ఒకటున్నది. అది పైన చెప్పుకున్న విస్తృతమైన, దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించి నటువంటిది. ఈ దేశంలో విద్వత్తుపై పట్టు సంపాదించి, తద్వారా మేధావి వర్గంగా పేరుపడినవారు, అదే విధంగా ఒక తరగతిగా స్థిరపడినవారు ఉన్నత కులాల వారు. అదే స్థితి వేల సంవత్సరాలుగా సాగి ఇప్పటికీ కనిపిస్తున్నది. ఇదొక వాస్తవం. క్రీస్తుపూర్వపు వేదకాలంనుంచి మొదలుకొని సామాజికంగా, ఆర్థికంగా, అప్పుడప్పుడు మేధోపరంగా, అసమ్మతి వర్గాల నుంచి భిన్నవిశ్వాసాల రీత్యా, విదేశీయుల (ముస్లిములు, బ్రిటిష్‌వారు) పాలనా కాలాలలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వారు వాటిని తట్టుకుని నిలవగలిగింది ఆ శక్తివల్ల మాత్రమే. దానిని ప్రాతిపదిక చేసుకుని సవాళ్లను ముఖాముఖి ఎదుర్కొనటమే కాదు. పరిస్థితులనుబట్టి వాటిని తమలో ఇముడ్చుకోవటం, తాము అందుకు అనుగుణంగా సవరణలు చేసుకోవటం వంటి పద్ధతులను కూడా అనుసరిస్తూ తమ పైచేయిని మాత్రం నిలుపుకొన్నారు.
ఆధునిక కాలంలో ఇందుకు సరితూగ గల విద్వత్తును సంపాదించినవాడు డాక్టర్ అంబేద్కర్. ఈ విషయం బడుగు మేధావులు, యువతరం స్వయంగా గుర్తించి మాట్లాడుతున్నటువంటిదే. సగర్వంగా చాటుతున్నదే. ఇటువంటి కృషిని ఈ వర్గాలు ఎంత చేయగలిగితే వారి విస్తృతమైన, దీర్ఘకాలికమైన లక్ష్యాలు అంతగా నెరవేరుతాయి. పైన అనుకున్నట్లు తక్షణమైన, వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా. మరి ఈ దిశలో ఏమి జరుగుతున్నది, ఎంత జరుగుతున్నది? బయట మనకు కనిపిస్తున్న దానిని బట్టి మాత్రం రెండూ బలహీనంగానే ఉన్నాయి. ఇందుకు బాధ్యత ఈ వర్గాల యువకులకన్న అనేక రెట్లు ఎక్కువగా ఆ వర్గాల మేధావులది. వారు అన్నీ తెలిసినవారై కూడా యువకులను అందుకు తగిన విధంగా సిద్ధం చేయకపోవటమేగాక, తమ శక్తిని, విద్యార్థి యువజనుల శక్తిని వృథాచేస్తున్నారు. అట్లా జరగరాదంటే అందుకు ప్రాథమిక చర్యగా వారు స్వయంగా క్లాసులకు తప్పక వెళ్లి, పాఠాలు సక్రమంగా చెప్పాలి. వారిలో తామైనా చదవనివారు, లైబ్రరీలకు పోనివారు, ఒరిజినల్ పరిశోధనలు చేయనివారు చాలామంది ఉన్నారు. వారు ఆ పద్ధతులు మార్చుకోవాలి. తాము చదవక, విద్యార్థుల చేత చదివించకపోవటమేగాక, ‘‘చదువెందుకు ఉద్యోగాలు వస్తున్నాయా?’’, ‘‘చదివే రాయాలా, ఏదో ఒక విధంగా పాసైతే చాలదా?’’అని తప్పుదారి పట్టించి హాని చేసేవారు కూడా తగినంతమంది ఉన్నారు. వారికి అంబేద్కర్‌ను ఉదాహరించే నైతిక హక్కు ఉంటుందా? ఇటువంటి వైఖరులు బడుగు విద్యార్థులలో కొన్ని అవాంఛనీయమైన, తమకుతామే హాని చేసుకునే ధోరణులకు దారితీస్తున్నాయి. ఈ మేధావుల దృష్టికి ఎంతవరకు వచ్చిందో తెలియదు గాని, బడుగు విద్యార్థులు, యువకులలో వీరి తీరుపట్ల విసుగు చూపుతున్నవారు తక్కువకారు. వివిధ కారణాలవల్ల వారు పైకి మాట్లాడలేక పోతున్నారంతే. సభల్లోని బ్యాక్ బెంచర్లను, గ్రామాల వారిని వింటే, వీరికి సమాంతరంగా వౌనసముద్రం ఒకటి ఉన్నట్లు అర్ధమవుతుంది.
కనుక బడుగు మేధావులు తమ వర్గాల విద్యార్థులకు, యువకులకు కత్తిని డాలును కూడా సమకూర్చే విధంగా కృషిచేయాలి. అందుకోసం తమ దృష్టిని మార్చుకోవాలి. కత్తి, డాలు రెండింటిలో ఏదోఒకటి ఉండి, అది ఎంతమంచిది అయినా, రెండవది లేకపోవటం పెద్ద బలహీనత, కొరత అవుతుంది. యధాతథంగానే ఈ వర్గాలకు అనేక సవాళ్లున్నాయి. ఆ పేరిట రాజకీయాధికారం సంపాదించిన వారికి కూడా తక్కువ లేవు. అటువంటి స్థితిలో చేజేతులా ఇటువంటి వైఫల్యాలతో కొత్త సవాళ్లను తయారుచేసుకోవటం ఎందుకు? చరిత్రలో లేని అవకాశాలు అంది వచ్చినపుడు వాటిని జారవిడుచుకోవటం ఏమిటి?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)