ఉత్తరాయణం

అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేల కోట్ల రూపాయల మేరకు వివిధ రాష్ట్రాల ప్రజలను మోసగించిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూముల వివరాలను ప్రభుత్వం బహిరంగ పరచాలి. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం తదితర సమాచారాన్ని ప్రకటించి, ఆ సంస్థకు చెందిన అన్ని స్థిరాస్తులను విక్రయించి బాధితులకు న్యాయసమ్మతంగా నష్టపరిహారం పంపిణీ చేయాలి. ఆక్రమణ దారులు, బినామీల నుండి ఈ భూములను సంరక్షణ చేసి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. విచారణ దశలో ఉన్న అగ్రిగోల్డ్ కేసులన్నింటినీ కోర్టులో త్వరితగతిన ముగించి, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలి.
-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
వీడియోలుగా చూపాలి..
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక పురస్కారాలు పొందిన వారి పాఠ్యప్రదర్శనలను వీడియో తీయించి, వాటిని అన్ని విద్యాసంస్థల్లో ప్రదర్శింపజేయాలి. ఈమేరకు విద్యాశాఖ తగు చర్యలు తీసుకోవాలి. దీనివల్ల అవార్డులకు గౌరవం, సంబంధిత ఉపాధ్యాయుల ప్రతిష్ఠ పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ప్రదానం చేస్తున్న అవార్డుల వల్ల సంబంధిత ఉపాధ్యాయులకే కాకుండా విద్యా సంస్థలన్నింటికీ ఉపయోగపడాలి. అవార్డు గ్రహీతల పాఠ్యబోధన విధానాన్ని వీడియో తీయించి అన్ని పాఠశాలల్లో ప్రదర్శిస్తేనే అవార్డు గ్రహీతలకు సైతం సంతృప్తి ఉంటుంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
ఆయుర్వేద ఆస్పత్రులు ఏవీ?
ఆయుర్వేద మందులు, ఇంగ్లీషు మందులు చాలా ఖరీదైపోతున్నాయి. పేదలకి అవి అందని ద్రాక్ష అని చెప్పవచ్చు. ప్రతి జిల్లాలోనూ చౌకగా ఆయుర్వేద మందులు అమ్మే షాపులు ఉండాలి. ప్రభుత్వమే అన్ని ప్రాంతాల్లోనూ ఆయుర్వేద ఆస్పత్రులు స్థాపించాలి. ప్రైవేట్ ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం హోమియోపతి , ఆయుర్వేద వైద్యాలయాలు స్థాపించడం లేదు. ప్రతి జిల్లాకు కనీసం ఒక హోమియో వైద్యశాల, ఆయుర్వేద వైద్యశాల అవసరం.
- వి.వివేక్, దొండపర్తి
ఎస్‌ఎంఎస్‌ల హడావుడి..
విద్యుత్ శాఖ ఆఫీసు నుంచి బిల్లు కట్టవలసిన తేదీకి పది రోజులు ముందే ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు. గడువులోగా బిల్లు కట్టకపోతే పెనాల్టీ పడుతుందని ప్రజలకు మాత్రం తెలియదా? బిల్లులో కట్టాల్సిన తేదీ, డిస్కనెక్షన్ తేదీ వుంటాయి కదా. ప్రైవేటు సంస్థలు ఇలా చేస్తున్నాయి కనుక తామెందుకు అలాచేయకూడదని విద్యుత్ శాఖ తలంపా?
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
అన్నీ తెలుసుకోవాలి..
అన్ని కళాశాలల్లో లైంగిక విజ్ఞానం ప్రవేశపెట్టాలి. అనుభవమైన డాక్టర్లచే నెలకు ఒకరోజైనా లైంగిక వ్యాధులు, సమస్యల గురించి విద్యార్థులకు చెప్పాలి. యోగా, శరీర సౌష్టవ పోటీలు ప్రతి డిగ్రీ కళాశాలల్లో సంవత్సరానికి ఒకసారైనా నిర్వహించాలి. కేవలం పాఠాలు చెప్పడమే కాదు. మానసిక, శారీరక సమస్యలపైనా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. కళాశాల స్థాయిలో అబ్బాయిలకు, అమ్మాయిలకు విడివిడిగా అందాల పోటీలు నిర్వహించాలి. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉన్నపుడే వారు చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించగలుగుతారు. టీనేజీ వయసులో యువతలో ఉన్న అపోహలు, అనుమానాలను ఎప్పటికప్పుడు అధ్యాపకులు, తల్లిదండ్రులు నివృత్తి చేస్తుండాలి.
- కె.వి.రమణి, విశాఖపట్నం
కోర్టులంటే లెక్కలేదా?
కోర్టు తీర్పులనే ధిక్కరించే ప్రబుద్ధులు నేడు తయారవుతున్నారు. లోధా కమిటీ సూచనల్ని పాటించాల్సిందే అని భారత క్రికెట్ సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే కొన్ని పాటిస్తాం, మరికొన్ని పాటించం అంటోంది ఆ సంఘం. ఇక- తమిళనాడుకి కావేరి జలాలు ఇవ్వాలని సుప్రీం ఆదేశిస్తే ఒక్కచుక్క కూడా ఇచ్చేదిలేదంటూ కర్నాటక అసెంబ్లీ తీర్మానించింది. ప్రధానిగా పనిచేసిన దేవెగౌడ సుప్రీం తీర్పుని నిరసిస్తూ దీక్ష చేయడం విడ్డూరం. అర్హులైన వారినే న్యాయమూర్తులుగా ఎంపిక చేసే స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని ‘పిల్’ వేస్తే, మాకెవరి సర్ట్ఫికెట్ అవసరం లేదంటూ దాన్ని కొట్టేసింది సుప్రీం కోర్టు. ఇవన్నీ చూస్తుంటే న్యాయవ్యవస్థపై నమ్మకం సడలుతోంది.
- సత్య, కరప