సబ్ ఫీచర్

అధ్యక్ష పోరులో మానవ హక్కుల ప్రస్తావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీగా సాగుతున్న వాదోపవాదాల్లో మానవ హక్కుల అంశాలు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. చిత్రహింసల నుండి వేతనంతో కుటుంబ సెలవు, వలసల నుండి పోలీసింగ్ వరకూ అనేక విషయాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి బరిలో ఉన్న హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు గెలుపొందినా వారు ప్రాధాన్యతగా చేపట్టవలసిన అం శాల్లో మానవ హక్కులను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను ఇక్కడ విశే్లషించడం సందర్భోచితం.
గ్వాంటనామా జైలు
2009లో అధ్యక్ష పదవిని చేపట్టిన మరుక్షణమే బరాక్ ఒబామా గ్వాంటనామా వద్దగల సైనిక జైలును ఏడాదిలోగా మూసివేయాలన్న ఉత్తర్వుపై సంతకం చేశారు. ఎనిమిదేళ్లవుతున్నా ఇంకా ఈ జైలు 61 మందితో కొనసాగుతోంది. ఇక్కడి ఖైదీల్లో అత్యధికులపై ఎటువంటి నేరారోపణలు లేవు. దశాబ్దాలుగా ఈ జైలు అమెరికాకు అపకీర్తి తీసుకొస్తూ, ‘అన్యాయానికి’ చిహ్నంగా నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఢీకొంటున్న హిల్లరీ, ట్రంప్ గానీ, వారి సహచరులు గానీ ఈ అంశాన్ని అరుదుగా ప్రస్తావించారు. ఈ జైలును మూసివేయడానికి గత ఫిబ్రవరిలో ఒక ప్రణాళికను ఒబామా కాంగ్రెస్‌కు సమర్పించారు. నిర్బంధంలో ఉన్న కొందరిని విచారణ నిమిత్తం సైనిక కమిషన్ల ముందు కాకుండా ఫెడరల్ కోర్టు ముందు ఉంచాలని, మరి కొందరిని ఇతర జైళ్లకు తరలించి వారి నిర్బంధాన్ని పొడిగించాలని ఆ ప్రణాళికలో సూచించారు. సైనిక కమిషన్ ముందు అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలు పాటించే అవకాశం లేనందున ఫెడరల్ కోర్టుకు మార్చడానికి మానవ హక్కుల సంఘాలు ఆమోదం తెలిపినా, విచారణ జరుపకుండా నిర్బంధంలో కొనసాగించడాన్ని హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
చిత్రహింసలకు తెరపడాలి..
2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాదుల దాడుల అనంతరం అమెరికా కొనసాగిస్తున్న ‘చిత్రహింసల’ విషయమై స్పష్టమైన వైఖరిని తెలపాలంటూ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులపై వత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే రహస్య నివేదిక (2014లో సెనేట్ నిఘా కమిటీ విడుదల చేసిన నివేదిక) ప్రకారం ‘ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా నేతృత్వంలో రహస్య నిర్బంధ కేంద్రాలు తెరచి అనేక మందిని బంధించి వారిపై చిత్రహింసలు కొనసాగిస్తున్నారు. చిత్రహింసలకు గురిచేసిన కొందరు అధికారులపై అసమగ్రంగానైనా ప్రాసిక్యూషన్ జరిపినా, సిఐఎ ఎటువంటి చర్యలకు ప్రయత్నించలేదు. బాధితులకు ఎటువంటి ఉపశమనం కల్గించలేదు. నిషేధించిన పద్ధతులకు సైనికులు పాల్పడకుండా కట్టడి చేస్తానని, కొన్ని చట్టాల్లో మార్పులు తెస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. తాను అధ్యక్ష పదవి చేపడితే ప్రపంచంలో ఎక్కడా అమెరికా చిత్రహింసలకు పాల్పడబోదని హిల్లరీ హామీ ఇచ్చారు. నిఘా, సైనిక, పోలీస్ వర్గాల నివేదికలను పరిశీలిస్తే- నేరాలను అదుపు చేయడానికి చిత్రహింసలు ఏమాత్రం దోహదపడవని స్పష్టమైనట్లు ఆమె ప్రకటించారు. అమెరికాలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ఈ చిత్రహింసలను పేర్కొనవచ్చు. అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయంగా మారుతున్న చిత్రహింసలకు స్వస్తి చెప్పాలంటే అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఆరోపణలపై విచారణ జరిపి, బాధ్యులైనవారికి శిక్షలు విధించి, బాధితులకు తగిన పరిహారం చెల్లించాల్సి ఉంది.
సైన్యంలో లైంగిక హింస
అమెరికా సైన్యంలో లైంగిక హింస వికృతరూపం దాల్చిందని, ఫిర్యాదులొచ్చినా నిందితులెవరినీ విచారించడం లేదని ట్రంప్ విమర్శించారు. సైన్యంలో లైంగిక హింస అనే రుగ్మతను నివారించేలా దూకుడుగా వ్యవహరిస్తానని హిల్లరీ ప్రకటించారు. లైంగిక హింసను ఎదుర్కొన్న బాధితుల పట్ల అభ్యర్థులిద్దరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడ్డమే కాకుండా, ఆ విషయమై ఫిర్యాదు చేసిన వారిపట్ల సైనికులు మరింత అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ‘మానసికంగా అనారోగ్యంతో’ ఉన్నారన్న ముద్రవేసి, బాధితులు సైన్యం నుండి నిష్క్రమించేలా చేస్తున్నారు. ఆ విధంగా సైన్యంలో ఉద్యోగం కోల్పోయిన బాధితులు అత్యంత దుర్భర జీవనం గడపాల్సి వస్తోంది.
వలసలు, నేరాలు
అమెరికాలో జోరందుకున్న అనధికార వలసలు, ఫలితంగా పెరుగుతున్న నేరాల గురించి వాదోపవాదాలు తీవ్రంగానే జరుగుతున్నాయి. ఉగ్రవాదులు, ప్రమాదకర నేరస్తులను దేశం నుండి గెంటివేసి, అమెరికా పౌరులకు భద్రత కల్పిస్తానని, వలసవచ్చినవారిలో నేరచరిత్ర కలిగినవారిని వెనుకకు పంపివేస్తానని, వలస నిబంధనలను కఠినతరం చేస్తానని ట్రంప్ తరచూ చెబుతున్నారు. భద్రతకు ప్రమాదం కలిగిస్తున్నవారిని వెనుకకు పంపాల్సిందేనని హిల్లరీ కూడా స్పష్టం చేస్తున్నారు. వలసలు పెరిగినకొలదీ నేరాలు పెరుగుతున్నాయనే వాదనలు వాస్తవం కాదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వలస వచ్చిన వారు చిన్న నేరాలకు పాల్పడినా తీవ్ర శిక్షలకు గురిచేస్తున్నారు. క్రిమినల్ న్యాయ వ్యవస్థను సంస్కరించడం అత్యవసరమని, వలసదారులను బలిపశువులు చేయడం కాదని ‘హ్యుమన్‌రైట్స్ వాచ్’ వంటి హక్కుల సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
సామాజిక నిర్బంధాలు..
అమెరికా న్యాయవ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య- సామూహిక అరెస్ట్‌లు జరుపుతూ, విచారణ లేకుండా దీర్ఘకాలం జైళ్లలో నిర్బంధించడం. నేడు అమెరికా జైళ్లలో 23 లక్షల మందికి పైగా ఈ తరహా ఖైదీలున్నారు. న్యూమెక్సికో, మరో 13 రాష్ట్రాల జనాభా కన్నా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. అమెరికాలో 3.3 కోట్ల మంది వరకూ ఉన్న బాలలకు సంబంధించి దాదాపు సగం మంది తల్లిదండ్రులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఏటా 1.10 కోట్ల మందిని అరెస్టుచేస్తుండగా, వారిలో 6.36 లక్షల మంది తిరిగి ఇంటిముఖం పడుతున్నారు. జైళ్లలో ఉన్నవారిలో, కఠినశిక్షలకు గురవుతున్న వారిలో అత్యధికులు నల్లజాతీయులే. క్రిమినల్ న్యాయ వ్యవస్థలో వర్ణ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది.
జీతంతో కుటుంబ సెలవు
గర్భస్థ సమయంలో జీతంతో కుటుంబ సెలవులు సమకూర్చడం గురించి 185 దేశాలలో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించిన నివేదికలో రెండు దేశాలు మాత్రమే అందుకు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. అవి అమెరికా, పపువాన్యుగినియా. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం చాలాచోట్ల జీతం లేకుండా సెలవు మంజూరు చేస్తూంటే, నాలుగు రాష్ట్రాలు మాత్రం జీతంతో సెలవులు ఇస్తున్నాయి. ప్రసవం తర్వాత తల్లులకు ఆరు వారాలు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ట్రంప్ అంటుంటే, 12 వారాల పాటు 66 శాతం జీతంతో సెలవు ఇచ్చేందుకు హిల్లరీ సుముఖంగా ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించడానికి ఈ ఇద్దరూ సిద్ధంగా లేరని చెప్పవచ్చు.
డ్రగ్స్‌పై యుద్ధం
‘మాదక ద్రవ్యాలపై యుద్ధం’ ప్రకటిస్తామని చెబుతున్నా, ఈ విషయమై న్యాయవ్యవస్థ విధానం పట్ల ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల్లో స్పష్టత కనబడటం లేదు. ‘డ్రగ్స్’ నియంత్రణకు ఏటా అమెరికా బిలియన్ల డాలర్లకొద్దీ ఖర్చుపెడుతోంది. ఈ విధానాల సామర్థ్యాన్ని మెక్సికో, కొలంబో వంటి దేశాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు గంజాయి పెంపకాన్ని చట్టబద్ధం చేయగా, శిక్షల కన్నా- డ్రగ్స్ వినియోగంపై చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా భావించేవారు. యువతను చెడగొడుత్ను డ్రగ్స్‌ను అరికట్టేందుకు అత్యుత్తమ అధికారులను నియమిస్తానని ట్రంప్ చెప్పారు. కేవలం డ్రగ్స్‌ను కలిగి ఉండటంపైనే కాకుండా, హింసకు దారితీసే నేరాలపై దృష్టిసారిస్తామని హిల్లరీ పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ‘డ్రగ్స్‌పై యుద్ధం’ ప్రకటించి 45 ఏళ్లు గడచినా ఇప్పటికీ వాటిని కట్టడి చేయడంలోగానీ, వినియోగాన్ని తగ్గించడంలోగానీ ‘అగ్రరాజ్యం’ పురోగతీ సాధించ లేకపోయింది.
డ్రోన్‌ల వినియోగం
యుద్ధప్రాంతాలకు వెలుపల డ్రోన్‌ల వినియోగంపై తలెత్తుతున్న వివాదాల పట్ల అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, హిల్లరీ వౌనంగానే ఉంటున్నారు. ‘లక్ష్యంగా జరిగే హత్యల’ కోసం రిమోట్‌తో నడిచే ఎయిర్‌క్రాఫ్టులను ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎవరు ఎవరిని, ఎంతమందిని చంపుతున్నారు? అన్న వివరాలను బయటకు పొక్కనీయడం లేదు. డ్రోన్‌లతో చేసే దాడులను హిల్లరీ సమర్ధించగా, ఇది విదేశాంగ విధానంలో భాగంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. మొత్తమీద కీలకమైన మానవ హక్కుల అంశాలపై ఇద్దరు అభ్యర్థులు స్పష్టమైన విధానాలను ప్రకటించకుండా, కప్పదాటు ధోరణులను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

chitram...

ట్రంప్ హిల్లరీ

-చలసాని నరేంద్ర