సంపాదకీయం

వాస్తుతో కూల్చివేతలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ‘సచివాలయం కూల్చివేత’ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు ఆదేశించడం ఉపశమనం కలిగించిన వార్త. పదోపాతికో సంవత్సరాల క్రితం నుండి వాడుకలో ఉన్న భవనాలు కూల్చేయడం, అదీ కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయపరుస్తూ అయినప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. నిక్షేపంగా ఉన్న పటిష్టమైన భవంతుల్ని వాస్తుపేరుతోనో, మరేదో కుంటిసాకుతోనో కూల్చివేయాలనుకోవడం తగదు. పేదరిక నిర్మూలన, ఉపాధి, విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడానికి అవసరమయ్యే నిధులను దుర్వినియోగం చేయడాన్ని జనం ఉపేక్షించరాదు. ఈ కేసు సందర్భంగా- ‘ప్రభుత్వ ధనం పైసా అయినా ఖర్చుపెట్టేముందు నేనెంతో ఆలోచిస్తాను’ అని న్యాయమూర్తి అన్న మాటలను పాలకులు సదా గుర్తుంచుకోవాలి. ప్రజాధనానికి ధర్మకర్తల్లా వ్యవహరించాలే తప్ప దుబారా చేసే వ్యక్తుల్లా ఉండరాదు.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
చారిత్రక తీర్పు
కోడళ్లు అత్తమామలతో విభేదించినపుడు వేరు కాపురం పెట్టాలన్న ప్రతిపాదనలపై సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. ఈ తీర్పును ప్రతి ఒక్క కోడలూ అవగాహనలోనికి తీసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వేరు కాపురం కోరే కోడళ్లకు ఈ తీర్పుతో కనువిప్పు కాగలదు. ఈ తీర్పుననుసరించి కోడళ్లు అత్తమామలతో సఖ్యతగా ఉండవలసిన అగత్యం తప్పదు. అత్తమామలతో విభేదాల కారణంగా విడాకులు తీసుకునే మహిళలకు భర్తలనుండి ఏ విధమైన భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం గమనార్హం. ఇలాంటి తీర్పులను గమనించైనా కలహాలకు దూరంగా ఉంటూ కుటుంబ బంధాలను గౌరవించుకోవాలి.
-బి.వి.సుబ్రహ్మణ్యశాస్ర్తీ, బాపట్ల
ఆంధ్రులను అణగదొక్కొద్దు
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. 1977 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 42 స్థానాలకు ఒకే ఒక్క స్థానంలో జనతా పార్టీ విజయం సాధించింది. అప్పట్లో కేంద్రంలో జనతాపార్టీ పగ్గాలు చేపట్టింది. 1984లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కుటిలంగా కూల్చిన అనంతరం జరిగిన ఎన్నికల్లో 426 ఎంపీ సీట్లను గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎపిలో 5 స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా టిడిపిని రాష్ట్ర ప్రజలు అందలమెక్కించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటూ గెలవలేక తుడుచుకుని పోయింది. ఆంధ్ర ప్రజలు విజ్ఞతతో విలక్షణంగా తీర్పు ఇస్తారనడానికి ఇవి ఉదాహరణలు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో టిడిపి, బిజెపి ప్రజలను వంచిస్తే రాబోయే ఎన్నికల్లో వారికి పరాభవం తప్పదని గమనించాలి. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎపి ప్రజల మనోభావాలను గుర్తించాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం