సబ్ ఫీచర్

మాతృభాషపై మమకారం తగ్గింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువతీ యువకులు నిజంగానే తెలుగు భా షకు దూరం అయ్యారా? వ్యవహారిక భాషని మాట్లాడటం వారు మరిచిపోయారా? ఈ ప్రశ్నలకు ‘నిజమే’ అన్న సమాధానం వస్తుంది. స్వాతంత్య్ర పోరాట సమయంలో యువతను ముందుకు నడిపించడంలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యాన్ని మరువలేము. అప్పట్లో మన స్వాతంత్య్రవీరుల ప్రసంగాలను ప్రాం తీయ భాషల్లోకి అనువదించేవారు. ఆ ఉత్తేజ పూరిత ప్రసంగాలతో యువత ఎంతో స్ఫూర్తి పొందేవారు. దేశంలో ‘మెకాలే’ ఆంగ్ల విద్యా విధానం అమలులోకి వచ్చాక తెలుగు భాష ప్రభావం తగ్గుతూ వచ్చింది. దాదాపు 1990 వరకూ గొప్పగా వెలిగిన తెలుగు భాష ఆ తర్వాత యువత నుంచి దూరం కావడానికి కారకులెవరు? ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లం తెలుగుభాషని ఆక్రమించుకుంది. ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితంలో స్థిరపడతామన్న నిర్ణయానికి తల్లిదండ్రులు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల వారు భావించడంతో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ నిర్బంధంగా మాతృభాషలో బోధన జరగాలి. ప్రపంచీకరణ పుణ్యమాని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు పుట్టగొడుగుల్లా అన్ని ప్రాంతాల్లో పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఒకటో తరగతి నుంచే తెలుగు భాష కనుమరుగవుతోంది. చాలామంది విద్యార్థులు రెండవ భాషగా హిందీ తీసుకుంటున్నారు తప్ప తెలుగు వైపు ఆసక్తి చూపడం లేదు. చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదవడంతో తెలుగు పదాల గురించి నేడు చాలామంది విద్యార్థులకు తెలియకుండా పోతోంది. పాఠశాల స్థాయిలోనే ఆంగ్లం వైపు మొగ్గు చూపడంతో కళాశాలల్లో తెలుగు మాధ్యమం జాడ కనిపించడం లేదు. ఎక్కువ మార్కుల కోసం సంస్కృతాన్ని తీసుకోవడం నేడు ఓ వేలం వెర్రిగా మారింది. ఇక తెలుగు భాష నేర్చుకోవడానికి, నేర్పడానికి అవకాశం ఎక్కడుంది? ఇలా అన్ని రకాలుగా తెలుగును యువత నుంచి దూరం చేస్తున్నందున ఆ భాషలో మాట్లాడాలన్న ఆసక్తి ఎక్కడనుంచి వస్తుంది? ఎవరైనా అచ్చతెలుగు పదాలను మాట్లాడితే- ‘దయచేసి కొంచెం తెలుగులో చెప్తారా..?’ అనే స్థాయికి నేటి యువత చేరుకుందంటే అతిశయోక్తి కాదు.
ఇపుడు మరో కొత్త పోకడ ఏంటంటే- తెలుగులో మాట్లాడినా మరీ క్లుప్తంగా మాట్లాడడం అలవాటై పోయింది. ఒక విద్యార్థి లేదా ఉద్యోగం చేస్తున్న యువతి లేదా యువకుడు 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు ఇంగ్లీష్ పదాలే ఉంటాయి. ఇక వ్రాయడానికి మరో కొత్త విధానం అమలులోకి వచ్చేసింది. తెలుగు రాయడంలోనూ మన వాళ్ల తెలివి అమోఘం. ఏదైనా విషయాన్ని రాయాలంటే ‘రోమన్ తెలుగు’లో రాసి పడేస్తున్నారు. ‘్గ్య్ఘౄశ ళఖఖ’ అంటే ఏమిటో అనుకునేరు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్‌అప్‌ల్లో వాడే భాష అన్న మాట. నేటి యువతలో చాలామంది మాట్లాడే తెలుగు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. భాషను నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండదు, ఇతరులు చెప్పినా వినే పరిస్థితి లేదు. టీవి చానళ్లలో వస్తున్న మాట్లాడే భాషనే వీరికి ప్రామాణికమై పోయింది. అక్షరాల మధ్య తేడా, పలికే విధానం చాలామందికి తెలియడం లేదు. ‘ల’కి, ‘ళ’కి తేడా తెలియదు. ‘శ’కి, ‘ష’కి మధ్య వ్యత్యాసం తెలియదు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో తెలుగు భాషకు సంబంధించిన తప్పులు వస్తున్నా వాటి గురించి యువతకు తెలియడం లేదు. ఈ మధ్య కొన్ని సినిమాల్లోనూ తెలుగు ప దాలు వికృత రూపం వహిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని విషయాలూ చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పేవారు, నేర్చుకొనేవారు లేరు. పాఠశాలల్లోనూ తెలుగు భాష అవసరం లేకుండా పోతోంది. అచ్చతెలుగు పదాలు, సామెతలు, జాతీయాలు, సూక్తుల గురించి నేటి యువతకు ఎలాంటి అవగాహన లేకుండా పోతోంది. దక్షిణాదిలోని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో వారి మాతృభాషకు, వారి సంస్కృతీ సంప్రదాయాలకు ఇప్పటికీ అధిక ప్రాధాన్యం ఇస్తుండగా- తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మాతృభాషకు గ్రహణం పడుతోంది. బాగా చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు ఎక్కడైనా కలుసుకుంటే ఆంగ్లంలో మాట్లాడతారు తప్ప మాతృభాష జోలికి పోరు. ఇదీ మనవాళ్లకు మాతృభాషపై ఉన్న మమకారం! తమిళనాడు, కర్నాటకతో పాటు చాలా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మాతృభాషలోనే చక్కగా మాట్లాడతారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలామంది చదువుకున్న విద్యార్థులు, ఉద్యోగులు అన్యభాషలో సంభాషణలు జరుపుతారు. ఇళ్లలో సైతం ఆంగ్లంలోనే మాట్లాడడం అలవాటై పోతోంది. పిల్లలు తెలుగు భాషలో మాట్లాడితే వారిని దండించే తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
మంచి ఉద్యోగాల కోసం ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా- మాతృభాషను విధిగా నేర్చుకోవాలి, మాట్లాడాలి, రాయాలి అనే నిబంధనలుండేలా విద్యా విధానాన్ని మార్చాలి. మాతృభాష- ‘మృతభాష’గా మారకముందే మేలుకుంటే బాగుంటుంది. అది యువత వల్లనే సాధ్యమవుతుంది. తెలుగు భాషను పరిరక్షించే బాధ్యతని నేటి యువత తీసుకోవాలి. ప్రభుత్వం కూడా పాలనాభాషగా తెలుగును అమలు పరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. తెలుగు ఓ అద్భుతమైన భాష అని ప్రపంచానికి చాటి చెప్పాలి, ఇది ‘అంతరించిన భాష’ కాకూడదు.

-పుష్యమీ సాగర్