మెయన్ ఫీచర్

అలనాటి దురాచారంపై అవిశ్రాంత పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల మనీలాలో ‘మెగసెసే అవార్డు’ అందుకుని ప్రముఖ సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణ, బెజవాడ విల్సన్ భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించగా, విల్సన్ గురించి వివరాలు తెలిసిన వారు తక్కువ మందే అని చెప్పాలి. విల్సన్‌కు మెగసెసే పురస్కారం ఎందుకు వచ్చిందీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో అతడికి గల సంబంధం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. విల్సన్ సాగించిన ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ ఉద్యమం అసామాన్యమైంది. అతడికి ఆసియా నోబెల్ బహుమతిగా చెప్పదగిన ‘మెగసెసే అవార్డు’ను తెచ్చిపెట్టింది అదే! ఇంతకీ ఈ బెజవాడ విల్సన్ ఎవరు? ఇంటి పేరులో ‘బెజవాడ’ వున్న ఇతడు జన్మతః ఆంధ్రుడేనా? ఈ వివరాల్లోకి వెళ్లేముందు అతడు సారథ్యం వహించిన ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ గురించి, దాని ఆవశ్యకత గురించి విశే్లషించాలి.
2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలో 69 శాతం మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. సామాజికంగా అందరూ ఉపయోగించుకునే మరుగుదొడ్లు (కమ్యూనిటీ లెట్రిన్స్) కూడా కావలసిన దానికన్నా చాలా తక్కువ వున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బహిరంగ మల మూత్ర విసర్జన తప్పనిసరి అవుతున్నది. మహిళలకు రక్షణ కొరవడడానికి కారణాలలో ఇది ఒకటి. ఈ సమస్యను తొలగించడానికి ‘అందరికీ మరుగుదొడ్లు’ నిర్మించాలన్న ఆశయం ప్రధాని మోదీ రూపొందించిన ‘స్వచ్ఛ భారత్’లో వుంది. మరుగుదొడ్లకు సంబంధించిన అసౌకర్యాలు ఇలా ఉండగా, ఇందులో అమానుషమైన అంశం మరొకటి వుంది. మరుగుదొడ్లు ఉన్నట్టుగా గణాంకాలలో చెప్పబడేవి అన్నీ కూడా- సెప్టిక్ లెట్రిన్‌లు కావు. చుట్టూ వున్న నాలుగు గోడల మధ్య నేలపై మల విసర్జన చేసే మరుగుదొడ్లు (వీటిని ‘శాండ్ లెట్రిన్’లు అంటారు.) ఈనాటికీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగానూ, పట్టణ ప్రాంతాలలో తక్కువగానూ ఉన్నాయి. వీటిని రోజూ శుభ్రపరిచి, మలాన్ని ఒక తట్టలోనో, బాల్చీలోనో వేసుకుని ఊరుచివర విసిరెయ్యడం వృత్తిగా గల ‘సఫాయి’ కార్మికులు ఈనాటికీ వున్నారు. అత్యంత హేయమైన ఈ పనిని ఒక వర్గానికి వంశపారంపర్యంగా అప్పగించి, వారిని ‘అంటరానివారు’గా తీర్మానించిన సంప్రదాయం మన దేశంలో ఇంకా అక్కడక్కడా ఉందంటే ఆశ్చర్యం కాదు. వారి వెతలను అర్థం చేసుకుని, వారి హక్కుల కోసం పోరాడడం మాత్రమేగాక- ఈ తరహా మరుగుదొడ్లు లేకుండా చేయడానికి ఉద్యమించినవాడు బెజవాడ విల్సన్. అతడు నడిపిన ఉద్యమం ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ (పాకీ పనివారి కోసం ఆందోళన). దళితులనబడేవారిలో అసలైన దళితులు వీరు. తమిళనాడు వంటి రాష్ట్రాలలో వీరిని అంతరానివారుగా సమాజానికి దూరంగా వుంచడం ఒక దురాచారం.
1993లో పార్లమెంటు చేసిన శాసనం ప్రకారం- మానవ మలవిసర్జనను శుభ్రం చేసేందుకు పాకీ పనివారిని ఉద్యోగించడం, ‘శాండ్ లెట్రిన్’లను కలిగి వుండడం నేరం. మానవ మలమూత్రాలను సఫాయి కార్మికులు శుభ్రం చెయ్యడం ఇక వుండదని ఆ శాసనంలో ఘనంగా పేర్కొన్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఇది యధావిధిగా కొనసాగుతూనే వుంది. ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో వాల్మీకులనే పేరుతోనో, భంగీలనే పేరుతోనో, మరో పేరుతోనో వంశపారంపర్యంగా ఈ వృత్తి కొనసాగుతూనే వుంది. ఈ వృత్తి చేసేవారు తమ రాష్ట్రంలో లేరని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది గాని, అది చర్చనీయాంశమే అంటున్నారు విశే్లషకులు. ఈ సమస్యకు సంబంధించి కొన్ని ప్రధానాంశాలున్నాయి. 1. ఒక అసహ్యకరమైన వృత్తిని కొందరే చెయ్యాలనడం. 2. ఆ వృత్తిని వారు ఇక చేసేది లేదంటే - దౌర్జన్యంతో వారిపై ఒత్తిడి తేవడం. 3. వారిని అంటరానివారనడం. 4. ఆధునిక ‘సెప్టిక్ లెట్రిన్’లను నిర్మించుకోకుండా పూర్వపు పద్ధతినే కొనసాగించడం. 5. కేంద్ర ప్రభుత్వం చేసిన శాసనం సక్రమంగా అమలు జరగకపోవడం. ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి.
ఆమధ్య ఒక ఆంగ్లపత్రిక ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలలో సఫాయి కార్మికుల సమస్యలపై ఆరా తీయగా, ఈ వృత్తిచేసే వారంతా మహిళలేనని తేలింది. భార్య, కూతురు, కోడలు వంటివారు ఈ వృత్తిలో వుంటారు. ఈ అమానుషమైన పనిని ఆడవాళ్లకప్పగించి పురుషులు వేరే వ్యాపకాల్లో వుంటారు. ‘వర్షాకాలంలో మలాన్ని తట్టలలోకి ఎత్తి, నెత్తిన పెట్టుకుని వెడుతుంటే ముఖంపై కూడా పడుతుంది. ఆరోజు ఏమీ తినబుద్ధి పుట్టదు.’ అంటూ ఆ మహిళలు వారి దీనావస్థను వినిపించారు. ఈ పనిచేసినందుకు తమకు ప్రత్యేకించి జీతం ఏమీ ఇవ్వరని, రెండుమూడు రొట్టెలు, పండుగలకు పాతబట్టలు ఇస్తారని, అవి కూడా ఇవ్వని వారి ఇళ్లకు వెళ్లడం మానేస్తే భౌతికదాడులకు దిగుతుంటారని ఆ మహిళలు మీడియాకు చెప్పారు. ఇలాంటి విషయాలను చదివితే- మనం 21వ శతాబ్దంలో వున్నామా? ఇంకా పద్దెనిమిదో శతాబ్దంలో వున్నామా? అని ఎవరికైనా అనిపిస్తుంది!
వివాహం చేసుకున్న తర్వాత కాపురానికి వచ్చిన వచ్చిన భంగీ కులానికి చెందిన యువతుల పరిస్థితి మరింత దయనీయం. వారికి ఈ వృత్తి చెయ్యడం ఏ మాత్రం ఇష్టం వుండదు. అత్తింట్లో వాళ్లు బలవంతం పెట్టి వారిచేత ఈ పని చేయిస్తారు. ‘దౌర్జన్యాన్ని తట్టుకుని, ఈ నీచపు పని మానేద్దామన్నా, అయితే- పొట్టగడవడానికి మరో మార్గం లేదు. ఎవరూ మాకు మరో పని ఇవ్వరు-’ అని విలపిస్తున్న ఈ మహిళలకు పునరావాసం కల్పించడం ఒక పెద్ద సమస్య. 2012లో భంగీల పునరావాసానికి సంబంధించిన చట్టం ఆమోదించబడి 2013 నుండి అమలులోనికి వచ్చింది. అయినా దీనివల్ల వారికి ఒరిగింది పెద్దగా ఏమీలేదు. ఈ సమస్య ఇలావుండగా, పట్టణాల్లో మురుగునీటి డ్రెయిన్లను శుభ్రపరిచే వారిది మరొక సమస్య. దీనిని నిషేధించడం సాధ్యం కాదు. డ్రెయిన్లను శుభ్రపరచకపోతే మొత్తం మురుగునీటి వ్యవస్థే ఛిన్నాభిన్నమైపోతుంది. డ్రెయిన్‌లను శుభ్రపరచడం అంత సామాన్యమైన విషయం కాదు. ఒక్క ఢిల్లీ నగరంలోనే 1.68 కోట్ల జనం వదిలే 9,000 టన్నుల వ్యర్థాన్ని ‘మేన్‌హోల్స్’ మూతలను తీసి సఫాయి కర్మచారీలు పనిచేస్తుంటారు. ఇలా పని చెయ్యడానికి వీరికి యంత్ర పరికరాలు, భద్రతను కలిగించే దుస్తులు (సేఫ్టీసూట్స్), చేతులకు ‘గ్లోవ్స్’, నెత్తిన టోపీలు వుండాలి. ఇవేమీ లేకుండా డ్రెయిన్‌లోనికి దిగి వ్యర్థాలను పైకి ఎత్తితే- వారికి ఈ పనివలన ఎన్నోరకాల వ్యాధులు వచ్చే అవకాశం వుంది. కనీసం ముఖానికి ముసుగు కూడా లేకుండా ఈ పనిని చేస్తే వ్యర్థాలలోనుండి వచ్చే ఘాటయిన వాయువులు వారికి చేసే హాని అంతాయింతా కాదు. చివరకు ఇది వారి ప్రాణాలను బలిగొనే అవకాశం కూడా వుంది.
ఈ వృత్తిలో ప్రమాదం ఉందని తెలిసి కూడా, ఢిల్లీ సహా ఏ నగరాల్లోనూ వీరి భద్రత పట్ల మున్సిపల్ యంత్రాంగం శ్రద్ధ వహించదు. వీరి భద్రతకు ఇవ్వవలసిన పరికరాలేవీ ఇవ్వడం లేదు. ఈ బాధ్యత నుండి తప్పించుకోడానికి పారిశుద్ధ్య పనులను ప్రయివేటు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లకు లాభార్జన దృష్టేకాని, పనిచేసేవారి భద్రత విషయంలో ఎలాంటి ఆలోచనా వుండదు. సఫాయి కార్మికులు సాధారణ దుస్తులతోనే డ్రెయిన్‌లోకి దిగి, అతికొద్ది జీతానికి వ్యర్థాన్ని పైకెత్తవలసి వుంది. కొన్ని సందర్భాలలో డ్రెయిన్‌లోకి దిగినవారు ఊపిరి ఆడక చనిపోవడం కూడా జరుగుతున్నది. ‘మేన్‌హోల్స్’లో దిగి చేసే పనులను కేవలం పురుషులే చేస్తారు. కాగా, ఒకే కులం వారు ఈ పని చెయ్యాలనే నియమం కూడా లేదు. కూటికోసం ఎవరు చేసినా ఇది పాకీ పనే. దేశం మొత్తం మీద ‘మేన్‌హోల్స్’లోకి దిగి వ్యర్థాలను శుభ్రంచేసే వారిలో ఏడాదికి సుమారు 1,000 పలురకాల వ్యాధులతో చనిపోతున్నారు. ఢిల్లీ మహానగరంలోనే 1996-2015 సంవత్సరాల మధ్య కాలంలో సుమారు 3,500 మంది పనివారు చనిపోయారు. ఈ పనిని చెయ్యడానికి అనుమతి (వర్క్ పర్మిట్) వుండాలి. భద్రతకు అవసరమైన పరికరాలతో ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పనిని చెయ్యాలి. ఈ నిబంధనలు దేశ రాజధానిలోనే పాటించకపోతే- మిగతా నగరాల మాట చెప్పాలా? ఈ సమస్యలన్నింటినీ ఇంత వివరంగా చెప్పడానికి కారణం- వీరి శ్రేయస్సు కోసం పోరాడిన బెజవాడ విల్సన్ చేసిన కృషి ఎంత విశిష్టమైనదో, ఆవశ్యకమైనదో చెప్పడానికీ.
బెజవాడ విల్సన్ 1966లో కోలార్ బంగారు గనులు వుండే ప్రాంతంలో- కర్నాటకలో జన్మించాడు. జన్మరీత్యా అతడు ‘పాకీ’ (తోటీ) కులానికి చెందినవాడు. ఇతడి తండ్రి కోలారులో పాకీదొడ్లను శుభ్రపరిచేవాడు. తను జన్మించిన కులం కారణంగా ఎదుర్కోవలసిన అవమానాలను తప్పించుకునేందుకు- ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎస్‌సి వసతి గృహంలో చేరి చదువుకున్నాడు. సాటి దళితులు తన పట్ల చూపే చిన్నచూపుఇతనికి బాధ కలిగించేది. అవన్నీ తట్టుకుని హైదరాబాద్‌లో హైస్కూలు విద్య, బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజి’లో తన పేరు నమోదు చేయించుకోడానికి వెడితే- కులం కారణంగా విల్సన్‌కు ఇవ్వదగ్గ ఉద్యోగం ‘పాకీపని’ అని అక్కడి అధికారి రాశాడు! ఇలాంటి చేదు అనుభవాలే- పాకీపనివారి ఉద్ధరణ కార్యక్రమానికి ఇతడిని నడుం బిగించేలా చేశాయి.
ఇసుక తట్టలుండే మరుగుదొడ్ల నిర్మూలనకు, పాకీ పనివారి పునరావాసానికి, వారి భద్రతకు బృహత్ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాడు. ‘సఫాయి కర్మచారీ ఆందోళన్’’కు నాయకుడై, పాదయాత్రలు సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. మలాన్ని బకెట్లలోకి ఎత్తే హేయమైన వృత్తిని బహిష్కరించేందుకు ఎంతగానో ప్రోద్బలమిచ్చాడు. విల్సన్ ఆందోళనల కారణంగానే 1993లో- మానవ మలాన్ని సాటి మనుషులు శుభ్రంచేసే వృత్తిని, ఆ తరహా మరుగుదొడ్లను ప్రభుత్వం నిషేధించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకొంది.

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969