మెయన్ ఫీచర్

‘డ్రాగన్’ చొరబాటు.. భారత్ తడబాటు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత భూభాగంలోకి చైనా చొరబడటం 1950 నుంచే మొదలైంది. ‘మానస సరోవర్’ ప్రాంతం అనాదిగా భారతీయులకు పుణ్యతీర్థ స్థలి. దీన్ని టిబెట్టుతోబాటు చైనా కబళించింది. నేపాల్ ప్రాంతాల్లో చైనా పేపర్ వీ సాలు ఇవ్వటం ఏమిటి..? అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మొత్తం హిమాలయ సానువులను- నేపాల్, టిబెట్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలను హస్తగతం చేసుకోవాలన్న నిర్ణయాత్మక ప్రణాళికలను చైనా అమలుచేస్తున్నది.

శివసేన పార్టీ తన అధికార పత్రిక ‘సామ్నా’లో ఇపుడు కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న వేసింది. ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇటీవల భారత సైనికులు లక్షిత దాడులు జరిపి గట్టిగా బుద్ధిచెప్పారు, మరి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనా మాటేమిటి? అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత భూ భాగంలోకి చొచ్చుకువస్తున్న చైనా సైన్యాన్ని భారత్ నిలువరిస్తోంది. అయినా వారు ఊరుకోవటం లేదు గనుక చైనా ఆక్రమిత ప్రాంతాలపై కూడా భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరపగలరా?’- ఇదీ ‘సామ్నా’లో శివసేన సంధించిన ప్రశ్న. 6 నవంబరు 2016న భారత్,చైనాల రక్షణరంగ ప్రముఖులు అజిత్ ధోవల్, యాంగ్ జీచి పరస్పరం అనేక అంశాలపై చర్చలు కొనసాగించారు. అందులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, సరిహద్దు భద్రత వంటి కీలక అంశాలున్నాయని భారత విదేశాంగశాఖ పేర్కొన్నది. ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వం, ప్రముఖ ఉగ్రవాది అజర్ మసూద్‌పై నిషేధం వంటి అంశాలపై చర్చలు జరిగాయా? లేదా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. భారత్, చైనా ఆర్థిక వ్యవహారాలపై చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ద్వైపాక్షిక సంబంధాలు ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని బలపరిచేందుకు తోడ్పడుతాయని మన విదేశాంగ శాఖ ప్రకటించింది. రెండు దేశాల మధ్య చర్చలు జరిగినపుడు ఇలాంటి ప్రకటనలు లాంఛనమే. వీటికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఆపాదించవలసిన అవసరం లేదు. ఒక్కోసారి చర్చలు విఫలమైనా వాటిని పేర్కొనకుండా-‘చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. వివాదాస్పద అంశాలపై మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించాం..’-అని ప్రకటన విడుదల చే యటం దౌత్య సంప్రదాయం అని విజ్ఞులకు తెలిసిన విషయమే. మరి.. చైనా, భారత్‌ల మధ్య సంప్రదింపులు దేనిపై జరిగినట్లు?
భారత్ నుండి చైనాకు జరిగే ఎగుమతులకన్నా చైనానుండి ఇండియాకు జరుగుతున్న దిగుమతుల సంఖ్య చాలా ఎక్కువ. మొన్నటి దీపావళి సందర్భంగా చైనా టపాసులపై ఇండియా నిషేధం విధించటం చైనాకు కోపం తెప్పించే అంశం. అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా వారి సినిమా క్యాసెట్లు, ఇతర వీడియో సామాగ్రి ముమ్మరంగా ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. దానిపై ఏ నిషేధమూ లేదు. ఒక రకంగా చూస్తే టిబెట్టులోవలెనే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారతీయ సాంస్కృతిక వారసత్వ లక్షణాలు లేకుండా చేయటంలో చైనా విజయం సాధిస్తున్నది. దూరదృష్టి లేని మన ప్రభుత్వం గత 60 ఏళ్లుగా చైనా సహా తక్కిన దక్షిణాసియా ద్వీపాల గురించి అసలు పట్టించుకోలేదు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దీవుల గురించి ఆలోచించాలనే ప్రతిపాదన వచ్చింది. దానిని కాంగ్రెస్ పార్టీలోని ‘చైనా పంచమాంగ దళం’ సాగనివ్వలేదు. ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియా ఒకవైపు పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో తలపడుతుండగా- ఏకకాలంలో చైనా సరిహద్దులపై పోరాటం జరపటం సాధ్యమేనా? అని రక్షణ నిపుణులు ఆలోచించాలి.
ఇక, భారత్‌ను బలహీనపరచాలనే కోరిక చైనాకు కొత్తేమీకాదు. 1948 నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. భారత్‌కు బద్ధశత్రువైన పాకిస్తాన్‌కు చైనా ఆయుధ సహాయం అందజేస్తోంది. పాకిస్తాన్‌కు అణుశక్తి రంగంలో అవసరమైన ముడి యురేనియం అందజేసింది. పాకిస్తాన్ నుండి ఉత్తర కొరియా ఈ అణుసామర్థ్యాన్ని కొనుగోలు చేసింది. చైనా వ్యూహాత్మక ఎత్తుగడలు అమెరికా, రష్యా, బ్రిటన్‌లకు తెలియకపోలేదు. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నాయి? అంటే- దీన్ని ఇండో, చైనా ఆంతరంగిక సమస్యలుగా వారు భావిస్తున్నారా? అమెరికాకు ఇండియా ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణ దూరంలో ఉండవచ్చు, కానీ దక్షిణ ఆసియాపై చైనా ఆధిపత్యం సంపాదిస్తే అది అమెరికా, యూరప్ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారు ఊహించలేకపోతున్నారు. భారత రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చైనా ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుంటున్నది. మసూద్ అజర్ కరడుకట్టిన ఉగ్రవాది అని ప్రపంచానికి తెలిసినా, అతడు టెర్రరిస్టు కాడని చైనా అంతర్జాతీయ వేదికలపై వాదించటం భారత అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం కిందికే వస్తుంది. భారత్ ఎదగకుండా ఉండాలని ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని వీటో చేయటం చైనా చేసిన మరో దు ర్మార్గం. దీన్ని అగ్రరాజ్యాలు ప్రశ్నించలేకపోతున్నాయి. పాకిస్తాన్‌పై భారత్ మెరుపుదాడుల తర్వాత పఠాన్‌కోట్ ప్రాంతం నుండి మన దేశంలోకి వచ్చే డ్రగ్స్ గణనీయంగా తగ్గినట్లు ఒక సర్వే వెల్లడించింది. అందుకని మాదక ద్రవ్యాల వ్యాపారులు టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వేరే మార్గాలను అనే్వషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవులల్లో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా విషయంలో తమిళనాడు ప్రమేయం గురించి అందరికీ తెలుసు. కానీ, దీనివెనుక చైనా పరోక్ష హస్తం ఉన్నదన్న సంగతి ఎందరికి తెలుసు? దిల్లీలోని ఒక కాలనీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న చైనా జాతీయులు కొంతకాలం క్రితం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం, మాదకద్రవ్యాల అంశాల్లో చైనా ప్రమేయం కచ్చితంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు చైనా, పాక్ సంయుక్తంగా కృషిచేస్తున్నాయనే విషయం మన రక్షణరంగ నిపుణులకూ తెలుసు. భారత భూ భాగంలోకి చైనా చొరబడటం 1950 నుండే మొదలయింది. ‘మానస సరోవర్’ అనాదిగా భారతీయులకు పుణ్యతీర్థ స్థలి. దీన్ని టిబెట్టుతోబాటు చైనా కబళించింది. నేపాల్ ప్రాంతాల్లో చైనా పేపర్ వీసాలు ఇవ్వటం ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మొత్తం హిమాలయ సానువులను- నేపాల్, టిబెట్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలను హస్తగతం చేసుకోవాలన్న నిర్ణయాత్మక ప్రణాళికలను చైనా అమలుచేస్తున్నది.
నిజానికి ఇపుడు చైనాలో- 1948 నాటి మావో సేటుంగ్, 1958 నాటి చే ఎన్‌లై ప్రతిపాదించిన ప్రజారాజ్యం వేరు. మొన్నటి తావో మందిరం దగ్గర జరిగిన ఆందోళనలల్లో చైనా పౌరులు ఈ విషయమే ఎత్తిచూపారు. అమెరికా పెట్టుబడిదారీ వలస వాదానికి ఏ విధంగానూ తీసిపోని మరొక సామ్రాజ్యవాద విస్తరణ వాదానికి చైనా పాల్పడుతోంది. ఇండియాలో తనకు అనుకూలంగా పనిచేసే కొన్ని వర్గాలను చైనా సృష్టించుకున్నది. దానికి సైద్ధాంతిక పరివేషం నిర్మించింది. నేపాల్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, నల్లమల, కర్నూలు, మైసూరు మీదుగా జాఫ్నాకు ఒక ‘రెడ్ కారిడార్’ నిర్మించేందుకు చైనా ఒక బ్లూప్రింట్‌ను తన అనుయాయులకు అందించింది. పాకిస్తాన్‌లోని బలూచీస్థాన్‌లో ఇలాంటి కారిడార్ నిర్మాణం ఇప్పటికే జరిగిపోయింది. దానిని స్థానిక బెలూచీలు, ఫక్తూన్‌లు నిరసిస్తున్నారు. అక్కడ ప్రతి చైనా పనివానికి ముగ్గురు పాకిస్తానీలు రక్షణగా ఉంటున్నారు. ఇలా ఎంతకాలం చైనా వర్కర్లను పాక్ రక్షించగలదు?
ఇండియాను భూలోక నరకంగానూ, తమ ప్రాంతాన్ని భూలోక స్వర్గంగా వర్ణిస్తూ వందిమాగధ వైతాళికులలో గీతాలు రాయించి చైనా ప్రచారం చేయించింది. ఇది అన్ని భారతీయ భాషల్లోనూ జరిగింది. పోలీసులు ఉగ్రవాదులను, మావోయిస్టులను చంపితే మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. ఉగ్రవాదులు పోలీసులను, ఇన్‌ఫార్మర్లను, గిరిజనులను చంపితే ప్రజాపోరాటం అని అభివర్ణించారు. చైనా ప్రేరేపిత ఉగ్రవాదులకు భార్యాబిడ్డలు ఉన్నారు. మరి.. దేశ రక్షణ చూసే సైనికులకు, పోలీసులకు భార్యాబిడ్డలు ఉండరా? వారికి పౌర హక్కులు ఉండవా?? మతోన్మాదాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, చైనాలను నిలువరించే శక్తి భారత్‌కు ఏ మేరకు ఉంది. చైనాలో సైనిక నియంతృత్వం ఉంది. మన దేశంపై ఆధిపత్యం వహించాలన్న కసి ఉంది. కానీ, మన దేశంలో చాలామంది నేతలకు దేశభక్తి లేదు. భారత్‌కు చెందిన కొన్ని పార్టీల నాయకులు బాహాటంగానే శత్రుదేశాలకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. ఈ అరాచకత్వం చైనాలో లేదు. ఆసియా ఖండంపై అజమాయిషీ చేయాలని చైనా ప్రయత్నిస్తున్నది. ఈ పరుగుపందెంలో ఇండియా నిస్సందేహంగా వెనుకపడింది.
ఇప్పటికే సియాచిన్, లడఖ్, టిబెట్టు, మానస సరోవర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నది. ఇప్పుడు మొత్తం అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాలను తన భూభాగంలో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ విషయంలో మన విదేశాంగ మంత్రులు వి.కె.కృష్ణమీనన్ నుండి సల్మాన్ ఖుర్షీద్‌ల వరకూ అందరూ ప్రేక్షక పాత్ర వహించారు. ప్రస్తుత విదేశాంగ మంత్రి మనోహర్ పారికర్ 2019 లోగా ఏమైనా చేయగలిగితే సంతోషమే. లడఖ్‌లోని డోమ్‌చౌక్ ప్రాంతం వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంది. ఇక్కడ చైనా సైనికులు గుడారాలు వేసుకున్నారు. భారత ఆర్మీ ఇంజనీర్లు అక్కడి గ్రామ ప్రజల సౌకర్యం కోసం నీటికాలువ తవ్వారు. అందుకు చైనా అభ్యంతరం చెబుతూ తన సైన్యాన్ని మోహరించింది. భారత సైన్యం ధైర్యంగా నిలబడేసరికి చైనీయులు గుడారాలతో దూరంగా పారిపోయారు. దీని సారాంశం ఏమంటే- భారత్ దృఢంగా నిలబడితే చైనా, పాక్ కూటమి నిలువజాలదు.

-ముదిగొండ శివప్రసాద్