ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజకీయ పార్టీలకు ‘పెద్ద’ సమస్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖలు సమూలంగా మారిపోతాయన్న వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు దాదాపు అన్ని రా జకీయ పార్టీలూ బెంబేలెత్తిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని విపక్ష పార్టీలు నోట్లరద్దును జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన గళం వినిపిస్తున్నారు. మోదీపై పోరాడేందుకు తన చిరకాల శత్రువైన సిపిఎంతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమేనని ఆమె ప్రకటించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి నోట్ల రద్దు వ్యవహారంపై ఫిర్యాదు చేస్తానని మమత వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద నోట్లు రద్దు కావటంతో బిఎస్‌పి, సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న అకాలీదళ్‌తోపాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని కలలు కంటున్న ఆమ్‌ఆద్మీ పార్టీ అధినాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మోదీ నిర్ణయంపై మండిపోతున్నారు. ఎన్నికల ముందు పెద్ద నోట్లు రద్దు కావటం అంటే ఓటర్లను కొనుగోలు చేసే అవకాశం చేజారి పోవటమేనని చాలామంది నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో ధనబలం లేకుండా పోవటం రాజకీయ పార్టీలకు ఆత్మహత్యాసదృశమేనని అందరికీ తెలిసిందే. పెద్దనోట్ల రద్దుతో మోదీ వ్యూహాత్మకంగా కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను దివాలా తీయించారు. మన దేశంలో కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వేలకోట్ల రూపాయల నల్లధనాన్ని కూడపెట్టుకున్నాయి. కేంద్రం నిర్ణయంతో ఈ కోట్లన్నీ పనికిరాకుండా పోవటంతో రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలోకి రావటం అంటే అక్రమంగా డబ్బు సంపాదించేందుకు అవకాశం కలిగినట్టే అన్నది జగమెరిగిన సత్యం. కొన్ని జాతీయ పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం నల్లధనం సహాయంతో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాయి. నల్లడబ్బుతో అవినీతిపరుడు అందలం ఎక్కితే నిజాయితీ పరుడికి సమాజంలో విలువ లేకుండాపోయింది. నిజాయితీని బలహీనతగా, చేతకానితనంగా మార్చివేశారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించే వాడు మూర్ఖుడు, తెలివితక్కువ వాడు. లక్షల కోట్ల పన్ను ఎగవేసే వాడు తెలివైనవాడుగా చెలామణి అవుతున్నాడు. నల్లధనం ఎంత ఎక్కువగా కలిగి ఉంటే అంత గొప్పవాడనే సంస్కృతి సర్వత్రా వ్యాపించింది.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అక్రమంగా సంపాదించుకున్న నల్లడబ్బును కొందరు పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద బంగారం వర్తకుల వద్ద దాచిపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో వీరి వద్ద దాచిన నల్లడబ్బును బైటికి తెచ్చి ఓటర్లకు ఎర వేస్తుంటాయి. నల్లడబ్బుతో అధికారంలోకి వచ్చిన తరువాత తమ పెట్టుబడికి మించి మరింత అధికంగా అక్రమ సంపాదనకు అలవాటుపడుతున్నారు. ఈ క్రమంలో పలు పారిశ్రామిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా లక్షల కోట్ల నల్లడబ్బును కూడపెట్టుకుంటున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ వద్ద ఉన్న నల్లడబ్బును దాచుకునేందుకు మీడియా సంస్థలను సైతం ప్రారంభిస్తున్నాయి. ఇలా మొత్తం వ్యవస్థ కలుషితమైపోయింది. బిజెపి కూడా ఎన్నికల కోసం కొంత నల్లడబ్బును ఉపయోగించుకున్నది. వామపక్షాలు ఎన్నికల్లో నల్ల డబ్బును ఉపయోగించటం కొంత తక్కువే. అయితే, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఎంతోకొంత నల్లడబ్బును ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా తయారైందంటే ఎన్నికలను, రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి నల్లధనం ఎదిగింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ముంచుకు రాకతప్పదు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి చూపిస్తున్న లెక్కల్లో మాత్రం అతి తక్కువ ఖర్చును ప్రకటిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతోంది.
ప్రతి రాజకీయ నాయకుడు పత్రికాముఖంగా నల్లధనాన్ని ఖండించటం, ఎన్నికల సమయంలో నల్లధనానికి పెద్దపీట వేయటం కాదనలేని కఠోర వాస్తవం. మోదీ నిర్ణయంతో ఇక ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల వద్ద ఎలాంటి నల్లడబ్బు లేకుండా చేస్తే నిజాయితీపరులైన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. ధనబలం కాకుండా బుద్ధిబలం, ఆలోచనా విదానం, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎన్నిక జరిగే పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఇక మెరుగవుతాయి. నల్లధనం మూలంగా నేరచరిత్ర గల వారు పార్లమెంటుకు, శాసనసభలకు ఎన్నికవుతున్నారు. ఇలాంటి వారు చట్ట సభల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తారే తప్ప ప్రజా హితం కోసం కృషి చేయరు.
కాగా, పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థికవ్యవస్థలో కొంత ప్రక్షాళన జరుగుతుంది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన ‘ఆదాయం స్వచ్ఛంద ప్రకటన’ విధానం మూలంగా లక్షా ఇరవై ఐదువేల కోట్ల రూపాయలు వెలుగులోకి వచ్చాయంటే ఇంకా వెలుగులోకి రావలసిన నల్ల ధనం ఎంత ఉన్నదనేది సులభంగానే ఊహించుకోవచ్చు. నల్లధనంతో కొనుగోలు చేసి దాచిపెట్టుకున్న వందలు,వేల టన్నుల బంగారం చీకటి గదుల్లో పడి ఉండి ఉంటుంది. మోదీ దీనిని కూడా బైటికి లాగాలి. పారిశ్రామికవేత్తలతోపాటు ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలపై కూడా నిఘా పెట్టాలి.
దేశంలో నల్లడబ్బు, అవినీతి డబ్బు అనేవి లేకుండా చేయటం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎనభై శాతం వరకు ప్రక్షాళన చేయగలిగితే దేశం ఎంతో అభివృద్ది చెందేందుకు వీలుంటుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నల్లధనాన్ని ఉపయోగించకుండా చేయగలిగితే దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు వాటంతటవే మాయమైపోతాయనేది పచ్చి నిజం. రాజకీయ వ్యవస్థ నల్ల ధనానికి దూరంగా ఉంటే పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారస్తులు కూడా అవినీతితో వ్యాపారం చేసేందుకు వెనకాడుతారు. తమను రక్షించే రాజకీయ నాయకుడు లేకపోతే ఏ పారిశ్రామికవేత్త, బడా వ్యాపారవేత్త కూడా భారీగా నల్లధనాన్ని కూడ పెట్టేందుకు ధైర్యం చేయడు. రాజకీయ నేతల అండదండల వల్లనే నల్లధనం, అవినీతి పెరుగుతున్నాయనేది ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి మారుపేరుగా మారిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరిగితే దేశం దానంతటదే బాగుపడుతుంది.
*