మెయన్ ఫీచర్

మోదీ ప్రతిష్ఠ మసకబారుతోందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుల ఆలోచనలు, వారి అంచనాలు ఎప్పుడూ అతిగానే ఉంటాయి. తమకు నచ్చింది అందరికీ నచ్చితీరుతుందన్నది వారి భావన. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వారి నిర్ణయాలు జనాలకు అప్రియంగా కనిపిస్తుంటాయి. అయినా తమ ధోరణి మార్చుకోవడానికి సిద్ధపడని పాలకులు- ‘సర్వత్రా తమకు సానుకూలత వ్యక్తమవుతోందం’టూ చేతిలో ఉన్న మీడియా భజంత్రీలతో డప్పులు కొట్టిస్తుంటారు. ఆ డప్పుల మోత మర్మమేమిటో సామాన్యుడికి ఎరుకే. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో కూడా చాలామంది ఆమె నిర్ణయాన్ని సమర్ధించారు. ఆఫీసులకు ఉద్యోగులు సకాలానికి వస్తున్నారని, ఇలాంటి నిర్బంధం ఉంటే తప్ప వారు పనిచేయరని, దేశానికి ఇందిరమ్మ లాంటి నేతలే కావాలని అభినందించారు. ఎమర్జెన్సీ వల్ల ప్రజల కష్టాలు పడుతున్నా, సానుకూలంగానే ఉన్నట్లు ఇందిర ప్రచారం చేసుకున్నారు. ‘ఇందిరే ఇండియా-ఇండియానే ఇందిర’ అని భజన చేయించుకున్నారు. కానీ- ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమయింది? రాజకీయంగా అర్భకుడైన రాజ్‌నారాయణ్ చేతిలో ఇందిర ఘోర పరాభవం పొందాల్సి వచ్చింది. 15 రోజుల క్రితం రాత్రివేళ పెద్దనోట్లపై ‘సర్జికల్ దాడి’ చేసిన ప్రధాని, ఆయన వ్యూహబృందం కూడా ఇదే పనిచేస్తోంది.
పెద్దనోట్ల రద్దుపై బిజెపి చేస్తున్న అతి ప్రచారం క్రమంగా వికటిస్తోంది. నల్లధనంపై సామాన్యుడి బ్రహ్మాస్తమ్రంటూ ప్రచారం చేసుకోవచ్చు గానీ, నిజానికి మోదీ సంధించిన బ్రహ్మాస్త్రం పెద్దగద్దలకు కాకుండా గురితప్పి, సామాన్యుడిని తాకింది. వెయ్యినోటు రద్దు చేసి, 2వేల నోటు ప్రవేశపెట్టడంలోనే ‘బ్లాక్‌మనీ’పై మోదీ మాటల్లో విశ్వసనీయత ఎంతో తేలిపోయింది. వెయ్యినోటు వల్లే బ్లాక్‌మనీ పెరుగుతోందని భావించి దాన్ని రద్దు చేస్తే, అంతకంటే పెద్దదయిన రెండువేల నోటు తీసుకురావడంలో మతలబేమిటి? ఇప్పుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్యాంకులు, ఏటిఎంల ముందు పడుతున్న కష్టాలన్నీ తాత్కాలికమేనని, ముందున్నవి మంచిరోజులేనంటూ పాలకులు చెబుతున్న తియ్యని మాటలేవీ కష్టాలు పడుతున్న వారిని మెప్పించడం లేదు. సామాన్యుడికి ఇబ్బంది లేదంటూ మోదీ నుంచి వెంకయ్య వరకూ రోజుకు పదిసార్లు చెబుతుండటం కేంద్రంపై జనంలో మరింత కోపానికి కారణమవుతోంది. ఈ మాటలు చెబుతున్న పెద్దమనుషులంతా ఏటిఎంల వద్దగానీ, బ్యాంకుల వద్దగానీ జనం మాదిరిగా క్యూలో నిలుచున్నట్లు ఏ మీడియాలోనూ కనిపించలేదు కాబట్టి! ఏ సంస్కరణలైనా జీవన ప్రమాణ స్థితిగతులు మార్చాలే తప్ప, జీవితాలను ముగించేలా ఉండకూడదు. ఇప్పుడు ఏటిఎంలు, బ్యాంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్న వృద్థులు, మహిళలు డజన్ల సంఖ్యలో అక్కడే కుప్పకూలి, తనువుచాలిస్తున్న ఘటనలు రోజూ మీడియాలో చూస్తున్న వారంతా, మోదీ చేసిన ఈ ప్రయోగాన్ని సమర్థిస్తారనకుంటే తప్పులో కాలేసినట్లే. మానవ జీవితాల్లో రెండే ముఖ్య ఘట్టాలు. అవి ఒకటి పెళ్లి, రెండు చావు. వాటికీ ‘పెద్ద’ దెబ్బే తగిలింది. కర్మకాండలకూ డబ్బులేని దుస్థితిని టీవీ చానెళ్లలో చూసిన ఏపి సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్‌ను పురమాయించి, కావలసిన డబ్బులు సర్దుబాటయ్యేలా చూశారు. బాబు స్పందించకపోతే కర్మకాండల సంగతేమిటి? ఈ ఘటనకు మూడురోజుల క్రితమే ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ వార్తలను పరిశీలిస్తే, మోదీ బ్రహ్మాస్త్రం సామాన్యుడికి బలంగా తగిలిందే తప్ప- సంపన్నుడిని తాకలేదని స్పష్టమవుతోంది.
స్వయంగా పెళ్లికూతుర్లే బ్యాంకుల వద్దకు వచ్చి, నగదు ఉపసంహరణ కోసం పడిగాపులు పడి నిరాశతో వెనక్కి వెళుతున్నారు. పెళ్లిఖర్చులకు లెక్కలు చెప్పాలని, రెండున్నర లక్షలకు మించి పెళ్లికోసం వాడుకోవద్దన్న ఆదేశాలు, మళ్లీ కొన్ని షరతులను తగ్గించడం, చనిపోయిన తమ వారి కర్మకాండలకూ డబ్బు ఉపసంహరించుకోలేని దుస్థితి... ఈ పరిణామాలన్నీ మోదీ ప్రతిష్టను మసకబార్చకుండా, పెంచుతాయని భావించేవారు భ్రమల్లో బతుకుతున్నట్లే లెక్క.
ఒకప్పుడు మహ్మద్ బీన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌల్తాబాద్‌కు మార్చివేసి, అందరినీ అక్కడికి రావలసిందేనని హుకుం జారీ చేశాడు. కొద్దికాలం తర్వాత తుగ్లక్ మదిని పురుగు తొలచి, మళ్లీ దౌల్తాబాద్ నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చాలన్న ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ఆదేశాలిచ్చి అందరినీ తనతోపాటు ఢిల్లీ రావాల్సిందేనని ఆదేశాలిచ్చిన వైనం- ఇపుడు బ్యాంకులు, ఎటిఎంల ముంగిట క్యూ లైన్లలో చతికిలబడిన వారికి గుర్తుకురాక తప్పదు.
మోదీ చట్టపరంగా వివాహితుడైనా సామాజికంగా అవివాహితుడే. కాబట్టి ఆయనకేమీ కోరికలుండవు. ఆయనక్కొరికే కాదు. బిజెపిని, వారి ప్రభుత్వాన్ని నడుపుతున్న ‘సంఘ’జీవులంతా అవివాహితులే. కాబట్టి వారికి దేశంలోని కుటుంబజీవులు పడుతున్న ఈతిబాధలేవీ తెలియవు. తనకు ఎలాంటి అవసరాలు ఉండవు కాబట్టి, మిగిలిన వారికి ఉండరాదని,ఉండకూడదని అంచనా వేయడం, అలా ఆశించడం తప్పు. మోదీ తన జీవిత భాగస్వామిని, జన్మనిచ్చిన తల్లిని, దేశం కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు వారిని గుజరాత్‌కే పరిమితం చేయవచ్చు. వారి ఉన్నతి కోసం అధికార దుర్వినియోగం చేయకపోవడం గర్వించదగ్గదే కాదు, అభినందించదగ్గది కూడా. కానీ, ఎంతమంది కొడుకులు భారతీయ ధర్మం విడిచిపెట్టి తల్లిని, భార్యను అలా వారి మానానికి వారిని విడిచిపెట్టగలరు? ఎలాంటి సంసార జంజాటాలు లేనందుకే మోదీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. వ్యక్తిగతంగా అదీ ఒకందుకు మంచిదే. కానీ, ఈ దేశంలో కుటుంబ జీవితం గడిపే 80శాతం మంది రోజువారీ సమస్యలు ఎదురీదుతూ బతికేవారే. అలాంటి వారంతా ఇప్పుడు మోదీ నిర్ణయంతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూలు ఫీజుల నుంచి పాలబిల్లుల వరకూ కావలసిన చిన్ననోట్లు అందుబాటులో లేని దయనీయాన్ని వారు ఎలా మర్చిపోగలుగుతారు? 80 శాతం నగదు వాడకం అలవాటున్న ఈ దేశంలో ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, తర్వాత పెద్దనోట్లు రద్దు చేయాలన్న ఆలోచన బిజెపి మేధావులకు లేకపోవడం వల్లే దేశం చిన్ననోట్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది.
దేశంలోని మెజారిటీ ప్రజలను ఇంత నరకయాతనకు గురిచేసి, రోజూ క్యూలైన్లలోనే వృద్ధులు, వికలాంగులను పిట్టలా రాల్చుతున్న మోదీ ప్రయోగమేమైనా సత్ఫలితాలిస్తుందా? అంటే అదీ లేదు. ఇటీవల భారత సైనికుల చేతిలో నిహతులైన పాక్ ముష్కరుల మృతదేహాల వద్ద కొత్త 2వేల నోట్లు దర్శనమిచ్చాయి. అంటే కొత్త కరెన్సీ భారత ప్రజల కంటే, విదేశీ శక్తులకే ఎక్కువ అందుబాటులో ఉందన్న మాట! సర్కారు లెక్క ప్రకారం బ్యాంకులో 2 వేలు తీసుకోవాలంటే ఏదో ఒక ధ్రువీకరణ పత్రం కావాలి. అన్నీ ఉండి లైన్లలో నిల్చుంటే తప్ప ఆ రెండువేలు రావు. మరి ఇలాంటివేమీ లేని పాక్ ముష్కరుల వద్దకు, 2వేల రూపాయల నోట్లు వెంటనే ఎలా చేరాయో పాలకులే సమాధానం చెప్పాలి. ఏటిఎం, బ్యాంకుల్లోకి కొత్తనోట్లు చేరకముందే కోట్లాదిరూపాయల కొత్తనోట్లు పెద్దమనుషుల ఇళ్లకు చేరి, దళారుల ద్వారా కమిషన్ల రూపంలో చేరవలసిన వారికి చేరుతూనే ఉన్నాయి. ఇన్నిరోజుల్లో ఏ ఒక్క ధనవంతుడైనా క్యూ లైన్లలో ఉన్నట్లు కనిపించిందా? ఇంత రగడ జరుగుతూ, దేశమంతా చిన్ననోట్ల కోసం హాహాకారాలు చేస్తుంటే, కొత్తగా విడుదల చేసిన 500 రూపాయల నోటునయినా సక్రమంగా ముద్రించారా? అంటే అదీ లేదు. దానిపై డబుల్ ప్రింటింగులు గాంధీ గారినే కాదు, ఈ దేశ ప్రజలనూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయినా దానివల్ల నష్టమేమీ లేదని, చెల్లుబాటు కావన్న భయమేమీలేదని ఆర్‌బిఐ తాపీగా చెప్పడం శిక్షార్హం కాదా? అంటే పాలకులు తమ నియంత్రణలో ఉన్న వ్యవస్థలను ఎంత చక్కగా పర్యవేక్షిస్తున్నారో తెలుస్తూనే ఉంది.
‘50 రోజులు కష్టాలు భరించి త్యాగం చేయండి, నల్లకుబేరుల సంగతి తేల్చాస్తాన’న్న మోదీ మాటలు, ఆయన చెప్పిన గడువుకు ముందు ఒకటి అంకె చేర్చినా (150 రోజులైనా) నెరవేరేలా కనిపించడం లేదు. మరో మూడు నెలలు ఈ తిప్పలు తప్పవని స్వయంగా బ్యాంకు అధికారులు, ఉద్యోగ సంఘాలే చెబుతుంటే దేశప్రజలు ఎలా స్థిమితంగా ఉండగలరు? అయినా అందరి ఖాతాల గుట్టుమట్లను తెలుసుకుని తీరాలంటున్న పాలకులు, పార్టీలు- తమ ఆనుపానులు తెలుసుకునే అధికారం సమాచారహక్కు చట్టానికి మాత్రం లేదనడం ఏం ధర్మం? తమ పార్టీల గుట్టుమట్లను చెప్పడానికి సాహసించని రాజకీయ పార్టీలకు, మరొకరి బ్యాంకుఖాతాలు ఇవ్వాలనే నైతిక హక్కు ఉందా?
మోదీ ఇమేజ్ దీర్ఘకాలంలో పెరగొచ్చేమో గానీ ఇప్పటికయితే డామేజీ అవుతూనే ఉందన్నది నికార్సయిన నిజం. శత్రుఘ్న సిన్హా వంటి సొంత పార్టీ నేత, శివసేన వంటి మిత్రపక్షమే మోదీ విధానాలను తప్పుపట్టడం గమనార్హం. ఆర్‌బిఐ సైతం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని నాలుక్కరుచుకుంది. ఒకరకంగా మోదీ ఈ నిర్ణయం తీసుకుని తన మిత్రపక్షాలనూ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారు. ఫలితంగా వారు తమకు తెలియకుండానే జనం ముందు ముద్దాయిలుగా నిలబడాల్సి వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు ముందే తేరుకుని స్థితప్రజ్ఞత ప్రదర్శించి, డామేజీని కేంద్రం వైపు మళ్లించగలిగారు. *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144