సంపాదకీయం

భద్రత బలపడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్- కెఎల్‌ఎఫ్- అన్న బీభత్స ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు పంజాబ్‌లోని ‘నాభా’ జైలు నుంచి తప్పించుకోగలగడం హైదరాబాద్‌లో ముగిసిన మూడు రోజుల డిజిపిల సదస్సుకు సమాంతర పరిణామం! డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్- డిజిపిల- సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ‘ఖలిస్తాన్’ విద్రోహులు జైలు నుంచి బయటపడడానికి వ్యూహరచన చేసినట్టు వెల్లడి కావడం విచిత్రమైన వ్యవహారం. 2014 మే 26న పాలన బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం భద్రతను పెంపొందించడానికి అనేక చర్యలను చేపట్టిందన్నది నిరాకరించజాలని నిజం. దేశ రాజధానిలో జరుగవలసిన డిజిపిల సదస్సును రాష్ట్రాల రాజధానులలో జరపడానికి నిర్ణయించడం కూడా భద్రతా ధ్యాసను పెంచడానికి దోహదం చేస్తున్న పరిణామం. నవంబర్ 25న పోలీస్ అధిపతుల సమావేశాన్ని ఆరంభించిన దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్, శనివారం సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య, కేంద్ర భద్రతా విభాగాల మధ్య మరింతగా సమన్వయం, సమాచార వినిమయం పెంచవలసిన ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు. ఈ సమన్వయం పెంపొందించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కూడా. వివిధ విష స్వభావాల, వికృత స్వరూపాల ఉగ్రవాదులు మన భద్రతను ఛిద్రం చేయడానికి నిర్విరామ కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ‘సమన్వయం’ అనివార్యమైన వౌలిక భద్రతాసూత్రం. పెద్ద కరెన్సీ నోట్ల చెలామణిని కేం ద్రం రద్దు చేసిన నేపథ్యంలో మన భద్రతకు మరో బెడద వచ్చిపడింది. అది ఆర్థిక బీ భత్సం, పెద్దనోట్ల రద్దు వల్ల నకిలీ డబ్బు ని ర్మూలన జరిగిపోవడంతో నకిలీ డబ్బును 500, 1000 రూపాయల నోట్ల రూపంలో చెలామణి చేసిన ఉగ్రవాదులు దెబ్బతిన్న తోడేళ్ల వలే మరింతగా పేట్రేగిపోవడానికి ప్రయత్నిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. ఈశాన్య ప్రాంతంలో అణగారి ఉండిన విద్రోహులు, ఉగ్రవాదులు మళ్లీ దాడులు చేస్తుండడం ఇందుకు నిదర్శనం! మన ప్రభుత్వం భద్రతా వ్యవస్థల మధ్య అనుసంధానం, సమన్వయం పెంపొందిస్తున్న కొద్దీ బీభత్సకారుల ముఠాల మధ్య కూడా సమన్వయం పెరుగుతోంది. ఈ సమన్వయాన్ని పెంపొందిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వ ‘గూఢచర్య విభాగం’గా చెలామణి అవుతున్న అంతర్జాతీయ ఉగ్ర వ్యవస్థ.. దానిపేరు ‘ఇంటర్ సర్వీసేస్ ఇంటెలిజన్స్’- ఐఎస్‌ఐ. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఇంకా తాము ఉన్నట్టు ఆదివారం చాటుకొనడం ఈ ‘ఐఎస్‌ఐ’ అనుసంధాన వ్యూహంలో భాగం మాత్రమే! మరుగున పడిన ‘ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్’- నాభా జైలు నుంచి ఉగ్రవాదులు పరారీ కావడం వల్ల ఆదివారం మళ్లీ వికృతంగా కనిపించింది!
ఈ ‘కెఎల్‌ఎఫ్’ ముష్కరులు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరణతో క్రీస్తుశకం 1970- 1988 దశకాలలో పంజాబ్‌లో భయానక బీభత్సకాండను సృష్టించారు. సతత హరిత పంజాబీ భూములు ‘టెర్రరిస్టులు’ హత్య చేసిన అమాయకుల రక్తంతో ఎరుపెక్కడం చరిత్ర. పంజాబ్‌ను దేశం నుంచి విడగొట్టి స్వతంత్ర ‘ఖలిస్తాన్’ దేశంగా ఏర్పాటు చేయాలన్న ‘కెఎల్‌ఎఫ్’ విద్రోహ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. ఈ విద్రోహం అణగిపోయి దాదాపు ఇరవై ఏళ్లయింది. కానీ ఇపుడు మళ్లీ ‘మేమున్నామంటూ’ ఈ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకొనడం ‘ఐఎస్‌ఐ’ వ్యూహంలో భాగం! జమ్మూ కాశ్మీర్‌లోని ‘అధీన రేఖ’ ప్రాంతంలో ప్రత్యక్ష జిహాదీ బీభత్సకారులకు, ప్రచ్ఛన్న బీభత్సకారులైన పాకిస్తాన్ ప్రభుత్వ దళాలకు మన భద్రతా దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ‘ఊరీ’ బీభత్స ఘటన తరువాత మన సైనికులు ‘అధీన రేఖ’ ప్రాంతంలో జరిపిన ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- ఐఎస్‌ఐ పాలిట అశనిపాతం! మన ప్రతిఘటన తీవ్రతరం అవుతున్న కొద్దీ ‘ఐఎస్‌ఐ’ వారి అనుసంధాన బీభత్సం కూడా విస్తరిస్తోంది. ఆదివారం ‘ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్’లోని మొదటి హంతకుడు హర్మిందర్ మింటూ సహా ఆరుగురు టెర్రరిస్టులు జైలు నుంచి పరారీ కావడం ఈ ‘విస్తరణ’లో భాగం!
మన ప్రధానమంత్రి డిజిపిల సదస్సులో పిలుపు ఇచ్చినట్టు ‘్భద్రత’ నిర్వహణలో గుణాత్మకమైన పరివర్తన రావలసిన అవసరం ఉంది. జైళ్ల గోడలకు పడుతున్న రంధ్రాలను పసికట్టడంలో ‘్భద్రత’ నిఘా నేత్రాలు విఫలం అవుతుండడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! జమ్మూ కాశ్మీర్‌లోను, ఈశాన్యం లోను, ఇతర రాష్ట్రాల లోను సైనికుల వేషంలోను, పోలీసుల వేషం లోను టెర్రరిస్టులు సంచరించగలుగుతున్నారు. పోలీసులపై, సైనికులపై దాడులు చేయగలుగుతున్నారు. ఈ ‘మారువేషాల’ను మన భద్రతా దళాల వారు ముందుగానే పసికట్టలేక పోవడం మన పనితీరులోని ప్రధానమైన లోపం. మన అంతర్గత భద్రతాదళాలు అప్రమత్తంగా లేవని కాదు, ఈ జాగరూకత మరింతగా సునిశితం కావలసి ఉంది. ప్రధానమంత్రి సూచించిన ‘పనితీరులో మార్పు’ బహుశా ఇదే కావచ్చు! పంజాబ్‌లోని నాభా జైలు వద్దకు పోలీసుల వేషంలో వచ్చిన ఉగ్రవాదులు సిబ్బందిపై కా ల్పులు జరిపారు. సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతుండగా సందు చూసుకుని లో పల ఉన్న బీభత్సకారులు పరారయ్యారు. ఇప్పుడు జైలు సిబ్బందిని, జైలు ప్రధాన అధికారిని సస్పెండ్ చేయడం వల్ల పారిపోయిన హంతకులు పట్టుబడతారా? పట్టుబడవచ్చు. కానీ, పారిపోకుండా నిరోధించ గలిగే విధంగా మన భద్రత రూపొందాలి.. అక్టోబర్ 31న ‘సిమి’ జిహాదీ బీభత్స సంస్థకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ జైలు గోడనెక్కి బయటికి వెళ్లగలిగారు. ఆ తరువాత వారిని ఎదురుకాల్పులలో పోలీసులు మట్టుపెట్టగలిగారు. కానీ, ఎత్తయిన జైలు గోడను టెర్రరిస్టులు నిర్భయంగా అధిరోహించడం భద్రతా కుడ్యంలోని భయంకర రంధ్రం. ఈ రంధ్రాలు విస్తరిస్తున్నాయనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వరంగల్ జైలు నుంచి తప్పించుకున్న ఇద్దరు నేరస్థులు కూడా చాలా ఎత్తయిన గోడనెక్కి దిగిపోయారట..
అత్యుత్తమ నిఘా విధానాలను, పటిష్టమైన నేర నిరోధక పద్ధతుల గురించి ఒక రాష్ట్రం పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో అనుభవాలను పంచుకొనడానికి, సమాచారాన్ని వినిమయం చేసుకొనడానికి డిజిపిల సదస్సులు మాధ్యమాలని మోదీ చెప్పిన మాట మరో మార్గదర్శక సూత్రం కావాలి. విధి నిర్వహణలోను, నేర నిరోధక వ్యూహరచనలోను నిష్ణాతులైన పోలీసులకు సదస్సు సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పురస్కారాలు అందజేశారు. ఇలాంటి నిపుణులైన పోలీసుల మధ్య మరింత సమన్వయం కోసం జాతీయ స్థాయిలో శాశ్వత అనుసంధాన విభాగం ఏర్పడవలసిన అవసరం ఉంది. ‘బీభత్స నిరోధక జాతీయ కేంద్రం’- నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్- ఎన్‌సిటిసి- అలాంటి అనుసంధాన విభాగం కాగలదు. కానీ, ఈ ‘ఎన్‌సిటిసి’ 2012లో ప్రతిపాదనకు వచ్చినప్పటికీ ఇంతవరకూ రూపొందలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ‘ఎన్‌సిటిసి’ గురించి ఇప్పుడైనా ఆలోచించాలి...