మెయన్ ఫీచర్

కరెన్సీ కష్టాలకు ‘డిజిటల్’ విరుగుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కలలు కనండి’ అని దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం విద్యార్థులకు సలహా ఇచ్చినట్టు, ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ కలలు కనండి’ అంటూ జాతికి సందేశం ఇస్తున్నారు. డిజిటల్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు. అమెరికా, ఐరోపా దేశాల్లో జేబులో డబ్బు పెట్టుకోకుండానే మొత్తం లావాదేవీలు ఆన్‌లైన్ మీదనే సాగిపోతాయి. ‘పెద్దనోట్ల’ను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన తర్వాత దేశ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరెన్సీ కొరత, చిల్లర సమస్య కారణంగా ఇపుడు చిన్న వ్యాపారస్థులు కూడా డెబిట్ కార్డులకు అలవాటుపడాలని భావిస్తున్నారు. ఇంతకుముందు వాళ్లెప్పుడూ ఆన్‌లైన్ పేమెంట్, స్వైపింగ్ విధానం, నగదు రహిత వ్యాపార లావాదేవీలు గూర్చి విని ఉండలేదు. పెద్దనోట్ల రద్దుతో నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ప్రజలు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఈ పరిస్థితి వినియోగదారులకే కాదు, బ్యాంకు ఉద్యోగులకూ ప్రాణసంకటంగా మారింది. నగదు రహిత లావాదేవీలు జరిగితేనే ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అందుకు ‘డిజిటల్ వ్యవస్థ’ మాత్రమే ఉపశమనం కలిగిస్తుందని మోదీ సందేశం ఇస్తున్నారు.
500, 1,000 రూపాయల రద్దు పేరుతో భారీ మొత్తంలో కరెన్సీని చెలామణి నుంచి ఉపసంహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని విపక్ష పార్టీల నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. తగినంత కరెన్సీని ముద్రించక పోవడం, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం క్షమించరాని నేరమని కొందరు మేధావులు సెలవిస్తున్నారు. మరోవైపు నోట్ల మార్పిడిలో లాలూచీలు, నకిలీ కరెన్సీ ప్రవేశం, ఎటిఎంలు పనిచేయక పోవడం, బ్యాంకుల్లో నగదు లేకపోవడం వంటి పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. రద్దయిన నోట్లను కొందరు ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూనే ఉన్నారు. సమస్యలు ఎదురవుతున్నమాట వాస్తవమేనని, అయినా డిసెంబర్ నెలాఖరు వరకూ వేచి ఉండాలంటూ మోదీ చెబుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ల తీరుపై ఆరా తీసేందుకు అపుడే ఇన్‌కంటాక్స్ అధికారులు రంగంలోకి దిగారు. సామాన్యులకు చెందిన జన్‌ధన్ యోజన ఖాతాల్లోకి రాత్రికి రాత్రే ఎక్కడి నుండి డబ్బు వచ్చిపడుతున్నదో అపరాధ పరిశోధన మొదలయింది. అయితే, నల్లకుబేరుల జాతకాలు మాత్రం ఇంకా బయటపడలేదు. పారిశ్రామిక, సినీ, రియల్ ఎస్టేట్ కుబేరుల ఆర్థిక లావాదేవీల్లో నిజానిజాలు నిగ్గుతేలాల్సి ఉంది.
1999లో ఆనాటి జిడిపిలో 20.7 శాతం నల్లధనం కాగా, 2007 నాటికి అది 23.7 శాతానికి పెరిగింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో 25 శాతం నల్లధనం మీద ఆధారపడి ఉంది. నల్లధనానికి తోడు నకిలీ కరెన్సీ మన ఆర్థిక వ్యవస్థకు పెనుశాపంగా మారింది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించని వారు, అక్రమంగా డబ్బు సంపాదించిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ధర కోటి వరకు వెళ్లగా, విజయవాడ, గుంటూరులల్లో 80 లక్షలకు చేరింది. ఇప్పుడీ రేట్లు ఒక్కసారి పడిపోతాయి. ఎందుకంటే ‘తెల్లధనం’తో కొనుగోలుచేసే వారే ముందుకు రావాలి కదా!
ఇక రాజకీయంగా చూస్తే- ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దనోట్ల రద్దుతో బిఎస్‌పి అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఇపుడు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాబోయే శాసనసభ ఎన్నికలలో వీరు విచ్చలవిడిగా ధనం ఖర్చుచేసి ఓట్లు కొనుగోలు చేయలేరు. కొన్ని పార్టీలు ఇప్పుడే పాత నోట్లు పంచిపెట్టినా, ఆరునెలల తర్వాత ఓటర్లు ఎటు ఓటువేస్తారో ఎవరూ ఊహించలేరు. ఇక, పేదలకు చెందిన జన్‌ధన్ యోజన ఖాతాల్లో పెద్దపెద్ద మొత్తాలు ఎక్కడి నుండి వచ్చి జమ అవుతున్నాయి? ఇలా జమ చేయబడిన రాష్ట్రాలలో తృణమూల్ కాంగ్రెస్ పాలనలోని బెంగాల్ ప్రధమస్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏలుబడిలోని కర్ణాటక ద్వితీయ స్థానంలో ఉన్నట్లు ఐటి అధికారులు అంచనావేశారు. అయితే, పాకిస్తాన్ ఉగ్రవాద మాఫియాల ప్రత్యక్ష ప్రమేయంతో నడిచే బాలీవుడ్‌లో నల్లధనం వ్యాప్తిని కేంద్రం ఎలా కట్టడి చేయగలదు? అన్న ప్రశ్నలు లేకపోలేదు.
మోదీ నిర్ణయాన్ని ముందుగా బలపరచవలసింది వామపక్షాలు. కానీ, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది కూడా వీళ్లే. అంటే వీరి నిజాయితీ ఏమిటో ఇప్పుడు తెలిసిపోయింది. ఇక కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీల నేతల అవినీతి, అక్రమార్జనల గురించి వేరే చెప్పనవసరం లేదు. మైనారిటీల ఓట్ల కోసం నల్లధనాన్ని విచ్చలవిడిగా పంచిపెట్టిందీ, నకిలీ కరెన్సీని ప్రోత్సహించిందీ ఈ విపక్ష పార్టీల నేతలే. ఈ కారణంగానే మోదీ సంస్కరణలను కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు, బిఎస్‌పి, ఎస్‌పి వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నల్లధనాన్ని నియంత్రించడమే కాదు, విదేశాల్లో పారిశ్రామిక వేత్తలు, సినీతారలు, రాజకీయ నేతలు, కొన్ని మతసంస్థలు భారీగా దాచిపెట్టుకున్న నల్లధనాన్ని ఈ దేశానికి రప్పించాలి.
నోట్లరద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని విపక్ష పార్టీలు యథాశక్తి ప్రయత్నించడం మరో పరిణామం. సిపిఎంకు చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ సహకార బ్యాంకులకూ నోట్ల మార్పిడి లావాదేవీలపై అధికారం కావాలని తిరువనంతపురంలో ధర్నా నిర్వహించారు. ‘ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా వీధికెక్కడం తగునా?’- అని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం అలా ఉంచితే, సహకార బ్యాంకులు, బులియన్ బ్యాంకుల వ్యాపారస్థుల బండారం బయటపడుతున్నది. మంగళూరులో ఐదు సహకార సంఘాలు 8 కోట్ల రూపాయలను ఏకకాలంలో సహకార బ్యాంకులో జమచేశాయి. మరోవైపు కొన్ని మత సంస్థలు, వందలాది ఛారిటబుల్ ట్రస్టులు చేస్తున్న అక్రమ లావాదేవీలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇన్‌కంటాక్స్ అధికారులు 133(6) సెక్షన్ కింద నోటీసులు జారీచేయటం మొదలుపెట్టారు. రేస్‌కోర్సులు, పేకాట క్లబ్బులు, సినిమా థియేటర్లు కలెక్షన్లు లేక విలవిలలాడుతున్నాయి. ఐటి అధికారులు 2013-14, 2014-15 టాక్స్ రిటర్న్‌లు కూడా పరిశీలించటం మొదలుపెట్టారు. అంటే ఇది నల్లధనంపై ప్రత్యక్ష యుద్ధమే.
ఇక సినీరంగం విషయం చూస్తే- ఒకప్పుడు అగ్రనటులకు భారీ పారితోషికాలు ఉండేవి కావు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, సల్మాన్‌ఖాన్‌ల పారితోషికాలు ఎంత? మన చిరంజీవి, పవన్‌కళ్యాణ్, మహేశ్‌బాబు, నాగార్జున వంటి అగ్రనటులు, ప్రముఖ దర్శకులు తీసుకుంటున్న మొత్తాలు ఎంత? వారు చెల్లిస్తున్న పన్నులు ఎంత? ఇంకోవైపు- దేశంలో దొంగ ఛారిటబుల్ ట్రస్టులు, అనాథ శరణాలయాలు, వికలాంగ సంక్షేమ కేంద్రాలూ ఉన్నాయి. కేవలం అమెరికన్ ఫండ్స్ కోసమే నడుస్తున్న వందలాది సేవా కేంద్రాలల్లో దొంగ డబ్బుతో మతం మార్పిడులు జరుగుతున్నాయి. ఇస్లాం దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయంతో మన దేశంలో కొన్ని మతసంస్థలు స్వచ్ఛంద సేవ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. నోట్లరద్దుతో వీటి ఆగడాలకు కళ్లెం పడుతుంది. పెద్దనోట్ల రద్దుతో అందరి దృష్టి చెక్కులు, క్రెడిట్ కార్డులు, బార్టర్ సిస్టం వైపు మళ్లింది. పెరటితోటలో కూరలు, చింతచెట్టు వంటివి ఉంటే చాలా నిత్యావసర సమస్యలు పరిష్కారమవుతాయి అంటున్నారు. ఇక విదేశాల సంగతి చూస్తే- బెల్జియంలో 93 శాతం ప్రజలు నోట్లను వాడరు. 86 శాతం మంది డెబిట్ కార్డులతోనే జీవనం గడుపుతున్నారు. కెనడాలో 90శాతం నోట్లను వాడటం లేదు. 70 శాతం కార్డులతోనే సరకులు కొనటం వంటివి జరుపుకుంటున్నారు. స్వీడన్‌లో మూడుశాతం మంది మాత్రమే నోట్లు వాడుతున్నారు.
అమెరికా, స్వీడన్ వంటి దేశాలల్లో బందిపోటు దొంగలు ధనాన్ని దోచుకోవటం జరుగుతున్నది. అందుకని వారు పెద్దనోట్లతో తిరగటం మానివేశారు. మనదేశంలో కూడా బ్యాంకుల వద్దే దృష్టి మళ్లించి లక్షలకు లక్షలు దొంగిలిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంతవరకు నోట్ల వ్యవహారం లేకుండా నిత్యజీవనం గడపటం మంచిదని ఆర్థికశాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక బ్యాంకుకార్డులతోనే ఆర్థిక వ్యవహారాలు నడుపుకోవచ్చు. దీనివల్ల నోట్లకోసం క్యూలు ఉండవలసిన అవసరం ఉండదు. మోదీ చెబుతున్న ‘డిజిటల్ కలలు’ సాకారమైతే కరెన్సీ కష్టాలు తొలిగిపోతాయనే భావించాలి.

-ముదిగొండ శివప్రసాద్