మెయన్ ఫీచర్

వ్యవస్థీకృత చౌర్యం.. ఎవరి పన్నాగం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆ ర్గనైజ్డ్ లూట్, లీగలైజ్డ్ ప్లండర్’ అన్న ఆంగ్ల పదజాలాన్ని మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ నవంబర్ ఇరవై నాలుగవ తేదీన రాజ్యసభలో ప్రయోగించాడు! ఈ పదజాలాన్ని ఇలా మరోసారి ఆయన ప్రయోగించడానికి అవకాశం కల్పించిన పరిణామం కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేయడం.. ‘ఆర్గనైజ్డ్ లూట్’అని అంటే గత్యం వ్యవస్థీకృతతం కావడం ‘లీగలైజ్డ్ ప్లండర్’ అని అంటే శాసనబద్ధంగా కొల్లగొట్టడం! ‘అభ్యాసానుసరీ విద్యా’ పదే పదే వల్లెవేయడం వల్ల పదజాలాన్ని మరచిపోము- అన్నది తర్కబద్ధమైన జీవన సత్యం. రాజకీయ జీవనపు మలిసంధ్యలో సైతం మన్‌మోహన్ సింగ్ ఇలా తనకు బాగా పరిచయమైన పదజాలాన్ని వల్లెవేస్తున్నాడు! స్వభావానికి విరుద్ధంగా ఎవ్వరూ ప్రవర్తించరు, వ్యవహరించరు. అందువల్ల స్వీయప్రవృత్తిని మరోమారు చాటుకొనడానికి మన్‌మోహన్ రాజ్యసభలో యత్నించాడు! ఐదువందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్ల రద్దు వల్ల నకిలీ డబ్బు నశిస్తుంది, నల్లడబ్బు పరిమాణం తగ్గిపోతుంది. ఈ రెండు పరిమాణాల వల్ల దోపిడీ ఎలా వ్యవస్థీకృతం అవుతుందన్నది మన్‌మోహన్ సింగ్ వివరించలేదు, ‘కొల్లగొట్టడం’ ఎలా శాసనబద్ధం అవుతున్నది కూడ ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఇవి కేవలం ఆరోపణలే! మన దేశంలో రాజకీయవేత్తలు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి తార్కిక ప్రాతిపదిక ఉండకపోవడం వివిధ సందర్భాలలో ధ్రువపడిన సత్యం.. పార్లమెంటూ శాసనసభలో చేసిన ప్రసంగాల గురించి బయట బాధ్యత వహించవలసిన పనిలేదు కాబట్టి చట్టసభలలో జరుగుతున్న నిందారోపణలకు ఔచిత్యం సున్నయిపోతోంది! ఏమయినప్పటికీ ‘ఆర్గనైజ్డ్ లూట్’, ‘లీగలైజ్డ్ ప్లండర్’ అన్న పదాలు మన్‌మోహన్ సింగ్‌కు బాగా పరిచయమైనవి! ఎందుకంటే దేశంలో ఇరవై రెండేళ్లుగా దోపిడీ వ్యవస్థీకృతం కావడానికి, కొల్లగొట్టడం బహిరంగ నిత్యకృత్యం కావడానికి, శాసనబద్ధం కావడానికి ఏకైక ప్రాతిపదిక వాణిజ్య ‘ప్రపంచీకరణ’.. ఈ ప్రపంచీకరణను వ్యవస్థీకరించినవాడు మన్‌మోహన్ సింగ్! క్రీస్తుశకం 1991నుంచి ఐదేళ్లపాటు ఆర్థికమంత్రిగా ఉండిన సింగ్ 1994లో ‘వాణిజ్య ప్రపంచీకరణ’కు అంకురార్పణ చేశాడు.. 2004 నుంచి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉండిన ఆయన మన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థతో ‘పీకితే తెగని విధం’గా గట్టిగా అనుసంధానం చేశాడు! విదేశాల నుంచి వచ్చిపడిన కొన్నిరకాల మొక్కలు, తీగెలు కేరళ ప్రాంతంలోని అడవులలో అనాదిగా పెరిగిన అనేక వృక్షాలను, లతలను నిర్మూలించాయట! ప్రపంచీకరణలో భాగంగా దేశంలోకి చొరబడిన విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలు స్వదేశీయ సంస్థలను, చిన్నచిన్న పరిశ్రమలను దిగిమింగి వేశాయి! వ్యవస్థీకృతమైన దోపిడీ అంటే ఇదీ.. శాసనబద్ధమైన ‘కొల్లగొట్టడం’ బహిరంగంగా సాగిపోతోంది. ఈ రెండింటినీ మన్‌మోహన్ సింగ్ ‘ప్రపంచీకరణ’ ద్వారా ప్రవేశపెట్టాడు! తన స్వభావాన్ని ఇతరులకు అంటగట్టి ఆరోపించడం సహజం! మన్‌మోహన్ సింగ్ ‘వ్యక్తి’కాదు.. వ్యవస్థ! అందుకే ప్రపంచీకరణ వల్ల నెలకొన్న వైపరీత్యాలను ఆయన ‘నోట్లురద్దు’కు ఆపాదించి ఆనందించాడు. మన్‌మోహన్ సింగ్ ప్రతీక మాత్రమే.. కాంగ్రెస్ ‘అధిష్ఠానం’ వౌలిక వ్యవస్థ!!
నల్లడబ్బు, నకిలీ డబ్బు విస్తరించిపోవడం ఇప్పటి సంగతి కాదు. వాటిని అరికట్టడం కోసం పెద్దనోట్లను రద్దుచేయడం కూడ ఇప్పుడు మొదటిసారి సంభవించిన పరిణామం కాదు. క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో ఐరోపావారు మన దేశంలోకి చొరబడినప్పటి నుంచి క్రమంగా బంగారం, వెండి, రాగి నాణెములు కనుమరుగైపోయాయి. ఈ లోహాలను వాడి వినిమయ ద్రవ్యాన్ని- కరెన్సీని- నాణెములుగా ముద్రించిన కాలంలో ‘నకిలీ’ డబ్బుకు ఆస్కారం ఉండేది కాదు. నాణెము విలువ, దాన్ని తయారుచేయడానికి వాడిన లోహం విలువ సమానంగా ఉన్నప్పుడు ‘నకిలీ’కి ఆస్కారం లేదు. ‘లోహం’ విలువ పెరిగి, ‘నాణెము’విలువ తగ్గినప్పుడు నాణెమును కరగించివేసి లోహంగా మార్చుకునే ముఠాలు బ్రిటన్ పాలనలో పుట్టుకొచ్చాయి. ‘నాణెం’ విలువకంటె ‘నాణెం’ తయారీకి వాడిన లోహం విలువ తగ్గిపోవడం తరువాతి పరిణామం. ఈ దశలోనే బంగారం, వెండిలో ఇతర లోహాలను కల్తీచేసి ‘నకిలీ నాణెముల’ను తయారుచేసిన ముఠాలు పుట్టుకొచ్చాయి! క్రమంగా అనాదిగా దేశంలో చెలామణిలో ఉండిన బంగారం, వెండి ‘నాణెముల’ స్థానంలో ‘కాగితం డబ్బులు’ పుట్టుకొని రావడం విదేశీయుల దోపిడీ ఫలితం! ‘రూపాయి’ని మాత్రమే బ్రిటన్ ప్రభువులు వెండి నాణెంగా కొనసాగించారు. రూపాయి కంటె విలువైన ‘వెండి నాణెముల’ను బ్రిటన్ దోపిడీదారులు ముద్రించిన చరిత్ర లేదు. రూపాయి నాణెంలో ‘తులం’- పదకొండు గ్రాములు- వెండి ఉండేదట! అంటే పదకొండు గ్రాముల వెండి ధర ఒక రూపాయి మాత్రమే! ఇప్పుడు కిలో వెండి ధర దాదాపు నలబయి వేల రూపాయలు, పదకొండు గ్రాముల వెండి విలువ దాదాపు నాలుగువందల యాబయి రూపాయలు. అంటే క్రీస్తుశకం 1947 నాటి ఒక రూపాయి విలువ ప్రస్తుత విలువల ప్రాతిపదికగా నాలుగువందల యాబయి రూపాయలన్నమాట! ద్రవ్యోల్బణం, ధరలు నాలుగువందల యాబయి రెట్లు పెరిగాయి. రూపాయి విలువ నాలుగువందల యాబయి రెట్లు పడిపోయింది! ఈ దుస్థితికి కారణం బ్రిటన్ తదితర విదేశీయులు దశాబ్దుల పాటు సాగించిన ‘దోపిడీ’.. ఈ ‘దోపిడీ’కి కొనసాగింపు‘ప్రపంచీకరణ’! ప్రపంచీకరణ ద్వారా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశాన్ని దోచుకొనడం వ్యవస్థీకృతమైంది, కొల్లగొట్టడం శాసనబద్ధమైంది.. దీన్ని నెలకొల్పినవాడు మన్‌మోహన్ సింగ్! విదేశీయ వాణిజ్య సంస్థల దోపిడీ ప్రవృత్తి స్వదేశీయ సంస్థలను కూడ ఆవహించడం ప్రపంచీకరణ ప్రభావం!
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ క్రీస్తుశకం 1934వ సంవత్సరంలో ‘వేయిపడగలు’ అన్న బృహత్ నవలను రచించాడు! అప్పటికే దేశంలో ‘నకిలీ నోట్ల’ సమస్య తీవ్రంగా ఉండినట్టు ఈ నవల ద్వారా తెలుస్తోంది. విదేశీయ దురాక్రమణదారుల దోపిడీ ప్రవృత్తి అప్పటికి స్వదేశీయ సమాజాన్ని కూడ ఆవహించి ఉంది. దోపిడీ చేయడానికి వీలులేని వికేంద్రీకృత వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థ మన దేశంలో అనాదిగా పరిఢవిల్లింది. ‘పాలకుల’ ముసుగులోని విదేశీయ ఆర్థిక బీభత్సకారులు ఈ వికేంద్రీకృత వ్యవస్థను నిర్మూలించారు. ‘ఆర్గనైజ్డ్ లూట్’ అన్న ఆర్థిక బీభత్సం అప్పుడే మొదలైంది. విశ్వనాథ వారు వివరించినట్టు ‘.. నూటిలో తొంబది తొమ్మిది మందికి తిన తిండిలేకుండా చేసి, ఒకడే ధనమంతయు ప్రోవుచేసి మేడలు కట్టును, మోటారులు కొనును, కుక్కపిల్లలను కొనును, దుష్టవస్తువులన్నియు కొనుటకు వినియోగించును.. మోటారు కొనిన డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు రాక్ఫెల్లర్లను బాగుచేయుచున్నది’. ‘ప్రపంచీకరణ’ 1994లో నెలకొన్న తరువాత మన దేశానికి చెందిన రెండు లక్షల కోట్లు రూపాయల విలువైన ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- ప్రతి ఏటా చైనాకు తరలిపోతోంది! ఇతర విదేశాలకు తరలిపోతున్న ‘వినిమయ ద్రవ్యం’ సంగతి వేరే కథ. బ్రిటన్ దోపిడీని కొనసాగిస్తున్న ప్రపంచీకరణను వ్యవస్థీకరించినవాడు మన్‌మోహన్‌సింగ్.. ‘ఆర్గనైజ్డ్ లూట్’ గురించి మాట్లాడే నైతిక అధికారం ఆయనకు ఉందా? ఆయనను ‘బొమ్మ’చేసి ఆడించిన కాంగ్రెస్ అధిష్ఠానం వారికుందా?? సుబ్బన్నపేట అన్న చిన్న ఊరిలోనే ‘సినిమా’ ప్రదర్శనశాల ముసుగులో జరిగిన దొంగనోట్ల ముద్రణ గురించి విశ్వనాథ వారు ఇలా వివరించారు. ‘కరెన్సీ నోట్లు తయారుచేయు యంత్రసామగ్రియు, అచ్చులు, రంగులు, కాగితములు దొరికెను. అవి అన్నియు స్టేషనుకు తెచ్చిరి. కుఱ్ఱవానిని నిర్బంధించిరి.. ‘అయ్యా.. నాకేమియు తెలియదు. ఇల్లద్దెకిచ్చితిని’ అనెను. ‘అతడు సినిమా కంపెనీలో నుండును. వచ్చినచో చూపించద’ననెను.. అతడు సినిమా రౌడీ.. నోట్లకట్టలున్నవారు, ఉన్నవని అనుమానమున్నవారు ఆ ఇంటికి వచ్చుచు పోవుచుందురని తెలియబడినవారు యేబది మంది సబ్ జైలులో చేరిరి.. జడ్జి యొక దొర.. ఇట్టి దొంగనోట్ల కేసులు పది పదునొకండిదివరకే యతడు విచారించియుండెను.. రామేశ్వరమునకు ఏడేండ్లును, చలపతికేడేండ్లును శిక్షవేసిరి’- 1934 నాటికే దొంగనోట్ల చెలామణి దేశమంతటా పెచ్చుపెరిగిందనడానికి ఈ ‘నవల’లోని ఈ ఘట్టం ఒక ఉదాహరణ మాత్రమే! నిరోధక చర్యలు సైతం అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. 1946లో ప్రభుత్వం- అప్పటికింకా బ్రిటన్ దురాక్రమణ కొనసాగుతూనే ఉంది- వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిందట. 1978లో మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం వారు కూడ వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల నోట్లను రద్దుచేశారట! ఐదువేలు, పదివేల రూపాయల నోట్లు మనం చూడలేదు. ఆ కాలంలోని కోటీశ్వరులు వాటిని చూశారేమో! అప్పుడు ఇలా ‘గోల’ చెలరేగిన జాడలేదు! దీనికి కారణం ఒకటే! అప్పుడు ఇంత పెద్దమొత్తంలో నల్లడబ్బు లేదు, ఇంత పెద్ద సంఖ్యలో నల్లకుబేరులూ లేరు! ఇందుకు కారణం ‘ప్రపంచీకరణ’! ప్రపంచీకరణ వల్ల ‘కృత్రిమ ప్రగతి’ విస్తరించి ఉండవచ్చు! కానీ అంతకంటె ఎక్కువగా అవినీతి విస్తరించింది. ప్రపంచీకరణకు పూర్వం జరిగిన అతిపెద్ద అవినీతి చర్య ‘బోఫోర్స్’ శతఘు్నల కొనుగోలు! ఆ అవినీతి విలువ కేవలం ముప్పయి ఎనిమిది కోట్ల రూపాయలు! ‘ప్రపంచీకరణ’ తరువాత పుట్టలు పగిలిన ‘అవినీతి’కలాపాల విలువ వేల లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 2012 నాటి బొగ్గు కుంభకోణంలో అధికార రాజకీయవేత్తలు, దళారీలు కలిసి లక్షాడెబ్బయి ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాధనం బొక్కేయడం పరాకాష్ఠ! దూరవాణి రెండవశ్రేణి తరంగాల కేటాయింపులలో కూడ ఇంతే మొత్తాన్ని అవినీతిపరులు బొక్కేయడం ‘ప్రపంచీకరణ’ప్రభావం! ఈ డబ్బంతా నోట్ల రూపంలో మాత్రమే కాదు, బంగారంగాను, స్థిరాస్థిగాను మారి ఉంది! ప్రపంచీకరణకర్త మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలోనే ఇలా ‘దోపిడీ’ వ్యవస్థీకృతమైంది! అందువల్లనే తమ ప్రభుత్వం నాటి ‘పదజాలాన్ని’ ఆయన వల్లెవేశాడు- మరచిపోరాదు మరి!
పెద్దనోట్ల రద్దువల్ల మాత్రమే నల్లడబ్బు నశించిపోదు! ‘ప్రపంచీకరణ కబంధ బంధం వల్ల దోపిడీ విస్తరిస్తోంది! ‘ప్రపంచీకరణ’ కొన్ని సంస్థల గుత్త్ధాపత్యాన్ని వ్యవస్థీకరించింది, వ్యవస్థీకరిస్తోంది! కాఫీపొడి అమ్మే చిల్లర దుకాణాలు మూతపడ్డాయి, పడుతున్నాయి. ‘కాఫీ డే’ వంటి సంస్థల గుత్త్ధాపత్యం నెలకొనిపోయింది! మనకు వీధులలో ‘టాక్సీ’ దొరకదు.. ‘క్యాబ్’ కావాలంటే ‘ఉబర్’, ‘ఓలో’ సంస్థలకు ఫోన్ చేసి ‘బుక్’ చేసుకోవాలి! అందుకు మామూలు ‘సంచారవాణి’ పనికిరాదు. ‘లావణ్యవాణి’- స్మార్ట్ఫోన్- కావాలి! ఇదీ ప్రపంచీకరణ! ‘స్మార్ట్ఫోన్’ దగ్గర లేనివాడు కాళ్లీడ్చుకుంటూ నడచిపోవాలి!!

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com