సబ్ ఫీచర్

‘చిల్లర కష్టాలు’ చిన్న సమస్యే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండ్లు ఓడలవటం, ఓడలు బండ్లు అవటం అంటే ఇదే..!- అన్నాడు లోకేశం నిట్టూరుస్తూ
‘ఏమైంది ఇప్పుడు.. ఎందుకలా వున్నావు?’ అడిగాడు గిరీశం.
‘ఏమైందని మెల్లిగా అడుగుతావేం..? నీ చెవులు దొబ్బినయా లేక నీ కళ్లలో పూలు పూసినయా..? నువ్వు ఈ సమాజంలో బతకడం లేదా..? మరీ అంత మొద్దు నిద్రేంటి..? నరేంద్ర మోదీ ఎంత పని చేశాడు..? ఉన్నట్లుండి పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్యుడి కొంప ముంచలేదూ.. అతి సామాన్యుడి కన్నా నాలాటి మధ్యతరగతి వాడి పరిస్థితి మింగలేకా.. కక్కలేకా అన్నట్లుంది.
‘ఏమైంది ఇప్పుడు..?’
‘మళ్లీ అదేమాట..! ఇంతకుముందు జేబులో పదో ఇరవయ్యో ఐదొందలు, వెయ్యి నోట్లు పెట్టుకుని చిన్న సైజు ఉన్నోడిలా పోజు కొడుతూ అవీ ఇవీ కొంటూ వీధులన్నీ దర్జాగా తిరిగేవాడిని. ‘చిల్లరివ్వండి సార్..’ అని ఏ షాపువాడైనా అంటే ‘నా దగ్గర అన్నీ పెద్దనోట్లే వున్నాయం’టూ పోజు కొట్టేవాడ్ని. అపుడు వాడే చచ్చినట్టుగా చిల్లరిచ్చేవాడు. ఇప్పుడు ఆ పెద్దనోట్లన్నీ చెల్లని చిత్తుకాగితాలు కావడంతో నా ఆర్థిక పరిస్థితి చిత్తయిపోయింది. పెద్దనోటు జేబులో నుంచి బయటికి తీసి బిచ్చగాడిలా దీనంగా ‘ఈ నోటు తీసుకోండి ప్లీజ్..’ అని అడుక్కోవాల్సి వస్తోంది. ఎత్తు కుర్చీమీద కూర్చున్న దుకాణదారు ‘తీసుకోను..నడవదు..’ అని మొహం మీద కొట్టినట్టు చెప్పి..‘్ఛ పో’! అని కుక్కను తరిమినట్టు తరిమితే అవమానంతో, సిగ్గుతో తలవంచుకుని బయటికి రావాల్సి వస్తోంది.. ఛ! ఛ!..
‘రోజులు ఎప్పుడూ ఒకేలా వుంటాయా?’
‘అవును.. ఉండవు’ అని బాగానే తెలిసివస్తోంది.
వెనకటి కాలంలో దేశంలో కరువు వస్తే జనం గడ్డ్ధిన్యం, ఆకులు, అలములు తిని ఆకలి మంట చల్లార్చుకుని బతికేవారట.. ఇప్పుడూ అదే పరిస్థితి!
ఇంటికి వెడితే పెళ్లాం..‘సరుకులు లేవు’ అంటూ పచ్చడి మెతుకులు, చారునీళ్లతో అన్నం పెడుతోంది. గంటల తరబడి క్యూలో నిల్చుని కొత్తనోట్లు తేలేని నన్ను యుద్ధంలో నుంచి పారిపోయి వచ్చిన పిరికి సైనికుడిలా చీదరించుకుంటోంది. కుర్‌కురేలకు, ఐస్‌క్రీములకు అలవాటుపడిన పిల్లలు.. అవి కొనుక్కోవడానికి డబ్బులివ్వడం లేదని ‘నువ్వేం డాడీవీ..’ అన్నట్టు ఓరచూపులు, కోరచూపులతో నిరసన తెలియజేస్తున్నారు.
‘నిజమే.. కష్టకాలమే..!’
‘వంద రూపాయలు, అంతకన్నా తక్కువ నోట్లు జేబులో లేనివాడు ఇప్పుడు ఎందుకూ కొరగాని వాడు.. పెళపెళలాడే పెద్దనోటు తీసి పోజుకొట్టేవాడికి రోజులు పోయి, చిల్లరున్నోడికి ఇప్పుడు అకస్మాత్తుగా విలువ పెరిగిపోయింది. అలాంటివాడ్ని ఇప్పుడు అందరూ కింగ్‌లా చూస్తున్నారు.
రద్దయిన నోట్లు డిపాజిట్ చేయలేక.. కొత్తనోట్లు సంపాదించలేక రోజువారీ ఖర్చులకూ చేతిలో డబ్బులు లేక ఇప్పుడు నా పరిస్థితి దుర్భరంగా వుంది. నాకన్నా బిచ్చగాడు నయం అనుకుంటున్నాను.’
‘ఒక్కొక్కసారి ఇలానే అవుతుంటుంది.. ఏం చేస్తాం.. ఫేస్ చెయ్యక తప్పదు..!’
ఈ మాటలతో గిరీశం వంక అనుమానంగా చూసాడు లోకేశం.
‘నిన్ను చూస్తుంటే నాకున్న కష్టాలేవీ నీకు లేవనీ, నువ్వు నిశ్చింతగా వున్నావనీ అనిపిస్తోంది. ఏంటి సంగతి..? పెద్దనోట్లు రద్దు కాబోతున్న విషయం ముందే లీక్ అయి నీదాకా వచ్చి నువ్వు జాగ్రత్త పడ్డావా అనిపిస్తోంది!’ అన్నాడు.
‘అది రాజ్యాంగ రహస్యం. లీక్ ఎలా అవుతుంది..? పైగా నేను నీలా సామాన్యుడికి కొంచెం ఎక్కువ.. ఉన్నవాడికి కొంచెం ఎక్కువ తక్కువ. కనుక మధ్యతరగతి వాడి అవస్థలు నాకూ అనుభవమే.. కాకుంటే నువ్వు చెప్పుకుంటున్నావు.. నేను చెప్పుకోవడం లేదు...అంతే తేడా!’
‘నువ్వెందుకు చెప్పుకోవడం లేదు.. బాధలు షేర్ చేసుకుంటే మనసు కాస్త ఊరట చెందుతుంది కదా!’
‘నేను షేర్ చేసుకునే విషయాలు వేరే వున్నాయి. అవి వినగల మిత్రులు నాకు వేరే ఉన్నారు..!’
‘నువ్వు నన్ను అవమానిస్తున్నావు..!’
‘కాదు కాదు.. సమస్యను చూడవలసిన విస్తృత పరిధిలో కాకుండా కేవలం నీ కోణం నుంచి మాత్రమే చూస్తున్నావని చెబుతున్నాను. నిజానికి ఈ సమస్య సామాన్యుడికి చిన్న సమస్య.. కట్టలు కట్టలు బ్లాక్‌మనీని రహస్య స్థావరాల్లో దాచుకున్న నల్లకుబేరుడికి గుండె ఆగిపోయేటంత పెద్ద సమస్య.. మోదీ లక్ష్యం అదే. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక సమస్యలు తప్పవు. అది భారత పౌరులుగా, ఓటు హక్కుదారులుగా మనందరి బాధ్యత! ఏం జరిగినా నాకేం పట్టదని కాళ్లు జాపుకుని కూర్చోలేము కదా.. మనమూ ఒక చెయ్యేసి నల్లధనాన్ని బయకు లాగవలసి వస్తుంది. మొన్నీ మధ్య మా వాట్సాప్ గ్రూపులో ఒకరు పంపిన మెసేజ్ విషయం నీకు చెబితే నీ ఆలోచనా విధానం కూడా మారుతుందేమో చూద్దాం. ఒకతను అంటాడూ...‘నా దగ్గర బ్లాక్‌మనీ ఏమీ లేదు. మరి.. నేనెందుకు ఈ కష్టాలు పడాలి!’ అని. అది విన్న ఓ సోల్జర్ అంటాడూ.. పాకిస్తాన్‌తో నాకు వ్యక్తిగత వైరమేమీ లేదు.. మరి నేనెందుకు ప్రాణాలకు తెగించి యుద్ధం చేయాలీ..! అని. దాంతో తెల్లముఖం వేశాడు అవతలి వ్యక్తి. లోకేశం.. నిజానికి ఇదీ ఒక రకంగా యుద్ధమే.. నల్లధనం మీద ప్రభుత్వం చేస్తున్న యుద్ధం. అందులో మనమూ..!’
‘విషయం అర్థమైంది.. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు.. చిన్నచిన్న వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు నాకు అసలు సమస్యలుగానే కనిపించడం లేదు. అర్జునుడి లక్ష్యం పక్షికన్ను మీద వున్నట్టు... ఇప్పుడు నా దృష్టి నల్లధనం మీదే వుంది. దాన్ని ఛేదించాలి అంతే..!’
‘అదీ బుద్ధిజీవి ఆలోచనా విధానం అంటే.. అలా ఉండాలి..’ అంటూ మెచ్చుకోలుగా లోకేశం వంక చూసాడు గిరీశం.

-కొఠారి వాణీ చలపతిరావు