మెయన్ ఫీచర్

ఏ తీరాలకు ఈ ప్రస్థానం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపులు, మరకలతో ఓ ఏడాది చరిత్ర గర్భం లో కలసిపోయింది. హెచ్‌సియులో రోహిత్ వేముల మృ తితో మొదలైన వివాదాల పరంపర పెద్దనోట్ల రద్దు, త మిళ ‘పురచ్చితలైవి’ జయలలిత అనుమానాస్పద మృ తితో 2016 ముగిసిపోయింది. రోహిత్ వేములను దళితుడిగా ప్రచారం చేసిన వామపక్షాలు చివరాఖరకు అతను దళితుడుకాదు, బీసీ అని తేలడంతో కంగుతినాల్సి వచ్చింది. రోహిత్, ఆ తర్వాత కన్నయ్య కుమార్ పరిణామాలు ఎలాంటి ఫలితాలు మిగిల్చినా, వర్సిటీల్లో నాటుకుపోయిన వామపక్ష భావజాల ఆలోచనా విధానాలను కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరాన్ని కేంద్రానికి గుర్తు చేశాయి. రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను సవాల్ చేసే శక్తులను అణచకపోతే, వర్శిటీలు ఉగ్ర భావజాల కేంద్రాలవుతాయన్న విషయం పాలకులకు తెలిసొచ్చింది. జాతీయ జెండాను తగులబెట్టి, సొంత దేశానే్న కబళించేస్తామని, పక్కదేశపుపాట పాడుతున్న చిరంజీవులను సమర్ధించిన వామపక్ష మేధావులనూ దేశ ప్రజ కళ్లారాచూసింది.
* * *
ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇద్దరు ‘చంద్రులూ’ తమ ప్రాంతాల్లో ప్రతిపక్షాలను బతకనిచ్చేలా కనిపించటం లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై గుండెలవిసేలా నిరసిస్తున్న తెదేపా- ఎపిలో వైకాపా ఎమ్మెల్యేల విషయంలో అదే చేసింది. ఇద్దరు ‘చంద్రుల’కు ఏ ఏడాది మధ్య వరకూ ‘ఓటుకు నోటు’ యుద్ధం నడిచి, తర్వాత రాజీ కుదిరిన ఫలితంగా అపూర్వ సహోదరులైపోయారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య మునుపటి వైరం కనిపించకపోవడం సంతోషకరమే. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలు సాధించిన విజయాలివే.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బాబు పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరించడంతో ఎట్టకేలకు దిల్లీ నుంచి నిధులొచ్చాయి. అవి పాతవా? కొత్తవా? అన్నది అప్రస్తుతం. పోలవరం కాంక్రీటు పనులను పబ్లిసిటీ పండగలా చేసుకున్న తెదేపా సాధించిన విజయాన్ని హైజాక్ చేసేందుకు రంగంలోకి దిగిన వైసీపీ, అదంతా వైఎస్ జమానా గొప్పతనమేనన్న వాదనకు దిగడం ఆశ్చర్యకరం. వైఎస్ కుటుంబ ఏలుబడిలో దశాబ్దాల తరబడి తరిస్తున్న పులివెందులకూ నీళ్లిస్తామని మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. అప్పుడు వైకాపా నేతలు ఇంకెన్ని పాతగాథలు తవ్వితీస్తారో చూడాలి. అలాగని పోలవరంలో సబ్ కాంట్రాక్టు పర్సెంటేజీలు, ‘ఎక్సెస్ ధనదాహం’ లేదంటే అంతకుమించిన అమాయక త్వం ఉండదు. అసలు ఇరిగేషన్ అంటేనే డబ్బును నీళ్లలా పిండుకోవడమే కాబట్టి, ఎవరికీ సర్ట్ఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు. ఈ విషయంలో వైఎస్ నుంచి బా బు వరకూ అంతా పట్ట్భద్రులే! ఏదేమైనా కొత్త ఏడాదిలో పోలవరం పరుగులు తీయాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదు.
* * *
‘వాడిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ’ని జనసామాన్యంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ సినిమా డైలాగు- తాజాగా తమిళనాట ఆవిష్కృతమవుతున్న విభ్రాంతికర దృశ్యాలు చూసిన తర్వాత అక్కడి రాజకీయ నేతలకు సరిగ్గా నప్పుతుందనిపిస్తోంది. తమిళసీమలో వ్యక్తిపూజ ఇప్పటిది కాదు. తారాలోకం నుంచి రాజకీయ రంగానికి అడుగిడిన వారితో మొదలైన ఈ వ్యక్తిపూజ, నిన్నటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత వరకూ నిర్నిఘ్నంగా కొనసాగింది. ఎంజిఆర్, కరుణానిధి, జయలలిత వంటి నేతలకు గుళ్లు గోపురాలతోపాటు, కష్టసమయంలో వారు బయటపడాలని కోరుకుంటూ లెక్కలేనంతమంది నాలుకలు కోసుకున్న దురభిమానం ఈ దేశం కళ్లారా చూసింది. ఈ ఏడాది చివరలో తమిళ ‘అమ్మ’ కన్ను మూసిన తర్వాత కొన్ని డజన్ల గుండెలు ఆగిపోయాయి.
తమిళనాట వ్యక్తిపూజ ఎంత సహజమో, వాటి కోసం పాకులాడే నేతల సంఖ్య కూడా ఎక్కువే. తాజాగా ‘చిన్నమ్మ’ రూపంలో వచ్చిన శశికళ అనే జయలలిత ఆత్మకూ అలాంటి జబ్బు అంటుకున్నట్లుంది. వారిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అన్నది నిరాకరించజాలని నిజం. ఒకప్పటి వీడియోషాపు ఓనరు- ‘అమ్మ’ అభిరుచులు తెలుసుకుని ఆ మేరకు విడదీయలేనంతగా పెనవేసుకునిపోయన బంధమే ఇప్పుడు శశికళను ‘చిన్నమ్మ’ను చేసినట్లుంది. అందుకే- ‘చిన్నమ్మా.. అక్రమ ఆస్తుల కేసులో జైలు ఊచలు లెక్కబెట్టినా నువ్వు తప్ప మాకు దిక్కులేదు, పార్టీ పగ్గాలు చేపట్టి, మా జన్మ ధన్యం చేయమని ఒక ముఖ్యమంత్రే కాళ్లూ వేళ్లూ పట్టుకుని ఆమెను బతిమిలాడితే, ఈ దేశంలో వ్యక్తిస్వామ్యం చూస్తే ప్రజాస్వామ్యవాదులకు భయమేయదూ?! బుద్ధిగా ఉద్యోగం చేసుకోవలసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహనరావు- ‘అమ్మ’ బతికుంటే ఇలా జరిగేదా? అని గద్దించడం ఏ విలువలకీ ప్రస్థానం అన్న సందేహం రాదూ? తమిళ తంబిలు అలా పాదాభివందనం చేసి ప్రార్థించడం, ‘చిన్న తలైవి’ వారి హాహాకారాలు ఆర్తితో ఆలకించి, పార్టీ పగ్గాలు తీసుకునేందుకు పెద్దమనసుతో మన్నించడం చకచకా జరిగిపోయాయి. తమిళ రాజకీయ పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం మరీ ఇంతగా పరిహాసమవుతుందా? ఈ డిజిటల్ యుగంలోనూ దురభిమానం ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వెర్రితలలు వే స్తుందా? అనిపించకమానదు.
వీటిని మానసిక బలహీనతలని మానసిక శాస్తవ్రేత్తలు చెబుతుంటారు. నిజానికి ఇలాంటి పోకడలు దాదాపు ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా దాగుంటాయట! పొగడ్తల్ని ఎవరైనా ఇష్టపడతారు. కానీ, తమిళనాడులో ప్రస్తుత నేతలు ఈ స్థితిని ఎప్పుడో దాటేయగా, చిన్నమ్మ మనసులో ఎప్పటినుంచో మనసులో ఉన్న అలాంటి కోరికలు ఇప్పుడే బయటపడుతున్నట్లు ప్రస్తుత సంఘటనలు చెబుతున్నాయి. ఇలాంటి మానసిక బలహీనతలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయన్న నిజాన్ని తెదేపా అధినేత చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలోకి అడుగుపెట్టిన తర్వాత అంగీకరించారు. సిఎంగా ఉన్నప్పుడు పొగడ్తలకు పొంగిపోయేవాడినని, అదొక బలహీనత అయ్యేదని నిజాయితీగా ఆయన ఎప్పుడో ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనలో అలాంటి బలహీనతలే తొంగిచూస్తున్నట్లున్నాయి.
పూర్వం రాచకార్యాల్లో మునిగిపోయి, బిజీగా ఉండే రాజులకు మానసిక ప్రశాంతతనిచ్చేందుకు భట్రాజులుండేవారు. రాజును పొగడ్తలతో ముంచెత్తడమే వారి ఉద్యోగం. అందుకోసం వారికి జీతభత్యాలుండేవి. ఆ పొగడ్తలకు రాజులూ పరవశించి ఆరోజు పడిన కష్టం మర్చిపోయేవారు. ఇప్పుడు జీతాలు గట్రా తీసుకోకుండా, దానికి బదులు ‘పెద్ద పనులు’ చేసుకునే నయా భట్రాజులు, మీడియా భజంత్రీలు పాలకుల పక్కన గజానికొకరు దర్శనమిస్తుంటారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నప్పుడు నిఘా బృందాలు తొలుత ‘నెగిటివ్ రిపోర్టు’లిస్తే ఆయన వారిపై కస్సున లేచేవారు. దాంతో ఇలాంటి రిపోర్టులను పంపాల్సివస్తే వాటి అసలు మూ లాలు తమ వద్దనే పెట్టుకుని ‘సానుకూల నివేదికలు’ మాత్రమే బాబుకు సమర్పించేవారు. అయితే ఆ ‘్భజన’ వల్ల ఏమి కోల్పోయిందీ బాబుకు ఎన్నికల తర్వాత తెలిసొచ్చింది.
తెలంగాణ సిఎం కేసీఆర్ అసెంబ్లీలో సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ముందు- చిరుద్యోగి నుంచి చీఫ్ ఇంజనీర్ వరకూ అందరినీ పిలిపించి, అందులో కష్టనష్టాలు, వాటిని మారిస్తే జనం నుంచి వచ్చే ప్రతిస్పందనను స్వయంగా ఆరా తీసి, ఆనక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వ్యక్తుల మనస్తత్వం, గత చరిత్ర, వాస్తవాల ప్రాతిపదిక జీవనం, అన్ని కోణాలు స్పృశించాలన్న జిజ్ఞాస వంటి అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉంటాయని అర్థమవుతుంది.
* * *
ఈ ఏడాది చివరన జనజీవితంలో ఆర్థిక సునామీ సృష్టించిన ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం గురించి చర్చించాల్సిందే. 50 రోజుల్లో కష్టాలు తీరతాయని చెప్పిన ఈ దేశ చౌకీదారు, ఆ మేరకు దానిని నిలబెట్టుకోలేకపోయినా- జనాలకు పొదుపు, క్యూలో నిలబడే సహనం, బాగా సంపాదించినా దానిని అనుభవించే అదృష్టం-అవకాశం ఉండదన్న జీవిత సత్యాన్ని మాత్రం చక్కగా చెప్పగలిగారు. మోదీ దెబ్బకు దేశం ‘క్యూ’లో నిలబడి నీరసించిపోయినప్పటికీ, సరిహద్దుల్లో చొరబాట్లు, సైనికులపై రాళ్లు విసిరే కిరాయి మూకలు మాత్రం కనిపించడం మానేశాయి. కారణం వారివద్ద అందుకు కావలసిన డబ్బు అందుబాటులో ఉండకపోవడమే. పెద్దనోట్ల రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్‌లో రోజుకోచోట కిరాయి మూకలు పోలీసులపై రాళ్లు, బాంబు దాడులు చేసేవి. వారికి అందుకోసం పాక్ ముష్కరులు డబ్బు పంపిణీ చేసేవారు. నోట్ల రద్దు తర్వాత వారివద్ద తగినంత డబ్బు అందుబాటులోకి లేకపోవడంతో, కిరాయిమూకలకు డబ్బులివ్వడం ఆపేశారు, ఫలితంగా ఇప్పుడక్కడ ఏ ధ్వనులూ వినిపించడం లేదు.
మోదీ ‘గురి’కి సామాన్యుడు కొంతమేరకే క్షతగాత్రుడైనప్పటికీ, నల్లకుబేరులు మాత్రం నిలువెల్లా గాయాలతో సతమతమవుతున్నారు. వ్యూహాత్మకంగా విడుదల చేసిన 2 వేల నోట్ల కట్టలపాములు కొద్దిరోజుల్లోనే మళ్లీ దాడులతో బ్యాంకులకు చేరుతున్నాయి. ఇలా ఆర్థిక రంగంపై మోదీ చేసిన సర్జికల్ దాడులతో ఈ ఏడాది ముగిసింది.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144