మెయన్ ఫీచర్

శాతకర్ణి.. శాలివాహనుడు.. ఉగాది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీకు తెలుసా? ఉగాది పండుగను జరుపుకొనే సంప్రదాయం శాలివాహన శకం ఆరంభం కావడంతో మొదలైంది. మనందరికీ తెలియని మహావిషయం ఇప్పుడు ఈ సినిమా ద్వారా వెల్లడవుతోంది! తెలుసుకోండి’’ అని దృశ్య శ్రవణ స్రవంతి వేదికపై నుండి ‘కార్యక్రమాన్ని’ అనుసంధానం చేస్తున్న మహిళామణి గట్టిగా అరచింది! మరో పండితుడు వెంటనే అం దుకుని- ‘‘మనం భరతవర్షే, భరతఖండే, శాలివాహన శకే... అని చెపుతున్నాము! ఈ శాలివాహన శకాన్ని స్థాపించినవాడు గౌతమీపుత్ర శాతకర్ణి’’ అని వివరించాడు! సృష్టి ఆరంభం నుంచి భారతదేశంలో తెలుగు, కన్నడ, మరాఠీ సీమలలో జరుగుతున్న ఉగాది- గుడి పద్వా-ని శాలివాహనుడు కనిపెట్టడం ఏమిటి? గౌతమీపుత్ర శాతకర్ణి వేఱు, శాలివాహనుడు వేఱు! ‘శాతకర్ణి’ శాలివాహన శ కాన్ని ఆరంభించడం ఏమిటి?
ఇది ‘చలనచిత్ర’ వినోదం కాదు, మనదేశ చరిత్రకు సంబంధించిన మహా విషయం, హైందవ జాతీయ సంస్కృతికి సంబంధించిన విజ్ఞానం. ఆషామాషీగా వినోదాన్ని వ్యాపింపచేయడం, నవ్వించడం తప్పు కాదు. కానీ వినోదాన్ని మహా విజ్ఞానంగాను, కల్పనను వాస్తవ చరిత్రగాను జన జీవనంలో స్థిరపరచడానికి ప్రయత్నించడం మహాపరాధం! ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అన్న తెలుగు సినిమా ఈనెల పనె్నండవ తేదీన విడుదల అవుతోందట! ‘ఆంధ్ర శాతవాహన’ వంశానికి చెందిన ఇరవై ఐదవ సమ్రాట్టు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. అందువల్ల ఈ సుప్రసిద్ధ చారిత్రక జాతీయ మహాపురుషుని గురించి సినిమా తీయడం తెలుగువారు మాత్రమే కాదు, భారతీయులందరూ ప్రశంసించదగిన మరో చారిత్రక ఘటన! సినిమా అన్న తరువాత చరిత్రతోపాటు కమనీయ కల్పనలు ఉండవచ్చు. కానీ ఏది చరిత్ర? ఏది కల్పన? అన్న విచక్షణను పెంచడానికి సైతం సమాంతరంగా ప్రయత్నం జరగాలి! కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం విడుదలకు పూర్వరంగంగా జరుగుతున్న దృశ్య మాధ్యమ కార్యక్రమాలలో చిత్ర విచిత్రమైన వక్రీకరణలు ప్రచారమైపోతున్నాయి! సినిమాలోనూ ఈ చారిత్రక వక్రీకరణలు ఉన్నాయా? ఉన్నట్టయితే నిర్మాత, దర్శకుడు, రచయితలు ఈ చారిత్రక వక్రీకరణం- హిస్టారికల్ డిస్టార్షన్స్-ను తొలగించి సినిమాను విడుదల చేయాలి! లేనట్టయితే అది జాతీయ మహావీరుడైన గౌతమీపుత్ర శాతకర్ణికి అవమానం, జాతీయ చరిత్రకు అగౌరవం, భరతమాతకు అపచారం కాగలదు..
ప్రస్తుత కలియుగం ప్రారంభమైన తరువాత ఐదువేల నూట పదిహేడు సంవత్సరాలు గతించాయి. ఈ ‘దుర్ముఖ’ నామ సంవత్సరం ఐదువేల నూట పద్దెనిమిదవ సంవత్సరం. ఇది చాంద్రమానం లెక్క. అంటే ఈ కలియుగం ప్రారంభమయిన తరువాతనే తెలుగువారు, కన్నడిగులు, మరాఠాలు ఐదువేల నూట పద్దెనిమిది ఉగాది పండుగలు జరుపుకున్నారు. పూర్వయుగాలలో, పూర్వ మన్వంతరాలలో, పూర్వ కల్పాలలో అనాదిగా అసంఖ్యాక ‘ఉగాదులు’ జరుపుకున్నాము. కేవలం కలియుగం ప్రాతిపదికగా ఆలోచించినప్పటికీ ప్రమర వంశపు శాలివాహనుడు, ఆంధ్ర శాతవాహన వంశపు గౌతమీపుత్ర శాతకర్ణి పుట్టడానికి పూర్వం రెండు వేల ఐదువందలకు పైగా ‘ఉగాదులు’ గడిచిపోయాయి.
ఆంధ్ర శాతవాహన వంశంలోని ఇరవై ఐదవ వాడైన గౌతమీపుత్ర శాతకర్ణి కలియుగం రెండువేల ఆరువందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి రెండువేల ఆరువందల తొంబయి నాలుగవ సంవత్సరం వరకూ పాతికేళ్లు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పాలించాడు. అంటే ‘క్రీస్తుశకం’ పుట్టక పూర్వం నాలుగువందల ముప్పయి మూడవ సంవత్సరం నుంచి నాలుగువందల ఎనిమిదవ సంవత్సరం వరకు గౌతమీపుత్ర శాతకర్ణి భారతదేశపు సమ్రాట్టు. కలియుగం క్రీస్తునకు పూర్వం మూడువందల నూట రెండేళ్లనాడు ఆరంభమైంది. అంటే కలియుగంలో మూడువేల నూట రెండవ ఏట క్రీస్తు మత శకం ఆరంభమైంది. ఇలా కలియుగంలో రెండువేల ఆరువందల అరవై తొమ్మిదేళ్లు గడిచిన తరువాత దేశాన్ని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కలియుగం పూర్వం నుండీ, కలియుగం ఆరంభం నుంచి జరుగుతున్న ‘ఉగాది’ పండుగను ఎలా ఆరంభించాడు? మనమందరం తెలుసుకోవాలి!
ఇలా గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన ముగిసిన తరువాత రెండువేల నాలుగువందల ఇరవై మూడు ఏళ్లు గడిచాయి, ప్రస్తుతం రెండువేల నాలుగు వందల ఇరవై నాలుగవ సంవత్సరం నడుస్తోంది. ఐదువేల నూట పద్దెనిమిదిలో రెండువేల ఆరువందల తొంబయి నాలుగును తీసివేస్తే రెండువేల నాలుగు వందల ఇరవై నాలుగు ఏళ్లు.. శాలివాహన శకం ప్రారంభమైన తరువాత పంతొమ్మిది వందల ముప్పయి ఏడు ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం శాలివాహన శకం పంతొమ్మిదవ వందల ముప్పయి ఎనిమిదవ సంవత్సరం నడుస్తోంది. శాలివాహన శకాన్ని జాతీయ ఆధికారిక శకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఉంది. కలియుగంలో మూడువేల నూట డెబ్బయి తొమ్మిదవ ఏట ‘శాలివాహన శకం’ ఆరంభమైంది. అంటే క్రీస్తుశకం ఆరంభమైన తరువాత డెబ్బయి ఎనిమిదవ సంవత్సరంలో ‘శాలివాహన శకం’ ఆరంభమైంది. తాను మరణించిన తరువాత నాలుగువందల ఎనబయి ఐదు ఏళ్లకు ఆరంభమైన శాలివాహన శకాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా ఆరంభించాడు? ప్రారంభించాడని చెప్పడం చారిత్రక అనభిజ్ఞతకు చిహ్నం!
నిజానికి శాలివాహన శకాన్ని ప్రారంభించినది ప్రమర వంశీయుడైన శాలివాహన సమ్రాట్టు! ‘గిరివ్రజం’ రాజధానిగా ఆంధ్రుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశాన్ని పాలించిన తరువాత దాదాపు ఐదువందల ఏళ్లకు ‘ఉజ్జయిని’ రాజధానిగా శాలివాహనుడు మొత్తం భారతదేశాన్ని పాలించాడు. శాలివాహనుడు ‘ప్రమర’ వంశం వాడు. అంతే కాని ఆంధ్ర శాతవాహన వంశం వాడు కాదు. ‘గిరివ్రజం’ ప్రస్తుతం బిహార్‌లో ఉంది, ‘ఉజ్జయిని’ మధ్యప్రదేశ్‌లో ఉంది. కలియుగం ఆరంభం నుంచి కలియుగం ముప్పయి తొమ్మిదవ శతాబ్ది వరకూ మొత్తం భారతదేశాన్ని పది రాజవంశాల వారు పాలించారు. ఈ రాజవంశాలలో ఆంధ్ర శాతన వంశం ఎనిమిదవది, గౌతమీపుత్ర శాతకర్ణి ఈ ఆంధ్ర వంశం వాడు. ఈ రాజ వంశాలలో ‘ప్రమర వంశం’ పదవది. శాలివాహన శకాన్ని స్థాపించిన శాలివాహనుడు ఈ ‘ప్రమర వంశం’ వాడు. ఇలా గౌతమీపుత్ర శాతకర్ణి వేఱు, శాలివాహనుడు వేఱు! ఇద్దరూ ఒకటే అని చెప్పడం చారిత్రక అనభిజ్ఞతకు చిహ్నం, జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం! ఆంధ్ర శాతవాహనుడైన గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ‘సినిమా’ తీయడం నిజంగా గొప్ప విషయం! ప్రమర వంశస్థుడైన శాలివాహనుని గురించి కూడ మరో గొప్ప చలనచిత్రాన్ని నిర్మించవచ్చు! ఇద్దరూ వేఱు వేఱు కాలాలలో మాతృభూమిని ఉపాసించిన భరతమాత వజ్రాల బిడ్డలు. కానీ ఇద్దరూ ఒకే వ్యక్తి అని చెప్పడం చరిత్రకు ద్రోహం..
బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశపు గొప్పతనాన్ని తగ్గించడానికై మన జాతీయ చరిత్రను చెరచిపోయారు. మన కలియుగ చరిత్రలో దాదాపు పదమూడు వందల ఏళ్ల కాల ఖండాన్ని తొలగించారు. విక్రమ శకాన్ని స్థాపించిన సమ్రాట్ విక్రముడు, శాలివాహన శకాన్ని స్థాపించిన శాలివాహనుడు పుట్టలేదని, వారు కల్పిత వ్యక్తులని కూడ వ్రాసిపోయారు! బ్రిటన్ మేధావులు భారత ప్రజల పట్ల ద్రోహబుద్ధితో వ్రాసిన చరిత్రనే ఇప్పటికీ మన పాఠశాలలలో, కళాశాలలలో విద్యార్థులకు బోధిస్తుండడం మన భావదాస్య ప్రవృత్తికి నిదర్శనం. బ్రిటన్‌వారు వక్రీకరించిన చరిత్ర ఆధారంగా కాక, భారతీయులు బ్రిటన్ జాతి పుట్టక పూర్వం నుంచి కూడ వ్రాసుకున్న వాస్తవ చరిత్ర ఆధారంగా ‘చారిత్రక చలనచిత్రాల’ నిర్మాణం జరగాలి! భారతీయులు ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా, సాహిత్య గ్రంథాల ద్వారా వ్రాసుకున్న చరిత్ర ‘దినచర్య’ పుస్తకం వంటిది. తన ‘దినచర్య పుస్తకం’- డయిరీ-లో ఎవ్వడూ అబద్ధాలు వ్రాసుకోడు! కానీ బ్రిటన్‌వారు మన దేశం గురించి వ్రాసిపోయిన చరిత్ర ‘రావణాసురుడు వ్రాసే రామాయణం వంటిది!’. అందువల్ల వాల్మీకి వ్రాసిన రామాయణం, వ్యాసుడు వ్రాసిన మహాభారతం, పురాణాలను మాత్రమే ప్రాతిపదికగా చారిత్రిక చలనచిత్రాలను నిర్మించాలి! బ్రిటన్ దురాక్రమణదారులు వ్రాసిన ‘్భరత చరిత్ర’ను నిరాకరిస్తూ అనేకమంది జాతీయ చరిత్రకారులు సమాంతరంగా వాస్తవమైన భారత చరిత్రను ఆవిష్కరించి ఉన్నారు.
అలాంటి జాతీయ చరిత్రకారులలో అగ్రగణ్యుడు బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం. భారతదేశపువాస్తవ చరిత్రను ఆవిష్కరించడానికై తన జీవితాన్ని ధారపోసిన తెలుగువాడు కోట వెంకటాచలం. డెబ్బయి ఏళ్ల క్రితమే ఆయన దాదాపు యాబయి చరిత్ర గ్రంథాలు వ్రాశాడు! కానీ ఆంగ్లేయుల చారిత్రిక భావ దాస్య గ్రస్తులై ఉన్న విశ్వవిద్యాలయాల నిర్వాహకులు కోట వెంకటాచలం వంటి జాతీయ చరిత్రకారులను పట్టించుకోలేదు! ‘ఇతిహాస సంకలన సమితి’ అన్న స్వచ్ఛంద జాతీయ సంస్థవారు వాస్తవ చరిత్రను ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ బ్రిటన్‌వారు మన నెత్తికెత్తించిపోయిన అబద్ధాల చరిత్రను వదిలించుకొనలేకపోవడం జాతీయ వైపరీత్యం! తెలుగువారి చరిత్ర పట్ల అనురక్తిని ప్రదర్శిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పుడైనా కోట వెంకటాచలం రచించిన ‘చరిత్ర’ను సర్వసమగ్రంగా పునర్ ముద్రించి ప్రచారం చేయాలి!’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సభలలో తెలుగు ముఖ్యమంత్రులు ప్రదర్శించిన చారిత్రక స్ఫూర్తికి అది- ఈ పునర్ ముద్రణ- ఫలశ్రుతి కాగలదు! కోట వెంకటాచలం స్థాయిలో పరిశోధన చేసినవారు, అన్ని చరిత్ర గ్రంథాలు వ్రాసినవారు మొత్తం భారతదేశంలో- సమకాలంలో కాని ప్రస్తుతం కాని- మరొకరు లేరు. కోట వెంకటాచలం వ్రాసిన మొత్తం చరిత్రను తెలుగు ప్రభుత్వాలు ప్రచారం చేసినట్టయితే వంద చారిత్రక సినిమాలకు సరిపడే ‘ఇతివృత్తాలు’ లభిస్తాయి. ‘కోట’వారి చరిత్ర ప్రాతిపదికగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఇరవై నాలుగు నవలలు వ్రాశారు. ఈ ఇరవై నాలుగింటినీ ఇరవై నాలుగు చారిత్రక చలనచిత్రాలుగా తీయవచ్చు!
ఆంధ్ర శాతవాహన వంశం వారు కలియుగాది నుంచి ధాన్యకటకం- కోటిలింగాల, అమరావతి- రాజధానిగా పాలించారు. ఈ ‘ఆంధ్రరాజ్యం’ భారతదేశంలోని యాబయి ఆరు - ఛప్పన్న ప్రాంతాలలో ఒకటి! ఈ ‘ఆంధ’ కలియుగ ఆరంభంలో నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్రమేకాక తమిళ, కన్నడ, మరాఠా, ఓఢ్ర ప్రాంతాలకు విస్తరించింది! ‘కటకం’ నుంచి కావేరీ వరకూ.. ఈ ఆంధ్ర శాతవాహనులు మొత్తం భారతదేశాన్ని క్రీస్తునకు పూర్వం ఎనిమిది వందల ముప్పయి మూడు- కలియుగం రెండువేల రెండువందల అరవై తొమ్మిది నుంచి క్రీస్తునకు పూర్వం మూడువందల ఇరవై ఏడు కలియుగం రెండువేల ఏడువందల డెబ్బయి ఐదు వరకు ఐదువందల ఆరేళ్లు ‘గిరివ్రజం’ రాజధానిగా పాలించారు. మొదటి సమ్రాట్టు శ్రీముఖుడు, ముప్పయి మూడవవాడు పులోముడు. గౌతమీపుత్ర శాతకర్ణి ఇరవై అయిదవవాడు!! *

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com