సంపాదకీయం

మళ్లీ ‘ప్రచ్ఛన్న’ చిచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయంగా మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయా? ఒకప్పుడు అమెరికాతో సమఉజ్జీగా అంతర్జాతీయ రాజకీయాలను శాసించిన రష్యా మరోసారి తన ఉనికిని బలంగా చాటుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, తన ప్రయోజనాలను దెబ్బతీసిందంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చిందులేయడం.. అంతే వేగంగా రష్యా దౌత్యవేత్తలపై వేటు వేయడం.. మరింత ఘాటైన రీతిలో ఏకంగా ఆర్థిక ఆంక్షలే విధించడం ఇందుకు ఆస్కారం ఇస్తోంది. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామిక దేశంగా భాసిల్లుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను.. అన్ని విధాలుగా వెనుకబడిపోయిన రష్యా ప్రభావితం చేసిందనడం ఎంత మేరకు సమంజసం? అసలు అమెరికా నిఘా వర్గాలు ఇందుకు సంబంధించి సేకరించిన సాక్ష్యాధారాలు ఎంత నిఖార్సన్నదీ సందేహాస్పదమే! డెమొక్రటిక్ పార్టీ ఆభ్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికీ, మొదటి నుంచి చివరి క్షణం వరకూ అందరూ వ్యతిరేకించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అఖండ విజయం సాధించడానికీ రష్యా హ్యాకర్లే కారణమని చెప్పడం వి డ్డూరంగానే ఉంది. అంతే కాదు, అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యానికి, హ్యాకింగ్‌ను పసిగట్టి నిరోధించలేని అమెరికా నిస్సహాయతకూ ఇది అద్దం పట్టేదే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు రష్యా తమ ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేసిందని, దీని వల్లే డెమొక్రాట్‌లకు నష్టం జరిగిందని చెప్పడం హాస్యాస్పదమే. తమ నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ఆధారంగా 32మంది రష్యా దౌత్యవేత్తల్ని బహిష్కరించిన అమెరికా ఆంక్షలూ విధించి రష్యాపై తన అక్కసు తీర్చుకోవడంలో వింతేమీ లేదు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం రెచ్చిపోయే అవకాశం ఉన్నా.. అమెరికాపై ప్రతి చర్యలకు పాల్పడక పోవడం, పైగా నూతన సంవత్సర విందువినోదాలకు అమెరికా దౌత్యవేత్తల్ని ఆహ్వానించడం అంతర్జాతీయ సంబంధాల్లో సరికొత్త మలుపు!
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచీ రష్యాతో మైత్రి అంతంత మాత్రంగానే కొనసాగుతూ వచ్చింది. ఉక్రెయిన్, ఎడ్వర్డ్ స్నోడెన్, సిరియా అంతర్గత సంక్షోభానికి సంబంధించి ఒబామా-పుతిన్ మధ్య ఎంత మాత్రం పొంతన లేని పరిస్థితే.. సిరియా అధ్యక్షుడు అసాద్‌కు రష్యా మద్దతివ్వడం ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింతగా దిగజార్చిందని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. పైగా ఒకప్పుడు అమెరికాతో పోటాపోటీగా అంతర్జాతీయ రాజకీయాల్లో రాణించిన రష్యాను మళ్లీ తిరుగులేని శక్తిగా మార్చేందుకు అధ్యక్షుడు పుతిన్ అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటూనే ఉన్నారు. ఒకప్పుడు యుఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా ఉన్న రిపబ్లికన్‌లను మళ్లీ విలీనం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా చర్యలూ చేపట్టారు. కానీ వీటిని ఇతర పశ్చిమ దేశాల సాయంతో అమెరికా తిప్పికొడుతూనే వచ్చింది. అందుకు కారణం.. మళ్లీ పాత రిపబ్లిక్‌లన్నీ నయానోభయానో రష్యాలో కలిసి పోతే అంతర్జాతీయంగా తమ పట్టు సడలినట్టేనని భావించడమే! ప్రత్యర్థుల్ని ఎత్తుకు పైఎత్తువేసి చిత్తుచేయాలే తప్ప తమ అధికారాన్నీ, ఇతర దేశాలతో తమకు ఉన్న సంబంధాల్ని ఆసరా చేసుకుని అణచివేయడమే అధికార వ్యూహమనుకుంటే పొరపాటే అవుతుంది. ఏ ఇతర రెండు దేశాల మధ్య విభేదాలు, సంఘర్షణ వాతావరణం తలెత్తినా అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ రష్యా-అమెరికాల మధ్యే ఇటువంటి పరిస్థితి తలెత్తితే దాని పర్యవసానాలు అనూహ్యంగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే ఈ రెండు దేశాలూ చేతులు కలిపితే మాత్రం అంతే విస్తృత స్థాయిలో గుణాత్మక అంతర్జాతీయ వాతావరణం బలోపేతం అవుతుంది. ఇందుకు దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్ అణు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేవడమే. ఈ అగ్ర దేశాలు రెండూ చేతులు కలపడం వల్లే ఇది సాధ్యమైంది. ప్రపంచానికి ఇరాన్ అణు ముప్పూ తప్పింది. కానీ హ్యాకింగ్ వ్యవహారంతో కథ మళ్లీ మొదటి కొచ్చింది. ఇది అమెరికా వైఫల్యమా? రష్యా చాతుర్యమా? లేక డొనాల్డ్ ట్రంప్ పరోక్ష సహకారామా? అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేది పరిస్థితి. మొత్తం మీద రష్యాను దోషిగా నిలబెట్టడంలో అమెరికా కృతకృత్యమైంది.
ఈ-మెయిల్స్ దుమారం రేపి ఆంక్షలూ విధించి అమెరికా తన అహంకారం చాటుకుంది. ఇంత జరిగినా పుతిన్ సంయమనం వీడక పోవడం వెనుక కచ్చితమైన రాజకీయ ఎత్తుగడ ఉందన్నదీ నిజం. మొదటి నుంచి ఒబామా చర్యల్ని, విధానాల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తమకు అనుకూలంగా మారతారన్న నమ్మకమే పుతిన్‌ను ప్రతీకార చర్యలకు విముఖం చేసింది. ఒక్కొక్కటిగా ఒబామా విధానాల్ని తిరగదోడతానని చెబుతూ వస్తున్న ట్రంప్ తమ దౌత్యవేత్తల బహిష్కరణ నిర్ణయాన్నీ కొట్టివేస్తారని రష్యా బలంగా విశ్వసిస్తోంది. పుతిన్ సంయమనాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడం, ఆయన చాలా తెలివైన వాడంటూ కితాబివ్వడం ఇందుకు సంకేతంగా రష్యా భావిస్తోంది. నిజంగా రష్యా దూకుడుకు కళ్లెం వేయడానికే అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆంక్షలు విధించారా? లేక అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ట్రంప్ రష్యా వైపు మొగ్గకుండా చేసేందుకే ఈ చర్య తీసుకున్నారా? అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. దేశాధ్యక్షుడిగా తన ఎన్నికను తిప్పికొట్టేందుకు డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్న ట్రంప్ ఒబామా తీసుకున్న నిర్ణయాల్ని దాదాపుగా రద్దు చేస్తాననీ ప్రకటించారు. దేశీయంగా రాజకీయ పార్టీల మధ్య ఉండే సంబంధాలు వేరు. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉంటే ఆర్థిక,రాజకీయ, సామాజిక మైత్రి బంధం వేరు. అంతర్గతంగా రిపబ్లికన్‌లు, డెమొక్రాట్ల మధ్య ఎన్ని విభేదాలున్నా వాటి ప్రభావం ఇతర దేశాలతో అమెరికా సంబంధాలపై ఏ విధంగానూ పొడసూపకూడదు. ఇప్పుడు అగ్రరాజ్యంలో జరుగుతున్నది ఇదే. రష్యాను ఒబామా వ్యతిరేకించినంత మాత్రాన ఆయన తర్వాత అధ్యక్ష పదవిని చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా అదే బాటలో వెళ్లాలన్న నిబంధం ఏమీ లేదు. ఎందుకంటే దేశాల మధ్య సంబంధాలు అంతర్జాతీయ పరిణామాలు, అవసరాల ప్రాతిపదికనే ఉంటాయి. ఒబామా చేయలేని పనిని ట్రంప్ చేయగలిగితే.. ఇప్పుడున్న సుహృద్భావాన్ని ఆలంబనగా చేసుకుని రష్యాకు చేరువ కాగలిగితే అది ప్రపంచ శాంతికి ఎంతో మేలు చేయడమే అవుతుంది. మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే చర్యలకు ఇరు దేశాలు ఒడిగట్టకుండా ఉంటేనే దేశాల మధ్య సంయమనం, సామరస్యానికి ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులే మారిపోయే పరిస్థితి తలెత్తుతుంది. మళ్లీ దేశాలు అమెరికా, రష్యాలవైపు చీలిపోయే ప్రమాదమూ పొంచి ఉంటుంది. ఇది ఎవరికీ క్షేమం కాదు. అలాంటి వాతావరణాన్ని రగిలించడం అంతకంటే క్షంతవ్యం కాదు.