మెయన్ ఫీచర్

‘ఉగాది’ ఉంది.. ఉషస్సు లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పదుగురాడు మాట పాటియై ధర చెల్లు’- అన్నది మహాకవి మాట! ‘పదుగురు’ అని అంటే ఎక్కువ మంది. ఆంగ్లభాషలో దీనే్న ‘మెజారిటీ’ అంటున్నారు. ఎక్కువ మంది మంచిగా ఆలోచిస్తారన్నది, మంచిగా ప్రవర్తిస్తారన్నది మహాకవి విశ్వాసం. అందుకే ‘జనవాక్యంతు కర్తవ్యం’- ప్రజాభిప్రాయాన్ని పాటించి పనిచేయడం పాలకుల బాధ్యత అన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి వేలాది ఏళ్లుగా మన దేశంలో విస్తరించి ఉంది! ‘పదుగురు’ చెడ్డవాళ్లయితే కూడా వారి ‘మాట’ కూడా ఆచరణకు, ‘పాటింపు’నకు గురికావలసిందేనా? అన్న మీమాంస అనాదిగా సమాంతరంగా కొనసాగుతోంది! ఆ ‘పదుగురు’ అర్ధరాత్రి వరకూ మద్యాన్ని మాదకాలనూ తప్పతాగి, ఊగి, తూగి, వీధులలో ఊరేగి, తందనాలను ఆడేవారైతే కూడా ఆ ‘పదుగురాడు మాట’కు ధరణిలో- మరీ ప్రధానంగా ‘విశ్వగురువు’గా వినుతికెక్కిన ‘్భరతి ధరణి’లో ‘పాటింపు’కొనసాగవలసిందేనా? ‘్భవదాస్యపు’ మద్యం మన దేశంలో ఏరులై ప్రవహించింది. బ్రిటన్ వాణిజ్య బీభత్సకారులు మన దేశాన్ని ‘పాలించిన’ ఈ ‘మతికి మత్తెక్కించిన’ భావదాస్య సురాప్రవాహంలో మన దేశంలో విద్యావంతులలో ‘పదుగురు’ ఓలలాడారు, భావదాస్య మధువును తాగి ‘నాగరికులు’గా నర్తించారు.. అందువల్ల మన దేశంలో ‘నో ఇయర్’డే జరిగింది, జరుగుతోంది! ‘న్యూ ఇయర్ డే’ అని అనాలి అని మరికొందరు తప్పుగా పలికిన వారికి సలహా ఇస్తున్నారు! బ్రిటన్‌వారి పెత్తనం సాగిన కాలంలో వారు మన ‘మందు’ను అంటే ‘ఔషధాన్ని’- నేటివ్ మెడిసిన్ అని పిలిచారట! ‘మందు’అని అంటే మరో అర్థం ప్రముఖంగా ప్రచారమైంది. అందువల్ల ‘ఔషధం’ అని కూడా చెప్పవలసి వచ్చింది. ‘పిల్లి’ అంటే ‘మార్జాలం’ అని చెప్పినట్టయిందని ఎవరూ వెక్కిరించ నక్కరలేదు. ఈ ‘నేటివ్ మెడిసిన్’ తరువాత ‘నాటు’మందుగా ప్రచారమైంది! ‘నేటివ్’ అన్న పదం ‘నాటు’ అయింది! అదేమిటయ్యా.. ‘దేశవాలీ మందు’ అని, ‘స్వదేశీయ ఔషధం’ అని అనవచ్చు కదా? అన్నది ప్రశ్న.. అలా అనలేదు. ఎందుకంటే బ్రిటన్ ‘పాలన’లో మనకు ‘స్వదేశీయత’ లేదు..
బ్రిటన్ వారు నిష్క్రమించి ఏడు దశాబ్దులైంది! ఇప్పుడు కూడా ఈ ‘పదుగురాడు మాట’లో స్వదేశీయత లేదు! అందువల్ల ‘న్యూ ఇయర్’ ‘కొత్త సంవత్సరం’గా మారలేదు, మేధావివర్గం మారనీయలేదు. అందువల్ల తప్పతాగిన జనం ‘నోఇయర్’ అని పలకడం పరిపాటి అయింది! వెలుగు నుంచి వెలుగుకు ఒక రోజు! ఉదయాత్ ఉదయాత్ వారం- సూర్యోదయం నుంచి మళ్లీ సూర్యోదయం వరకు ఒక దినం! ఇది అనాదిగా భారతీయ పద్ధతి! ‘చీకటి నుంచి చీకటికి’ ఒక రోజు కావడం పాశ్చాత్య పద్ధతి! అందువల్ల అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు రోజును లెక్కపెట్టే పద్ధతిని బ్రిటన్ చీకటి స్వభావులైన ‘నిశాసురులు’ మన నెత్తికెత్తిపోయారు. దించుకోవాలన్న ధ్యాస మనకు లేదు, ఎందుకంటె మనలో అత్యధికులు ‘బ్రిటనీయ భావాల సారాను తాగి తైతక్కలాడుతున్నారు, కర్నాటక రాజధాని బెంగళూరులో ‘నో ఇయర్’ రాత్రి వేడుకలను జరుపుకున్న ‘నిశాచరులు’ ఆ తరువాత ‘మత్తు’ ముదిరి నిజంగానే ‘నిశాచరులై’పోయారట. వీధులలో కనపడిన మహిళలపై, యువతులపై పైశాచికంగా దాడులు చేశారట. 2016 డిసెంబర్ ముప్పయి ఒకటవ తేదీ రాత్రి పనె్నండు గంటలకు జరిగిన లైంగిక బీభత్సకాండ అది! రాత్రిపూట తిరిగేవారు నిశాచరులు. నిశాచరులు రాక్షసులు. అలా ఆ ‘నిశాచరులు’ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మహిళలపై దాడులతో ఆరంభించారట! మహిళలను మాతృ స్వరూపంగా ఆరాధించే స్వదేశీయత, స్వజాతీయత ఆ నిశాచర మద్య మదోన్మత్తులకు తెలియదు మరి. ‘అలా అర్ధరాత్రి దాటాక దాడులకు గురైన మహిళలు బెంగళూరు రహదారులలో ఎందుకున్నారు?’ అని ప్రశ్నించరాదు. అలా ప్రశ్నించేవాడు ‘అనాగరికుడు’. వాడికి అమెరికాతో ఎలాంటి సంబంధం లేదు, లండన్‌లో వాడిని అడుగుపెట్టనివ్వరు. అలా దాడులకు గురైన మహిళలు, యువతులు కూడా ఆ ‘పదుగురి’లో భాగం! ఆ యువతులు, మహిళలు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక బెంగళూరు నగర వీధులలో నడిచి, నర్తించి ‘నో ఇయర్’ రాత్రిని జరుపుకోవాలని భావించిన వారే! ఇలా జరుపుకోవడం మహిళా సాధికారతలో భాగం. దాడులకు గురైన మహిళలు భారతీయ పద్ధతిలోకాక పాశ్చాత్య పద్ధతిలో బట్టలను ధరించడం కూడా దుండగులు వారిపై దాడులు చేయడానికి ఒక కారణమని ఒక రాజకీయవేత్త అన్నాడట! ఆయనకు, ఆయన పక్షానికి ప్రత్యర్థులైన రాజకీయవేత్తలందరూ వెంటనే ఆయనపై మాటల దాడికి దిగారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ అధిపతి ఒకరు ఇలా ‘పాశ్చాత్య పద్ధతి వస్తధ్రారణ’ను నిరసించాడు. ఇటీవల ఒక కేంద్రమంత్రి కూడా ఈ ‘పాశ్చాత్య వస్తధ్రారణ’ తగదని సలహా ఇచ్చాడు. వీరు మాత్రమే కాదు, అమెరికా ‘సంస్కృతి’ గురించి, పారిస్ ‘నాగరికత’ గురించి ఏమాత్రం అవగాహన లేని ఇతర భారతీయ ప్రముఖులు కూడా ఇలా ‘పాశ్చాత్య వస్తధ్రారణ’ను నిరసించినందుకు మాటల దాడులకు గురయ్యారు. గురవుతూనే ఉన్నారు. పాపం.. వస్త్రాలది తప్పెలా అవుతుంది? సమస్త భారతీయ బుద్ధిని పాశ్చాత్య భావదాస్యపు మద్యం మత్తు ప్రభావితం చేస్తోంది. అందువల్లనే సూర్యోదయ సమయంలో ‘కొత్త సంవత్సరానికి స్వాగతం పలకవలసిన మనం చీకటి వాకిళ్లు తెరచి ‘నో ఇయర్ సెలబ్రేషిన్స్’ జరుపుకుంటున్నాము.
క్రీస్తుమత శకం పుట్టకముందు తరతరాలుగా, యుగయుగాలుగా మన దేశంలో ‘ఉగాది’ పండుగను జరుపుకొంటున్నాము. కొత్త సంవత్సరాలను కాలచక్రానికి సమకూర్చుకుంటున్నాము. ఈ కాల గణనం ఏదో ఒక వ్యక్తికి,మతానికి, దేశానికి పరిమితమైనది కాదు. మొత్తం ప్రపంచానికి మాత్రమేకాక విశ్వవ్యవస్థకు వర్తిస్తున్న కాలగణనాన్ని భారతీయులు స్వీకరించారు. అందువల్ల భారతదేశంలో అనాదిగా కొనసాగిన ‘కాలగణన’ శాస్ర్తియమైన ఖగోళ, విశ్వ వ్యవస్థలోని నక్షత్రాల గ్రహాల చలనానికి సంబంధించినది. ఈ వైశ్వగోళాల చలనం నిర్ణీత పద్ధతిలో పునరావృత్తం అవుతుంది. ఇదే కాలగణనం. ఈ ఖగోళ చరుల, నక్షత్రాల, గ్రహాల గమనం ఆధారంగా మాత్రమే మన దేశంలో కాలాన్ని కొలుస్తున్నాము. అందువల్ల కాలానికి కొలమానాలు ‘లిప్తలు’, ‘క్షణాలు’, ‘నిముషాలు’, ‘ఘడియలు’, ‘హోర’లు లేదా గంటలు, దినాలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు! ఇవన్నీ నిర్ణీత పద్ధతిలో పునరావృత్తికి గురికావడం ‘కాలగణనం’. ఈ పునరావృత్తి విశ్వవ్యవస్థలో నిహితమైంది. అందువల్ల కాలానికి ఆదిలేదు, అంతం లేదు, పునరావృత్తి మాత్రమే ఉంది. ప్రతి ఇరవైనాలుగు గంటలలో ‘దినం’ పునరావృత్తం అవుతోంది. ఇరవై నాలుగు గంటలకొకసారి ‘ఉదయం’ ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు వంటి ఋతువులు ‘చైత్రం’వంటి నెలలు పునరావృత్తవౌతున్నాయి. నలబయి మూడు లక్షల ఇరవై వేల ఏళ్లకొకసారి ప్రతి యుగం పునరావృత్తం అవుతోంది. ప్రతి మహాయుగం పునరావృత్తం అవుతోంది. వెయ్యి మహాయుగాలకొకసారి ‘కల్పం’ పునరావృత్తం అవుతోంది. అందు క్రీస్తుశకం ఒకటవ సంవత్సరం కంటె లేదా క్రీస్తుశకం ‘సున్న’సంవత్సరం కంటె ముందు పాశ్చాత్య దేశాలలో కూడ భారతీయమైన పద్ధతులలోనే కాలాన్ని లెక్కపెట్టి ఉండాలి. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం ఒకటవ శతాబ్ది, ఐదవ శతాబ్ది అని అంటున్నారు కాని నిజంగా ఆయా సమయాలలో క్రీస్తుకు పూర్వం ఒకటవ శతాబ్ది అని కాని, క్రీస్తుకు పూర్వ ఐదవ శతాబ్ది అనికాని చెప్పి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటె క్రీస్తుశకం మరో వంద ఏళ్ల తరువాత కాని, మరో ఐదువందల ఏళ్ల తరువాత కాని భవిష్యత్తులో ఆరంభం కానున్నట్టు అప్పటి ప్రజలకు తెలియదు. మరి అప్పుడు ఏ ‘శకం’ ప్రాతిపదికగా పాశ్చత్య దేశాల వారు కాలాన్ని లెక్కించారు? అందువల్ల ‘తుది మొదలు’ లేని కాలాన్ని భారతీయుల పద్ధతిలో లెక్కపెట్టడం శాస్ర్తియం, తార్కికం.
బ్రిటన్‌వారు మన దేశంలో జరిపిన అనేక అత్యాచారాలలో ఇలా కాలాన్ని లెక్కపెట్టే శాస్ర్తియమైన పద్ధతిని ధ్వంసం చేయడం ఒకటి! మనవారు ఫలానా యుగంలో ఫలానా సంవత్సరమని అనాదిగా కాలాన్ని లెక్కించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం- అనేవి యుగాలు. ఈ నాలుగు కలసి ఒక మహాయుగం. ఈ నాలుగు యుగాలు ఒకసారి జరిగిన తరువాత, అంటే కలియుగం తరువాత మళ్లీ కృతయుగం వస్తోంది- శిశిర ఋతువు తరువాత వసంత ఋతువు వచ్చినట్టు. ఈ అనాది కాలగణన విజ్ఞానాన్ని బ్రిటన్‌వారు విధ్వంసం చేశారు. అంతేకాదు, మన దేశంలో ‘మతం’ పేరుతో ‘శకం’ లేదు. సర్వమతాలకూ వర్తించగల శాశ్వత ఖగోళ విజ్ఞానం మన ‘కాలగణన’కు ప్రాతిపదిక! ఈ ‘సర్వమత సమభావ కాలగణన’ ప్రకారం ప్రస్తుతం కలియుగంలో ఐదువేల నూట పద్దెనిమిదవ సంవత్సరం నడుస్తోంది. ఇది ‘దుర్ముఖ’ సంవత్సరం. కలియుగం రెండువేల ఐదువందల యాబయి రెండవ సంవత్సరంలో పారశీకుడైన రెండవ సైరస్ అనేవాడు మన దేశాన్ని జయించి తన పేరుతో ‘సైరస్ శకాన్ని’ మన నెత్తికెక్కించాడు. మన దేశంలో ఈ విదేశీయ శకం అమలు జరిగింది. ఈ విదేశీయ ‘శకాన్ని’ మనవారు జాతీయ ‘శకం’గా భావించి కలియుగం మూడువేల నలబయి నాలుగవ సంవత్సరం వరకూ ఉపయోగించారు. అంటే క్రీస్తుకు పూర్వం ఐదువందల యాబయ్యవ సంవత్సరం నుంచి క్రీస్తుకు పూర్వం యాబయి ఏడవ సంవత్సరం వరకు విదేశీయమైన ఈ ‘సైరస్ శకం’ జాతీయ శకంగా మన దేశంలో చెలామణి అయింది. ఈ భావదాస్యాన్ని తొలగించడానికై భారతీయుడైన ‘సమ్రాట్’ విక్రముడు కలియుగం మూడువేల నలబయి నాలుగవ సంవత్సరంలో, అంటే క్రీస్తునకు పూర్వం యాబయి ఏడవ ఏట ‘సంవత్’ పేరుతో కొత్త ‘శకాన్ని’ ప్రారంభించాడు. అలా దేశం విదేశీయ సైరస్ శకం నుంచి విముక్తమైంది.
విక్రముని మునిమనుమడైన ‘శాలివాహనుడు’ కలియుగం మూడువేల నూట డెబ్బయి తొమ్మిదవ సంవత్సరంలో అంటే క్రీస్తుశకం డెబ్బయి ఎనిమిదవ ఏట మరో శకాన్ని ఆరంభించాడు. ఈ ‘శాలివాహన శకం’ ప్రస్తుతం మనకు ఆధికారికంగా జాతీయ శకం. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు నెలలున్న ఈ జాతీయ సంవత్సరం క్రీస్తుశకం ప్రకారం మార్చి ఇరవయి ఒకటవ తేదీన మొదలవుతోంది. మరి ఆరోజున భారతీయులు ఎందుకని ఉగాది, కొత్త సంవత్సరం వేడుకలు జరపడం లేదు? ఇది శాలివాహన శకం పంతొమ్మిది వందల ముప్పయి ఎనిమిది. రానున్న ఉగాది- మార్చి ఇరవై ఒకటని అయినా జనం గుర్తించాలి!
*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352