సంపాదకీయం

‘కంది’ బొబ్బలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరలను పెంచుతున్న దళారీలు ధరలను దించుతున్నారు కూడా! ధరలు దిగిరావడం హర్షదాయకం కాదా? అన్నది ప్రశ్న. కానీ పెరగడం, తరగడం వినియోగదారులకు పరిమితమైన విపణి రంగం సమస్య కాదు, ఉత్పత్తిదారుల ఉనికితో ముడివడిన వ్యవసాయ ప్రాంగణ వ్యవహారం. కందుల ధరలు తగ్గిపోవడం వ్యవసాయదారుని వెనె్నముకను విరిచేస్తున్న పరిణామం! కందిపప్పు ధరలను పెంచడం ద్వారా వినియోగదారుని దోచుకొనడం, కందుల ధరలను దించడం ద్వారా ఉత్పత్తిదారుని దోచుకొనడం దళారీలు కల్పిస్తున్న కృత్రిమ పరిణామాలు! ఈ సమాంతర వాణిజ్యపు దోపిడీ విన్యాసాలు ప్రపంచీకరణలో భాగం. స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ-గా మనదేశం ఏర్పడిపోయింది. ఇందుకు కందుల ధర తగ్గడం, కందిపప్పు ధర పెరగడం ఒక ఉదాహరణ మాత్రమే! ప్రవర్ధమాన దేశాలలోని వ్యవసాయాన్ని గుల్లచేసి ఆయా దేశాలు సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’కు వలసలుగా మారిపోవడం ‘స్వేచ్ఛావిపణి’లో సంభవిస్తున్న, సంభవించే క్రమానుగత పరిణామం. ధరలను పెంచడంలో కాని, దించడంలో కాని సార్వభౌమ ప్రభుత్వాలకు ఎ లాంటి ప్రమే యం లేకపోవడం ‘మా ర్కెట్ ఎకానమీ’ స్వభావం. ఇది ప్రపంచీకరణలో భా గంగా ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ వారు ‘స్వేచ్ఛావిపణి’కి ఇచ్చిన నిర్వచనంలో భాగం! ధరలను అదుపుచేయడంలో కాని, ధరల తీ రును పర్యవేక్షించడంలో కాని సార్వభౌమ ప్రభుత్వపు జోక్యం రేఖామాత్రంగా పొడగట్టినప్పటికీ ఆ వ్యవస్థ ‘మార్కెట్ ఎకానమీ’ కాజాలదట.. కాజాలదు అని ప్రచారం జరుగుతోంది. కందుల ధరలను పాతాళ పతనం చేసిన దళారీలు రైతుల నుంచి కారుచౌకగా వాటిని కొనుగోలు చేస్తున్నా, భుత్వాలు జోక్యం చేసుకోవడం లేదు. కందిపంట కోతకు రాక పూర్వం క్వింటాలుకు పదకొండు వేల రూపాయల వరకూ కందుల ధర పలికింది. పంట కోతకు వచ్చి కందులను అమ్ముకునే సమయంలో ఇపుడు క్వింటాలుకు నాలుగువేల రూపాయలు కూడా రైతులకు లభించడం లేదట! కారుచౌకగా కందులను కొని నెలలపాటు నిలువ చేసి కృత్రిమ కొరతను సృష్టించి అధికాధిక ధరలకు కందులను, కందిపప్పును అమ్మడం దళారీల లక్ష్యం. ఈ దళారీల ఆధిపత్య వ్యవస్థ పేరు ‘మార్కెట్ ఎకానమీ’. కందుల ధరను పెంచి రైతుకు మేలు చేయడానికి కాని, కందిపప్పు ధరను తగ్గించి వినియోగదారునికి వెసలుబాటు కల్పించడానికి కాని మన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించరాదు. ప్రయత్నం చేస్తే ‘మార్కెట్ ఎకానమీ’ హోదా మనకు దూరమైపోతుందట!
వ్యవసాయదారుని ప్రయోజనాలు కాని, వినియోగదారుని సౌకర్యాలు కాని ప్రధానం కాదు, ‘మార్కెట్ ఎకానమీ’ హోదా ప్రధానం. కందులు, కందిపప్పు ఇందుకు ప్రతీకలు మాత్రమే! ‘మార్కెట్ ఎకానమీ’లో సార్వభౌమ ప్రభుత్వం ఏ వస్తువు ధర విషయంలోను జోక్యం చేసుకోరాదన్నది ప్రపంచీకరణ ఇతివృత్తం. వాణిజ్య వ్యవస్థ స్వేచ్ఛకు ప్రభుత్వాలు ‘మనోవాక్కాయ కర్మల’ చేత ఎలాంటి భంగం కలిగించకపోవడమే ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- వౌలిక లక్షణమట! స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థలో దళారీలు, బహుళ జాతీయ సంస్థలు- మల్టీ నేషనల్ కంపెనీస్- దోచుకుంటూ ఉంటే ప్రభుత్వాలు నిరోధించడానికి వీలులేదట! అందువల్ల ప్రభుత్వాలు ఈ దోపిడీని గుడ్లప్పగించి చూస్తూ ఉండవలసిందే! జోక్యం చేసుకుంటే ‘మార్కెట్ ఎకానమీ’ హోదాను ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ లాగేసుకుంటుందన్నది ప్రభుత్వాల భయం. చైనాకు ‘మార్కెట్ ఎకానమీ’ హోదా ఉన్నట్టు 2016 నుంచి డబ్ల్యుటిఓ- ప్రపంచ వాణిజ్యసంస్థ- సభ్య దేశాలు గుర్తించాలట! చైనా 2001లో ‘డబ్ల్యుటిఓ’లో చేరింది. పదిహేనేళ్ల సభ్యత్వం కొనసాగించిన దేశాలకు ఈ ‘మార్కెట్ ఎకానమీ స్టేటస్’-ఎంఇఎస్- స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ ప్రతిపత్తి- లభించాలట! కానీ అమెరికా, ఐరోపా దేశాలు చైనాకు ఈ ‘ప్రతిపత్తి’ ఇవ్వరాదని వాదిస్తున్నాయట! ఎందుకంటే ‘గిరాకీ, సరఫరా’ ప్రాతిపదికగా మాత్రమే ధరలు నిర్ధారితం కావడం ‘మార్కెట్ ఎకానమీ’ లక్షణం, ప్రభుత్వ ప్రమేయం ఉండరాదు. చైనాలో ఇంకా కొంత ప్రభుత్వ ప్రమేయం కొనసాగుతోందట! అందుకని చైనాకు ‘మార్కెట్ ఎకానమీ’ హోదా ఇప్పుడే లభించదట..
మనదేశంలోకి చొరబడిపోయిన వందలాది సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచుతున్నాయి. ఇది విపణివీధి కథ. వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ లేదని నమ్మించి రైతుల వద్ద కారుచౌకగా కొని ‘వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి’ని సృష్టిస్తున్నాయి. క్వింటాలుకు దాదాపు పదివేల రూపాయలు ధర లభిస్తుందన్న ఆశతో లక్షల ఎకరాల్లో అదనంగా కందిపంట పండించిన రె తుల గతి ఏమి కావాలి? 2015లో హఠాత్తుగా ‘విపణి’లో కందిపప్పు ధరలు పెరిగిపోవడం ‘బహుళ జాతీయ వా ణిజ్య సంస్థల’ కుట్రలో భాగం. 2015 జూన్, జూలై వరకూ కిలో అరవై రూపాయలకు, డెబ్బయి రూపాయలకు లభించిన కందిపప్పు ధరలు రెండు వందల రూపాయలకు పెరగడం విస్మయకరమైన వా ణిజ్య విపరిణామం! జతగా మినపపప్పు, ఇతర పప్పుల ధరలూ పెరిగాయి. ఈ ధరలకు వీటిని కొనలేనివారు కేవలం కూరగాయలు కొని తిన్నారు. ఫలితంగా కూరగాయలకు గిరాకీ పెరిగి వాటి ధరలూ ఆకాశానె్నక్కి కూర్చున్నాయి. చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వ సహాయం పొందలేని వారికి కేవలం ‘చింతపండు చారు’ మిగిలింది. చింతపండు, ఎండుమిర్చి ధరలు 2015లో పెరిగిపోవడం ‘కందిపప్పు’ కుట్రలో భాగం. ప్రపంచీకరణ మొదలైన నాటి నుంచి ఏటా లేదా రెండేళ్లకోసారి ఏదో ఒక ఆహారధాన్యం, పదార్థం ధర అమాంతం పెరిగిపోవడం నడుస్తున్న వ్యధ. ఇలా వందశాతం, రెండువందల శాతం పెరిగిన ‘ఆహారం’ ధరలు ఆ తర్వాత పదిశాతమో, ఇరవై శాతమో తగ్గాయి. జనానికి మాత్రం ధరలు తగ్గిన భ్రాంతి కలుగుతోంది! కందిపప్పు ధరలు ప్రస్తుతం కిలో వంద రూపాయల కంటె తక్కువ స్థాయిలో ఉన్నాయి. కానీ మునుపటి స్థాయికి మాత్రం దిగడం కల్ల..
సహజంగా అన్ని వస్తువుల ధరలూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలా అసహజంగా పెరగడం, వ్యవసాయదారునికి లభించే ధర అసహజంగా పడిపోవడం ‘మార్కెట్ ఎకానమీ’ మారీచ మాయ! రైతుల వద్ద కొనుగోలు చేసే ధరకు, వినియోగదారునికి అమ్మే ధరకు మధ్య ‘అంతరం’ ఎంత ఉండాలి? ఎంత ఉంటోంది? కందిపప్పు ధరలు పెరగడం చూసి వ్యామోహపడి పసుపు, పత్తి, మిరప, చెరకు పంటలను మానుకొని ‘కంది’ పండించినవారు గగ్గోలు పెడుతున్నారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. ‘మార్కెట్ ఎకానమీ’ అమెరికా వంటి వాణిజ్య దేశాలకు మేలు చేయవచ్చు. ఇప్పటికీ అత్యధిక జనాభా వ్యవసాయం చేస్తూన్న మన దేశానికి ‘మార్కెట్’ మాయ ‘మేలు’ చేస్తోందా? వ్యవసాయ రంగాన్ని ప్రపంచీకరణ పరిధి నుంచి తప్పించాలని స్వామినాథన్ వంటి శాస్తవ్రేత్తలు సలహా ఇచ్చి ఏళ్లు గతించిపోయాయి..