మెయన్ ఫీచర్

నేతాజీకి అన్యాయం.. చరిత్రకు ద్రోహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతాజీ సుభాస్‌చంద్రబోసు మన దేశపు తొలి ప్రధానమం త్రి... ఈ వాస్తవాన్ని మన చరిత్ర చాటుతోంది. కానీ, ఆధికారికంగా మాత్రం ‘నేతాజీ’ ఇప్పటికీ ప్రథమ ప్రభుత్వ సారథిగా గుర్తింపును పొందడం లేదు. ఎందుకంటె క్రీస్తుశకం 1947 ఆగస్టు 15 వరకు మన దేశంపై పెత్తనం చెలాయించి వెళ్లిన బ్రిటన్ దురాక్రమణదారులు ‘సుభాస్ చంద్రవసు’ను మన దేశపు ప్రధానిగా గుర్తించలేదు. ‘వసు’ అన్న పదాన్ని వంగదేశీయులు ‘బొసు’ అని పలుకుతారు. ‘వ’ను ‘బ’గాను ‘పదం’లోని మొదటి ‘అ’ను ‘ఒ’గాను పలకడం వారి పద్ధతి. అందువల్ల ‘సుభాస్ చంద్రవసు’, ‘సుభాస్ చంద్రబొసు’అయ్యాడు. రబీంద్రనాథ ఠాకుర్‌ను మనం ‘రవీంద్రనాథ ఠాకుర్’ అని పలుకుతున్నాము- అందువల్ల ‘సుభాస్ చంద్రవసు’ అనడం సమంజసం! కొంతమంది ‘్ఠకుర్’ను ‘టెగోర్’ అని పలుకుతున్నారు. అలా పలుకడం వారు బ్రిటన్ వారిని ‘చూసి నేర్చుకున్నారు..’
చూసి నేర్చుకొనడమన్న ‘విద్య’ను బ్రిటన్ ‘దొర’లు మనకు మప్పిపోయారు. ఆ రోజుల్లో ప్రముఖులెందరో ‘తెల్లవారిని చూసి నేర్చుకోవాలి..’ అని తెల్లమొగం వేసుకుని వింటుండిన సామాన్యులకు పాఠాలు చెప్పేవారట! ‘ఆ రోజులలో’ అని అంటే క్రీస్తుశకం 1947వ సంవత్సరానికి పూర్వం రోజులన్నమాట! ఈ రోజులలో చాలామంది ప్రముఖులు చైనాకు వెళ్లివస్తున్నారు. వచ్చిన తరువాత- ‘చైనాను చూసి మనం ఎంతో నేర్చుకొనవలసి ఉంది..’ వాక్రుచ్చుతున్నారు. ‘ఈ రోజులలో..’ అని అంటే 1949వ సంవత్సరం నుండి మొదలైన రోజులన్నమాట! ఈ ‘వాక్రుచ్చుడు’ మన దేశంలోని కొంతమంది హృదయాలకు ‘బల్లెం’లాగ గుచ్చుకొంటోంది- ఎందుకంటె చైనా మనకు శత్రుదేశం, మన భూభాగాలను దురాక్రమించి ఉన్న దేశం. 1947కు పూర్వం బ్రిటన్ కూడ మనకు శత్రుదేశం! కానీ ఇలా శత్రుదేశ ప్రశంసల పట్ల హృదయాలను గాయపరచుకున్నవారు అప్పుడూ ఇప్పుడూ కూడ అల్పసంఖ్యాకులు! అధిక సంఖ్యాకులను ‘చూసి నేర్చుకొనడం’ పట్ల ఉవ్విళ్లూరిన వారు.. ఉవ్విళ్లూరుతున్నవారు. ప్రసిద్ధ రచయిత మొక్కపాటి నరసింహశాస్ర్తీ చెప్పిన కథలో ‘బారిస్టర్ పార్వతీశం’ లండన్‌కు వెళ్లివస్తాడు. ఇంగ్లాండును చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందని బారిస్టర్ పార్వతీశం ఇక్కడ మనవారికి సలహా యిచ్చాడు! లండన్‌లో పసిపిల్లలు గుక్కపట్టి ఏడవరట, ఏడ్చి పెద్దవారి కార్యకలాపాలకు భంగం కలిగించరట! కానీ మన దేశంలోని చిన్నపిల్లలు గట్టిగా ఏడ్చి, పెద్దగా ఏడ్చి, బావురమని ఏడ్చి రచ్చచేసి ఇళ్లను రణరంగాలుగా మార్చేశారట! దీన్ని మన పెద్దలు నిరసించక పోవడాన్ని ‘బారిస్టర్ పార్వతీశం’ నిరసించాడు.. పైగా మన తల్లిదండ్రులు, పెద్దలు ఈ బాలబాలికల ‘ఏడుపు’ను సమర్ధిస్తూ ‘బాలానాం రోదనం బలం..’ అన్న సామెతను కూడా ఏర్పాటుచేసుకున్నారట. ‘చూసి నేర్చుకోవడం’ రెండేళ్ల వయసులోపు ఏడిచే పిల్లలకు చేతకాదు కనుక మన దేశంలోని చిన్నపిల్లలు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు! కానీ చూసి నేర్చుకొనడం చేతనయిన యువకులు, పెద్దలూ మన దేశమంతటా ఉన్న చైనీయ భోజనశాలలలో ఆరగిస్తూనే ఉన్నారు! ‘చైనీస్ ఫుడ్’ చైనా నుండి రాలేదు. ఇక్కడి దుకాణాలలో ఈ ‘చెత్తతిండి’- జంక్‌ఫుడ్- తయారవుతోంది! కానీ ‘చైనీస్’ అన్న పేరున్న ‘తిండిని’ బొక్కుతూ, చైనాను చూసి నేర్చుకుంటున్న ‘నకిలీ పారవశ్యాన్ని పొందుతున్న మహాజనం’ మన దేశంలో ఉన్నారు! ‘‘ఆ నోభద్రాః క్రతవో యన్త విశ్వతః’’- ప్రపంచంలోని మంగళకరమైన భావాలన్నీ మనకు లభించుగాక- అన్నది మన నీతి.
సూక్తులను, సామెతలను, సుభాషితాలను, ఆదర్శాలను ఉటంకించడంలో సైతం మన దేశంలో ఈ ‘చూసి నేర్చుకొనే సంస్కృతి’ కొనసాగుతోంది! ఆంగ్లభాషలోని ఐరోపాకు చెందిన సూక్తులను ఉటంకించడమే గొప్పతనమన్న భావం మన దేశంలోని అనేకమంది విద్యావేత్తల తలల్లో గూడుకట్టుకొని ఉంది. ‘‘్భరతీయ భాషలలోని భారతదేశానికి సంబంధించిన సూక్తులను, సూత్రాలను ఉటంకించడం అంత గొప్పకాదు.’’ ఇదికూడ మనం ‘‘చూసి నేర్చుకొన్నదే’’! మన చరిత్రను చూసి నేర్చుకోండి. మహాభారతాన్ని చూసి నేర్చుకోండి, నచికేతుడిని చూసి నేర్చుకోండి, దిలీపుణ్ని చూసి నేర్చుకోండి- అని చెప్పడం మనలో చాలామందికి తెలీదు. ఎందుకంటె బ్రిటన్ దురాక్రమణదారులు వీటిని మనకు మప్పిపోలేదు. అందువల్ల బ్రిటన్‌ను ‘‘చూసి నేర్చుకున్న మనం’’ పదహారవ శతాబ్దికి చెందిన ‘టింబక్టూ కాంప్ డేవిడ్ అమెరిగో వెస్బూజి’ ఏమన్నాడంటే అంటూ, విచిత్రమైన విదేశీయుల ‘మహితోక్తుల’ను ఉటంకిస్తున్నాము. ఎక్కువమంది పాఠకులకు, శ్రోతలకు, రసజ్ఞులకు, వీక్షకులకు కూడ ఇలా ‘విదేశీయ’ విశేషాలతో అనుభూతి చెందడమే ఇష్టం. ఇదంతా మన ‘చూసి నేర్చుకున్న విద్య’! మనం చెప్పినట్టయితే మనం నమ్మము. అందువల్ల నేతాజీ సుభాస్ చంద్రవసు మన దేశపు మొదటి ప్రధాని అని ఋజువు చేయడానికి సైతం ‘విదేశీయమైన ఉదాహరణలు’ చెప్పవలసి వస్తోంది! ఆదిమానవులు భారతదేశంలో పుట్టారు, ఆ తరువాత వివిధ దేశాలకు విస్తరించారు. ఇది మన జాతీయ చరిత్రకారులు నిర్ధారించిన వాస్తవం.. దీన్ని విశ్వసించని వారి గురించి సుప్రసిద్ధ సంస్కృత పండితుడు, జాతీయ రచయిత జటావల్లభుల పురుషోత్తము ఇలా వ్యాఖ్యానించి ఉన్నారు. ‘‘ఈ సిద్ధాంతమును వినినంతనే త్రుళ్లి పడువారును, ఇది భారతీయుల దేశ దురభిమానమును సూచించుననియు పలుకువారును కొందరుగలరు. ఆదిమానవ సృష్టి ఆర్కిటిక్ ప్రాంతమున జరిగెననుటలో వీరికి త్రుళ్లిపాటు రాదు. కావచ్చును.. ఎక్కడో యొకచోట ఆదిసృష్టి జరుగవలయును కదా! అని వారు సమన్వయించుకొందురు. అట్లే మధ్య ఆసియాలో ఆదిమానవుడు సృజింపబడినాడన్నను వీరికి వెగటుగా కన్పట్టును.. ఎక్కడను పుట్టనిచో మానవుడు ఎట్లు భూలోకములోనికి వచ్చును?- అని వీరు సరిపెట్టుకొందురు. కానీ వీరి వెగటులు, త్రుళ్లిపాటులు భారతదేశము పేరెత్తినప్పుడే ప్రారంభమగును. స్వదేశీయ విజ్ఞానము వెగటుగ తోచునీ విపరీత పరిస్థితి నూటయేబది సంవత్సరముల బ్రిటన్ పరిపాలన దుష్ఫలితములలోనొకటి.. కానీ ‘‘చూసి నేర్చుకున్న’’ మేధావులు జటావల్లభుల పురుషోత్తము వంటి జాతీయతా నిబద్ధుల మందలింపులను లెక్కచేయడం లేదు. బ్రిటన్ వారి వెక్కిరింపులు వీరికి మధుర మందహాసములు..
బ్రిటన్ దుర్జన మేధావులు మన సుదూర గత చరిత్రను వక్రీకరించారు! ఈ ధ్యాస సైతం మనలో చాలమందికి లేదు. కానీ సమీప గతంలోని సమకాలీన చరిత్రను సైతం ఈ ‘‘తెల్లబొల్లి మేధావులు’’ చెరచిపోయారు. ఇలా చెరచడంలో భాగంగానే నేతాజీ సుభాస్ చంద్రవసును వారు మన స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా గుర్తించలేదు! ఈ వక్రీకరణను తొలగించి వాస్తవ చరిత్రను వెలిగించడానికి ఇప్పుడైనా ప్రయత్నం జరగాలి! చైనా ప్రభుత్వం ఇటీవల వినూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ వినూతన చరిత్ర నిజానికి వాస్తవ వక్రీకరణ మాత్రమే! అయినప్పటికీ చైనా ప్రభుత్వం నిర్లజ్జగా అంతర్జాతీయ సమాజం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను చరిత్రగా ప్రచారం చేస్తోంది. ఈ కొత్తచరిత్రను పాఠశాల స్థాయి నుండి చైనీయ విద్యార్థులకు నేర్పుతున్నారట! క్రీస్తుశకం 1937 నుండి 1945 వరకు ఎనిమిది ఏళ్లపాటు ‘జపాన్ తమ దేశాన్ని దురాక్రమించిన’ట్టు ఇంతవరకూ చైనాలో విద్యార్థులకు చరిత్ర పాఠం చెప్పారు. కానీ జపాన్ తమ దేశాన్ని 1931 నుంచి పదునాలుగేళ్లపాటు దురాక్రమించినట్టు ఇప్పుడు చైనా ప్రభుత్వం ‘కనిపెట్టింది.’ అందువల్ల చరిత్ర గ్రంథాలలోను, పాఠశాలల, కళాశాలల పాఠ్య ప్రణాళికలలోను ఈ ‘మార్పు’ను ఆధికారికంగా చైనా ప్రభుత్వం చొప్పించింది! ‘చైనాను చూసి మనమెంతో నేర్చుకోవాలి..’ అని పాఠాలు చెబుతున్నవారు ఏమంటారో మరి? ఏమన్నప్పటికీ వాస్తవాలను తొలగించి అబద్ధాలను ధైర్యంగా చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మనకు అబద్ధాలను తొలగించి నిజాన్ని ప్రచారం చేయడానికైనా ధైర్యం కలుగవద్దా? మనకు మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని చెప్పడం ఇలాంటి చారిత్రక అబద్ధాలలో ఒకటి! మన మొదటి ప్రధానమంత్రి సుభాస్‌చంద్రవసు. సుభాస్‌చంద్రుడు భారత భూమికి బ్రిటన్ దుర్మార్గపు పాలన నుండి, దురాక్రమణ నుండి విముక్తిని కల్పించాడు. పూర్తిగా విముక్తి లభించకపోయినప్పటికీ, క్రీస్తుశకం 1857 మే పదవ తేదీన మొదలైన బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సంగ్రామ పరాకాష్ఠ నేతాజీ పోరాటం.. మహాకవి గుఱ్ఱం జాషువా అన్నట్టు- నేతాజీ
కత్తుల్ పట్టక స్వేచ్ఛరాదెపుడు
చర్ఖా పద్ధతుల్ పూర్తిగా
చిత్తయ్ పోవునటంచు గాంధిమునితో
సిద్ధాంతమున్ చేసి భూ
భృత్తుల్ తెల్లని చక్రవర్తులు
భయాప్తిన్ క్రుంగి కంగారుగాన్
ఎత్తించెన్ ఎవరెస్టు నెత్తములపై
హిందూ రణస్తంభమున్
ఈ ‘హిందూ రణస్తంభము’ను నిలబెట్టిన సుభాస్ చంద్రుడు 1943వ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. అప్పటికి అండమాన్ ద్వీపాలకు, ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాలకు బ్రిటన్ దురాక్రమణ నుండి విముక్తి కలిగింది. సింగపూర్‌లో నేతాజీ ప్రకటించిన స్వతంత్ర భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని జపాన్ ప్రభుత్వం వెంటనే గుర్తించింది! అందువల్ల నేతాజీ సుభాస్ చంద్రవసు స్వతంత్ర భారత ప్రథమ ప్రభుత్వాధినేత, తొలి ప్రధాని! ప్రముఖ రచయిత పులుసు గోపిరెడ్డి రచించిన ‘నేతాజీ’ గ్రంథంలో ఈ ప్రభుత్వం గురించి విపులమైన సమాచారం ఉంది! ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం ప్రవాస ప్రభుత్వాలను ఆయా స్వతంత్ర దేశాల తొలి ప్రభుత్వాలుగా గుర్తిస్తోంది. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం విషయంలో ఇది మరోసారి ధ్రువపడింది! అందువల్ల మన ప్రభుత్వం ఇప్పుడైనా వాస్తవ చరిత్రను ఆధికారికంగా ప్రకటించాలి! చరిత్ర గ్రంథాలలోను, పాఠ్య ప్రణాళికలలోను మార్పులు చేయాలి! సుభాస్ చంద్రబోస్ మన దేశపు తొలి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ రెండవ ప్రధానమంత్రి! ఈ వాస్తవాన్ని ఇంతవరకు ఆధికారికంగా గుర్తించకపోవడం నేతాజీకి జరిగిన అన్యాయం, జాతీయ చరిత్రకు జరిగిన ద్రోహం..
అమెరికా సంయుక్త రాష్ట్రాల - యుఎస్‌ఏ- వారు క్రీస్తుశకం 1776 జూలై నాలుగవ తేదీన స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. కానీ వారు పదమూడు ఏళ్ల తరువాత మాత్రమే తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొన్నారు. బ్రిటన్ నుంచి విముక్తికోసం ఈమధ్యకాలంలో యుద్ధం చేశారు. అయినప్పటికీ అమెరికా ఏటా జూలై నాలుగవ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటోంది. 1857 మే పదవ తేదీన భారతీయులు బ్రిటన్ నుండి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు. అందువల్ల మన స్వాతంత్య్ర దినోత్సవం మే పదవ తేదీన జరగాలి. దీన్ని ప్రభుత్వం ఇప్పుడైనా ఆధికారికంగా ప్రకటించి చరిత్రకు, భారత జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నిరోధించాలి! ఆగస్టు పదహైదవ తేదీని ‘అఖండ భారత విభజన దినం’గా పాటించాలి.. జనవరి ఇరవై మూడవ తేదీ నేతాజీ జన్మదినం! *

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com