సబ్ ఫీచర్

నమ్మకమే చెలా‘మనీ’కి గీటురాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ లోహ నాణానికైనా, పేపరు కరెన్సీకైనా ప్రజలకు వాటి పట్ల కలిగే నమ్మకమే విలువను కలిగిస్తుంది. ఎంత విలువైన నోట్లను, నాణాలనూ ముద్రించాలో రిజర్వు బ్యాంకు నిర్ణయిస్తుంది. దేశంలో ఎంత నగదు చెలామణిలో వుండాలో కొన్ని నిబంధనలకు లోబడి రిజర్వు బ్యాంకు కరెన్సీని ముద్రించి విడుదల చేస్తుంది. ఇలా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నగదుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. అందువల్ల ఆ కరెన్సీ నోట్లు, నాణాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే వాటికి విలువను కలిగిస్తుంది. ఈ కరెన్సీ కేంద్ర ప్రభుత్వ హామీతో, రిజర్వు బ్యాంకు ప్రజలకు వ్రాసి ఇచ్చిన ‘ప్రామిసరీ నోటు’ లాంటిది. ఇవి ఎవరూ కాదనడానికి, తిరస్కరించడానికి వీలులేనివి. కరెన్సీని మార్చుకొని ‘కొనుగోలు శక్తి’ని వాడుకోడానికీ, బదిలీ చేయడానికీ ప్రజలకు హక్కు ఏర్పడుతుంది.
ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో నాణాలు చెలామణిలో వున్నాయి. బంగారం, వెండి, రాగి తదితర లోహాలతో వీటిని రూపొందించేవారు. అలనాడు దేశంలో ఎంతోమంది రాజులు ఉన్నందున పలురకాల నాణాలుండేవి. దేశవ్యాప్తంగా చెలామణి అయ్యే నాణాలుండేవి కావు. ఎక్కువగా ‘వస్తుమార్పిడి’ (బార్టర్ సిస్టం) విధానంలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేవి. బ్రిటిషు వారు మన దేశంలో పాలనను తమ అధీనంలోకి తీసుకున్నాక, దేశమంతటా చెలామణి అయ్యే ఒకే విలువతో కూడిన నాణాలను ప్రవేశపెట్టారు. అయితే బ్రిటిష్ ద్రవ్యమానం వేరు. అక్కడ పౌండ్లు, ఫిల్లింగులు, పెన్నీలు ద్రవ్యమానం. మన దేశంలో ‘రూపాయి’ ద్రవ్యమానం. సుమారు రెండువేల ఏళ్ల క్రితం నుంచి ‘రూపయా’ అనేది భారత్‌లో వుంది. అందువలన బ్రిటిష్ వారు కూడా క్రమంగా రూపాయి ద్రవ్యమానానే్న ఇక్కడ అనుసరించారు. రూపాయికి రెండు అర్ధ రూపాయలు, నాలుగు పావలాలు, 16 అణాలు, 64 కాణీలు, 128 ఏగాణీలు, 192 పైసలు (దమ్మిడీలు) అంటే, ఆ రోజుల్లో రూపాయిలో 192వ వంతైన పైసకు కూడా విలువుందన్న మాట! అందువలన ద్రవ్య లభ్యత తక్కువగా వున్నా కూడా మార్పిడికి ఇబ్బంది వుండేది కాదు. అంతేకాక, ప్రజలు వస్తుమార్పిడిని కూడా అనుసరించేవారు. ‘కన్యాశుల్కం’ నాటకంలో లుబ్దావధానులు నౌఖరుకు ఒక కాణీ ఇచ్చి, ‘పోలిశెట్టి కొట్టుకు వెళ్ళి తమలపాకులు, వక్కలు, మిగిలిన సరంజామా తీసుకురా’ అంటాడు. ‘ఒక్క కాణీకీ అన్నోటోత్తాయాండీ’ అంటాడు నౌఖరు. ఇది 120 ఏళ్ళ నాటి మాట! ఇప్పుడైతే పది రూపాయలక్కూడా అన్ని రావు.
నాణానికి గాని, కరెన్సీకి గాని రెండు రకాల విలువలుంటాయి. ఒకటి- అంతర్గత విలువ , రెండు ముఖవిలువ. ఒక నాణెం తయారుచేయడానికి అవసరమయ్యే లోహం ఖరీదును ‘అంతర్గత విలువ’ అంటారు. చెలామణిలో ఉద్దేశించబడిన దాన్ని ‘ముఖవిలువ’ అంటారు. ఒక నాణెం, నోటు పట్ల ‘నమ్మకం’, ‘ఆమోదం’ ఎంత ముఖ్యమో, దాని ‘మార్పిడి’ (కన్వర్టబిలిటీ) కూడా అంతే ముఖ్యం. అంటే, రూపాయి నాణానికి చిన్న విలువగల నాణాలు కూడా వుండాలి. గతంలో రూపాయికి 192వ వంతు చిన్న నాణెం కూడా వుండేది. అలాగే, 100 రూపాయల నోటుకు చిన్న నోట్లుండాలి. అంటే 50, 20, 10, 1 నోట్లన్నమాట. ఇందువల్ల ప్రజల మధ్య, మార్కెట్టులోనూ మార్చుకోవడానికి వీలుగా వుంటుంది. ఇదే నగదు ద్రవ్యత (క్యాష్ లిక్విడిటీ). ఇది తగ్గినపుడు నగదు మార్పిడి స్తంభించిపోతుంది. తాజాగా పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో జరిగింది ఇదే. ఎపుడూ చెలామణిలో వున్న కరెన్సీలో పెద్ద నోట్లు తక్కువగా, చిన్న నోట్లు ఎక్కువగా వుండాలి. దేశంలో ఇపుడు అందుకు విరుద్ధంగా పెద్దనోట్లు 86 శాతం, చిన్న నోట్లు 14 శాతం వున్నాయి. కరెన్సీ అస్థిరత్వానికి ఇదే కారణం! తగిన ముందస్తు కసరత్తు లేనందున పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. నిజానికి ప్రజలకు డబ్బు విలువ తెలియాలంటే కరెన్సీ చరిత్ర తెలియాలి. నగదు నిర్వహణ సక్రమంగా జరగాలంటే దానికి సంబంధించి పూర్వపరాలు తెలుసుకోవాలి.
పూర్తిగా నాణాలతోనే నగదు చెలామణి కుదరదు. నగదుకు నమ్మకం, మార్పిడి ఉన్నట్లే, దాన్ని ప్రజలు సులువుగా తమవెంట తీసుకుపోయేలా (పోర్టబిలిటీ) వుండాలి. ఒకచోట నుండి మరోచోటకు, ఒక వ్యక్తినుండి మరో వ్యక్తి తరలించడానికి నగదు వీలుగా వుండాలి. భారీ విలువతో నాణాలను మరొకచోటుకు తీసుకెళ్ళాలంటే తేలిక కాదు. అందుకే బ్రిటిష్ హయాంలో పేపరు కరెన్సీని అమలులోకి తెచ్చారు. అప్పటికే బ్రిటన్‌లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండు పేపరు కరెన్సీని ముద్రించి చెలామణిలో పెట్టింది. ఆ తరహాలోనే భారత్‌లో ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’ను నెలకొల్పారు. కొన్ని నియమాలకు లోబడే కరెన్సీ ముద్రణ జరగాలి. అయితే, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ‘సమాంతర కరెన్సీ’ కూడా దేశంలో విజృంభిస్తోంది. నకిలీ నోట్ల వల్ల కొంత నగదు చెలామణిలోకొస్తుంది. కొన్ని వర్గాల్లోని అవినీతి ఫలితంగా ‘లెక్కలోకి రాని డబ్బు’ పోగవుతుంటుంది. ఇలా పేరుకుపోయిన సమాంతర ధనానే్న ‘నల్లధనం’ అంటున్నాం. దీన్ని బైటకు తీసి, ఆర్థిక వ్యవస్థను ‘శుద్ధి’చేయడమే ప్రధాని మోదీ ప్రస్తుత ఆర్థిక సంస్కరణల్లో ఒక విధానం. ఈ విధానాన్ని చాలా జాగ్రత్తగా, ముందస్తు కసరత్తుతో అమలుచేయాలి. లేకుంటే నల్లధనానికి, తెల్లదనానికీ తేడా తెలియకుండా పోతుంది. ఈ సంస్కరణలతో ‘నల్లకుబేరుల’కు నష్టం కలిగినా, వారికంత కష్టం కాకపోవచ్చు. సంస్కరణల సమయంలో పేద, మధ్యతరగతి వారు పాట్లు పడుతున్నారు. నల్లధనం లేకున్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది వారే! పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రోజుకో నిర్ణయం ప్రకటించి గందరగోళం సృష్టించడంతో పేద, మధ్యతరగతి వారే ఇక్కట్ల పాలయ్యారు. ఇలా ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు నిలకడ లేకపోతే, ప్రజలకు నగదుపైన, బ్యాంకింగ్ వ్యవస్థపైన నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది.

- మనె్ సత్యనారాయణ