మెయన్ ఫీచర్

కులం తెగులుతో నవ్యాంధ్ర నవ్వులపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరే చెప్పండి. మేం మనుషులకు కాపలా కా యాలా? విగ్రహాలు, ఫ్లెక్సీలకు కాపలాకాయలా? వీటిని ఎవరో ధ్వంసం చేస్తే- ఇంకెవరో రోడ్లమీదకు రావడం, దానికి మమ్మల్ని నిందించడం ఏమిటి? ఈ కొత్త రాష్ట్రం ఎటు పోతోంది? విగ్రహాలు, ఫ్లెక్సీల వివాదాలతో కాలం వెళ్లదీస్తే నవ్యాంధ్రలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? తమిళనాడును చూడండి. జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించినా అన్ని పార్టీలూ ఐక్యంగా ఒత్తిడి చేసి, కేంద్రంతో ఆర్డినెన్సు తెప్పించుకున్నాయి. ఇక్కడేమో అందరిదీ తలోదారి. ఇలాగైతే కొన్ని తరాలు కుమిలిపోవలసిందే..’
-నవ్యాంధ్రలో తాజా సంఘటనలపై మానవతావాదిగా, సామాజిక బాధ్యతతో స్పందించే ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. నవ్యాంధ్రలో ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఆ అధికారి చేసిన వ్యాఖ్యలు నిజమని స్పష్టమవుతుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఆంధ్ర ప్రాంతం కులాల చుట్టూనే పరిభ్రమిస్తోంది. ‘కులం లేనిదే మనుషులు లేరు, మనుషులు లేనిదే కులం లేదన్నంత’గా కులవ్యవస్థ బలంగా నాటుకుపోయింది. కులాన్ని-సమాజాన్ని విడదీయలేనంత భయానక పరిస్థితి ఉంది. ఈ వైఖరి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా మారుతుందనకుంటే, మరింత వికృతరూపం దాల్చి అభివృద్ధికి అవరోధంగా మారుతోంది. ఎప్పుడో కొనే్నళ్ల క్రితం చనిపోయిన నాయకుల చుట్టూ ఇంకా కులరాజకీయాలు కొనసాగించి, పబ్బం గడుపుకునే నీతిమాలిన రాజకీయాలు నవ్యాంధ్రను మొదట్లోనే చిదిమేస్తున్నాయి. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు.
నియామకాలు, ఎన్నికలు, ఎంపికలు, విమర్శలు, ఆరోపణలు అన్నీ కులం చుట్టూనే తిరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి నుంచి బయటపడకపోతే నవ్యాంధ్రకు అధోగతి తథ్యం! సమర్ధత, ప్రతిభ కాకుండా కులమే బలమై, అదే గీటురాయిగా మారుతున్న పరిస్థితిని అటు పాలకులు ప్రోత్సహించటం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి వంటి కీలక పదవులకూ కులమే ప్రాతిపదిక కావడం దౌర్భాగ్యం. త్వరలో ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ కానుంది. దానికి సమర్ధత కాకుండా కులమే గీటురాయిగా మారిన వైనం ఆందోళనపరుస్తోంది. ఆ పదవికి గతంలో అనిల్‌చంద్ర పునేతా పేరు దాదాపు ఖరారైనట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు అజయ్ కల్లాం పేరు వినిపిస్తోంది. కులాన్ని పక్కనపెడితే ఈ ఇద్దరూ సమర్ధులైన అధికారులే. కానీ, కొందరు టిడిపి నేతలు ఆ పదవిని జగన్ సామాజికవర్గానికి చెందిన అధికారికి ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు ఆ కులానికి చెందిన అధికారిని ఎంపిక చేస్తే- జగన్ వర్గీయులంతా వచ్చే ఎన్నికల్లో సైకిల్ ఎక్కేస్తారని చంద్రబాబుకు సలహా ఇచ్చారట! దీంతో- ‘అలాగే.. ఆలోచిద్దామ’ని బాబు చెప్పినట్లు ప్ర చారం జరుగుతోంది. చంద్రబాబు తరచూ ‘మనం ఎక్కడికి పోతున్నాం? నాకర్థం కావడం లేద’నే ఊతపదం వాడుతుంటారు. ఇప్పటి నియామకాలు చూస్తే పాలితులే పాలకులకు అలాంటి ప్రశ్న వేయాల్సి వస్తుంది.
బాబుకు సలహా ఇచ్చిన వారి వ్యూహం నిజమనకున్నా, అదే ప్రాతిపదికపై ఎంపిక చేసినా ఫలితాలు ఎందుకు బెడిసికొట్టాయన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కాపు ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో ఆ కులం వారిని ఆకట్టుకునేందుకు, అదే సామాజిక వర్గానికి చెందిన నండూరి సాంబశివరావును డిజిపిగా నియమించారు. కాపు కులస్థుడైన అధికారిని డిజిపిగా నియమిస్తే, ఆ కులం వా రంతా సంతోషించి ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి దూరంగా ఉంటూ, ప్రభుత్వానికి కృతజ్ఞత ప్రకటిస్తారని ఏలికల అంచనా. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది? కాపు ఉద్యమం చల్లారకపోగా, ముద్రగడ మరింత మొండికెత్తగా ఆయన వెంటే కాపులు ఇంకా నడుస్తూనే ఉన్నారు. పాలకుల లెక్కలు నిజమైతే, అత్యంత ప్రాధాన్యం ఉన్న డిజిపి పదవి ఇచ్చినందుకు కాపులు ప్రభుత్వంలోని పార్టీ పట్ల కృతజ్ఞతతో ఉద్యమానికి దూరంగా ఉండాలి కదా?! మరెందుకు అలా జరగలేదు? కాపుకార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయల రుణం తీసుకుంటున్న ఆ వర్గాలు కార్లు, ఆటోలపై సీఎం ఫొటోలకు బదులు ముద్రగడ, పవన్ ఫొటోలు ఎందుకు వేసుకుంటున్నారు?
ఒక కులానికి చెందిన వ్యక్తిని అందలమెక్కిస్తే ఆ సామాజికవర్గమంతా తమ వెంట ఉంటారన్న ఆలోచనే తప్పు. సరిగ్గా మూడురోజుల క్రితం బెజవాడలో వంగవీటి రంగా విగ్రహం ఒకచోట, చిరంజీవి, రంగా ఫ్లెక్సీలు మరొకచోట ధ్వంసం చేశారు. దీనిపై పెద్ద రభసే జరిగింది. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో ఇలాంటి ఘటన శాంతిభద్రతల కోణంలో ఆందోళన కలిగించేదే. ఆ క్రమంలో కాపువర్గానికి చెందిన బెజవాడ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తనయుడు స్వయంగా రంగా విగ్రహం వద్దకు వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించినట్లు వార్తలొచ్చాయి. వంగవీటి రంగా కాపులకు దైవం, కాంగ్రెస్ నేత. ప్రస్తుతం ఆయన వారసుడు వైసీపీలో ఉండటం, వైసీపీ కూడా కాపుల ఉద్యమానికి మద్దతు ప్రకటించి టిడిపిపై యుద్ధం ప్రకటించడం తెలిసిందే. అదే కాపు వర్గానికి చెందిన బోండా ఉమ తనయుడు ఏ అభిమానంతో రంగా విగ్రహం వద్దకు వెళ్లి చిత్రపటానికి పూలమాల వే శారు? రాజకీయపరంగా ఎన్ని ఆరోపణలు చేసుకున్నా కులపరమైన అభిమానం మాత్రం మనసులో సజీవంగానే ఉంటుందనుకోవాలా?
చంద్రబాబు కులపరంగా చేసే సమీకరణలు పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఏ ఎన్నికలొచ్చినా ఆయన కులాల లెక్కలు చూసి మరీ టిక్కెట్లు ఇస్తుంటారు. వైఎస్ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లన్నీ సహజంగానే రెడ్డి వర్గానికే ఇచ్చారు. కానీ, బాబు కులాల లెక్కలు చూసి ఇచ్చారు. చివరకు వైఎస్ లెక్కే గెలిచింది. అంటే వైఎస్ గెలుపు గుర్రాలను చూశారే తప్ప, కులాల్ని పట్టించుకోలేదు. తాజాగా నవ్యాంధ్రలో కొత్తగా పుట్టిన చోటా జర్నలిస్టు సంఘాన్ని, మరో చోటా జర్నలిస్టు నేతలనూ కులం కోణంలో ప్రోత్సహిస్తున్న తీరు కూడా బెడిసికొట్టింది. వారంతా బాబు పేరుతో మంత్రులనే శాసించి, వారిని తమ చుట్టూ తిప్పుకునే ‘మార్కెటింగ్ మేనేజర్ల’ స్థాయికి చేరారు. ప్రతిభ తప్ప కులమే గీటురాయి అయితే జరిగే దారుణాలు ఇంతకంటే భిన్నంగా ఉండవు.
ప్రస్తుతం నవ్యాంధ్రలో కులనేతల విగ్రహాలు శాంతిభద్రతలకు సవాలుగా మారే ప్రమాదం ఏర్పడింది. కమ్మ వర్గమంతా ఎన్టీఆర్, పరిటాల రవి, రెడ్డి వర్గమంతా వైఎస్, కాపులంతా వంగవీటి రంగా విగ్రహాలు విచ్చలవిడిగా ప్రతిష్ఠించాయి. వీటిలో వైఎస్ విగ్రహాలే ఎక్కువ. పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీటి సంఖ్య 50 వేలకు పైమాటేనన్నది ఒక అంచనా. వీటిలో 90 శాతం అనుమతి లేకుండా ఏర్పాటైనవే. రెండు కులాల మధ్య పోరాటానికి నవ్యాంధ్ర వేదికైన నేపథ్యంలో ఎక్కువగా రంగా, ఎన్టీఆర్ విగ్రహాలు, ఫ్లెక్సీల విధ్వంసాలు పెరిగిపోతున్నాయి. ఈ విగ్రహాలను కూల్చివేసినప్పుడల్లా రెండు వర్గాల వారూ మోహరించడటం పోలీసులకు తలనొప్పిలా మారింది. అనుమతి లేని విగ్రహాల్ని తొలగించే సాహసం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందన్నది ప్రశ్న. రోగానికి కారణం తెలిసి కూడా మందు వేయకపోవడం, ఆ సమస్యలో భాగస్వామి కావడం కిందే లెక్క!
ఇక, ముద్రగడ ప్రారంభించిన కాపు ఉద్యమం ముదురుపాకాన పడుతోంది. ఆయన పాదయాత్ర తేదీలు ప్రకటించడం, దానిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన ప్రతిసారీ ఆ ప్రభావం మిగిలిన జిల్లాలపై పడుతోంది. కాపు ఉద్యమానికి పోటీగా అందులోనుంచి విడిపోయి బలిజలు ప్రారంభించే బీసీ ఉద్యమం తాజా మలుపు. కాపు కార్పొరేషన్‌ను విభజించి, బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేసి తమకూ రాజకీయ న్యాయం చేయాలన్న డిమాండ్‌తో రేపు వాళ్లూ రోడ్డెక్కనున్నారు. కాపులతో తమకు సంబంధం లేదని, రేపటి బీసీ రిజర్వేషన్ల ఉద్యమంతో తమది ఒంటరిపోరేనంటున్న బలిజలూ రాయలసీమలో పిడికిలి బిగిస్తే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ సమాజానికి ఏం సంకేతాలిస్తున్నాయి? ఇలాంటి అరాచక, ఆందోళనకర పరిస్థితి కొనసాగితే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారు? ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో ఇలాంటి వ్యూహాలకు తెరలేపాయనుకున్నా, రేపు అవీ అధికారంలోకి వస్తే ఏలడానికి పనికిమాలిన కుల వ్యవస్థ తప్ప ఏమీ మిగలదు కదా? పోలీసులు పరిమిత సిబ్బందితో ప్రజల ధన, మాన, ప్రాణాలకే ప్రాధాన్యం ఇవ్వాలా? లేక ఇలాంటి ఉద్యమాలను నియంత్రిస్తూ, విగ్రహాలు, ఫ్లెక్సీలకు కాపలాకాయాలా?

*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144