మెయన్ ఫీచర్

కేజ్రీవాల్ గురివింద వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలై నెల పదిహేడవ తేదీ, 2015న ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలో వచ్చిన ఒక వార్త కథనం ఇలా ఉంది; ‘‘ఆశిష్‌జోషి అనే ఒక సీనియర్ ప్రభుత్వాధికారి జూన్ నెల 12వ తేదీన ఎసిబి అధికారులను కలిసి, దిల్లీ మాజీ హోంశాఖ కార్యదర్శి రాజేంద్రకుమార్ అవినీతి కార్యకలాపాలపై విచారణ జరిపించాలని కోరారు. కానీ నెలరోజుల వరకూ ఎసిబి అధికారులు దానిపై స్పందించలేదు. అపుడు ఆశిష్‌జోషి సిబిఐ తలుపు తట్టాలనుకున్నారు. అప్రమత్తమైన ఎసిబి అధికారులు విచారణ కేసును సిబిఐ వారికి అప్పగించారు. ఈ రాజేంద్రకుమార్ 2002 నుం డి 2005 వరకూ ఆరోగ్యం, విద్య మరియు ఐటి విభాగాలను పర్యవేక్షించే వాడు. ఆ సమయంలో ఆయన టెండర్లు పిలవకుండా రూ. 50కోట్ల విలువచేసే కాంట్రాక్టులను తాను సృష్టించిన బినామీ కంపెనీలకు అప్పజెప్పాడు.’’
ఈ మధ్య అంటే డిసెంబరు నెల పదిహేనవ తేదీన సిబిఐ అధికారులు రాజేంద్రకుమార్ కార్యాలయంపై ఉదయం 9.30 నిమిషాల సమయంలో దాడిచేసి రూ. 3 లక్షలు చేసే విదేశీ కరెన్సీని, 2.5 లక్షల (స్వదేశీ) మొత్తాన్ని, కుమార్‌కు సన్నిహితుడైన మరో అధికారి జి.కె.నందా నుండి రూ. 10.5 లక్షలను, ఒక ల్యాప్‌టాప్‌ను మరియు 14 విస్కీ బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రకుమార్ ఇపుడు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే రాజేంద్రకుమార్‌ను ఏరికోరి తన ముఖ్యకార్యదర్శిగా కేజ్రీవాల్ నియమించుకోవడం.
ఈ సంవత్సరం డిసెంబరు 9వ తేదీన సిబిఐ అధికారులు రాజేంద్రకుమార్‌ను కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. ఆయన సమాధానాలు సరిగా ఇవ్వడంలేదని, తన ఈ-మెయిల్స్‌ను చూపించడంలేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని సిబిఐ వర్గాలు చెప్పాయి. ఇటీవల కుమార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించేందుకు సిబిఐ అధికారులు వెళ్ళినపుడు, అదే భవన సముదాయంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయం కూడా ఉన్నా, ఆయన కార్యాలయంలోకి అధికారులు వెళ్ళనూ లేదు, దాన్ని మూయనూ లేదు. కానీ అబద్ధాలు చెప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడని కేజ్రీవాల్ మాత్రం అధికారులు తన కార్యాలయాన్ని కూడా ‘సీజ్’చేసారని, ఇదంతా నరేంద్రమోదీనే చేయించాడని తీవ్ర విమర్శలు గుప్పించాడు. కానీ అన్ని టెలివిజన్ వార్త్ఛానెళ్ళు కేజ్రీవాల్ కార్యాలయాన్ని అధికారులు తనిఖీ చేయలేదని, దాన్ని మూయలేదని వీడియోలతోపాటు చూపించాయి. అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించడమే కాక, ప్రధానమంత్రిని ‘పిరికివాడు’, ‘సైకో’అని సంభోదించడం ద్వారా కేజ్రీవాల్ మరో ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డాడు. దేశంలో ఇంతవరకూ ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రధానమంత్రినీ ఇంతటి నీచమైన భాషలో విమర్శించలేదు. ఈ సంస్కారహీనతను కేజ్రీవాల్‌లోనే ప్రజలు చూస్తున్నారు. సిబిఐ దాడులతో ఎటువంటి సంబంధమూ లేని ప్రధానిని లక్ష్యంగా చేసుకోవడం, ఆయనపై కేజ్రీవాల్‌కున్న అక్కసు, అసూయలను స్పష్టంగా చూపుతున్నాయి.‘‘సిబిఐ దాడు లు మోదీ ప్రభుత్వంయొక్క మద్దతుతోనే జరిగాయి’’అంటూ అసలు వివాదాన్ని పక్కదారి పట్టించి, ఢిల్లీ ఆప్ ప్రభుత్వపు అవినీతి బాగోతాన్ని ప్రజలు గమనించకుండా చూసుకోవడమే అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశ్యంగా కనబడుతున్నది.
సిబిఐ దాడులు చేయగానే నరేంద్రమోదీని తిట్టడం మొదలుపెట్టిన కేజ్రీవాల్, తన అబద్ధాలు ఫలితాలు ఇవ్వకపోయేసరికి, సాయంత్రానికి మాటమార్చి, ‘‘ఇదంతా అరుణ్‌జైట్లీ చేయించాడని, దిల్లీ క్రికెట్ అసోసియేషన్ అవినీతి వ్యవహారంలో జైట్లీ పాత్ర ఉందని, అందుకు సంబంధించిన ఫైలును తమవద్దనుండి స్వాధీనం చేసుకోవడానికే సిబిఐ దాడులుచేసిందని కొత్త అబద్ధాలతో కూడిన కథనాన్ని తెరమీదకు తెచ్చాడు.
కేజ్రీవాల్ చేస్తున్న ఈ ఆరోపణలు, చెబుతున్న అబద్ధాలను అనేకమంది మేధావులు, ప్రతిపక్ష నాయకులు కూడా అసహ్యించుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కక్షసాధింపు కోసమే సిబిఐ దాడులు చేసిందంటూ కేజ్రీవాల్ చెబుతున్న దాంట్లో లేశమాత్ర మైనా నిజం లేదనేది సుస్పష్టం. ఇటీవల ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్న సిబిఐ డైరెక్టరు అనిల్‌శర్మ ఇలా అన్నారు. ‘‘గత ఏడాది ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి నేటివరకూ ఏ కేంద్రమంత్రి కూడా మా సిబిఐ వ్యవహారాల్లో ఎటువంటి జోక్యంచేసుకోలేదు, ఏ సూచనలూ ఇవ్వలేదు.’’
రాత్రికిరాత్రే ఎవరి సూచనమేరకో రాజేంద్రకుమార్‌పై సిబిఐ దాడులు నిర్వహించలేదు. దిల్లీలోని ‘‘అవినీతి వ్యతిరేక విభాగం’’ (శఆజ ళ్యూఖఔఆజ్యశ ఱ్ఘూశష్ద) నుండి ఆర్‌టిఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2012నుండి, రాజేంద్రకుమార్‌కు వ్యతిరేకంగా ఏడు ఫిర్యాదులు ఎసిబికి అందాయి. కానీ అందులో ఒక దానిని మాత్రమే ఎసిబి అధికారులు సిబిఐకు పంపారు. తన ముఖ్యకార్యదర్శిపై అంత పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై ఎందుకు చర్య తీసుకోలేదు? అవినీతి భరతం పడతామని, అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచే పురుడుపోసుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ, దాని నేతల ప్రస్తుత వైఖరి తమ సిద్ధాంతాలను తామే తుంగలోకి తొక్కినట్టు బట్టబయలవడం లేదా?
మరో ఆశ్చర్యకర పరిణామం చూడండి. దిల్లీలో వంద కోట్ల రూపాయల ట్రాన్స్‌పోర్ట్ కుంభకోణం జరిగింది. ఆ వ్యవహారాన్ని అధ్యయనంచేస్తున్న వినోద్‌కుమార్‌శర్మ అనే న్యాయవాది ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘అవినీతి వ్యతిరేక విభాగం’(ఎసిబి) యొక్క జాయింట్ కమిషనర్ అయిన యం.కె.మీనాకు లేఖ ద్వారా తన గోడు చెప్పుకున్నారు. ఆయన ఏమి చెప్పారో చూడండి: ‘‘వంద కోట్ల రూపాయల ట్రాన్స్‌పోర్టు కుంభకోణంలో నివేదికను సిద్ధంచేయొద్దని, అలా చేసిన పక్షంలో సస్పెన్షన్ తప్పదని ముఖ్యమంత్రి కార్యదర్శి రాజేంద్రకుమార్ నన్ను బెదిరిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీనాడు నన్ను, కుమార్ మరియు మరికొందరు అధికారులు సచివాలయానికి పిలిపించారు. అక్కడ వారు, నేను సిద్ధంచేస్తున్న నివేదికను ముందుగా తమకు చూపించమని ఒత్తిడిచేసారు. తాము చెప్పినట్టు చేయకపోతే, సస్పెండ్ కూడా చేస్తామని నన్ను వారు బెదిరించారు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. అధిక రక్తపోటు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ మరియు ఇతర దిల్లీ ప్రభుత్వాధికారులనుండి నాపై పెరుగుతున్న ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నన్ను ఈ కేసు పర్యవేక్షణనుండి తప్పించాల్సిందిగా మిమ్మ ల్ని కోరుతున్నాను.’’
చట్టప్రకారం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఒక న్యాయవాదిని బెదిరించడం అనేది మామూలుగా మాఫియా డాన్‌లు, హంతక ముఠా నాయకులు చేస్తారు. కానీ ఆమ్‌ఆద్మీ పార్టీలో అయితే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు, బ్యూరోక్రాట్లే చేసేస్తారు. ఈ పార్టీనేనా దేశంలో అవినీతిని కూకటివేళ్ళతో పెకిలించి వేస్తానని, ఢిల్లీ ఓటర్లను మెప్పించి, అధికారాన్ని అందుకున్నది? ఇదేనా కేజ్రీవాల్ తీసుకువస్తానన్న విప్లవం?
సిబిఐ అధికారులు తనకు చెప్పకుండా, తన ముఖ్యకార్యదర్శి కార్యాలయంపై దాడులు నిర్వహించారని, ఇది అన్యాయమని కేజ్రీవాల్ అనడం ఆయన రెండు నాల్కల ధోరణిని బయటపెడుతున్నది. ఎలా? 2012, అక్టోబర్‌లో ఆయన తన ట్విట్టర్‌లో చేసిన ఈ రెండు వ్యాఖ్యలు చూడండి. ఒకటి: ‘‘ఒకవేళ, తాను ఎవరిమీద దాడులు నిర్వహించబోతున్నానో అనే విషయాన్ని దినపత్రిక మొదటి పేజీలో ప్రకటిస్తే సిబిఐ తన పనిని విజయవంతంగా చేయగలదా?’’అంటే దీని అర్థం తానుచేసే దాడుల సంగతిని సిబిఐ ముందుగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనేగా? రెండు: ‘‘ఐటి చట్టం యొక్క 132 సెక్షను ప్రకారం, అలాగే 133ఎ సెక్షను ప్రకారం సిబిఐ, ఎవరిమీదైనా ఆరోపణలు వచ్చినపుడు దాడి చేయవచ్చు పరిశోధించవచ్చు. మరి ప్రభుత్వమేం చేస్తోంది?’’ 2012లో అపుడు (అధికారంలో లేనపుడు) సిబిఐ దాడులు చేయాలి, చేయాలి అని అరచిన ఆ గొంతుతోనే ఇపుడు ‘‘దాడులు అన్యాయం, అక్రమం, అంతా కక్షసాధింపు చర్య’’అంటూ గగ్గోలు పెట్టడం అరవింద్ కేజ్రీవాల్‌కే చెల్లు. భా.జ.పా. వారి మీదనో, ఇతర పార్టీల నాయకుల మీదనో దాడులుచేస్తే సిబిఐ ‘మంచిది’, తన పార్టీ నాయకులు, తన ప్రభుత్వంలోని వారిపై దాడిచేస్తే మాత్రం సిబిఐ పాపిష్ఠిది. ఎంత నాటకం! ఎంత వంచన!
ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్ అనేది ఒక ప్రపంచ ప్రసిద్ధిపొందిన సంస్థ. ఇది అవినీతిపై ప్రత్యేకంగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు రూపొందిస్తుంటుంది. ఈ సంస్థ ఈ ఏడాది మేనెలలోనే రాజేంద్రకుమార్ అవినీతి, అక్రమ సంపాదనలపై అరవింద్ కేజ్రీవాల్‌కే ఉత్తరం వ్రాసింది. ఇపుడు కేజ్రీవాల్ దాని గురించి అడిగితే ఈమాట దాటవేస్తున్నాడు. స్వయానా ‘ఆప్’ కార్యకర్తలే రాజేంద్రకుమార్‌పై ఫిర్యాదులుచేసినా, కేజ్రీవాల్ వాటిని పట్టించుకోలేదంటే ఆయన వ్యవహారశైలి అనేక అనుమానాలకు దారితీయడం సహ జం. కేజ్రీవాల్ అండ చూసుకునేకదా రాజేంద్రకుమార్ అవినీతికి పాల్పడుతున్నది? అవినీతిని సమర్ధించేవాళ్ళు, చూసీచూడనట్టు వదిలేసేవాళ్ళు కూడా అవినీతిపరుల జాబితాలోకి వస్తారు. లాలూప్రసాద్‌యాదవ్‌ను కౌగిలించుకునేవాడు, సోనియాగాంధీ అండదండలతో పైకొచ్చినవాడు, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తన్ని తరిమేసినవాడు, నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో రాహుల్‌గాంధీని పల్లెత్తు మాట అననివాడు అవినీతిపరుడు కాకుండా పోతాడా అని ప్రజలు అనుకోవడం మొదలుపెడితే దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు 2019దాకా ఆగాల్సిన పనిలేదు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎవరినో తిట్టాల్సిన పనిలేదు. తనను తానే తిట్టుకో వాల్సి ఉంటుంది.

- పి.సతీష్ ఫోన్: 08554-242691