సబ్ ఫీచర్

తీరుమారని ‘దీదీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరులోనే ‘మమత’.. కళ్లలో కసి, మాటలో పదును, నడకలో వేగం ఆమె నైజం. ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం, ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేయడం ఆమె స్వభావం. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల సుదీర్ఘపాలనకు తెరదించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న మమతా బెనర్జీ పాలనావ్యవస్థపై కంటే వివాదాలపైనే నిత్యం దృష్టిసారిస్తుంటారు. ఆమె ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే బహిరంగ యుద్ధం ప్రకటించారు. రాజకీయాల సంగతి పక్కనపెడితే, మమత పాలనలో ఇపుడు బెంగాల్ మళ్లీ భగ్గుమంటోంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా ఆమె జాతీయ రాజకీయాల్లో తన పేరు మార్మోగాలని తపన పడుతుంటారు. తన మాటే చెల్లుబాటు కావాలని, తన ఆధిపత్యానికి ఎదురుండకూడదని ఆరాటపడే మమత కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొంటూ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
కాంగ్రెస్ నుంచి వేరుపడి ‘తృణమూల్ కాంగ్రెస్’ పేరిట ప్రాంతీయ పార్టీని ప్రారంభించిన మమత- నందిగ్రాంలో కమ్యూనిస్టుల దమనకాండను వ్యతిరేకించి సంతుష్టీకరణతో రాజకీయ వైభోగాన్ని దక్కించుకున్నారు. రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన యుపిఎ-2 సర్కారుకు ఆమె మద్దతును ఉపసంహరించుకుంది. సిఎం పదవిని చేపట్టాక పారదర్శక పాలనతో ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, అవినీతి అంతానికి ‘లోక్‌పాల్’ వ్యవస్థను తెస్తానని గంభీర ప్రకటనలు చేసిన ఆమె ‘శారదా చిట్‌ఫండ్’ కుంభకోణంలో చిక్కుకుంది. మాల్దా వంటి ప్రాంతాల్లో పోలీసుల చేత హిందువులపై దాడులు చేయిస్తూ ‘మైనారిటీ’ల ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు మమత పాకులాడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జనం మద్దతు మరోసారి లభించడంతో ఇక తనకు ఎదురే లేదని భావించిన ఆమె మోదీ సర్కారును వ్యతిరేకించడమే ఏకైక ఎజెండాగా చేసుకుంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ‘బెంగాల్ దీదీ’ బహిరంగంగా వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి. పెద్దనోట్ల రద్దుతో మాల్దా కేంద్రంగా జరిగే నకిలీనోట్ల చెలామణికి గండిపడడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. పెద్దనోట్ల రద్దుపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని లేవదీసి, దానికి తానే సారథ్యం వహించాలని ఆశపడింది. విపక్షాల్లో ఐక్యత లోపించడంతో ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
బెంగాల్‌లో జరిగిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం గురించి 2014 ఎన్నికల్లో మోదీ ప్రస్తావించడం మమతకు కోపం తెప్పించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే రాష్ట్ర మంత్రులు చాలామంది జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధర్ చౌదరి అన్నారు. దోషులను మమత రక్షిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ అర్పిత్ ఘోష్ ఆరోపించారు. 2013 ఏప్రిల్‌లో వెలుగు చూసిన ఈ చిట్‌ఫండ్ కుంభకోణం నుంచి మమత బయటపడడం అసాధ్యమని ఆమె ప్రత్యర్థులు అంటున్నారు. మోదీ ప్రధాని అయ్యాక రెండున్నరేళ్ల పాటు కిమ్మనకుండా ఉన్న ఈ ‘ఫైర్‌బ్రాండ్’ ఇటీవల పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రత్యర్థులపై మళ్లీ విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు మమతను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఆమెకు దగ్గరవుతోంది. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో కలసి మమత మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
పారదర్శక పాలనే తన ధ్యేయమంటూ ప్రకటించిన మమతా బెనర్జీ హయాంలో భారీ చిట్‌ఫండ్ బాగోతం బయటపడడంతో జనం నివ్వెరపోతున్నారు. సుమారు లక్షా తొంభైవేల మంది ఖాతాదారులు శారదా చిట్‌ఫండ్‌లో సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలను దాచుకున్నారు. ఈ ధనాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు దోచుకున్నారనే ఆరోపణలు రావడంతో మమత ప్రతిష్ఠ మసిబారుతోంది. నందిగ్రామ్ వద్ద పారిశ్రామిక వేత్తల కోసం వామపక్ష ప్రభుత్వం రైతుల నుంచి వెయ్యి ఎకరాల భూమిని లాక్కుందని గతంలో ఆందోళన చేసిన మమత ఇపుడు వౌనం వహించారు. సింగూర్, నందిగ్రామ్‌లలో వామపక్ష ప్రభుత్వ హయాంలో ఎంతోమంది ముస్లింలు హతమయ్యారు. వామపక్షాలపై యుద్ధం చేసి అధికారాన్ని దక్కించుకున్న మమత హయాంలోనూ హింస రాజ్యమేలుతోంది. మరోవైపు ఎనిమిదివేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకంలోనూ ఆమె అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతూ శాంతిభద్రతలు క్షీణించడంతో ఆమె పాలనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మమత ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి అవినీతి ఆరోపణలు అధికం అవుతున్నాయి. పలు జిల్లాల్లో హింస ప్రజ్వరిల్లుతోంది. అనేకమంది హిందువుల ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. మతపరమైన అలజడులు జరుగుతున్నాయి. గత ఏడాది మొహర్రం రోజున దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతించక పోవడంతో మత ఘర్షణలు జరిగాయి. కోల్‌కత హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆక్షేపించింది.
పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించిన మమతా బెనర్జీ ‘ప్రధాని పదవి నుంచి మోదీని దించేయాలని, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల’ని కొత్త పల్లవి అందుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు యత్నించి ఆమె భంగపడింది. మోదీని తప్పించి, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాష్టప్రతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం దక్కలేదు. మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె చేస్తున్న ఆరోపణలకు విపక్షాల నుంచి స్పందన కరవైంది. రోజ్‌వేలీ స్కామ్‌లో సుమారు 17 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో తృణమూల్ పార్టీ నేతల ప్రమేయం ఉందని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. అవినీతిని నియంత్రించడంలోనే కాదు, నేరాల అదుపులోనూ మమత సర్కారు ఘోరంగా విఫలమైందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. 2011లో బెంగాల్‌లో మహిళలపై 29,133 నేరాలు జరిగాయి. ఉపాధి లేక నిరుద్యోగులు ఆగ్రహం చెందుతున్నారు. నకలీ నోట్ల చెలామణితో రాష్ట్రంలో ఉగ్రవాదం, స్మగ్లింగ్, హవాలా వ్యాపారం నడుస్తున్నట్లు నిరూపణ అయింది. మోదీపై యుద్ధం చేసేందుకు తన బద్ధ శత్రువులైన వామపక్షాలతో జోడీ కట్టేందుకు మమత సిద్ధం కావడం రాజకీయాల్లో విలువల పతనానికి, అవకాశవాదానికి నిదర్శనం. మోదీపై చీటికీ మాటికీ ఒంటికాలిపై లేస్తున్న దిల్లీ సిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ ఎలా ప్రతిష్ట కోల్పోతున్నారో మమతా బెనర్జీకి కూడా అదే పరిస్థితి తప్పదని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్