సంపాదకీయం

విరాళాల వైచిత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న విరాళాలలో ఎనబయి మూడు శాతం రహస్య ప్రదాతల నుంచి సమకూరుతుండడం విస్మయకరం. భారతీయ జనతాపార్టీ సైతం ఈ ‘రహస్య గోపనం’లో వెనుకబడిలేదు. భాజపా వసూలు చేస్తున్న నిధులలో ముప్పయి ఐదు శాతం చెల్లించిన వారి పేర్లు మాత్రమే వెల్లడవుతున్నాయట! అరవై ఐదు శాతం నిధులు సమకూర్చిన వారి పేర్లు రహస్యంగా వుండిపోయాయి. ఇరవై వేల రూపాయల వరకు విరాళం చెల్లించే వారి పేర్లను వెల్లడి చేయవలసిన పనిలేదన్న నిబంధన బహుశా ఈ రహస్య నిధులకు కారణం! ఈ రెండు ప్రధాన రాజకీయ పక్షాలు మాత్రమే కాదు, గుర్తింపు పొందిన దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కూడ వంద శాతం ప్రదాతల వివరాలను వెల్లడించలేదు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ-సిపిఐఎం వారు యాబయి మూడు శాతం నిధులకు సంబంధించిన ప్రదాతల పేర్లను, సమాజ్‌వాదీ పార్టీవారు గరిష్ఠంగా తొంబయి నాలుగు శాతం నిధుల ప్రదాతల పేర్లను వెల్లడించడం లేదట! నల్లడబ్బును, అవినీతిని నిర్మూలించడానికి అవతరించినట్టు చెప్పుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ సైతం యాబయి ఏడు శాతం నిధుల ప్రదాతల వివరాలను గుప్తంగా ఉంచిందట! గత పదకొండేళ్లలో (2004-2015) రాజకీయ పార్టీలు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల విరాళాలను వసూ లు చేశాయట! వీటిలో అరవై తొమ్మిది శాతం నిధులను రహస్య ప్రదాతలు సమకూర్చడం రాజకీయ పారదర్శకతకు నిదర్శనం! పారదర్శక ప్రజాసేవ గురించి జరిగిపోతున్న ఆర్భాటానికీ, ఆచరణకూ మధ్య ఏర్పడిన అంతరం అంతుపట్టని వ్యవహారం! ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్’- ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం-ఏడిఆర్ అన్న స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధన, అధ్యయనం ఫలితంగా పార్టీల పారదర్శక ప్రమాణాలు బయటపడినాయే తప్ప రహస్యదాతలు ఎవరన్నది వెల్లడి కాలేదు! ఈ సంస్థవారు కేవలం ఎన్నికల కమిషన్ నుండి ఆదాయపు పన్ను శాఖనుండి సేకరించిన వివరాలు మాత్రమే పరిశోధన ఫలితాలకు ప్రాతిపదికలు! ఇలా అత్యధిక శాతం దాతల పేర్లను బయటపెట్టకపోవడం నేరం కాకపోవడం చట్టంలోని ఘోరమైన లోపం. ఇరవై వేల కంటె తక్కువ రూపాయలను రాజకీయ పక్షాలకు విరాళమిచ్చే వారి పేర్లను బహిర్గతం చేయనక్కరలేదన్నది ప్రజాప్రాతినిధ్యపుచట్టంలోని నిబంధన.
ఈ నిబంధన రాజకీయ పక్షాలవారు నిధుల వివరాలను బయటపెట్టకపోవడానికి మాత్రమే కాదు, విరాళాలు సేకరించే పద్ధతిలోను ఉదాత్తతను చాటుకోవడానికి సైతం దోహదం చేసింది. ‘మేము ఘరానా సంపన్నుల నుంచి, పారిశ్రామిక వాణిజ్య సంస్థల నుంచి పెద్ద మొత్తాలను సేకరించలేదు. సామాన్య, మధ్యతరగతి జనాల నుంచి ఇరవై వేల రూపాయలలోపు విరాళాలను మాత్రమే అధికసంఖ్యలో స్వీకరించాము..’అని చెప్పుకోవడానికి ఈ విచిత్ర నిబంధన వీలు కల్పిస్తోంది. ఈ నిబంధనను సవరించాలని ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రతిపాదించింది. దశాబ్దుల తరబడి ఈ నిబంధన కొనసాగుతుండడమే మన ప్రజాస్వామ్యంలోని డొల్లతనానికి నిదర్శనం. నిబంధనలను ఉల్లంఘించడం మన దేశంలోని అన్ని రంగాలలోను జీవన రీతి-్ఫషన్-గా మారింది! కానీ రాజకీయ పక్షాలు నిధుల విషయంలో నిబంధనను ఉల్లంఘించినట్టు చెడ్డపేరు తెచ్చుకోనక్కరలేదు. ‘నిబంధనను పాటించడం ద్వారానే నల్లడబ్బు చేతులు మారుతోంది! కాంగ్రెస్ పదిహేడు శాతం నిధుల దాతలను, భాజపా ముప్పయి ఐదు శాతం నిధుల దాతలను బయటపెట్టాయి. కానీ ఒక్క శాతం దాతల పేర్లను కూడ ఈ పార్టీలు బయటపెట్టకుండా ఉండడానికి కూడ ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోని నిబంధన వీలు కల్పిస్తోంది. మొత్తం నిధులన్నింటినీ ఇరవై వేల రూపాయలకంటె తక్కువగా విరాళమిచ్చిన లక్షలాది దాతల నుంచి సేకరించుకున్నాము’అని ఈ ప్రధాన పక్షాలు చెప్పవచ్చు! కాదని నిరూపించగల, నిలదీయగల నిబంధన కాని, వ్యవస్థ కాని ఏర్పడలేదు. బహుజన సమాజ్ పార్టీ వారు ఇలా మొత్తం నిధులను ఇరవై వేల లోపు చిన్న మొత్తాల ద్వారానే సేకరించారట! అందువల్ల ఏ ప్రదాత పేరు కూడ ఆ పార్టీ వెల్లడించలేదట. నిబంధనను పాటించడంలో పరాకాష్ఠ అంటే ఇదే మరి!
ఈ ఇరవై వేల రూపాయల లోపు విరాళ ప్రదాతలను గోప్యంగా ఉంచడానికి వీలు కల్పించిన నిబంధనను ఉపయోగించుకుని వందలాది చిన్న రాజకీయ పక్షాలు వేలాది కోట్ల రూపాయలను వసూలు చేసుకుని తిని కూర్చుంటున్నట్టు ఎన్నికల సంఘం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది! దేశంలో నమోదైన దాదాపు పంతొమ్మిది వందల రాజకీయ పక్షాలలో నాలుగు వందల రాజకీయ పక్షాలు ఇంతవరకూ ఏ ఎన్నికలో కూడా పోటీ చేయలేదని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికలలో పోటీ చేయని పార్టీలు ఎందుకని నమోదైనట్టు? ఈ నాలుగు వందల పార్టీలలో అత్యధికం కేవలం నిధులను వసూలు చేసుకుని భోంచేయడం కో సం అవతరించాయట! నల్లడబ్బును చెలామణి చేయడానికి ఈ రాజకీయ ముఠాలు దోహద పడుతున్నాయన్నది ఎన్నికల సంఘం వ్యక్తం చేసిన అనుమానం. ఇరవై వేల రూపాయల లోపు విరాళం రూపంలో ఆయా పార్టీలు ఎన్ని కోట్ల రూపాయలను వసూలు చేసుకున్నప్పటికీ దాతల పేర్లు చెప్పనక్కరలేదు. విరాళాలపైన, ప్రదానాలపైన రాజకీయ పక్షాలు ఆదాయపుపన్ను చెల్లించనక్కరలేదు. రాజకీయ పార్టీని ప్రారంభించి నిధులను దండుకుని వాటి స్వంత ఆస్తులుగా చేసుకొనడం ఈ నాలుగు వందల పార్టీల నిర్వాహకుల ప్రధాన వృత్తిగా మారి ఉండవచ్చు. ఇలాంటి పార్టీలను జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ఇటీవల ఆరంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పనె్నండు రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు-డీలిస్టింగ్-ఎన్నికల కమిషన్ డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ప్రకటించింది. ఈ పార్టీలు గతంలో జరిగిన రెండు ఎన్నికలలో పోటీ చేయకపోవడం ఈ తొలగింపునకు కారణం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, అన్న తెలుగుదేశం పార్టీ, భారతీయ సేవాదళ్, జాతీయ పౌర సంఘం వంటివి ఈ తెలుగు రాష్ట్రాలలో తొలగింపునకు గురయ్యాయి. దేశంలో రెండు వందల యాబయి ఐదు పార్టీలను ఇలా ఎన్నికల కమిషన్ రద్దు చేసింది.
ప్రజాప్రాతినిధ్యపుచట్టాన్ని సవరించాలని ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రతిపాదించింది. రెండు వేల రూపాయలకంటె ఎక్కువ విరాళం ఇచ్చే ప్రదాతల పేర్లను రాజకీయ పక్షాలు ప్రకటించి తీరాలన్న నూతన నిబంధనను కమిషన్ ప్రతిపాదించింది! దీనివల్ల రహస్యదాతల సంఖ్య, నల్లడబ్బు పరిమాణం తగ్గిపోగలవన్నది కమిషన్ ఆశాభావం. ఈ ప్రతిపాదన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ప్రకటించాడు. కానీ విరాళాల దాతల పేర్లు వెల్లడించడానికి ఈ రెండు వేల రూపాయల గరిష్ఠ పరిమితి మాత్రం ఎందుకు? ఈ గరిష్ఠ పరిమితి వల్ల పాతకథ సరికొత్తగా సాగిపోగలదు. ప్రతి రూపాయి విరాళం ఇచ్చే ప్రదాతల పేర్లను సైతం పార్టీ వెల్లడించాలన్న నిబంధనను ఎందుకు విధించరాదు?