సబ్ ఫీచర్

విజేతలంటే ఎవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి దేశం ‘విజయం’ అనే పదాన్ని రకరకాలుగా అన్వయించుకుంటుంది. అమెరికాలో ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడో వాడే విజయవంతుడని అర్థం. ఎక్కువ బిజెనెస్‌ను తన చాతుర్యంతో ఏ వ్యక్తి అభివృద్ధి చేసుకుంటాడో ఆ వ్యక్తి విజయవంతుడని అర్థం. అంటే- ఇలా ధనం సంపాదించిన వారందరూ స్వార్థపరులని అనుకోకండి. కూడబెట్టిన ధనమంతా కొన్ని సేవాసంస్థలకు దానధర్మాలు చేసిన వారు కూడా ఉన్నారు. వారినే అక్కడివారు శ్రేష్ఠులుగా భావిస్తారు.
స్టాన్‌ఫర్డ్‌లో 10 మంది విగ్రహాలుంటాయి. ఈ విగ్రహాలు ఎవరివంటే- తమ ఆస్తిపాస్తులన్నింటినీ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి ధారపోసిన వాళ్లవి. కాలిఫోర్నియాలోని ఓ బయోటెక్నాలజీ సంస్థలో 30 వేల మంది సైంటిస్ట్‌లు పనిచేస్తుంటారు. ఆ సంస్థకు ఓ దాత తన యావదాస్తిని విరాళంగా ఇచ్చారు. ఈ సంస్థ ఏర్పాటుకు కారణభూతుడయ్యాడు. ఆ దాత తాను సంపాదించిన సంపదను తన పిల్లలకు ఇవ్వలేదు. వారసత్వంతో వచ్చిన వాళ్లను అమెరికాలో తక్కువగా చూస్తారు. స్వతంత్రంగా కష్టపడి సంపాదించటం, ఆ విధంగా సంపాదించిన ధనాన్ని స్వచ్ఛందంగా సేవా సంస్థలకు ధారపోయటం అక్కడి సంస్కృతి. అదే ఫ్రాన్స్ దేశంలో అయితే- అత్యధికంగా డబ్బున్నవారిని తక్కువ చూపు చూస్తారు. ఎవరైతే మేధాసంపత్తిని ధారపోశారో, కలలను, ఆకాంక్షలను సృష్టించుకొని పనిచేస్తారో వారిని విజయవంతులుగా గుర్తిస్తారు. అదే చైనాలోనైతే నీతిమంతుడిని విజయవంతునిగా భావిస్తారు. దీనికి కారణం ఆ దేశంపై ‘కన్ఫూషియస్‌‘ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ దేశంలో ప్రజలకు సేవచేసిన వాణ్ణి గొప్ప వ్యక్తిగా విజయవంతులుగా పరిగణిస్తారు. అదే మనం జపాన్, సౌత్ కొరియాలో చూస్తే గొప్ప ఆవిష్కరణలు చేసిన వారిని విశిష్టమైన మనుషులుగా పరిగణిస్తారు.
సక్సెస్‌ఫుల్ మనిషి అనేది ఆ దేశం కల్చర్‌పై ఆధారపడి ఉంటుంది. అదే మన దేశానికి వస్తే ఆధ్యాత్మికమైన సేవలందించే వారిని గొప్ప మనిషిగా పరిగణిస్తారు. శంకరాచార్యులని అలా చూస్తారు. ‘విజయం’ అన్న పదానికి నిర్వచనం ఆ దేశ సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ‘ఇలా చేస్తే విజయులవుతారు’- అని ఎవరూ సరళీకరించలేదు, సూత్రీకరించలేదు. కానీ, ఏ దేశంలో కూడా సోమరిపోతును మాత్రం విజయవంతుడనరు. సుఖంగా జీవితాన్ని గడిపిన వాడిని విజయవంతుడనరు. విలాసాలు చేసినంత మాత్రాన, రెండు పూటలా కడుపునిండా తిని కదలకుండా ఉండేవాడిని విజయవంతులనరు. రెండు పూటలా అన్నం కోసమై పడిన శ్రమే- ఆ వ్యక్తుల, ఆ దేశం సంస్కృతిని సూచిస్తుంది. కల్చర్‌ను నిర్మించేది శ్రమజీవులు మాత్రమే. శ్రమైక జీవన సంస్కృతి గొప్పది. ఆ శ్రమ మేధస్సుది కావొచ్చు. శారీరకమైంది కావొచ్చు. ఆ శ్రమ- సమాజానికి, ప్రగతికి ఎంత దోహద పడిందన్నదే ప్రమాణం.

- చుక్కా రామయ్య