మెయన్ ఫీచర్

మీడియాకు ‘సూక్తి ముక్తావళి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీజీని హత్య చేసేందుకు తనను ప్రేరేపించిన కారణాలను ప్రపంచానికి చెప్పలేదని నాథూరామ్ గాడ్సే అలనాడు మీడియాపై అసహనం చెందాడు. తాజాగా ‘శే్వత సౌధాధిపతి’ ట్రంపుసారుదీ అదే బాట. వీటన్నింటితోపాటు ఏపి సిఎం చంద్రబాబు ఓ మీడియా ప్రతినిధిపై వ్యక్తం చేసిన అసహనాన్ని గాడ్సే, ట్రంపులతో పోల్చి, నాయకులు ఎలా ఉండాలో, పాలకులు మీడియా పట్ల ఎలా ఉండకూడదో, వాటిపై జర్నలిస్టులు ఎలా స్పందించాలో చెబుతున్న ‘మీడియా మహాత్ముల సూక్తిముక్తావళి’ వింతల్లోకెల్లా వింత.
ఒకప్పుడు పత్రికలో ఏదైనా వార్త వస్తే అది కచ్చితంగా నిజమని జనం నమ్మేవారు. నేతలు కూడా తమపై ఆరోపణలొస్తే, ఊళ్లో జనాలకు ముఖం చూపించలేక రోజంతా ఇంటిపట్టునే ఉండేవారు. మీడియాకు, నాయకులకు అం తటి విశ్వసనీయత ఉండేది. మరి ఇప్పుడు..? ఎవరి మీడియా వారిది. ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా. పది పత్రికలు చదివిన తర్వాతనే, ఏది నిజమైన వార్తనో అంచనా వేయాల్సిన దుస్థితి.
తమిళనాడు మాదిరిగానే ఏపి, తెలంగాణలో పార్టీలకు సొంత మీడియాలున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు సొంత పత్రిక, చానెల్ ఉంది. తెలుగుదేశం పార్టీకి సొంత చానెల్, పత్రికంటూ లేకపోయినా రెండు పత్రికలు, మరికొన్ని చానెళ్లు అనుకూలంగానే ఉన్నాయి. గతంలో ఒక టీవీ చానెల్‌ను తీసుకుని చేతులు కాల్చుకున్న అనుభవం కూడా టిడిపి వారికి ఉంది. ఇక వైసీపీకి సొంత పత్రిక, చానెల్ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలకూ సొంత మీడియా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదీ ‘పార్టీల మీడియా’ స్వరూపం. ఇవన్నీ వారి పార్టీల గళాన్ని వినిపించేందుకు, ప్రత్యర్థి పార్టీలను భ్రష్టుపట్టించేందుకే పనిచేస్తాయి తప్ప, ‘లోకకల్యాణం కోసం’ అనుకోవడం వెర్రితనం! అంతెందుకు..? ఇప్పుడు ‘జర్నలిస్టులకు అవమానం’పై కడవల కొద్దీ ఆవేదన కురిపిస్తున్న ఈ ‘మహాత్ములు’ పనిచేసే మీడియా సంస్థలు తాము చెప్పే ప్రవచనాలు పాటిస్తున్నాయా? అన్నది ప్రశ్న. ఒకప్పుడు ప్రభుత్వాలకు బాకాగా, ‘కిచెన్ క్యాబినెట్’ సభ్యులుగా దిశానిర్దేశం చేసి, ఇప్పుడు పవిత్రుల మాదిరిగా మీడియా దుస్థితిపై వగచడమెందుకో?
ఇప్పుడు మీడియా కూడా మిగిలిన రంగాల మాదిరిగానే దారి తప్పింది. అందులో సందేహం లేదు. దానికి ఎవరి కారణాలు వారికున్నాయి. గత పది, పదిహేనేళ్ల కాలంలో వివిధ రకాల వ్యక్తులు, శక్తులు చొరబడటంతో మీడియా స్వరూపం, నడక, నడత పూర్తిగా మారిపోయాయి. ఎవరి పార్టీ కోణంలో వారి వాదన వినిపించటం, ఎదుటి పార్టీ వారిపై బురద చల్లడమే ‘నయా జర్నలిజం’. తా జాగా ఏపిలో ఒక విలేఖరిపై సి ఎం చంద్రబాబు విరుచుకుపడ్డారంటూ వాపోతున్న మీడియా మహాత్ములు, వారి సంఘాలూ ఈ పోకడలకు అతీతం కాదు.
ఇది దాదాపు 15ఏళ్ల క్రితం నాటి మాట.. గుంటూరులో వా మపక్షపార్టీకి చెందిన ఒక ప త్రికా విలేఖరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ అరెస్టు గురించి ప్రశ్నిస్తే, అతగాడిని విలేఖరిగా అరెస్టు చేయలేదు, ఫలానా విద్యార్ధి సంఘ నేత హోదాలో ధర్నాలు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే అరెస్టు చేశామని పోలీసులు అసలు విషయం చెప్పారు. అంటే- సదరు విలేఖరి విద్యార్థి సంఘ నేతగా అరెస్టయ్యాడే తప్ప, విలేఖరిగా కాదన్నమాట! అప్పట్లో బాగా బతికిన ‘పేరు గొప్ప’ జర్నలిస్టు యూనియన్ నేతలు దానిపై నానా యాగీ చేసి, జర్నలిస్టులపై దాడులను ఖండించాలని పెద్ద వాంతులే చేసుకున్నారు. మరి అతగాడిని జర్నలిస్టుగా చూడాలా? లేక పార్టీ అనుబంధ సంఘ నేతగా చూడాలా?
సీన్ కట్ చేస్తే.. కొనే్నళ్ల క్రితం వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు సంస్థలు ఆయన మీడియాకు చెందిన ఆఫీసులలో సోదాలు చేసి, వారికి కావలసిన ఆధారాలు తీసుకువెళ్లాయి. ఇది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియనే. దర్యాప్తు సంస్థలు నిందితుడి నేరచరిత్రను తెలుసుకునేందుకే ప్రయత్నిస్తాయి తప్ప, అతగాడిని పత్రికాధిపతిగా చూడవు. ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ అందులో పనిచేసే జర్నలిస్టు నాయకులు, వారి సిబ్బందిని రాత్రి రోడ్డెక్కించి కొవ్వొత్తులతో నిరసన ప్రకటించారు. దీన్ని పత్రికాస్వామ్యంపై జరిగిన దాడిగా జర్నలిస్టులు ముందుండి నినదించారు. ఇక్కడ తేడా గమనిస్తే దర్యాప్తు సంస్థలు ఏ ఒక్క జర్నలిస్టు విధి నిర్వహణనూ అడ్డుకోలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. మరి ప్రజాస్వామ్యం ఎక్కడ ఖూనీ అయింది? పత్రికాస్వామ్యానికి ఎక్కడ విఘాతం ఏర్పడింది? రోడ్డెక్కిన వారిని జర్నలిస్టులుగా చూడాలా? లేక ఫలానా పార్టీ ప్రతినిధులుగా చూడాలా? ఇ లాంటి చిత్ర విచిత్ర విన్యాసాలకు సారథ్యం వహించిన ఆ ‘పేరుగొప్ప’ పాత్రికేయ వృద్ధసింహాలే- ఇప్పుడు ఏపిలో జర్నలిస్టులపై నాయకుల దాష్టీకాలంటూ టన్నులకొద్దీ ఆవేదన కుమ్మరించేస్తున్నాయి.
చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో వామపక్ష పార్టీకి చెందిన ఒక పత్రికా విలేఖరి ప్రభుత్వంపై, తన పార్టీ కోణంలోనే ఒక ప్రశ్న వేశారు. అది బాబుకు రుచించలేదు. సరిపడని ప్రశ్నలు ఎవరికీ రుచించవు కదా? అందుకే ము క్కూ ముఖం తెలియని కుర్ర జర్నలిస్టులు పెట్టిన సంఘానికి దన్నుగా నిలిచారు. కొత్తగా కళ్లు తెరిచిన ఈ సంఘం నేతలు మంత్రులను తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. అది వేరే విషయం! బాబును ప్రశ్నించిన సదరు విలేఖరి ఫలానా పార్టీకి చెందిన పత్రికలో పనిచేస్తున్నందున ఆ ప్రశ్న కూడా అదే కోణంలో ఉంటుంది కాబట్టి, ‘నీకు సమాధానం చెప్పాల్సిన పనిలేద’ని సిఎం కొట్టిపారేశారు. ఆ సందర్భంలో ఆయన మీడియాకు క్లాసు తీసుకుని, పాత్రికేయులు ఎలా ఉండాలో సెలవిచ్చారు. దానిపై ఏపి,తెలంగాణలో ఎప్పుడో మనుగడ కోల్పోయిన జర్నలిస్టు సంఘం ఉద్యమం మొదలెట్టింది. జర్నలిస్టులను బాబు అవమానిస్తున్నారని, అక్షరాన్ని అపార్థం చేసుకుంటున్నారంటూ నేతలు కన్నీరు కారుస్తున్నారు.
ఇక్కడ బాబు తీరును ఎవరూ సమర్ధించరు. ఇప్పుడు జర్నలిజం, పత్రికాస్వామ్యం గురించి బిందెల కొద్దీ కన్నీరు కారుస్తున్న ఈ మహాత్ములే, బాబు తొమ్మిదేళ్ల పాలనలో రామలక్ష్మణుల మాదిరిగా ఆయనకు అటు, ఇటు నిలిచారు. కొందరు పవర్ ప్రాజెక్టుల సేవల్లో, మరికొందరు పైరవీ సేవల్లో తరించారు. అప్పట్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగాయి. కానీ, ఈ బాపతు నేతలెవరూ దానిపై నోరెత్తలేదు. వైఎస్ హయాంలో సబ్ స్టేషన్ల కాంట్రాక్టులు కొట్టేసి, చీరాల కేబుల్ వ్యాపారాల్లో మునిగిపోయిన ఒంగోలు యూనియన్ నేతాశ్రీ.. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానంటూ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన వారా జర్నలిస్టుల ప్రతినిధులు?
వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ‘ఆ రెండు పత్రికలం’టూ విరుచుకుపడేవారు. అధికారంలోకి వచ్చాక మరింత ఎదురుదాడి చేసేవారు. అప్పుడు ఈ మహాత్ములెవరూ గొంతు విప్పకపోగా, స్వయంగా వైఎస్ పెట్టించిన చానెల్‌లో సేదతీరి, గళాన్ని అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు. ‘నీదే పత్రిక..?’ అని బాబు ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్న ఈ నేతలు.. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ కూడా అదే ప్రశ్న అడగటాన్ని ఎందుకు ప్రస్తావించరో? తెలంగాణ ఉద్యమ సమయం లో కేసీఆర్ కూడా ‘ఆంధ్రా మీడియా’ అంటూ ధ్వజమెత్తేవారు. అదే మీడియాను ఉద్యమ, పార్టీ విస్తృతి కోసం వాడుకున్నారు. అది వేరే విషయం. అధికారంలోకి వచ్చాక రెండు చానెళ్లను అనధికారికంగా నిషేధించేలా చూశారు. వరంగల్ సభలో బహిరంగ హెచ్చరికలే చేశారు. విలేకరుల ప్రశ్నలపై విరుచుకుపడ్డారు. అయినా ‘పేరుగొప్ప’ జర్నలిస్టు నేతలెవరూ రోడ్డెక్కకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయారు. ఆ తర్వాత ‘తత్త్వం’ తెలుసుకున్న కేసీఆర్ పక్షపాతరహితంగానే వ్యవహరిస్తున్నారు. ఇది వేరే ముచ్చట. అంటే- అణచివేసే వారి వద్ద అణకువగా, మెతకగా ఉండే వారివద్ద అగ్గిరాముళ్ల మాదిరిగా ‘పొద్దుతిరుగుడు పువ్వుల’ పాత్రలు పోషిస్తున్నారన్నమాట! జర్నలిస్టు నాయకులు, సంఘాలు ఇప్పుడు చేస్తున్నవి నిజమైన ఉద్యమాలా? ఉనికి కోసం చేసే పెట్టుడు ఉద్యమాలా? నిజంగా ఈ సంఘాలు జర్నలిస్టులకు సేవ చేస్తున్నాయా? పార్టీలు, వ్యక్తుల సేవలో తరిస్తున్నాయా? అన్నది ప్రశ్న. జర్నలిస్టుల సమస్యల గురించి వాపోయే ఈ నేతల్లో ఒక మహానేత- తెలంగాణలో కొత్త పత్రికకు ఊపిరిపోశాడు. అర్ధంతరంగా జర్నలిస్టులను తొలగించేసి ఇళ్ళకు పంపించేశాడు. కమ్యూనిజం భావజాలంతో హక్కుల కోసం సర్కారుపై పోరాడే ఈ జర్నలిస్టు మేధావి తన సొంత పత్రికలో వాటినెందుకు పాటించలేదు? ఇంకో పేరుమోసిన పెద్ద పత్రికలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తొలగించినా ఏ ఒక్క యూనియన్ పెదవి విప్పిన పాపాన పోలేదు. అసలు తెలుగురాష్ట్రాల్లో జర్నలిస్టులకు జీతాలు ఇస్తున్న పత్రికలను, చానళ్లను వేళ్లమీదనే లెక్కించవచ్చు. వారి తరఫున పోరాటం చేతకాని నేతాశ్రీలకు జర్నలిస్టు సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత ఉందా?
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144