సంపాదకీయం

టర్కీ దూకుడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా యుద్ధవిమానాన్ని టర్కీ ప్రభుత్వం నవంబర్ 24వ తేదీన కూల్చివేయడం అగ్రరాజ్యాల ఆధిపత్య సమరంలో భాగం. ఈ కూల్చివేతకు నిరసనగా టర్కీతో రక్షణ సహకారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు రష్యా ప్రభుత్వం 26వ తేదీన ప్రకటించడం ‘అగ్ర’ వైరుధ్యాలు తీవ్రతరం అవుతుండడానికి నిదర్శనం. ఈ వైరుధ్యాల కారణంగా లాభపడుతున్నది అంతర్జాతీయ సమాజానికి శత్రువైన ఇరాక్ సిరియా ఇస్లామిక్ రాజ్యం-ఐఎస్‌ఐఎస్-బీభత్స సంస్థ. సిరియాలో దాదాపు మూడింట రెండు వంతుల భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్న ఐఎస్‌ఐఎస్ వారు పొరుగున ఉన్న టర్కీలోకి కూడ చొరబడనున్నారు. అసియా వాయువ్య భాగంలో ఐరోపాకు దక్షిణంగా నెలకొని ఉన్న టర్కీకి చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యత ఉంది. శతాబ్దులపాటు ఇస్లాం, క్రైస్తవం తమ విస్తరణలో భాగంగా పరస్పరం తలపడిన చారిత్రక సీమ టర్కీ. కాన్‌స్టాంట్ నోపుల్‌ను క్రీస్తుశకం 1453లో క్రైస్తవ బాహుళ్యమైన ఐరోపా నుండి తరుష్కులు స్వాధీనం చేసుకొనడం చరిత్రగతిని మార్చిన పరిణామం. కాన్‌స్టాంట్‌నోపుల్ పేరును తురుష్కులు ఇస్తాంబుల్‌గా మార్చారు. ఇస్లాం మతస్థులు దాదాపు 99 శాతం ఉన్న టర్కీకి అమెరికా నేతృత్వంలోని ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి-నాటో-లో 1952 నుండి సభ్య త్వం లభించడం ప్రచ్ఛన్న యుద్ధం నాటి వారసత్వం. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో టర్కీ సోవియట్ రష్యా ప్రాబల్యాన్ని నిరోధించి అమెరికా కూటమిలో పనిచేసింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై పదిహేను దేశాలుగా విడివడిన తరువాత దశాబ్దికి పైగా అంతర్జాతీయ సమాజంపై అమెరికా ప్రభుత్వం వారి ఏకఛత్రాధిపత్యం కొనసాగడం చరిత్ర. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత పదిహేను ఏళ్లుగా రష్యా మళ్లీ అమెరికాను ఢీకొనడానికి యత్నిస్తోంది. రష్యా, చైనాలు ఒకవైపున, అమెరికా ఐరోపాలు మరోవైపున ప్రపంచంపై ప్రాబల్యం కోసం యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. మానవాళికి భయంకర శత్రువుగా పరిణమించిన జిహాద్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో సైతం రెండు ‘అగ్ర’ కూటముల మధ్య సమన్వయం ఏర్పడడం లేదు. ఏర్పడలేదనడానికి రష్యా విమానాన్ని టర్కీ కూల్చివేయడం సరికొత్త సాక్ష్యం..సిరియాలో భయంకర బీభత్సకాండను సృష్టించిన ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా అమెరికా ఐరోపా ప్రభుత్వాలు గగన యుద్ధం చేస్తున్నాయి. రష్యా కూడ ఐఎస్‌ఐఎస్ స్థావరాలను ధ్వంసం చేయడంకోసం సిరియా ఆకాశంలోని చొచ్చుకొని పోయింది. అలాంటప్పుడు అమెరికా కూటమి రష్యాలు పరస్పరం సహకరించుకోవాలి. కానీ అమెరికా కూటమిలోని టర్కీ రష్యా విమానాన్ని కూల్చివేసింది. టర్కీ ప్రభుత్వం ఈ కూల్చివేత చర్యకు పూనుకొనడం ఐఎస్‌ఐఎస్ జిహాదీ హంతకులు హర్షించిన విపరిణామం. రష్యా యుద్ధ విమానం సిరియా గగనతలంలో నుండి తమ ఆకాశంలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందువల్లనే కూల్చివేసినట్టు టర్కీ ప్రభుత్వ వాదంలో తర్కం ఉండవచ్చుగాక. అంతర్జాతీయ సమష్టి హితకరమైన న్యాయం మాత్రం కాదు. ఈ అన్యాయానికి రష్యా ప్రభుత్వం కూడ కారణం..
సిరియాను కల్లోలగ్రస్తం చేసిన ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా అమెరికా కూటమితో కలిసి రష్యా ఉమ్మడిపోరాటానికి సిద్ధపడకపోవడం ఈ కారణం. అంతేకాక అమెరికా కూటమివారు, రష్యా ప్రభుత్వం వారు పరస్పరం విరుద్ధ ప్రయోజనాల ప్రాతిపదికగా ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా విడివిడిగా పోరాటాలు చేస్తున్నారు. ప్రపంచంలోని ఇస్లామేతర మతాలన్నింటినీ ధ్వంసం చేసి ఇస్లాంను ఏకైక మతంగా నిలబెట్టడం జిహాదీ ఉగ్రవాదుల లక్ష్యం. ఇరాక్‌లోను సిరియా పొరుగు దేశాలలోను మాత్రమే ప్రధానంగా పోరాటం సాగిస్తున్నప్పటికీ, ఐఎస్‌ఐఎస్ ప్రచ్ఛన్న యుద్ధం మన దేశానికి వ్యతిరేకంగా కూడ మొదలైంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం పశ్చిమ ఆసియా సీమలకు వెలుపల ఉన్న అనేక దేశాలలో కొనసాగుతోంది. ఆఫ్రికా ఖండంలోని ట్యునీసియా నుంచి బంగ్లాదేశ్ వరకు తమ పోరాటం విస్తరించి ఉం దని ఐఎస్‌ఐఎస్ స్వయంగా ప్రకటించి ఉంది. మన ప్రధాని నరేం ద్ర మోదీ 22వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ప్రసంగం చేస్తున్న సమయంలోనే ఐఎస్‌ఐఎస్ ఈ స్పష్టీకరణను జారీ చేసింది. జిహాదీ బీభత్సకాండకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు ప్రచారవౌతున్న అంతర్జాతీయ సమరాన్ని అమెరికా కూటమి వారు, రష్యా దళాలు ఉమ్మడిగా నిర్వహించడం, అందువల్ల, ప్రపంచానికి ప్రయోజనకరం, సర్వమత సమభావ వ్యవస్థల పరిరక్షణకు దోహదకరం. కానీ అమెరికా, రష్యాలు ఈ విస్తృత హితాన్ని పట్టించుకొనడం లేదు. పశ్చిమాసియాలోను ఇతర ప్రాంతాలలోను తమ ప్రాబల్యాన్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే అగ్ర రాజ్యాలు ఇప్పుడు సిరియాలో యుద్ధం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య రష్యా ప్రభుత్వం సిరియాలోని నియంతృత్వ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుండడం టర్కీ చర్యకు నేపథ్యం.
అక్టోబర్ 31వ తేదీన ఈజిప్టులో రష్యా వారి పౌర విమానాన్ని ఐఎస్‌ఐఎస్ కూల్చివేసింది. 224 మంది ప్రయాణికులు హతమయ్యారు. రష్యా వైమానిక దళాలు సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై దాడులు ప్రారంభించిన తరువాత సరీగ్గా నెలరోజులకు ఈ బీభత్స ఘటన జరిగింది. ఐఎస్‌ఐఎస్ వ్యూహరచన పటిమకు, బీభత్స దళాల విస్తృతికి ఇది నిదర్శనం. ఏ దేశంలోనైనా బీభత్సకాండను సృష్టించగల పైశాచిక పటిమ ఐఎస్‌ఐఎస్‌కు ఏర్పడి ఉంది. సెప్టెంబర్ 27న ఫ్రాన్స్ వైమానిక దళాలు సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై దాడులు ప్రారంభించాయి. 50 రోజుల తర్వాత ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఐఎస్‌ఐఎస్ మూకలు చొరబడి భయంకర రక్తపాతం సృష్టించాయి. 129 మంది బలయ్యారు. ఈ రెండు దుర్ఘటనల తరువాతనైనా ఫ్రాన్స్, రష్యాలు కలిసికట్టుగా పోరాటానికి సంసిద్ధమై ఉండాలి. ఫ్రాన్స్‌పై దాడి ఐరోపాపై దాడి, అమెరికా నాయకత్వంలోని ‘నాటో’పై దాడి..అయినప్పటికీ రష్యాను నాటో కూటమి వారు తమలో ఎందుకని చేర్చుకోవడం లేదు? రష్యా ఎందుకని నాటోతో కలసి పనిచేయడం లేదు? ఐఎస్‌ఐఎస్ దశాలతో తలపడి ఉన్న రష్యా యుద్ధ విమానం పొరపాటున కావచ్చు, యుద్ధ వ్యూహాలలో అనివార్యమై కావచ్చు టర్కీ గగన తలంలోకి చొరబడింది. టర్కీ ప్రభుత్వం నిజానికి దీన్ని పట్టించుకోరాదు. రష్యాతో యుద్ధానికి కాలుదువ్వే రీతిలో టర్కీ ప్రభుత్వం ఆ యుద్ధ విమానాన్ని కూల్చడానికి నేపథ్యం ఆధిపత్య సమరం మాత్రమే.
సిరియాలో ఈ ఆధిపత్య సమరానికి అంకురార్పణ చేసింది రష్యా, చైనాలు. అరబ్ ఉప్పెన పేరుతో చెలరేగిన విప్లవాలు పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలోని నియంతృత్వ వ్యవస్థలను కూల్చివేశాయి. సిరియాలో బషార్ అల్ అసాద్ నాయకత్వంలోని నియంతృత్వ వ్యవస్థను కూల్చివేయడానికి జరిగిన తిరుగుబాటు మాత్రం సఫలం కాలేదు. రష్యా, చైనాలు సిరియాలోని నియంతృత్వ వ్యవస్థను బలపరచడం ఇందుకు కారణం. తిరుగుబాటు దారులను అమెరికా, నియంతను రష్యా బలపరచడం ఇప్పటికీ నడుస్తున్న చరిత్ర. ఐఎస్‌ఐఎస్ చొరబాటుతో సిరియాలోని రెండు వర్గాల మధ్య పోరు మూడు వర్గాల మధ్య పోరాటంగా మారింది. ఐఎస్‌ఐఎస్‌ను మట్టుపెట్టిన తరువాత రష్యా అల్ అసాద్ వ్యతిరేక సాయుధులను కూడ నిర్మూలిస్తుందన్నది అమెరికా కూటమి భయం...అమెరికా కూటమి వారు అల్ అసాద్ ప్రభుత్వాన్ని తొలగిస్తారన్నది రష్యా భయం...