మెయన్ ఫీచర్

కలకాలం అధికారం సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా పదవిలో కొనసాగాలని కోరుకున్నా, వారి ఆశలను తప్పుపట్టలేం. ఒకరి పనితనంపై ఇతరులు తీర్పు ఇవ్వాలే తప్ప, ఎవరికి వారు అంచనా వేసుకుంటే దానివల్ల వచ్చేది ఆత్మానందమే. భారత్ వంటి అతిగొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజరికాలు, జమీందారీలు ఏనాడో అంతరించిపోయాయి. ఇప్పుడు ఎవరెంత కాలం పాలించాలన్నది తేల్చాల్సింది ప్రజలే. ‘ఓటుస్వామ్యం’ వచ్చాక ఈ దేశంలో ఎక్కువకాలం పరిపాలించిన ఘనత పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టులదే. ఆ తర్వాత డిఎంకె, టిడిపి, బిజూ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు వరసగా కాకపోయినా, సుదీర్ఘకాలమే ఆయా రాష్ట్రాలను పాలించాయి. జాతీయ స్థాయిలో కొన్ని కూటములు పాలించినా కాంగ్రెస్‌తో పోలిస్తే వాటి పదవీకాలం తక్కువ.
ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాల తీరు, నాయకుల ఆశలు, అంచనాలు మారుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే ఏపిలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ తామే కలకాలం అధికారంలో కొనసాగాలన్న అభిలాషను ఎక్కడా దాచుకోకుండా వెల్లడిస్తున్నారు. ఏపిలో విపక్ష నేత జగన్ అప్పుడే తాను సిఎం అయినట్లు కలలుకంటున్నారు. మరో ఏడాది, కాకుంటే రెండేళ్లు ఓపిక పడితే మన ప్రభుత్వమే వస్తుందని వైకాపా నేత భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వాదనలకు నేతలు చెప్పే సూత్రీకరణ రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాలు! తాము ఉంటే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదనేది వారి వాదన. అందుకే రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇద్దరు పాలకులూ పక్కచూపులతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ, తమ కలలు సాకారం చేసుకునే పనిలో ఉన్నారు.
మంచిదే. ఎవరి కలలు వారివి, ఎవరి ఆశలు వారివి. తామే శాశ్వతంగా అధికారంలో ఉండటం ఈ ప్రజాసామ్య దేశంలో సాధ్యమా? అందుకు ఆయా రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులు అనుకూలిస్తాయా? ప్రజలందరూ ఇప్పుడున్న పాలకులనే ఎల్లకాలం సమర్థిస్తారా? మార్పు కోరుకుంటారా? అన్నది ప్రశ్న. తెలుగురాష్ట్రాల్లో సామాజిక, రాజకీయ పరిస్థితులు భిన్నం. తెలంగాణలో ప్రతిపక్షానికి బలం లేకున్నా, బలమైన విపక్ష నేతలున్నారు.
ఏపిలో బలమైన ప్రతిపక్షనేతతోపాటు, ప్రాంతాల వారీగా ప్రభావం చూపగలిగే నేతలున్నారు. ఏపిలో కోస్తాతోపాటు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకునే కమ్మవర్గం ప్రభావం ఎక్కువ. రాయలసీమతోపాటు, నెల్లూరు జిల్లాలో వైసీపీని మానసికంగా సొంతం చేసుకున్న రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువ. ఇక్కడ జనాభా పరంగా బలిజల సంఖ్య అధికం. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు, ఉత్తరాంధ్రలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. కాపునేత ముద్రగడ ఇప్పటికే వైసీపీ సౌజన్యంతో ఉద్యమాలు మొదలుపెట్టా రు. ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలో కొనసాగాలంటే ఈ వర్గాలన్నీ ఆయనకు మూకుమ్మడిగా జైకొట్టాలి. కోస్తాలో సొంత సామాజికవర్గం దూకుడు, హవా, సంపాదన, అన్నింటా దక్కుతున్న కాంట్రాక్టులు, పదవులు చూసి మిగిలిన వర్గాల్లో వ్యతిరేకత రాజుకుంది. నయా మీడియా రాజకులగురువు కూడా దీనిపై చాలాసార్లు వాపోయారు కూడా.
ఈ పరిణామాలతో బాబుకు సంబంధం, ప్రమేయం లేకపోవచ్చు. గతేడాది ఎప్పుడో కమ్మ సంఘం ఆధ్వర్యాన జరిగిన విద్యార్థుల సదస్సులో ఆ వర్గ నేతలు తమ కులం గురించి చెప్పిన గొప్పలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఏపిలోని ప్రతి ఒక్కరి ఫోన్‌లోనూ దర్శనమిస్తున్నాయి. వివిధ శాఖల్లో నియామకాలకు సంబంధించి ఇలాంటివే మరికొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిని గుర్తుచేస్తూ, మిగిలిన వర్గాలను ఏకం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉంటారు. మిగిలిన వర్గాల్లో వ్యతిరేకత, అసూయకు కారణం ఇదే.
రాజకీయాల్లో కులాలు, మతాల ఆందోళనలు, వారిని ప్రోత్సహించడం సరైనది కాదన్న ధోరణి బాబులో కూడా పెరిగినట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక స్థాయికి చేరిన నేతలో ఈ ధోరణి కనిపించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, ఏపిలో మనిషి మనుగడ, రోజువారీ జీవనం కులంతోనే విడదీయలేనంతగా ముడిపడి ఉన్న వాస్తవాన్ని విస్మరించలేం. కులాల వారీగా పార్టీ టిక్కెట్లు, పదవులు ఇస్తున్న ఈ రోజుల్లో అవి లేకుండా రాజకీయాలు చేయటం అసాధ్యమే. కాబట్టి బాబు ఆలోచనలు ఆచరణ సాధ్యం కావనిపిస్తుంది. ఎన్ని లెక్కలు, కసరత్తులు చేసినా గత ఎన్నికల్లో అధికార,ప్రతిపక్ష పార్టీకి ఓట్లలో తేడా కేవలం ఒకటంటే ఒకే శాతం మాత్రమేనని విస్మరించకూడదు.
ఇక, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు చెందిన వెలమ కులస్థుల సంఖ్య అత్యల్పం. సంఖ్యాపరంగా ఆధిక్యతలో ఉన్న రెడ్లకు హవా ఎప్పుడైనా ఎక్కువే. ఆ సూత్రాన్ని గ్రహించిన కేసీఆర్ పార్టీ-ప్రభుత్వంలో వారికే పెద్దపెట వేసి, ‘రెండో ఆలోచన’ లేకుండా చేశారు. ఈ రెండు వర్గాలకంటే బీసీల సంఖ్య అత్యధికం. కేసీఆర్ ఉద్యమదన్నుతో కులం బలం లేకుండానే అధికారంలోకి రాగలిగారు. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో కులపిచ్చి తక్కువ. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంతోపాటు, కులాల వారీగా వరాలిస్తూ వెళుతున్నారు. బంగారు తెలంగాణ, రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాల కోసం మళ్లీ తాను అధికారంలోకి రావడం అవసరమంటున్నారు. అ యితే ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు బలం ఉన్నా పోరాటపటిమ ఉన్న నేతలు తక్కువ. ఇద్దరు ‘చంద్రుల’ మనస్తత్వాల మధ్య పోలికలున్నాయి. ఇద్దరూ తాము చెప్పింది తప్ప, ఎదుటివారి మాట వినరు. పార్టీని సొంతంగా భావిస్తారు తప్ప, శ్రేణులను తమదని భావించే అవకాశం ఇవ్వరు. ఈ విషయంలో సిఎం అవుతానంటున్న జగనన్నయ్య కూడా డిటో. బాబు,కేసీఆర్ సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నందున, తమ పార్టీ భవితవ్యానికి సంబంధించి ఏమి నిర్ణయం తీసుకోవాలో తమకు తప్ప ఎదుటివారికి తెలియదని భావిస్తుంటారు. అసలు చిక్కు అక్కడే ఉంది. ఎదుటివారు చెప్పేది నిలబడి కాకుండా కూర్చుని పూర్తిగా విని, అందులో వాస్తవాలు గ్రహిస్తే మంచి ఫలితాలే వస్తాయి. ఇద్దరికీ ఎవరి సొంత యంత్రాంగం వారికున్నందున ఎదుటివారికి చెప్పే అవకాశం ఇవ్వరు. తమ వల్లనే పార్టీ మనుగడ సాగిస్తుందని, ప్రజలు తమను చూసే ఓట్లేస్తారు తప్ప, అభ్యర్థులను చూసి కాదన్నది వారి ప్రగాఢ నమ్మకం. ఆ ధీమాతోనే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రావాల్సిన అవసరం ఉందని భావిస్తుంటారు.
తమిళనాడులో దివంగత జయలలితకు, డిఎంకె అధినేత కరుణానిధికి అపారమైన ప్రజాభిమానం ఉంది. అయినా వారిద్దరూ వరసగా ఎన్నిక కాలేకపోయారు. ఏపిలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఎన్టీఆర్ వంటి మహానేత కూడా వరసగా ఎన్నిక కాలేకపోయారు. ‘ఉక్కు మహిళ’ ఇందిరాగాంధీ పరిస్థితి కూడా అంతే. శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న, అధికారంలోకి వచ్చి 20 ఏళ్లు ఉంటామని భావించే నేతల ఆశలు తీర్చాల్సింది ప్రజలే.
* * *
విపక్షంలో ఉన్నప్పుడు నెగటివ్‌గా, అధికారంలోకి వస్తే పాజిటివ్‌గా వ్యవహరించే నైజం వింతగానే ఉంటుంది. ఈ క్రమంలో వారికి మీడియా ఆటవస్తువవుతుంటుంది. బాబు విపక్షంలో ఉన్నప్పుడు అధికారపార్టీపై దుమ్మెత్తిపోశారు. మీడియాలో కూడా మార్పు రావాలని, విపక్షాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు పాజిటివ్ థింక్‌ంగ్‌తో మీడియా ఆలోచించాలని హితబోధ చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా మీడియా పక్షపాతం అంటూ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనా పాజిటివ్ కోణంలో ఆలోచించాలని సెలవిస్తున్నారు. గతంలో ప్రతిపక్షానికి మద్దతునిచ్చిన ‘ఆ రెండు పత్రికల’ను అణచివేసేందుకు ప్రయత్నించిన వైఎస్‌కు రాజకీయ వారసుడైన జగనన్న కూడా మీడియా తమకు సహకరించడం లేదంటూ వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో మీడియా కూడా అందుకుతగ్గట్లే కనిపిస్తోంది. ఏపిలో సర్కారుపై ఒంటికాలితో లేచి ధ్వజమెత్తుతున్న మీడియా, తెలంగాణలో మాత్రం వౌనవ్రతం పాటిస్తోంది. ఏపిలో జరుగుతున్న అరాచకాలపై తెలంగాణ గడ్డ నుంచి స్పందిస్తున్న కలం వీరులు, అక్కడి స్థితిగతులపై రాసే సాహసం చేయకపోవటం మరో వైచిత్రి. రెండు చోట్లా ఎవరి భజన సంఘాలు వారి స్వామిభక్తి ప్రదర్శిస్తున్నాయి. ఏపిలో తాజాగా కళ్లు తెరచిన ఓ జర్నలిస్టు సంఘం నేతలు కులసేవలో భాగంగా పాత్రికేయలోకం సిగ్గుపడే స్థాయిలో ప్రభుత్వానికి బహిరంగ భజన పరుల్లా మారుతున్న వైనం కనిపిస్తూనే ఉంది. మంత్రులు, ప్రముఖులకు భోజనం ప్లేట్లు కూడా అందించే స్థాయికి జర్నలిస్టు నేతలు దిగజారడం బాధాకరం. ‘ఎవరేమనకున్నా నాకేటి సిగ్గన్నట్లు’ నిర్లజ్జగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. తెలంగాణలో కులం కోణంలో కాకపోయినా ఓ అనుకూల సంఘం దాదాపు ఇలాంటి స్వామిసేవనే కొనసాగిస్తోంది. *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144