మెయన్ ఫీచర్

స్వతంత్ర టిబెట్‌ను ‘చంపిన’ ఫలితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఎవరు వెళ్లవచ్చు? ఎవరు వెళ్లరాదు? అన్న నిర్ధారణలకు చైనా ప్ర భుత్వం పూనుకుంటుండడం మన అంతర్గత వ్యవహారాలలో అ క్రమ ప్రమేయానికి నిదర్శనం! ఇలా నిర్దేశిస్తుండడం దశాబ్దుల చైనా దౌత్య దౌర్జన్యానికి ప్రత్యక్ష ప్రమాణం! త్రివిష్టప- టిబెట్- దేశపు పరిపాలకుడు, టిబెట్ ప్రజల ధార్మిక గురువు దలైలామా అరుణాచల్‌లో పర్యటించడం పట్ల ప్రస్తుతం చైనా అభ్యంతరం చెబుతోంది! మన దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలను సందర్శించినట్టుగానే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడ దలైలామా పర్యటించవచ్చునని మన ప్రభుత్వం స్పష్టం చేసింది. అరుణాచల్ గురించి మాట్లాడే అధికారం చైనాకు కాని మరో దేశానికి లేదు. ‘నోరు మూసుకోండి, అరుణాచల్ గురించి వాగినట్టయితే మేము ఊరుకోము, మీతో వాణిజ్య సంబంధాలను, దౌత్య బంధాలను తెగతెంపులు చేసుకుంటాము..’ అని చైనా నియంతలకు మన ప్రభుత్వం దశాబ్దుల క్రితమే చెప్పి ఉండాలి! కానీ, అలా చెప్పకపోవడం వల్ల చైనా నానాటికీ పేట్రేగిపోతోంది! బీజింగ్ నగరాన్ని కాని, షాంఘయి నగరాన్ని కాని ఫలానావారు దర్శించరాదని మన ప్రభుత్వం కోరడం లేదు! కానీ ‘అరుణాచల్’ను మన ప్రధానమంత్రి దర్శించరాదని, రాష్టప్రతి అక్కడ పర్యటించరాదని, ఆ ప్రాంతంలో మన ప్రభుత్వాలు ప్రగతి సంక్షేమ పథకాలు అమలు జరుపరాదని, ఈ పథకాలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం చేయరాదని చైనా ప్రభుత్వ నిర్వాహకులు దశాబ్దుల తరబడి కోరుతున్నారు! ఇప్పుడు దలైలామా అరుణాచల్‌కు వెళ్లరాదని చైనా నియంతలు నిర్దేశిస్తున్నారు. ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ రీతిలో ‘చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ షాంఘయి నగరాన్ని సందర్శించరాదు’ అని మన ప్రభుత్వం నిర్దేశించాలి! ఈ ఝీజింగ్ పింగ్ గతంలో ఆఫ్రికా దేశాల నుంచి తన విమానంలోనే ఏనుగు దంతాలను దొంగ రవాణా చేయించిన ఘనుడట! అరుణాచల్‌లోకి మన ప్రధాని, మన రాష్టప్రతి వెళ్లరాదన్న చైనావారి దురహంకారం తర్కబద్ధం అయినప్పుడు, ‘షాంఘయి’కి చైనా అధ్యక్షుడు వెళ్లరాదని మనం కోరడం కూడ తర్కబద్ధమే కాగలదు! అరుణాచల్ అనాదిగా మన దేశంలోని భౌగోళిక విభాగం! మనం ఏ ఇతర దేశాలనూ దురాక్రమించుకోలేదు! చైనా శతాబ్దుల తరబడి మంచూరియా, మంగోలియా, టిబెట్, సింకియాంగ్ దేశాలను ఆక్రమించుకొంది! రెండువేల ఐదువందల ఏళ్లకు పైగా ‘త్రివిష్టపం’ - టిబెట్- స్వతంత్ర దేశం! అంతకు పూర్వం టిబెట్ మన దేశంలో భాగం.
నవ్వుతూ నవ్వుతూ టిబెట్‌ను ఆక్రమించిన చైనా కదనానికి కాలుదువ్వుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను కూడ ఆక్రమించుకోవాలన్నది చైనా లక్ష్యం. ఈ లక్ష్యం క్రీస్తుశకం 1959లో టిబెట్ దేశాన్ని పూర్తిగా దురాక్రమించిన వెంటనే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వపు విస్తరణ విషహృదయంలో అంకురించింది! టిబెట్‌ను చైనా దురాక్రమిస్తుండిన సమయంలో క్రీస్తుశకం 1949వ- 1959వ సంవత్సరాల మధ్య అప్పటి మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ ‘దురాక్రమణ’ను ప్రోత్సహించాడు, సమర్ధించాడు, సహకరించాడు,ప్రశంసించాడు! 1949లో చైనాలో కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ ఏర్పడింది. ఆ సమయంలో చైనా నియంతలు- ‘జవహర్‌లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదుల తొత్తు, అతడు వారి వీపుపై ఎక్కి ఉన్నాడు..’ అని అభివర్ణించారు! మనస్తాపం చెందిన మన జవహర్‌లాల్ ‘తాను సామ్రాజ్యవాదుల తొత్తును కాదని, తాను వారి వీపుపై ఎక్కి ఉండలేదని’ చైనా పాలకులను ఒప్పించడానికి 1962 అక్టోబర్ వరకు కృషిచేశాడు! ఈ కృషిలో భాగంగానే మన దేశం తరఫున బ్రిటన్ ప్రభుత్వం వారు 1914నుంచి స్వతంత్ర టిబెట్‌లో నెలకొల్పి ఉండిన సైనిక దళాలను నెహ్రూ ప్రభుత్వం ఉపసంహరించింది! చైనా దురాక్రమణ ప్రమాదం నుండి టిబెట్‌కు రక్షణ కల్పించడానికి వీలుగా మన దేశాన్ని అప్పుడు దురాక్రమించి ఉండిన బ్రిటన్ ఈ సైనిక దళాలను టిబెట్‌లో నెలకొల్పింది! మన దేశానికీ, చైనాకు మధ్య సువిశాలమైన స్వతంత్ర టిబెట్ దేశం నెలకొని ఉన్నందున రెండువేల ఐదువందల ఏళ్లకు పైగా మనకు చైనాతో సరిహద్దు లేదు. చైనాకు, మన దేశానికి మధ్య యుద్ధాలు జరగలేదు! ‘సింకియాంగ్’ స్వతంత్రంగా ఉండిన సమయంలో ఈ ప్రాంతంలోని ‘హూణు’లు మన దేశంపై దాడులు జరిపారు. ఈ ‘సింకియాంగ్’ (తూర్పు తుర్కీస్థాన్)ను చైనా క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దిలో ఆక్రమించుకొంది! అందువల్ల టిబెట్ స్వతంత్ర దేశంగానే ఉండాలని దానివల్ల భారత్‌కు చైనా దురాక్రమణ బెడద ఉండదని బ్రిటన్ ప్రభుత్వం భావించింది! అందువల్లనే టిబెట్ ప్రభుత్వం కోరిక మేరకు భారత సైనికులను టిబెట్‌లో నెలకొల్పింది! ఇలా మన సైనికులను టిబెట్‌లో నెలకొల్పే పద్ధతి ‘వలస వాదుల’ అంటే బ్రిటన్ ప్రభుత్వంవారి సంప్రదాయమని నెహ్రూ అభివర్ణించాడు, మన దేశపు భద్రతనుకోరే వారందరినీ విస్మయచకితులను చేశాడు! ‘టిబెట్ స్వతంత్ర దేశం కావచ్చు లేదా చైనాలో భాగం కావచ్చు! కానీ టిబెట్‌లో సైనికులను నెలకొలిపే హక్కు మనకెక్కడుంది?’ అని నెహ్రూ చేసిన చారిత్రక ప్రకటన టిబెట్ స్వాతంత్య్రానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది..
మన సైనికులు టిబెట్ రాజధాని ‘లాసా’ పట్టణం నుంచి నిష్క్రమించడంతో టిబెట్‌ను దురాక్రమించే చైనా కార్యక్రమం నిర్నిరోధంగా 1959లో విజయవంతమైంది! చైనాకు పట్టుబడి హత్యకో, యావజ్జీవ కారాగృహవాసానికో గురికాకుండా తప్పించుకున్న టిబెట్ అధినేత దలైలామా మన దేశానికి వచ్చేశాడు. వేలాది మంది ఆయన అనుచరులు కూడ మన దేశంలో ఆశ్రయం పొందారు! హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామా టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు! మన దేశంలోను, విదేశాలలోను ఉన్న లక్షలాది టిబెట్ ప్రజలు మాతృదేశాన్ని చైనా కబంధ బంధం నుంచి విడిపించడానికి ఉద్యమిస్తూనే ఉన్నారు! అందువల్లనే చైనా ప్రభుత్వం టిబెట్‌లోని త్రివిష్టప జాతీయులపై దమనకాండ సాగిస్తోంది! టిబెట్‌లోని సహజ సంపదను విచ్చలవిడిగా కొల్లగొడుతున్న చైనా ప్రభుత్వం టిబెట్‌ను చైనా జాతీయులతో నింపుతోంది! ఫలితంగా టిబెట్ రాజధాని ‘లాసా’లో టిబెట్ స్థానికుల కన్నా ‘హాణ’ చైనీయుల సంఖ్య ఎక్కువైపోయింది. టిబెట్ అంతటా చైనా జాతివారు నిండిపోతున్నారు. దలైలామా మాత్రం పదేళ్లక్రితమే ‘స్వతంత్ర టిబెట్’ పునరుద్ధరణకు స్వస్తిచెప్పడం టిబెట్ ప్రజలను విస్మయచకితులను చేసింది! ఇలా పరోక్షంగా తమకు అనుకూలంగా మారిన దలైలామా నుంచి తమకు ఎలాంటి ప్రమాదం లేదని చైనా నియంతలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు! అయినప్పటికీ దలైలామాను చైనా ప్రభుత్వం ద్వేషించడం మన దేశానికి వ్యతిరేకంగా అమలుజరుపుతున్న దురాక్రమణ వ్యూహంలో భాగం..
టిబెట్‌ను చైనా దురాక్రమించకుండా మనం 1949 తరువాత నిరోధించి ఉన్నట్టయితే చైనా ‘విస్తరణ’ విష వీక్షణాలు అరుణాచల్ ప్రాంతంలోకి చొరబడడానికి వీలుండేది కాదు, చైనా సరిహద్దులు స్వతంత్ర టిబెట్‌కు ఉత్తరంగా నెలకొని ఉండేవి! ‘టిబెట్ మనలను నమ్ముకొని ఉంది, టిబెట్ స్వాతంత్య్రాన్ని రక్షించడం మన బాధ్యత..’ అని ఉప ప్రధానమంత్రి, జాతీయ మహాపురుషుడు సర్దార్ వల్లభభాయి పటేల్ 1950వ సంవత్సరం ఆరంభంలో వ్రాసిన రెండు ఉత్తరాలలో నెహ్రూకు విజ్ఞప్తిచేశాడు. కానీ ‘నకిలీ అంతర్జాతీయత’ నెత్తికెక్కిన నెహ్రూ ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది..’ - ‘టిబెట్స్ ఇండిపెండెన్స్ ఈజ్ డెడ్’- అన్న క్రూరమైన సమాధానమిచ్చాడు! నిజానికి టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోలేదు, రెండువేల ఐదువందల ఏళ్లకు పైగా టిబెట్ చైనాతో యుద్ధం చేసింది, దురాక్రమించినప్పుడల్లా చైనాను టిబెట్ తిప్పికొట్టింది! స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకొంది! అందువల్ల టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోలేదు. ఆ స్వాతంత్య్రాన్ని నెహ్రూ చంపేశాడు! క్రీస్తుశకం 1903లో యంగ్ హస్‌బెండ్ అనే బ్రిటన్ ప్రతినిధి కొంత సైన్యంతో టిబెట్ రాజధాని ‘లాసా’కు వెళ్లాడు. అప్పుడు మాత్రమే బ్రిటన్‌కు వ్యతిరేకంగా అప్పటి దలైలామా- టిబెట్ పాలకుడు- చైనా సహాయాన్ని అర్థించాడు! అప్పటి నుంచి 1914వరకు చైనా దురాక్రమించినప్పుడు ‘బ్రిటన్ పాలిత భారత్’ సహాయాన్ని, బ్రిటన్ దాడి చేసినప్పుడు చైనా సహాయాన్ని కోరడం దలైలామాలకు పరిపాటి అయింది. చివరికి 1914 నాటి ‘సిమ్లా ఒప్పందం’ ద్వారా చైనా ప్రభుత్వం, బ్రిటన్ పాలిత భారతీయ ప్రభుత్వం ‘టిబెట్’ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి! భూటాన్ తూర్పు సరిహద్దు నుంచి బర్మావరకు భారత, టిబెట్ దేశాలమధ్య సరిహద్దు రేఖను కూడ ‘సిమ్లా’లో జరిగిన సమావేశంలో స్పష్టంగా గుర్తించారు! బ్రిటన్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ‘మెక్ మాహన్’ అనే యూది పేరుతో ‘్భరత- టిబెట్’ల మధ్యగల ఈ తూర్పు ప్రాంత సరిహద్దుకు ‘మెక్‌మాహన్ రేఖ’ అని పేరుపెట్టారు. ‘మెక్‌మాహన్ రేఖ’కు దక్షిణంగా మన అస్సాం, అరుణాచల్ ప్రాంతాలు, ఉత్తరంగా స్వతంత్ర టిబెట్ దేశం నెలకొని ఉన్న వాస్తవాన్ని 1914లో చైనా గుర్తించింది! టిబెట్ స్వతంత్ర దేశంగానే ఉండినట్టయితే ‘మెక్ మాహన్ రేఖ’ గురించి చైనా పేచీ పెట్టడం అసంభవం! టిబెట్‌ను చైనా రాజేయడంతో ‘్భరత్ టిబెట్’ సరిహద్దు ‘్భరత్ చైనా’ సరిహద్దుగా మారింది. అప్పటినుంచి- 1959 నుంచి చైనా ‘మెక్ మాహన్’ రేఖకు దక్షిణంగా ఉన్న మన ‘అరుణాచల్’కూడ తనదేనని వితండ వాదం చేస్తోంది..
ద్వాపర యుగం మరో ముప్పయి ఆరేళ్లకు పరిసమాప్తి అవుతున్న సమయంలో కురుపాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగింది.. క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిది ఏళ్లనాటి మహా ఘటన అది. ఆ యుద్ధంలో యదు వీరుడు బలరాముడు పాల్గొనలేదు. ఆయన తమ్ముడు యదుకుల కృష్ణుడు మాత్రం పాండవుల పక్షం వహించి ‘పార్థసారథి’ అయ్యాడు! యుద్ధంలో పాల్గొనని మరికొందరిలో ‘రూపతి’ అనే వీరుడున్నాడు. ‘రూపతి’ యుద్ధవిముఖుడై ఉత్తరంగా వెళ్లాడు. కైలాసగిరి సమీపంలోని మానస సరోవరం ప్రాంతంలో తపస్సు చేశాడు. క్రమంగా టిబెట్ ప్రాంతపు వనవాసీలందరూ ‘రూపతి’ని తమ రాజుగా చేసుకున్నారు. కలియుగంలో ‘రూపతి’ తొలి ‘త్రివిష్టప’ పరిపాలకుడు! రెండువేల ఐదువందల ఏళ్లపాటు అఖండ భారత్‌లో భాగమైన ‘టిబెట్’ ఆ తరువాత స్వతంత్ర దేశమైంది..
*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352