సబ్ ఫీచర్

జాతీయవాద నినాదం.. జాతిజనులకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ఇటు యావత్ భారతదేశ ప్రజలకు, అటు పాలకపక్షాలకు ఓ గుణపాఠం కావాలి. కొత్తగా నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తుండవచ్చు. అయితే, పంజాబ్‌లో ఆ పార్టీ, దాని మిత్రపక్షం అయిన అకాలీదళ్ నేతృత్వంలో పదేళ్లుగా వున్న ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని బిజెపి వారు గమనించాలి. గోవాలో పదేళ్లకు పైగా అధికారంలో ఉంటూ తాజా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేక వేరే పార్టీల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయాన్ని ‘కమలనాథులు’ గుర్తుంచుకోవాలి. మణిపూర్‌లో రెండో స్థానం పొంది, ‘కుప్పిగంతుల’ ద్వారా వచ్చిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు భాజపా వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపికి అంచనాలకు మించి మెజారిటీ సీట్లు వచ్చి ఉండవచ్చు! యుపిలో అధికార సమాజ్‌వాదీ పార్టీ వైఫల్యం, ములాయం కుటుంబంలో కలహాలు, మాయావతి కుల రాజకీయం, ఇతర కారణాలతో బిజెపికి బ్రహ్మరథం పట్టారు. ఇక, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీమీద అసంతృప్తి, ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఓటర్లు ప్రత్యామ్నాయంగా బిజెపికి అవకాశం కల్పించారు. మణిపూర్‌లో కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు గెలిచి 15 సంవత్సరాలు అధికారాన్ని చేపట్టింది. తాజా ఎన్నికల్లో మొదటి స్థానంలోకి వచ్చినప్పటికీ అధికారం చేపట్టేందుకు మెజారిటీ లభించక చతికిల పడింది. మొత్తమీద అయిదు రాష్ట్రాల ప్రజలు పాలకపక్షాలపై వ్యతిరేకతతో తీర్పు చెప్పారన్నది స్పష్టం.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రజలు కులాలను, మతాలను కాదని కొంతమేరకు జాతీయవాదంతో ఆలోచించినందుకు అభినందించాలి. ఉత్తరాదిలోని బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ అంటే కులాలకు, మాఫియాకు, రౌడీలకు నిలయం అనే పేరుండేది. ఈసారి సామాన్య ప్రజలు మాఫియా బెదిరింపులకు భయపడక, ఇతరత్రా ప్రలోభాలకు లొంగక అసలైన ప్రజాస్వామ్య పౌరులుగా వ్యవహరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముస్లింల జనాభా ప్రముఖంగా ఉన్నప్పటికీ ఆ వర్గానికి బిజెపి ఒక్క సీటును కూడా కేటాయించలేదు. దీంతో ముస్లిం పెద్దలు స్థానిక పరిస్థితులను బట్టి ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆదేశాలు ఇచ్చారు. యుపిలో అత్యధికంగా 99 మంది ముస్లింలకు మాయావతి టికెట్లు ఇచ్చారు. ముస్లింలతో పాటు దళితుల ఓట్లు గంపగుత్తగా పడి తనకే అధికార పీఠం ఖాయమని మాయావతి ఆశించారు. యాదవుల ఓట్లు , ఇతర బిసి కులస్థుల ఓట్లు, కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు తమకు పడతాయని సమాజ్‌వాదీ పార్టీ భావించింది. యువ ఓటర్లు కూడా తనకే మళ్లీ అధికారం అప్పగిస్తారని అఖిలేష్ యాదవ్ గంపెడాశతో ఎదురుచూశారు. ఏడాదిన్నర కిందట బిహార్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా తన ఫార్ములా సక్సెస్ అయిందని, ఆ తరహాలోనే యుపిలో 60, 70 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని రాహుల్ గాంధీ ఊహల్లో తేలిపోయారు. వీరందరి ఆశలు అడియాసలు చేస్తూ ప్రజలు నిశ్శబ్ద విప్లవంలాగా చారిత్రాత్మక తీర్పునిచ్చారు.
జనంలో మోదీ పట్ల ఆకర్షణ తగ్గలేదని యుపి ఎన్నికలు రుజువు చేశాయి. అందుకే ఇది బిజెపి విజయం కాదు, మోదీ గెలుపు అని అభివర్ణించవచ్చు. మోదీపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, వారసత్వ రాజకీయాలకు అవకాశం లేకపోవడం వంటివి బిజెపికి బాగా కలసివచ్చాయి. దేశ సరిహద్దుల్లో సర్జికల్ దాడులు, భద్రతకు ప్రాధాన్యం, ఉగ్రవాదులపై సమరం, పెద్దనోట్ల రద్దుద్వారా నల్లకుబేరులను కట్టడి చేయడం వంటి చర్యలతో మోదీ సామాన్యుల హృదయాలను గెలవగలిగారు. ‘ట్రిపుల్ తలాక్’ వ్యవస్థను దేశంలో రద్దు చేయాలనడం ద్వారా 80 శాతం ముస్లిం మహిళల అభిమానాన్ని ఆయన సంపాదించారు. ఆయనను ‘మరో రాజారామ్మోహన్‌రాయ్’ అని విశ్వసించి బిజెపికి ముస్లిం మహిళలు భారీగా ఓట్లువేశారు. అయితే- ఈ విజయం పట్ల మోదీ పొంగిపోకుండా ఇపుడు మరింత బాధ్యతగా వ్యవహరించవలసి ఉంది.
బ్యాంకుల జాతీరుూకరణ, భూసంస్కరణల చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ‘అమ్మ’, ‘పేదల తల్లి’ అని జనం కొనియాడారు. 1970 దశకం ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో ఆమెకు దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత 1975లో ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల ద్వారా, అనుసరించిన నియంతృత్వ విధానాల ద్వారా 1977లోజరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ పార్టీ గల్లంతు అయింది. ఇలాంటి అనుభవాలను, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని భాజపా నేతలు సుపరిపాలన అందించేలా కృషి చేయాలి. పార్టీ యంత్రాంగంలో, ప్రభుత్వ అధికారుల్లో అవినీతి నిర్మూలనకు దృష్టి సారించాలి. అఖిలేష్, రాహుల్, మాయావతి వంటివాళ్లు కులాలపైన, కుటుంబ చరిత్రలపైన ఆధారపడకుండా ప్రజల ఆలోచనా విధానానికి అనుగుణంగా నడుచుకోవలసి వుంది. ఒకప్పుడు బిజెపి నినదించిన ‘ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం’ విధానాన్ని అమలు చేయడానికి మోదీకి ఇప్పుడు చక్కటి అవకాశం లభించింది. ఈ నినాదాన్ని నిజం చేయాలంటే ముందుగా జమ్మూ కశ్మీర్ కోసం తీసుకొచ్చిన 370 ఆర్టికల్‌ను రద్దుచేయాలి. ఉత్తరప్రదేశ్ ప్రజలు వినిపించిన ‘జాతీయవాద’ నినాదం దేశవ్యాప్తంగా మార్మోగాలి.

- తిప్పినేని రామదాసప్పనాయుడు