సబ్ ఫీచర్

కఠిన నిర్ణయాలకు తరుణమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి, ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని యావత్ జాతి ఆశించింది. సామాజిక అసమానతలు, శాంతి భద్రతలు, పేదరిక నిర్మూలన, ఉపాధి వంటి రంగాల్లో పెను మార్పులు చోటుచేసుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను సంస్కరించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా ఆమోదించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇంకా అనేక సమస్యలు, సవాళ్లు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇప్పటికైనా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని పాలనావ్యవస్థను, తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని జాతిజనులు ఆశిస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా అధిక జనాభా, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, కాశ్మీర్ సమస్య వంటివి ఇంకా పట్టిపీడిస్తున్నాయి. అన్ని సమస్యలకూ మూలం అధిక జనాభా అని తెలిసినా పాలకులు ఈ విషయమై చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదు. 1947లో 30 కోట్లు ఉన్న దేశ జనాభా ఇపుడు 130 కోట్లకు చేరింది. సహజ వనరులు పరిమితం కావడంతో అందరికీ అభివృద్ధి ఫలాలు అందడం లేదు. జనాభాకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు. ఓ వైపు జనాభా పెరుగుతుండగా, మరోవైపు వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గుతోంది. అధిక జనాభాను నివారించాలంటే అన్ని మతాల వారూ కుటుంబ నియంత్రణ పాటించేలా కఠిన చట్టాలను అమలులోకి తేవాలి.
కంప్యూటరీకరణ, యాంత్రీకరణ పెరగడంతో ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కారణంగా రైతు కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. పట్టణాలు, నగరాలు విపరీతంగా విస్తరిస్తున్నందున అక్కడి వారికి కనీస సౌకర్యాలను కల్పించడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతోంది. అందరికీ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి లభించడం లేదు. దీంతో నిరుద్యోగ యువకులు నిరాశకు లోనవుతూ తప్పుదారి పడుతున్నారు. ఉపాధి లేకపోవడంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. కార్పొరేటు సంస్కృతి ప్రభావంతో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జీతభత్యాలను తగ్గించుకునేందుకు ప్రభుత్వ శాఖల్లోనూ ‘ఔట్ సోర్సింగ్’ పద్ధతిలో తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నారు. దేశ విభజన కాలం నుంచి రగులుతున్న కాశ్మీర్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించడం లేదు. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, ఉగ్రవాదం, విధ్వంసక చర్యలు దేశ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాశ్మీర్‌ను కబళించాలని యత్నిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తరచూ రక్తపాతాన్ని సృష్టిస్తోంది. సరిహద్దులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి భారీగా నిధులను కేటాయించాల్సి వస్తోంది. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా మోదీ కృషి చేయాల్సి ఉంది. ఇంటాబయటా నెలకొన్న సమస్యలకు మోక్షం కల్పించేందుకు ప్రధాని మోదీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప దేశ ప్రజలకు కొంతైనా ఉపశమనం లభించే అవకాశాలు లేవనే చెప్పాలి.

- తిరుమలశెట్టి సాంబశివరావు