ఉత్తరాయణం

రైతులకు సంకెళ్లు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాము వేసిన పంటలపై పెట్టుబడులు సైతం దక్కడం లేదని లబోదిబోమంటూ అన్నదాతలు నిరసనకు దిగితే, వారి చేతులకు సంకెళ్ళు వేసి నడిపిస్తూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్ళడం సిగ్గుమాలిన పని. పోలీసులలో కొందరు తమ అధికార్లను మెప్పించడానికో లేక తాత్కాలికంగా కలిగిన ఉత్సాహాన్ని ప్రదర్శించడానికో అలా చేయడం తప్పే. ప్రజాస్వామ్యంలో, నాగరిక సమాజంలో ఈ చర్య గర్హనీయమని ప్రభుత్వాలకి తెలియజేయడం, మరెప్పుడూ ఇలా జరగకుండా చూడడం సభ్య సమాజం కర్తవ్యం. ఈ సంఘటనపై కాంగ్రెస్, సిపిఐ నేతలు నేడు గొంతుచించుకుని, ఇది మహాపరాధమని అరుస్తున్నారు. మరి.. 1975-77లమధ్య అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎందరో ఆచార్యవర్యులను, సమాజసేవలో పేరొందినవారిని డిటెన్యూలుగా చేసి, ఆరోగ్య పరిస్థితి బాగోలేక వారు ఆసుపత్రులకి వెళ్లాల్సివస్తే పోలీసులను కాపలా పెట్టి, చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్ళినప్పుడు ఈ నాయకులు ప్రశ్నించలేదే? దొంగలకు వేయవలసిన అరదండాలను అన్నదాతలకు తగిలించే సిగ్గుమాలిన పనిని చేయవద్దని మనవి.
- దుగ్గిరాల విశే్వశ్వరం, విశాఖపట్నం
పార్టీ సభలకే ప్రాధాన్యం
పార్టీ ప్లీనరీ, బహిరంగ సభలపై వున్న శ్రద్ధ రైతుల కష్టాలపై, గిట్టుబాటు ధరలపై తెరాస నాయకులు చూపకపోవడం శోచనీయం. చేతికి వచ్చిన పంటను గిట్టుబాటు ధర లేనందున రైతులు అగ్నికి ఆహుతి చేస్తున్నారు. మిర్చికి కేంద్రం గిట్టుబాటు ధర ప్రకటించినా ఆశాజనకంగా లేదు. కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి మిర్చికి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే, ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రాష్టప్రతిని ముఖ్యఅతిథిగా పిలిచి మొక్కుబడి వ్యవహారంలా ముగించారు. మేధావులు, పూర్వ విద్యార్థులతో వైభవంగా నిర్వహించాల్సిందిపోయి చేతులు దులుపుకున్నారు.
-ఎ. రఘురామారావు గౌడ్, ఖమ్మం
ఏ ఆసుపత్రికెళ్లాలి?
కార్పొరేట్ హాస్పటల్‌కి వెళితే ఏ చిన్న అనారోగ్యానికైనా కష్టపడి సంపాదించిన ధనమంతా వైద్య పరీక్షలకు, చికిత్సలకు ఖర్చయిపోతున్నది. పోనీ ఆరోగ్యం చేకూరిందా? అంటే అనుమానమే. నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లినవాడు స్ట్రెచర్ మీద బయటికొచ్చిన సందర్భాలు అనేకం. ఇక ప్రభుత్వాసుపత్రుల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. గర్భిణులు, వృద్ధులు కార్పొరేట్ హాస్పటల్స్‌కి వెళ్లే సామర్ధ్యం లేక విధిలేక ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తే, ప్రతిదానికీ లంచం ఇస్తేకానీ అక్కడి ఉద్యోగుల్లో చలనం కలగదు. శవాల మీద కూడా వ్యాపారం జరుగుతోంది. అవినీతికి, అలసత్వానికి చిరునామా అయిన ప్రభుత్వ ఆసుపత్రులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
ఓట్లకోసం తాయిలాలు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కుల, మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం బాధాకరం. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాపు కులస్థులకు రిజర్వేషన్లు ఇస్తామని చేసిన హామీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నెరవేర్చకపోవటంతో ఉద్యమం రగులుకుంటోంది. ఇక రెండు ప్రభుత్వాలు మైనారిటీలను ఆకర్షించేందుకు దళిత క్రైస్తవులకు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాయి. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు అనేకసార్లు స్పష్టం చేసినా ప్రభుత్వాలు పోటాపోటీగా వారికి తాయిలాలు ఇస్తున్నాయి. కుల, మత పరమైన రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిలో లేనిపోని ఆశలు రేకెత్తించడమే కాకుండా సమాజాన్ని కులాలు, మతాల వారీగా చీల్చే ప్రయత్నం చేయడం బాధాకరం.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం