సబ్ ఫీచర్

కరిగే మంచుతో.. ‘కల్లోల సాగరం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృవప్రాంతాల వద్ద మంచు ఫలకాలు, మంచు చరియలు కరిగిపోతున్నందున ఇప్పటికిప్పు డు ఉపద్రవమేమీ లేదని చాలామంది భావిస్తు వుండవచ్చు. ధృవప్రాంతాల వద్ద, ఇతర శీతల ప్రాంతాల వద్ద భారీ స్థాయిలో ఉన్న మంచు భూ వాతావరణాన్ని నియంత్రించడంలోను, సమస్త జీవజాలానికి అవసరమైన నీటిని సమకూర్చడంలోను ప్రధాన పాత్ర వహిస్తోంది. ఏళ్ల తరబడి సముద్రం గడ్డకట్టి ఉండే ప్రాంతాన్ని క్రయోస్పియర్ అంటారు. అలాంటి ప్రాం తాలు నివాసయోగ్యం కావు. చాలా తక్కువ శాతం మంది ప్ర జలు మాత్రమే ఈ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. పర్యావరణపరంగా అక్కడ చోటుచేసుకుంటున్న మార్పుల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అలాంటి ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల భవిష్యత్తులో సంభవించే ఉపద్రవాల గురించి సదస్సుల ద్వారా అందరికీ అర్థమయ్యేట్టు చేయడం కష్టవౌతోంది. క్రియోస్పియర్ ప్రాంతం భూ వాతావరణాన్ని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తోందని ‘ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనీషియేటివ్’ (ఐసిసిఐ) వ్యవస్థాపక డైరెక్టర్ పామ్ పియర్సన్ అంటున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ సంస్థ ‘త్రెషోల్డ్ అండ్ క్లోజింగ్ వర్క్స్: రిస్క్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఛేంజ్’ పేరుతో ఒక నివేదిక వెలువరించింది. మూడేళ్ల అధ్యయనం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో ఐదు రకాల ప్రమాద సంకేతాలను పేర్కొన్నారు. అవి- పెద్ద పెద్ద మంచు ఫలకాలు కరగడం వల్ల సముద్ర మట్టం పెరగడం, ధృవప్రాంత సాగర జలాల ఆలీకరణం, మంచు చరియలు కరగడం, శాశ్వత ఘనీభవన స్థితిలో ఉంటాయనుకున్న సముద్ర జలాలు కరుగుతుండడం, వేసవి కాలంలో కూడా ఘనీభవించి ఉండే అంటార్కిటికాలో మంచు కరగడం.
పారిశ్రామికీరణకు ముందు కాలంతో పోలిస్తే ఆర్కిటిక్, అంటార్కిటికా, ఇతర పర్వత ప్రాంతాల్లో నేడు ఉష్ణోగ్రతలు 2 నుండి 3.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో రెండు,మూడు రెట్లు వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత్‌లోని హిమాలయ పర్వతాలు, దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరాన అండీస్ పర్వత శ్రేణులు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి. ఇక్కడ చాలా చోట్ల కొండలపై బాగా మంచు పేరుకుని ఉంటుంది. వాతావరణం కాస్త వేడెక్కినప్పుడు ఇక్కడి మంచు కరగడం వల్ల ఈ పరిసరాల్లో నివసించేవారికి తాగడానికి, ఇతర అవసరాలకు నీరు లభిస్తుంది. భూ ఉపరితల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు అండీస్, హిమాలయాలపైకూడా ప్రభావం చూపుతున్నాయి.
శాస్తవ్రేత్తల అంచనాలకు మించిన వేగంతో భూ ఉపరితల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2007 నాటి ఐపిసిసి అంచనా ప్రకారం మంచు చరియలు కరగడం వల్ల ఈ శతాబ్దాంతానికి సముద్రమట్టం ఒక మీటరు ఎత్తు పెరగనుంది. గ్లోబల్ వార్మింగ్‌ని నిలువరించగలిగినా రాబోయే 200 ఏళ్లలోనైనా సరే సముద్రమట్టం ఒక మీటరు వరకు ఎత్తు పెరగకుండా ఆపడం అసాధ్యమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే పశ్చిమ అంటార్కిటికాలో పెద్ద పెద్ద మంచు ఫలకాలు స్థానభ్రంశం చెంది చాలావరకు కరిగిపోవడం.
‘ధ్రృవ ప్రాంతాల్లో పరిణామాల గురించి తెలిసిన వారిలో చాలామందికి ప్రధానంగా రెండు విషయాల గుంచి అవగాహన లేదు. మొదటిది- పర్యావరణ వినాశనానికి కారణమైన భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిని మించి పెరిగిపోయాయి. ఇప్పటికే మొదలైన వినాశకర పరిణామాలను ఆపడం ఎవరి తరం కాదు’ అని పామ్ పియర్సన్ అంటారు. పర్యావరణంలో వేగంగా సంభవిస్తున్న పరిణామాల వల్ల గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలో మంచు పూర్తిగా అదృశ్యం కానుంది. ఫలితంగా సముద్రమట్టం 4 నుండి 10 మీటర్ల ఎత్తు పెరిగే ప్రమాదం ఉంది.
భూగోళంలోని ఉత్తరార్ధంలో నాలుగవ వంతు భాగంలో నీరు ఘనీభవన స్థితిలో ఉంటుంది. ఇలా శాశ్వతంగా నీరు గడ్డకట్టి వుండే ప్రాంతాన్ని పెర్మాఫ్రాస్ట్ అంటారు. ఇక్కడ శతాబ్దాల తరబడి ఆర్గానిక్ కార్బన్ ఘనీభవన స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఇక్కడి మంచు కరగడం మొదలవుతుందో వెంటనే ఘనీభవన స్థితిలో వున్న కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాయువులు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది తక్కిన ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఫలితంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగుతాయి. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీలు పెరిగినా సరే ఈ పెర్మాఫ్రాస్ట్ ప్రాంతంలో 30 శాతం మంచు కరిగిపోతుంది. ఫలితంగా 50 గిగా టన్నుల కార్బన్ విడుదలవుతుంది. క్రీశ 2000 నుండి వేసవి కాలం వచ్చేసరికి ఉత్తర ధృవ ప్రాంతంలో వుండే ఆర్కిటిక్ వద్ద కూడా మంచు వేగంగా కరుగుతోంది. 1950 నుండి చూసినట్టయితే ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడ సగం సముద్రం మాత్రమే గడ్డకట్టి ఉంటోంది. ఇది గ్లోబల్ వార్మింగ్ ఫలితమే. తెల్లటి మంచు తనపై పడే సూర్యరశ్మి వేడిని తిరిగి వెనక్కి పరావర్తనం చెందిస్తుంది. అదే మంచు నీరుగా కరిగినపుడు ఆ వేడిని లోపలికి పీల్చుకుంటుంది. దానివల్ల సముద్రం అడుగున వున్న జలాలు కూడా వేడెక్కుతాయి. ఫలితంగా సముద్రపు లోతుల్లో మంచు పర్వతాలు కరగడం మొదలవుతుంది. ఇది పైకి వెంటనే కనపడని ప్రమాదం. ఐరోపాలోని ఆల్ఫ్ పర్వతాలలోను, అమెరికాలోని రాకీ పర్వతాలలోను, తూర్పు ఆఫ్రికాలోని అండీస్ పర్వతాలలోను, భారత్‌లోని హిమాలయా పర్వతాలలోను త్వరిత గతిన భారీగా మంచుకనుమరగవడం వాతావరణంలో సంభవిస్తున్న మా ర్పుల ప్రభావానికి ప్రత్యక్ష తార్కాణం. సాధారణంగా ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల భూ ఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. గత 50 ఏళ్లలో మానవ ప్రమేయం వల్ల చోటు చేసుకుంటున్న ప్రకృతి పరిణామాల కారణంగా ఉష్ణోగ్రతలలోని పెరుగుదల సహజ సిద్ధమైన ఉష్ణోగ్రతల పెరుగుదల కంటే ఎంతో అధికంగా ఉంది. ఫలితంగా 1991-2010 మధ్య కాలంలో భూగోళంపై మూడింట రెండు వంతులు మంచు చరియలు కరిగిపోయాయి.
కొండ ప్రాంతాలలో ఉండేవారికి మంచు చరియలే ప్రధాన జలాధారం. మంచు కరిగినపుడు ఏర్పడే నీటిపాయలు పర్వత ప్రాంతాలలోను, దిగువ ప్రాంతాల్లోను తాగునీటిని, సాగునీటిని అందిస్తాయి. మంచు చరియలు కరిగిపోతుండడం వల్ల హిమాలయాల్లోను, అండీస్ పర్వత ఫ్రాంతాల్లోను తరతరాలుగా వస్తున్న సంప్రదాయక వ్యవసాయం దెబ్బతింటోంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వ్యాప్తిని తగ్గించడం ద్వారా భూ ఉపరితల ఉష్ణోగ్రతలలో పెరుగుదలను, పర్వత ప్రాంతాలలోని మంచు కరగడాన్ని కొంత వరకు నియంత్రించవచ్చని శాస్తవ్రేత్తలు అంటున్నారు. ప్రపంచంలో వివిధ దేశాధినేతల దృఢ నిశ్చయం వల్లనే ఇది సాధ్యమవుతుందని వారు అంటున్నారు. ‘రాబోయే రోజుల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరగకుండా మనమంతా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలి. దానివలన కొంతవరకైనా ప్రకృతి ఉపద్రవాలను నివారించవచ్చు. లేకపోతే వివిధ దేశాల్లోని ప్రజల సాంస్కృతిక, ఆర్థిక మనుగడ దెబ్బతింటుంది’ అని పామ్ పియర్సన్ అంటారు.

- దుగ్గిరాల రాజకిశోర్