మెయన్ ఫీచర్

మంటల్లో బడులు.. సాగని చదువులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ ఉదయానే్న ‘అలారం’ పెట్టుకుని మరీ నిద్రలేచి ఎనిమిదేళ్ల రెహానా ఉరుకులు పరుగులతో ముస్తాబవుతుంది స్కూలుకు పోదామని.. అయితే- ఆ రోజు కూడా బడి తలుపులు తెరచుకోలేదని తెలిశాక ఆమెకు నిరాశే.. యూనిఫాం ధరించి బడికి బదులు ఇంట్లో కూర్చోవాల్సి వస్తోందని ఆమె దిగాలు పడుతోంది.. తన ఈడు పిల్లలంతా బాగా చదువుకుని పెద్దయ్యాక డాక్టర్లవుతామని చెబుతుంటారు.. అయితే, అందరికీ భిన్నంగా రెహానా మాత్రం పెద్ద చదువులు చదివాక అమెరికా వెళ్లి అక్కడ ‘నాసా’లో సైంటిస్టుగా పనిచేస్తానని తన ఆలోచనలను ఆవిష్కరిస్తుంది.. అందుకు ఆమె ఓ ప్రణాళికను కూడా అపుడే సిద్ధం చేసుకుంది.. ముందుగా చండీగఢ్ యూనివర్సిటీలో చేరతా, ఆ తర్వాత అమెరికా వెళ్లి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ‘నాసా’లో సైంటిస్టుగా పనిచేస్తానని ఆ చిన్నారి చెబుతుంటుంది.. త్వరలోనే తన బడి తలుపులు తెరుచుకుంటాయని, స్నేహితురాళ్లతో కలిసి పాఠాలు నేర్చుకుంటానని ఆమె ఆకాంక్షిస్తోంది.. అయితే- కాశ్మీర్‌లోని కుల్గాం లోయలో ఉద్రిక్త పరిస్థితులు చక్కబడేదెపుడు? ఆమె బడికి వెళ్లేదెపుడు?
‘నేను సైంటిస్టునవుతా.. బొల్లి వ్యాధిపై పరిశోధనలు చేస్తా.. బడులు మూసేసినా నేను కాశ్మీర్‌ను వదిలిపెట్టేది లేదు.. నా ప్రాంత ప్రజల కోసం పనిచేస్తా.. నాలాంటి పిల్లలంతా స్కూలుకు వెళ్లాలంటే ముందుగా ఇక్కడ ప్రశాంత వాతావారణం కావాలి.. శాంతి భద్రతలు లేకపోవడంతో బడులు మూసేశారు..’ అంటోంది పనె్నండో తరగతి చదువుతున్న రుక్సానా. రెహానా, రుక్సానాలే కాదు.. జమ్మూ కాశ్మీర్‌లో ఇలా వేలాదిమంది విద్యార్థులు బడులకు వెళ్లలేని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ తమ భవిష్యత్ గురించి ఎంతగానో బెంగపడుతున్నారు.
దేశ సరిహద్దుల్లో కాశ్మీర్‌లోని పలు జిల్లాల్లో ముస్లిం తీవ్రవాద సంస్థలు నిత్యం మారణహోమం సృష్టిస్తున్నందున ఏళ్ల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రవాదులకు భయపడుతూ పాఠశాలలను నడపడం పెను సమస్యగా మారిందని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ‘కాశ్మీర్ వివాదం తేలేవరకూ తమకు ఈ దుస్థితి తప్పదని, తీవ్రవాదుల నుంచి ఎప్పుడు ఎలాంటి ముప్పు వాటిల్లుతోందోనని నిత్యం భయపడుతున్నామని కుల్గాంలోని ఎల్‌సిఎస్ విద్యాసంస్థల చైర్మన్ గులామ్ హసన్ ఆవేదన చెందుతున్నారు. తమ పాఠశాలలో చదువుతున్న సుమారు 200 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడడం కష్టంగా ఉంటోందని, ఈ నేపథ్యంలోనే స్కూలును మూసివేసినట్టు ఆయన చెబుతున్నారు.
కాశ్మీర్‌లోని వేర్పాటువాదులు ప్రధానంగా పాఠశాలలను, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే అనంత్‌నాగ్, కుల్గాం ప్రాంతాల్లో 25 పాఠశాలలకు తీవ్రవాదులు నిప్పుపెట్టారు. బడి భవనాలు మంటల్లో తగలబడిపోవడంతో విద్యార్థులకు తరగతులు నిర్వహించే పరిస్థితి లేక సెలవులు ప్రకటించారు. పాఠశాలలు మూతపడడంతో తమ చదువులు సాగడం లేదన్న చిన్నారుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాల వారు మాత్రం తమ పిల్లలను చదివించుకోవాలన్న పట్టుదలతో సురక్షిత ప్రాంతాలకు వలస పోతున్నారు. కానీ పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు బడికి దూరమై తీవ్ర మానసిక వేదనతో కుమిలిపోతున్నారు.
తీవ్రవాదులు బడి భవనాలను దగ్ధం చేస్తుండడంతో- మధ్యలోనే చదువు మానేస్తున్న (డ్రాపౌట్స్) పిల్లల సంఖ్య పెరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరీ ఆందోళనకర స్థాయికి చేరుకుందని విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, విద్యాసంస్థల యాజమాన్యాల గోడును ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. బాగా చదువుకోవాలన్న ఆశ.. మంచి ఉద్యోగం చేయాలన్న తపన.. కుటుంబాన్ని ఆదుకోవడం.. ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నా, ఏమీ చేయలేక విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు వెళ్లడం దేవుడెరుగు.. కనీసం స్కూలు యూనిఫాం వేసుకుని బయట తిరగడం ప్రమాదకరంగా మారింది.. అలా వెళ్లే విద్యార్థులకు తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు తప్పడం లేదు.. ఈ పరిస్థితులన్నీ ‘కత్తుల వంతెన’పై నడుస్తున్నట్లు ఉన్నా- తమ కలలను సాకారం చేసుకుని తీరతామన్న ఆత్మవిశ్వాసం చాలామంది విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఇపుడు తమ జీవితంలో ఓ భాగమైపోయాయని, వాటికి తాము ఎందుకు భయపడాలని, ఈ రాష్ట్రం మాది.. తాము ఎక్కడికీ పోయే ప్రసక్తి లేదని అమ్మాయిలు సైతం ధైర్యంగా చెబుతున్నారు.
పాక్, ఆఫ్ఘన్ తరహాలో..
ముస్లిం దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ తీవ్రవాదులు విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న రీతిలోనే కాశ్మీర్‌లో ఉగ్రవాద ముఠాలు పాఠశాలలపై గత కొనే్నళ్లుగా దృష్టి సారించాయి. కాశ్మీర్‌లో పెడదారి పడుతున్న యువకులకు, ఉగ్రవాద సానుభూతిపరులకు పాకిస్తాన్ నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు వచ్చిన భద్రతాదళాల జవాన్లపై రాళ్లు రువ్వడం, బడి భవనాలకు నిప్పు పెట్టడం వంటి కార్యకలాపాల్లో కొంతమంది యువకులు కూడా పాల్గొంటున్నారు. వీరి విధ్యంసం ధాటికి వందలాది బడి భవనాలు కుప్పకూలిపోతున్నాయి. ఏదో ఒక సందర్భాన్ని సాకుగా తీసుకుని అల్లరిమూకలు రెచ్చిపోతూ పాఠశాలలపై, ప్రభుత్వ కార్యాలయాలపై తమ ప్రతాపం చూపుతున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీని గత ఏడాది జూలై 8న కాశ్మీర్‌లో భద్రతాసిబ్బంది హతమార్చాక నెలల తరబడి యథేచ్ఛగా విధ్వంస కలాపాలు కొనసాగాయి. బుర్హాన్ వనీ హతమయ్యాక ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఉగ్రవాదులు కనీవినీ ఎరగని రీతిలో బీభత్సచర్యలకు దిగడంతో పాఠశాలలకు ప్రభుత్వమే సెలవులు ప్రకటించింది. కాశ్మీర్ లోయలో సుమారు రెండు మిలియన్ల మంది విద్యార్థులు బడులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే ప్రకటించారు.
లోయలోని గురెజ్, తంగ్దార్, ఊరి ప్రాంతాలతో పాటు జమ్ము, లడఖ్‌లో మాత్రం వేర్పాటువాదుల ప్రభావం తక్కువగా ఉన్నందున అక్కడక్కడా పాఠశాలలు తెరచుకున్నాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రం అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల భవనాలు అగ్నిజ్వాలలకు ఆహుతయ్యాయి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో కూడా రాళ్లు రువ్వే అల్లరిమూకలు పలు పాఠశాల భవనాలకు నిప్పుపెట్టాయి. పెట్రోల్ బాంబులను సైతం పాఠశాలల్లోకి విసిరి బీభత్సకారులు విధ్వంసం కొనసాగించారు. రాళ్లు విసిరే యువకులు కొన్ని చోట్ల విద్యాసంస్థల సిబ్బందిపైనా దాడులు చేశారు. కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో ‘దారితప్పిన యువకుల’కు చేతినిండా పనిదొరికినట్లయ్యింది.
వేర్పాటువాదాన్ని సమర్థించే మతోన్మాద ఉగ్రవాద సంస్థలు జారీ చేసే ఆదేశాలతో అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. పాఠశాలలను తెరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదని పాకిస్తాన్ ప్రేరిత ‘లష్కర్-ఇ- తైబా’ గత ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్ విద్యామంత్రి నరుూం అఖ్తర్‌ను హెచ్చరించింది. ‘లోయలో విద్యాసంస్థలను తెరిపించే ప్రయత్నాలకు మంత్రి అఖ్తర్ స్వస్తి పలకాలి.. ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలను నిర్ణయించగలిగే చదువు కాశ్మీరీలకు చాలు.. మా ఆదేశాలను బేఖాతరు చేస్తే అఖ్తర్‌పై తగిన చర్య తప్పదు..’ అని లష్కర్-ఇ-తైబా ప్రతినిధి బాహాటంగానే హెచ్చరించారు. విద్యాసంస్థలు సజావుగా నడిచేందుకు సహకరించాలని మంత్రి అఖ్తర్ పాక్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ గిలానీకి బహిరంగ లేఖ రాసినా ఫలితం దక్కలేదు. వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థలేవీ మంత్రి అభ్యర్థనను ఖాతరు చేయలేదు. నెలల తరబడి తరగతులు రద్దు కావడంతో వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను జమ్మూ, దిల్లీ తదితర ప్రాంతాలకు తరలించారు.
పాకిస్తాన్ సైనికులు ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినా ఉద్రిక్తతలు చెలరేగడం.. ఫలితంగా ‘నియంత్రణ రేఖ’ (ఎల్‌ఒసి) ప్రాంతంలోని రజౌరీ, పూంచ్ జిల్లాలలో ప్రభుత్వ అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ‘నియంత్రణ రేఖ’, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద సున్నిత ప్రాంతాల్లో 630 పాఠశాలలు ఎప్పుడూ మూతపడుతుంటాయి. పాక్ సరిహద్దుల్లోని కతువా, సాంబా, జమ్ము ప్రాంతాల్లో 330 ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సందడే కనిపించదు. జమ్ములోని కతువా నుంచి అఖ్నూర్ వరకూ 198 కిలోమీటర్ల పొడవున ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో నిరంతరం సిఆర్‌పిఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నప్పటికీ పాక్ బీభత్సకారులు పాఠశాల భవనాలపై దాడులు చేస్తుంటారు. ఏదో ఒక రూపంలో విధ్వంసం కొనసాగాలన్నదే వీరి పన్నాగం. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఈ గ్రామాలపై తరచూ విరుచుకుపడుతున్నందున పాఠశాలలను నడపడం కష్టతరంగా మారిందని విద్యాశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తుంటారు. స్కూళ్లను తెరిచేందుకు తాము సాహసం చేయలేమని, ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకూ నిరీక్షించక తప్పదని వారు చెబుతున్నారు.
తుపాకీ మోతలు, బాంబు పేలుళ్ల మధ్య భయం భయంగా రోజులు వెళ్లదీస్తున్న అనేక గ్రామాల ప్రజలు పాఠశాలలను తెరిపించేందుకు అధికారులపై ఒత్తిడి చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, అవకాశం ఉన్నపుడు పాఠశాలలు తెరవడం, ఉద్రిక్తతలు ఏర్పడినపుడు మళ్లీ సెలవులు ప్రకటించడం నిత్యకృత్యంగా మారింది. నియంత్రణ రేఖ వద్ద పూంచ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో గత ఏడాది సుమారు 180 పాఠశాలలను మూసివేశారు. పిల్లల ప్రాణాలే ముఖ్యం గనుక పాఠశాలలకు సెలవులు ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు. కాగా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారిని ఉగ్రవాద కలాపాలకు దూరంగా ఉంచాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు అందుతున్నందున కొంతమంది యువకులు ‘రాళ్లు విసిరే కార్యక్రమం’లో పాల్గొంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెబుతున్నారు. ఉగ్రవాదులకు సహకరించకుండా యువతను ఉపాధి మార్గంలోకి మళ్లించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆమె అంటున్నారు. పాఠశాలలకు భద్రత కల్పించి, చిన్నారుల చదువులకు ఆటంకం లేకుండా చేసేందుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. నేతల హామీల సంగతెలా ఉన్నా, తాము తిరిగి బడికి ఎప్పుడు వెళతామని విద్యార్థులు వేస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పేవారే లేరు.

-మానస