ఉత్తరాయణం

అమలు కాని పెన్షన్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ)ల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర శాఖల మాదిరి పెన్షన్, గ్రాట్యుటీలను వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, ఈ ఉత్తర్వులు అమలుకాని దీనస్థితి కొనసాగుతోంది. డిఆర్‌డిఎ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించి రిటైర్మెంట్ ప్రయోజనాలను కల్పించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 2013 జూలై 2న స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జీవో ఎం.ఎస్.నెం.313 ద్వారా ఈ ఉత్తర్వులను జారీ చేయించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్ యోజన (ఎస్‌జిఎస్‌వై) సంయుక్త కార్యదర్శి డిఆర్‌డిఎ ఉద్యోగులందరికీ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని డిఆర్‌డిఎల్లో 2004 సెప్టెంబర్ 1 నాటికి ముందు నేరుగా నియమితులైన 564 మంది ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అప్పటి ‘సెర్చ్’ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ) సైతం వారికి న్యాయం చేయడం ఎంతైనా అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రాష్ట్రప్రభుత్వం స్పందించి జీవోను జారీ చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల్లో పనిచేస్తున్న 564మంది అధికారులు, సిబ్బంది ప్రభుత్వ చర్యలపై ఎంతో సంతోషించారు. తమ జీవితాలు సుఖప్రదంగా సాగుతాయని భావించారు. అయితే ఇదంతా ఓ రంగుల కలగా, మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ జీవోను మూలపడేశారు. అలాగని జీవోను రద్దు చేయలేదు. ఏమైనప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బతుకులు అత్యంత దుర్భరంగా మారాయి. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. జీవిత వైకుంఠపాళిలో పెద్ద పాము వారిని మింగేసింది. ఎంప్లారుూస్ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) కింద నెలకు సుమారు 2వేలు మాత్రమే వస్తుంది. మిగిలిన ప్రభుత్వ శాఖల వలే రెగ్యులర్ పింఛన్ రావడం లేదు. గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం పది లక్షల రూపాయల గరిష్ట గ్రాట్యుటీ రావలసి ఉండగా, వారికి 3.5 లక్షల మేరకు మాత్రమే వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తిస్తూ జీవో విడుదలైనా అమలు కాని దయనీయ పరిస్థితి కొనసాగుతోంది.
ప్రస్తుతం ఏపిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల్లో సుమారు 300 మంది, తెలంగాణలో 264 మంది ఉద్యోగులున్నారు. పదవీ విరమణ అనంతరం రెగ్యులర్ పింఛన్, గ్రాట్యుటీకి వారంతా అర్హులేనని ప్రభుత్వ ఉత్తర్వులు ఘోషిస్తున్నాయి. ఎటొచ్చీ ఈ జీవోను పక్కన పడేయడం వల్ల వారి బతుకులు హీనంగా మరాయి. డిఆర్‌డిఎ ఉద్యోగుల జీతభత్యాలు, పదవీ విరమణ చేసినవారి వివరాలను ‘సెర్చ్’ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ) సేకరించి, ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించారు. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉన్నట్టు’ సామెత వీరికి అక్షరాలా వర్తిస్తుంది. చాలీచాలని పింఛన్ వల్ల, ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఒక్క శ్రీకాకుళం డిఆర్‌డిఎలోనే పదవీ విరమణ చేసినవారిలో ఐదుగురు చనిపోయారు. అయినప్పకీ ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. జీవో విడుదలై నాలుగేళ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదు. ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటోంది. వీరంతా అనేకసార్లు ప్రభుత్వాలకు విన్నవించినా అది బధిర శంఖారావమే అయింది. ఇకనైనా 2013 జూలై నెల 2న విడుదల చేసిన 313 జీవోను అమలుచేయాలి. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని, న్యాయ సమ్మతమైన వారి డిమాండ్‌ను అమలుచేయాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు