మెయన్ ఫీచర్

మాతృభాషపై మమకారం ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభాష అంటే సొంత భాష. సాధారణంగా వ్యక్తులకు తమ తల్లిదండ్రులు మాట్లాడే భాషే మాతృభాష అవుతుంది. శిశువు మరొక భాషా ప్రాంతంలో ఉండి అక్కడ పెరిగితే- ఆ ప్రాంత ప్రజల భాష అలవడితే అది ఆ శిశువు మాతృభాష అవుతుంది. పాఠశాలలో విద్యార్థి భాషేతర విషయాలను నేర్చుకునేటప్పుడు బోధనకు ఉపయోగించే భాషను బోధనా భాషగా పరిగణిస్తారు. ‘మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్’.. దీనినే బోధనా మాధ్యమం అని కూడా అంటారు. నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా భావ గ్రహణ, భావ వ్యక్తీకరణలకు మాతృభాషపైనే ఆధారపడతాడు. ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలిసిన వ్యక్తి అయినా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు మాతృభాషలోనే ఆలోచిస్తాడు. బోధనా భాషగా ఉండడానికి మాతృభాష మాత్రమే అన్ని విధాలా అనుకూలం. పరభాషలు ఏ మాత్రం సాటిరావు. నేర్చుకునే విషయం కొత్తదీ, బోధనా మాధ్యమం కూడా కొత్తదీ అయితే భావ కాఠిన్యానికి తోడు భాషా కాఠిన్యం కూడా తోడై విద్యార్థికి శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యార్థికి అర్థం కాకుండానే పాఠ్యాంశాలను కంఠస్థం చేయవలసి ఉంటుంది.
విద్యా వ్యవస్థలో మాతృభాషే మాధ్యమ భాషగా, బోధన భాషగా, బోధన వాహికంగా రూపొందాలని అనేక నిపుణుల కమిటీలు అభిప్రాయపడ్డాయి. 1929లో హార్టాగ్ కమిటీ నివేదిక, 1936లో ఉడ్సు కమిటీ నివేదిక, 1948లో విశ్వవిద్యాలయ సంఘం, 1952లో సెకండరీ విద్యా సంఘం, 1986లో జాతీయ విద్యా విధానం సైతం- బోధనా భాషగా మాతృభాష ఉండాలని దాని ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947లో ఏర్పడిన రాధాకృష్ణన్ కమిటీ నుండి 1964లో కొఠారి కమిషన్ ఉన్న సంఘాలన్నీ అన్ని దశలలోను బోధనా భాషగా మాతృభాషనే ఉపయోగించాలని స్పష్టం చేశాయి.
నోబెల్ బహుమతి గ్రహీత, ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘పరభాష ద్వారా విద్యా బోధన సోపానాలు లేని సౌధం వంటిది’ అన్నారు. విశ్వవిద్యాయాలలో తెలుగును బోధనా భాషగా ప్రోత్సహించాలని గ్విన్ సంఘం సిఫార్సు చేసింది. మాతృభాషే బోధనా భాషగా ఉండాలని జాతిపిత గాంధీ నొక్కి చెప్పారు. ‘నేనే నియంతనైతే మన బాలబాలికలకు పరభాషా మాధ్యమం ద్వారా బోధించడం నిలిపివేస్తాను.. ఈ దుస్థితికి తక్షణ చికిత్స అవసరం’ అని కూడా గాంధీజీ అన్నారు. బాలగంగాధర తిలక్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి భావాలే వ్యక్తం చేసారు.
1986వ సంవత్సరం నాటి జాతీయ విద్యావిధానం మాతృభాషలోనే జరగాలని అప్పుడే సమగ్ర మానవ వ్యక్తిత్వానికి రూపకల్పన జరుగుతుందని చెప్పింది. విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా మాధ్యమంగా ప్రాంతీయ భాషలను వినియోగించినట్టయితే దేశంలో ప్రతిభా వికాసం సాధ్యపడుతుందని కొఠారీ కమిషన్ చెప్పింది. తల్లిపాలు తాగి పెరిగిన బాలుడికీ వేరే పాలు తాగి పెరిగిన బాలుడికీ ఎలాంటి బేధముంటుందో స్వభాషలో శాస్త్ధ్య్రాయనం చేసిన వారికీ పరభాషలో జ్ఞానార్జన చేసిన వారికీ అటువంటి భేదమే ఉంటుందని సాహితీ పరిశోధకుడు కొమర్రాజు లక్ష్మణరావు అన్నారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న పాఠశాలల్లో చదువుకొన్న విద్యార్థుల భాషా పరిజ్ఞానాన్ని గమనిస్తే ఎవరికైనా విచారం కలుగుతుంది. ఈ కాలపు పిల్లలకు చాలావరకూ తెలుగు పదాలే తెలియడం లేదు. కొన్నాళ్లకు తెలుగు మాటలు మరుగునపడిపోతాయన్న ఆందోళన కలగక తప్పదు. ఆంగ్ల మాధ్యమంలో అభ్యాసం చేసే విద్యార్థులతో సంభాషించునపుడు- కొన్ని పదాలను, అంకెలను తమ మాతృభాష అయిన తెలుగులో ఏమంటారో తెలియక తికమక పడుతుంటారు. కొంతమంది పిల్లలకైతే ఎనిమిది, తొమ్మిది వంటి అంకెలు తెలుగులో అన్నప్పుడు వారికి అర్థం కాకపోవడం మరీ విడ్డూరం. ‘బొద్దింక’ అంటే బొత్తిగా తెలియదు, ‘కాక్రోచ్’ అంటేనే వారికి అర్థం అవుతుంది. ‘సాలీడు’ను చూసినపుడు ‘స్పైడర్’ అని చెప్పాల్సిందే. చాలామంది ఇళ్లలో వాడే చిన్న చిన్న తెలుగు మాటలు సైతం పిల్లలకు తెలియడం లేదంటే మనం ఆశ్చర్యపడక తప్పదు. అంకెలను తెలుగులో పలకడం ఇంగ్లీషు మీడియంలో చదివిన పిల్లలకు తెలియదు. తెలుగు సంవత్సరాల పేర్లు, వారములు, తిథులు వంటివి అసలే తెలియవు. ‘మమీ-డాడీ’ సంస్కృతికి అలవాటుపడిన నేటితరం పిల్లలు కృత్రిమ వాతావరణంలో పెరుగుతున్నారు. ‘నాన్న, అమ్మ’ అనే పిలుపులోని మాధుర్యానికి తల్లిదండ్రులు దూరమవుతున్నారు. ఆంగ్లభాషను నేర్చుకొనడంలో తప్పులేదు. ఆ భాషను నేర్చుకున్నప్పుడు తరగతి గది వరకూ మాత్రమే అది పరిమితం కావాలి. కానీ, నేడు ప్రైవేటు పాఠశాలల్లోను, కానె్వంట్లలో పిల్లలు తరగతిలో అడుగుపెట్టినది మొదలు ఇంగ్లీషులోనే మాట్లాడాలని నిర్బంధిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడితే చాలు పిల్లలను అనాగరిక పద్ధతుల్లో దండిస్తున్నారు. దీంతో తెలుగు భాషలోని వాడుక పదాలను సైతం పిల్లలు మరిచిపోతూ ఆంగ్ల పదాలను వాడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో టీవీ చానళ్ల ప్రభావం కూడా పిల్లలపై పడుతోంది. ఆంగ్ల పదాలు లేనిదే మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. ఉదాహరణకు ‘ట్రై’ చేస్తాను (ప్రయత్నిస్తాను అనడం), ‘ఎటాక్’ చేస్తాను (దాడి చేస్తాను అనడం), ‘లెటర్’ వ్రాస్తాను (ఉత్తరం రాస్తాననడం)... ఇలా వందలాది పదాలు తెలుగు భాషలో చొరబడిపోయాయి. ఆంగ్లం, తెలుగు పదాలు కలిపి మాట్లాడడం కొన్ని సందర్భాల్లో వినడానికి వెగటుగా ఉంటాయి. రైలు, బస్సు, ఫ్యాన్ వంటి ఇంగ్లీషు మాటలు తెలుగులో ప్రవేశించి రూఢమై ఉన్నందున వాటినే అలాగే వాడడం సముచితమే. కానీ, అన్ని తెలుగు పదాలనూ త్యాగం చేయాల్సిన అవసరం లేదు.
బహు భాషాభ్యాసం బాలలకు భారం అనుకోవడం సముచితం కాదు. హాలండ్ పాఠశాలల్లో నాలుగు, స్విట్జర్లాండ్ దేశంలో మూడు భాషలను చిన్నారులకు నేర్పుతుంటారు. రష్యాలో కూడా బహు భాషాభ్యాసం ఉంది. ఇతర భాషలను నేర్చుకోవడంలోను, నేర్పడంలోను తప్పులేదు. కానీ, వేలం వెర్రిగా వ్యామోహం పెంచుకోవడం, మాతృభాషను నిర్లక్ష్యం చేయడమే మాత్రం సమంజసం కాదు. అది మాతృభాషకు ద్రోహం చేయడమే అవుతుంది. ఈనాడు గొప్ప భాషగా, ప్రపంచ భాషగా వెలుగొందుతున్న ఇంగ్లీషు పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేదో చూద్దాం. తెలుగులో ‘కవిత్రయం’ కావ్యసృష్టి చేస్తున్న కాలంలో ఇంగ్లీషు రూపకల్పన కాలేదు. పాఠశాలల్లో క్రీశ 1350వ సంవత్సరంలో ప్రవేశపెట్టేదాకా ఇంగ్లీషు చిన్నచూపు చూడబడింది. 14వ శతాబ్దం ఆఖరున మాత్రమే ఇంగ్లీషు భాషకు స్వదేశంలో పార్లమెంటులో ప్రవేశం లభించింది. నేడు మన ఇంగ్లీషు వ్యామోహం లాగే నాడు ఫ్రెంచ్, లాటిన్ భాషలపై వ్యామోహం ఉండేది. నేటి మన ప్రాంతీయ భాషల స్థితిలోనే మూడు, నాలుగు వందల ఏళ్ల కిందట ఇంగ్లీషు పరిస్థితి ఉండేది. ఆంగ్ల భాషను ఆశ్రయించుకుని అద్భుత రచనలు చేసిన మహా రచయితలు, మాతృభాషాభిమానులై ప్రపంచం నలుమూలలా వ్యాపించిన ఆంగ్లేయులు భాషా నియంత్రణలను విడనాడి స్వేచ్ఛగా తమ భాషను ఎదగనిచ్చిన దృక్పథం- ఇవన్నీ ఆంగ్లభాష ఔన్నత్యానికి తోడ్పడ్డాయి. ఆంగ్ల భాషలో ఫ్రెంచ్, అరబ్బీ మొదలైన భాషల నుండి వచ్చిన పదాలు ఆయా భాషలకు తద్భావాలో, అనుకృతులో అని గమనించగలం. ఉదాహరణకు సిరప్, సోపా, షుగర్ వంటివి ఇంగ్లీషులో వాడబడుతున్న అరబ్బీ పదాలని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
రష్యా, జపాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలెన్నో తమ భాషలను అధికార భాషలుగా, అన్ని స్థాయిలలోను బోధనా భాషలుగా రూపొందించుకుని అభివృద్ధి చెందిన దేశాలుగా అంతర్జాతీయ రంగంలో మనుగడ సాగిస్తున్నాయి. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో కూడా వారి మాతృభాషలను బోధనా భాషగా వినియోగిస్తున్నారు. కాగా, తెలుగును మాధ్యమంగా అమలు చేయడంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయని కొందరు పలు కారణాలు చెబుతుంటారు. అవి..
* శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి తెలుగులోని పదజాలం అంతగా సరిపోదు.
* తెలుగులో కూర్చిన పారిభాషిక పదాలు కృతకంగా, అన్వయ క్లిష్టంగా ఉండి పదుగురి నోళ్లలో నానడానికి ఇబ్బంది కలుగుతుంది.
* తెలుగు భాషలోని పదాల కన్నా ఆంగ్ల పదాలను సులభంగా జీర్ణించుకోగలం అనే భావన చిరకాలంగా గట్టిగా నాటుకుపోయింది.
ఇలాంటి అభ్యంతరాలకు, సమస్యలకు పరిష్కారం ఉంది. పదాల వినియోగం వల్లనే ఏ భాష అయినా పరిపుష్టం అవుతుంది. ఆసుపత్రి, లాంతరు వంటి ఇంగ్లీషు పదాలు, తువ్వాలు, మేజువాణి లాంటి ఉర్దు పదాలు అలమర, బొత్తాము వంటి యూరోపియన్ పదాలు ఎంత చక్కగా తెలుగులో కలిసిపోయాయో చూస్తే ఆ భాష స్వభావం అర్థం అవుతుంది. పారిభాషిక పదాలను, సాంకేతిక పదాలను కచ్చితంగా తెనిగించి తీరాలి అనే నిబంధన ఏదీ లేదు. అనువైన వాటిని అనువదించి, అందుకు అవకాశం లేని వాటిని అలాగే వాడుకోవడంలో సరళత ఉంది. దీనివలన తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అవరోధాలను అధిగమించడానికి నన్నయ భట్టారకుడు సూచించిన మార్గమే ఉత్తమం. సంస్కృత పదాలను తత్సమాలుగా తెలుగులో ప్రవేశపెట్టడం.
వేలాది అన్య దేశాలను చక్కగా తనలో మలుచుకోగల మన తెలుగు భాష విద్యా మాధ్యమంగా గానీ, అధికార భాషగా గానీ నిస్సంశయంగా తక్కువ స్థాయిలోనే వుంది. ప్రాథమిక స్థాయి నుండి డిగ్రీ వరకు, విశ్వవిద్యాలయ స్థాయి వరకు తెలుగును బోధనా భాషగా వినియోగించడానికి ఎంతగానో అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన గ్రంథాలు రూపొందిస్తున్నారు. ఆయా స్థాయిలలో బోధనాభ్యసన అవసరాలకు తగినట్టుగా తెలుగులోకి సంబంధిత గ్రంథాలను తయారు చేయవలసిన అవసరం ఇంకనూ ఉంది. తెలుగును బోధనా మాధ్యమంగా చేయడంవల్ల ఎన్నో ప్రయోజనాలను సాధింపవచ్చు. అవి..
*విషయ గ్రహణం, విషయ వ్యక్తీకరణములు సులభమవుతాయి. మనం గ్రహించాల్సిన విషయం ఇంగ్లీషు భాషలో ఉన్నపుడు కఠిన పదాలు లేక నూతన పదాలు తటస్థిస్తే నిఘంటువును చూడవలసి వస్తుంది. తరచుగా నిఘంటువును చూస్తున్నట్లయితే త్వరగా పఠించుటకు అవరోధం కలుగుతుంది. విషయ పఠనం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది.
*ఉపాధ్యాయులు మాతృభాషలో పిల్లలకు బోధించినట్లయితే మాటలు కొరకు తడుముకొననక్కరలేదు. సహజముగా, అనర్గళముగా బోధింపవచ్చును. విద్యార్థులు కూడ తమకు సందేహాలు ఉంటే మాతృభాషలో సులభంగా ప్రశ్నించేందుకు ఉత్సాహం చూపుతారు.
*విద్యార్థుల స్వయం కృషికి మాతృభాష దోహదకారి కాగలదు. విద్యార్థులు స్వయంగా పరిశీలనా గ్రంథములను పఠించి విషయ జ్ఞానమును పొందగలరు. బోధనా భాషగా ఉన్నపుడు మాతృభాష మరింతగా వికసిస్తుంది.

-ముడుంబ వేణుగోపాలాచార్యులు సెల్ : 94404 20379