సబ్ ఫీచర్

అగ్రరాజ్యాల తప్పిదాలే ఉగ్రవాదానికి ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 22 మంది అమాయక పౌరులు మృతి చెందడం, పలువురు గాయపడడం అత్యంత విషాదకరం. ఈ కిరాతకం బ్రిటన్ ఇప్పటివరకూ ఎదుర్కొన్న ఉగ్రదాడులకు పూర్తిగా భిన్నమైనది. ఇంతటి దుష్కృత్యానికి పాల్పడింది తామేనని మతోన్మాద ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ ప్రకటించింది. బ్రిటన్‌పై ఐఎస్ జరిపిన ఈ తొలి ఆత్మాహుతి దాడి ఆ దేశ ప్రజల మానసిక స్థితిపై గట్టి ప్రభావాన్ని చూపక తప్పదు. ఈ దారుణ మారణకాండను నాగరిక సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రకమైన దాడులతో- ప్రపంచంలో ఆధునిక నగరం నుంచి మారుమూల పల్లె వరకూ ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదని మరోసారి తేటతెల్లమైంది. ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఉగ్రవాదంపై సమగ్రమైన వ్యూహం లేకపోవడం పెద్ద లోటు.
ముఖ్యంగా ఉగ్రవాదం అనేది రెండు తలల విషసర్పం. రెండు తలలను ఛేదించినపుడే దానిని అంతం చేయడం సులభం అవుతుంది. అయితే, అగ్రరాజ్యాలు ఆ పనికి ఏ మాత్రం పూనుకొనడం లేదు. ఒక తలను ఛేదించి, మరో తలకు పాలు పోస్తున్నారు. తమ స్వలాభం కోసం పక్షపాత బుద్ధితో సగం సగం యుద్ధం చేస్తున్నారు. ఫలితంగా ఆ రెండు తలల విషసర్పం మరింత బలం పుంజుకుని దేశదేశాల్లో విషాన్ని విరజిమ్ముతోంది.
మాంచెస్టర్ నగరంలో తాజాగా జరిగిన దాడి యాదృచ్ఛికంగా జరిగినది కానే కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి పశ్చిమాసియా దేశాల పర్యటనకు సవాల్‌గా ఈ ఉగ్రదాడి చేసినట్లు ఉంది. సౌదీ అరేబియాలో ఆయన ఏభై దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఇస్లామిక్ స్టేట్‌ను కట్టడి చేస్తామ’ని ప్రతిన బూనిన ఇరవై నాలుగు గంటలలోపే వారి మిత్రదేశమైన బ్రిటన్‌లో దాడి జరపడం ద్వారా తన ప్రతి సవాల్‌ను ఐఎస్ ఉగ్రదాడి రూపంలో చూపించింది. ఇలాంటి హత్యోదంతాల నుంచి మానవాళిని అగ్రరాజ్యాలు కాపాడాలంటే తమ తమ వ్యూహాల్లో లోపాలను నిజాయితీగా గుర్తించాలి. మిత్రులుగా ఉన్న దేశాల్లో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా ఉండడం, ఇతర దేశాల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించడం మానుకోవాలి. అన్ని దేశాల కష్టం తమదిగా భావించాలి. గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సాధించిన ఇరాన్- అమెరికా మైత్రిని ఉద్దేశ పూర్వకంగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అటకెక్కిస్తూ ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారు ఎప్పటిలాగే. పాకిస్తాన్ భారత్‌లో పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తున్నారు. సిరియాలో, ఆఫ్గనిస్తాన్‌లో ఎక్కడ చూసినా పక్షపాత యుద్ధమే తప్ప సమగ్ర సమరం ఎక్కడా కానరావడం లేదు. వెరసి అగ్రరాజ్యాల బలహీనతలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలే ఉగ్రవాదానికి ఊపిరి పోస్తున్నాయి. ఈ వైఖరి మారనంత వరకూ ప్రపంచ దేశాలన్నీ పెను ప్రమాదంలో ఉన్నట్టే. ఉగ్రవాదుల దాడులకు దీటుగా అగ్రరాజ్యాలు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ మిగతా దేశాలకు బాసటగా నిలవాలి.

- డా. జివిజి శంకరరావు