సంపాదకీయం

మోకరిల్లడం మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంతకుడు అభియోగాన్ని విచారించి తీర్పు చెప్పడమన్న ప్రక్రియ మళ్లీ మొదలైపోయింది. ఇలా మొదలు కావడం ఇది మొదటిసారి కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం రెండు దశాబ్దులకు పైగా ఇలా అభియోగాలను విచారిస్తూనే ఉంది. మన ప్రభుత్వం మోసపోతూనే ఉంది. పంజాబ్‌లో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై మూడు రోజులపాటు నాలుగవ తేదీ వరకు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ హంతకులు దాడి చేయడం ఈ పునరావృత్తికి సరికొత్త నేపథ్యం. పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ బీభత్సకాండను జరిపించింది. ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వం బహిరంగంగా అధికారికంగా ప్రకటించగలదని పఠాన్‌కోట స్థావరలో జరిగిన యుద్ధంలో అమరులైన సమరవీరుల కుటుంబాల వారు ఎదురు చూశారు, దేశ ప్రజలు ఎదురు చూశారు. మంగళవారం సాయంత్రం వరకు అలాంటిదేమీ జరగలేదు. బీభత్సకాండ జరిపిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సమర్పించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని పాకిస్తానీ విదేశాంగ మంత్రిత్వశాఖవారు ప్రకటించారట. ఆ తరువాత పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు నవాజ్ షరీఫ్ కూడ చర్యలు కఠినంగా తీసుకుంటామని హామీని ప్రదానం చేశాడట. పఠాన్‌కోటపైకి టెర్రరిస్టులను ఉసిగొలపాలన్న పథకాన్ని ఐఎస్‌ఐ వారు రచించారన్నది బహిరంగ రహస్యం. మన ప్రభుత్వానికి తెలియకపోవడం మాత్రం మన దేశాన్ని అంతర్జాతీయ సమాజంలోఅపహాస్యం పాలు చేస్తున్న పరిణామం. ఐఎస్‌ఐ పాకిస్తాన్ సైనిక విభాగం. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న జిహాదీ బీభత్సపు ముఠా. పాకిస్తాన్ సైనిక దళాల కార్యాలయంలోనే పఠాన్‌కోటపై దాడికి వ్యూహరచన జరిగిందన్నది అతార్కికమైన అరోపణ కాజాలదు. పాకిస్తాన్ ప్రభుత్వ స్వభావానికి అనుగుణమైన వాస్తవం. పాకిస్తాన్ ప్రభుత్వం భారత వ్యతిరేక బీభత్స వ్యవస్థ. అందువల్ల పఠాన్‌కోట బీభత్స ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణ జరపడం హంతకుడు తన నేరం గురించి తానే న్యాయ విచారణ జరిపి నిర్దోషిత్వాన్ని నిర్ధారించినట్టు కాగలదు. డిసెంబర్ 25వ తేదీన లాహోర్‌లో నవాజ్ షరీఫ్ మన ప్రధాని గుజరాతీ ‘సారు’కు కొసరి కొసరి వడ్డించాడట. ఈ వడ్డన సాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ సైనికాధికారులు పఠాన్‌కోటపై దాడి సాగించాలని నిర్ణయించుకొని ఉంటారు. దరహాస వదనం వెనుక నక్కిన పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స హృదయం, మోదీ లాహోర్ నుండి తిరిగి వచ్చిన వెంటనే ఇలా ఆవిష్కృతమైంది. ఇంకా పాకిస్తాన్‌తో చర్చలేమిటి? చర్చలు జరగాలా వద్దా అన్న మీమాంస ఏమిటి?
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వంచన క్రీడను 1993 నుంచీ ముంబయిలో దారుణ మారణకాండ జరిపినప్పటినుంచీ కొనసాగిస్తూనే ఉంది. మన ప్రభుత్వం ఎన్నిసార్లు మోసపోతుంది? ఈ ఇరవై రెండేళ్లలో ప్రతి ఏడు మనదేశంలో ఎక్కడో అక్కడ జిహాదీ హంతకులు విరుచుకొని పడుతూనే ఉన్నారు. బీభత్స ఘటన జరిగిన ప్రతిసారీ మన ప్రభుత్వం పెద్ద గొంతుకతో నిరసన తెలుపుతూనే ఉంది. దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సరుూద్ తదితర భయంకర జిహాదీ హంతకులనుపట్టి మన దేశానికి తరలించాలని కోరుతూనే ఉంది. పాకిస్తాన్ పట్టించుకోలేదు. వెంట వెంటనే మన ప్రభుత్వం మెట్టు దిగిపోవడం చరిత్ర. ‘‘హంతకులను పట్టుకొని మీ దేశంలోనే విచారించండి...’’అని మన ప్రభుత్వం పాకిస్తానీ పెత్తందార్లకు విజ్ఞప్తి చేయడం ఇలా మెట్టు దిగడానికి సాక్ష్యం. పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘సాక్ష్యాధారాలు సమర్పించండి చర్య తీసుకుంటాం’’ అని జవాబు చెప్పడం పదే పదే జరిగిన ప్రహసనం. మన ప్రభుత్వం బోలెడన్ని సాక్ష్యాధారాలను సమర్పించింది. ‘‘అబ్బే ఇవి సాక్ష్యాధారాలు కావు’’ అని పాకిస్తాన్ ప్రభుత్వం బుకాయించడం తదుపరి ఘట్టం. పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టిలో దావూద్ ఇబ్రహీం దోషి కాడు. లష్కర్ ఏ తయ్యబా అధిపతి హఫీజ్ సరుూద్ దోషి కాదు. ‘‘జైష్ ఏ మహమ్మద్’’ ముష్కరులు దోషులు కారు. హఫీజ్ సరుూద్ నిర్దోషి అని పాకిస్తాన్‌లోని ఉన్నత న్యాయస్థానాలు సైతం నిర్ధారించడం పాకిస్తాన్‌లో వ్యవస్థీకృతమై ఉన్న ఉగ్రవాదానికి తిరుగులేని ప్రమాణం.
ఇప్పుడు పాతబడిన వంచన గీతాన్ని నవాజ్ షరీఫ్ సరికొత్తగా వినిపిస్తున్నాడు. పఠాన్‌కోటలో హత్యాకాండ జరిపినవారిపై చర్యలు తీసుకుంటాడట. అందువల్ల సాక్ష్యాధారాలు పంపించాలట. ఈ వంచకజాలంలో మళ్లీ మన ప్రభుత్వం తగులుకుంటోంది. హతులైన టెర్రరిస్టుల జన్యు జీవన కణ-డీఎన్‌ఏ- నమూనాలను పాకిస్తాన్‌కు పంపించాలట. హతులు పాకిస్తాన్ పౌరులేనని ఋజువు అవుతుంది. వారికి వ్యతిరేకంగా చర్యలేమిటి? వారిని ఎవరు ఉసిగొలిపారన్నది మాత్రమే ధ్రువపడాలి. ఉసిగొల్పినది పాకిస్తాన్ ప్రభుత్వమే. శిక్షను పొందవలసింది పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు ఎవరిని శిక్షిస్తారు? 2008 నవంబర్‌లో ముంబయిని ముట్టడించిన బీభత్సకారులను పాకిస్తాన్ ప్రభుత్వం శిక్షించాలని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఆ డిసెంబర్‌లోనే తీర్మానాన్ని ఆమోదించింది. జమాత్ ఉద్ దావాను నిషేధించాలని, ఆ ముఠాలోని ‘ముందరి మనిషి’ హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించి విచారించాలని ఆ తీర్మానం సారాంశం. సమితి తీర్మానాన్ని అమలు జరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే ప్రకటించింది. కానీ అమలు జరుపలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం జమాత్‌ను నిషేధించలేదని లాహోర్ హైకోర్టు 2009 జూన్‌లో నిర్ధారించింది. అందువల్ల హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించడం చెల్లదని ఆ కోర్టు తీర్పు చెప్పింది. జమాత్ ఉద్ దావాను ఎందుకని నిషేధించలేదు? ఈ ప్రశ్నను అడిగి నిలదీయవలసింది మన ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం నిలదీయలేదు. చర్చలను పునరుద్ధరించింది. క్రికెట్ ఆటను పునరుద్ధరించింది. మన ప్రభుత్వానికే పట్టనప్పుడు ఇతర దేశాలకు ఎందుకు ఆసక్తి? సమితికి ఎందుకు శ్రమ?
ఇదంతా గతం, ఇప్పుడు మళ్లీ అదే కథ పునరావృత్తం అవుతోంది. మన ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలు నిలదీయాలి. తమ దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను సాగించినన్నాళ్లు బీభత్స ఈజిప్టుతో, ఇజ్రాయిల్ చర్చలు జరపలేదు. అమెరికా బీభత్స ఇరాన్‌తో చర్చలు జరపలేదు. తమ విమానాన్ని కూల్చిన టర్కీపై రష్యా వెంటనే ఆంక్షలను విధించడం నడుస్తున్న చరిత్ర. మరి పఠాన్‌కోటపై దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్‌తో చర్చల నాటకాన్ని రద్దు చేసినట్టు మన ప్రభుత్వం ఎందుకని ప్రకటించలేదు? పాకిస్తాన్ బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్- అని ఇప్పటికైనా ఎందుకు అధికారికంగా చాటించరాదు?