తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

గతం ఆగత చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాలను ‘జానపదం’ ఆక్రమించిన వారం ఇది. పనె్నండో తేదీ నుండి మూడు రోజులు రవీంద్రభారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గేలరీలో ‘అణగారిన వర్గాల కళాకృతులు, సంస్కృతి, సాహిత్య రూపాల ప్రదర్శన’, సదస్సు జరిగింది. పదిహేనో తేదీన వరంగల్లులో ‘జానపద సాహిత్య విజ్ఞానం- నేటి ఆవశ్యకత’పై జాతీయ సదస్సు జరిగింది. పద్దెనిమిదో తేదీన సుప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం చిత్రాల ప్రదర్శన ప్రారంభం. ఈ అన్ని కార్యక్రమాల్లో గ్రామీణ జానపదమే ప్రాణశక్తిగా నిలిచింది. ఇందులో మొదటి కార్యక్రమంలో సేకరించిన సామగ్రి నాది కావడం యాధృచ్ఛికం. నిజానికి ప్రజల సంస్కృతి అనగానే దానిని తగ్గించి చూసే దృక్పథం అన్ని వర్గాల్లో పేరుకుపోయింది. గతానికి చెందిందని కొందరు, భూస్వామ్య సంస్కృతి అని కొందరు ఏమిటేమిటో అంటుంటారు. గతం లే కుండా ఆగతం లేదని తెలుసుకోలేని అక్షరజ్ఞానులు!
గతం అనే పునాదిపైనే వర్తమానం నిర్మించబడుతుంది. మార్క్సిజానికి మోర్గాన్ రాసిన ఆదిమ జీవన విధానం ఒక ప్రేరణ. జాతీయవాదానికి గత సంప్రదాయం, విశ్వాసాలే ముఖ్యం. అది వారి పరిధి, పరిమితి. ఐనా అంతటా గతకాలపుప్రజలపై చిన్నచూపు. ఈ స్వభావం వెనుక ఏయే కారణాలు ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించాల్సి వుంది. గతకాలపు మతం, కులం, విశ్వాసం వంటివి ఎన్నో రూపాల్లో ప్రచారం అవుతున్నా పట్టించుకోనివాళ్లు, కేవలం గతంలో ప్రజల సాంస్కృతిక అధ్యయనం ఆకరాల విషయం వచ్చేసరికి పీటముడులు వే యడం గమనార్హం. జాతీయవాదాభిమానులు కూడా ఈ సంస్కృతిలోని వైవిధ్యతను జీర్ణించుకోవడానికి అవస్థ పడడం గుర్తించదగిన విషయం.
నిజానికి వేయేండ్ల పూర్వపు సాంస్కృతిక లోకంలోకి తీసుకెళ్ళే ప్రదర్శన ఒక్క రోజులో రూపొందింది కాదు. నలభై ఏళ్ళ కృషి అని ప్రదర్శన చూసిన పెద్దల భావన. ప్రజలే సాంస్కృతిని, సాహిత్యాన్ని కళని సృష్టించుకున్నారు. వీటిని ఇబ్బడిముబ్బడిగా వాడుకోవడానికి లేని అభ్యంతరం దానిని అధ్యయనం చేయడానికి ఎందుకు? చైనాలో మావో ఆనాడే ధైర్యం చేసి చెప్పని విషయాన్ని ఇప్పుడు ప్రజల సంస్కృతి పనికిరాదని అంటే ప్రజలు దానిని వదులుకుంటారా?
గత రెండున్నర వందల ఏళ్ళుగా ఆ పని కొంత జరిగింది. ప్రజల సాంస్కృతిక భాండాగారాన్ని దోచుకున్నంత దోచుకుని తమ దేశాలలోని ప్రదర్శనశాలల్లో పెట్టుకుని, ఆధునికతే ఆరాధ్యమని చెప్పిన ఆంగ్లేయ కుటిలత్వ వారసత్వం ఇంకా కొనసాగుతున్నది. పె ట్టుబడిదారుల సంస్కృతిని, ఆ యుగాన్ని వెనకేసుకు వస్తూ భూస్వామ్యపాలనని మాత్రమే శత్రువుగా చూడ్డం ఏ గతి తర్కం? భూస్వామ్యం కన్నా పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రకంగానూ అభివృద్ధికరం కాజాలదు. ఈ నేపథ్యంలో మనం మన దేశీయ కళా సారస్వతాలను చూడాలి. వాటిని కళ్ళతో చూడ్డానికి పైన చెప్పిన మూడు కార్యక్రమాలు ఉపయోగపడతాయి. వరంగల్లులో జరిగిన సదస్సులో రెండు రోజులు జానపద గిరిజన ఆహారా న్ని ప్రదర్శనకే కాదు, తినడానికి కూడా ఉంచారు. 34 రకాల చిరుతిం డ్లు ప్రధాన ఆహారం తయారీలో ఎలాంటి కృత్రిమ పదార్థాల వాడకం లేదు. పైగా చిరుధాన్యాలే ఎక్కువ. వీటి వాడకం ఎందుకు ఆగింది? ఎవరు చెప్పారు తినవద్దని. పండించవద్దని. కొనవద్దని. మళ్లీ ఇప్పుడు ఎవరు చెప్పారు తినాలని.
ఏ కొద్దిపాటి విచక్షణ లేని మేధావి వర్గం పుస్తకాలలోని వాక్యాలకు, ఆ వాక్యాలలోని ఆచరణకు పొసగని అసంగతాలకు లోబడిపోయింది. ప్రజలతో నిత్య నూతన సంబంధాలను ఒడిసి పట్టుకొనవలసినవాళ్ళు తామే వారికి దూరం నుండి కృత్రిమతని, పై పూతల కల్పనలను అందించడం వల్ల వాళ్ళు మోసపోతున్నారని ఇకనైనా గ్రహించాలి. తాము ఏ సృజన, ఏ కళ లేని పేదలమని భావించేట్లు చేయడం ప్రజామేధావులు చేస్తున్న అకృత్యం. ఏది తమ శరీరానికి ఆరోగ్యకరమో దానిని వారు ప్రకృతి నుండి స్వీకరిస్తున్నారు. తమ మానాన తాము బతుకుతుంటే, వారిని తమ తమ అజ్ఞానంతో మరింత లోతుల్లోకి కూరుకుపోయేలా చేస్తున్నారు కొందరు. ప్రజలను గౌరవించని ఎంతటి విప్లవకారులైనా వారు ఒంటరి కాక తప్పదు. అహంతో గౌరవించడం తెలియకపోయినా అగౌరవించకపోతే చాలు కదా.
ఆధునికత, అభివృద్ధి, విప్లవంతో పురోగతి అనే అంశాలను పరీక్షించి, తరచి చూసి వాడాలి. ఆ పదాలు లేకుండానే మానవాభివృద్ధి దశలు ఎన్నో చరిత్రలో మనగలిగాయి. అది ఎలా సాధ్యమైంది? ప్రభుత్వ, అధికార, ఆధిపత్య వ్యవస్థలను నిరంతరం ప్రతిఘటించి, నిశ్శబ్దంగా ఎదిరించి, సశాస్త్రంగా అడ్డుకొని నిలబడిన ధీర చరితల దేశమిది. ఆ అపూర్వ ఘట్టాలకు పునాదిగా నిలిచిన ప్రజా వ్యవస్థల, కళాగమనాల, సాం స్కృతిక ఆయుధాల రూ పాలు గ్రహించగలిగితే, వె లికితీయగలిగితే ప్రజలను మరింతగా నిరంతరం ప్రే మించగలం. షరతులు లే కుండా, పదాల గునపాలు అడ్డం పెట్టుకోకుండా హాయిగా హృదయపూర్వక ఆలింగనంతో ప్రేమించగలం. ప్రజలను ప్రేమించలేనివాడే వారి సంస్కృతిని వారికి దూరం చేస్తాడు. వాడే వారి నుండి దూరమవుతాడు. అవసరం పడిన నాడే ప్రేమించినట్లు నటిస్తాడు. ఆ నటనలోని కృత్రిమతని, కుయుక్తిని ప్ర జలు వేల ఏండ్ల నుండి పసిగడుతూనే ఉన్నారు. ఆ శక్తి వారు నిలిచిన నేలలోంచి, వీచే గాలిలోంచి, వింటున్న వీరగాధలలోంచి, తగిలిన శరీర గాయాల నెత్తుటిలోంచి గ్రహిస్తున్నారు. విడిపోయినా, విడి విడి బృందాలుగా విడగొట్టబడినా తమ అస్తిత్వ ఆత్మగౌరవాలకు సంకేతాలు ఏర్పరచుకుని ఆధిపత్య మత వర్గ కుల పోకడలని ఐక్యత దిశగా అడుగులు వేసే ఒక కనబడని పథకం రచించుకున్నారు. తమని తాము కాపాడుకుంటూ, తమ ప్రజలను కూడా రక్షించుకునే విధానమేదో వాళ్ళకు ఉంది. ప్రకృతిలో, మానవ రాక్షసత్వంతో ఏకకాల యుద్ధం చేస్తూ మనగలిగిన శక్తి వారికి వారి పూర్వీకుల వారసత్వం. ఆ వారసత్వంలో కొంత సంస్కృతి కళా సారస్వతాల పాత్ర దాచిపెట్టుకున్నారనే దానిని సాధారణ మేధావి అర్థం చేసుకోలేడు. వాడు తన అస్తిత్వ భ్రాంతిలో మునిగిపోతూ ప్రజలకు, ఇతులకు రక్షణ కల్పిస్తున్నాననే కాల్పనిక భ్రాంతికి లోనవుతున్నాడు.
ఇది రాజుల యుగం కాదు, ఇది సేనానుల తంత్ర సమయం కాదు. ఐనా కొందరు ప్రజల పేరు చెప్పి తాము నాయకరాజులం అనుకుంటున్నారు. కొందరు కొంత యుద్ధతంత్రం తెలిసినవారు సేనానులం అని బోర విరుచుకుంటున్నారు. అలా అనుకోని సాదాసీదా ప్రజలు మాత్రం త్యాగాలు, యుద్ధాలు అనేక రెట్లుగా చేస్తున్నారు. ఎలా? అది వారి జీవన సంస్కృతి. నగరాలలో అనేకానేక హంగుల మధ్యే జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ప్రజల గురించి మాట్లాడ్డం ఫాషన్ అయిపోయిన రోజులకి ఇది అర్థం కాదు. ప్రజల ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనివాళ్ళు కేవలం పదాలతో వారిని ఆకట్టుకోవాలని చూస్తుంటారు. వారి జీవితాలలో ఆవరించిన సాంస్కృతిక మేధోపర జ్ఞానాలను ఏ మాత్రం గుర్తించరు. పైగా నిరాకరిస్తారు. ఈ నిరాకరణ భావనవల్ల జానపదం పదాన్ని, ప్రజావారసత్వ సంకేతాల్ని చూడాలని అనుకోడు. ఐనా కొద్ది యాంత్రిక మేధో రోబోలు మనుషులవలె కనబడేవారికి ఇది ప్రదర్శన వస్తువులే. నిజానికి తామే గోడలు లేని ప్రదర్శనశాలలోని వస్తువుల్లా మారిపోయామని అనుకోవడానికి సైతం గ్రహింపులేనివారు వాళ్ళు.
ప్రజలు తమకు జైకొట్టడం లేదని గమనించిన మేధావులు, వారి గురించి పట్టించుకునే వారిని ఎక్కడో ఓ చోట గాయపరుస్తారు. ఆ పని చేస్తూనే ఉంటారు. సమగ్రం కాని వారి సిద్ధాంతాలు, నమ్మకాలతో మాత్రమే ఆ పని కానిస్తారు. అది వారి ఓటమి. ప్రజలు విజేతలు. అంతిమంగా వారే నిర్ణాయకులు. అలాంటి వారి కళా సారస్వతాలే మార్పుకి పునాది. పాక్షిక మేధావులు కాలం చెల్లి, శ్రమజీవి జీవ మేధావులు వారి స్థానాలను భర్తీ చేసిన రోజున ఒక కొత్త కళ వెల్లివిరుస్తుంది. ఆరోజు గతంలోని జెండా కొయ్యే ఒక గొప్ప ఆయుధంగా మారక తప్పదు. అప్పటిదాకా పేరేదైతేనేం.. ప్రజారాశుల సంస్కృతిని కాపాడి వారికి తిరిగి అందించే ప్రయత్నం చేస్తూనే ఉందాం. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242