ఈ వారం స్పెషల్

పాటకు పల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు.. చిరుగాలి సన్నాయి
వసంతుడే పెళ్లికొడుకు.. వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు.. పున్నమి తొలిరేయి
... మనోహరమైన ఈ పాట వింటూంటే మనం మధురమైన మరోలోకంలో తేలిపోతుంటాం. కోకిలమ్మలు.. చిగురాకుల తోరణాలు.. సన్నాయిలా సాగే చిరుగాలి.. వసంతం.. వనంలో సందడి.. పూల సోయగాలు.. తలంబ్రాలు.. పున్నమి.. తొలిరేయి.. ఈ దృశ్యాలన్నీ మన కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి.. తరాలు గడిచినా ఈ పాటలోని స్వర మాధుర్యం నిత్యనూతనం.. ఇంతటి కమ్మనైన గీతాన్ని ఆలపించిన ‘గానకోకిల’ గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
***
తెలుగు కొమ్మల్లో పుట్టి, తెలుగుపాటకు వనె్నలద్దిన కోయిలమ్మ- సుశీల. ఆమె పాటల్ని వెతకడమంటే వసంతంలో పూసే వేలాది పూవుల్ని ఏరుకోవడమే. ఆమె ఏది పాడినా అది- స్వరరాగ సమ్మోహనమే. సాదాసీదాగా అనిపించే పదబంధాలు ఆమె గళమాధుర్యంతో జీవం పోసుకుంటాయి. ఏ పాటకైనా ప్రాణం పోసే అద్భుత గాయని ఆమె. ఆరు దశాబ్దాలకు పైగా వినిపించే ఆమని గీతం ఆమె. కొన్ని తరాలపాటు శ్రోతలను ఉర్రూతలూగించిన ఆమె కొత్తతరం గాయనులకు స్ఫూర్తి ప్రదాత.
***
సుశీల పాట మార్మోగని తెలుగు ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆమె గానం కొన్ని తరాలుగా తెలుగువారి జీవితాలతో మమేకమైపోయింది. ఆమె పాట అంతగా ప్రభావితం చేసింది గనుకే ఒకప్పుడు తెలుగిళ్లలో అమ్మాయిలకు సుశీల అని పేరు పెట్టేందుకు తల్లిదండ్రులు ముచ్చట పడేవారు. గతంలో పెళ్లిచూపుల సందర్భంగా అమ్మాయి పాట పాడాలని మగపెళ్లివారు పట్టుబడినపుడు సుశీల పాటలే పాడేవారు. ఆమె పాడిన వీణ పాటలను ఒకప్పుడు తెలుగునాట యువతులు నేర్చుకోవడం ఆనవాయితీగా ఉండేది.
***
‘మనోహరముగా.. మధుర మధురముగ..’ సాగిపోయే సుశీల పాటంటే తరగని మాధుర్యం.. అది తెలుగువాడి హృదయ ఫలకంపై చెరగని జ్ఞాపకం.. శ్రావ్యతకు, స్పష్టతకు పట్టంగట్టే సుశీల గానంలో సహజత్వం, తీయదనం కలగలసి సెలయేటి పరవళ్లుగా సాగుతుంటాయి. ఏ రకమైన పాటకైనా అనువుగా ఒదిగిపోయే స్వరం ఆమె సొంతం. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించేలా మంత్రముగ్ధం చేయడం ‘గానకోకిల’ ప్రత్యేకత. ఇంతటి విశిష్టతలున్నందునే ఆమెకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన ఆమెకు తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు’లో స్థానం దక్కింది. నిజానికి 1952లోనే ఆమె ‘గళ విన్యాసం’ ప్రారంభమైనా, 1960 నుంచి సేకరించిన పాటలను పరిగణనలోకి తీసుకుని ‘గిన్నిస్’ సంస్థ అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది. ఆరు దశాబ్దాల కాలంలో ఆమె పనె్నండు భాషల్లో సినీగీతాలు ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ, ఒరియా, సంస్కృతం, తుళు, మరాఠీ, పడుగు, సింహళీస్ తదితర భాషల్లో ఆమె పాడారు. అయితే, ఆరు భాషలకు సంబంధించి 17,695 సోలో, యుగళ, బృంద గీతాలు పాడారని ఆమెకు ప్రదానం చేసిన ధ్రువపత్రంలో ‘గిన్నిస్’ ప్రశంసించింది. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళగీతాల సంఖ్య రికార్డు స్థాయిలో 1,336 కావడం విశేషం.
అభిమానుల కృషి ఫలితమే..
సినిమాల్లో ఎన్ని పాటలు పాడారో సుశీలకే తెలియదు. పాడిన పాటలను ఒక చోట రాసుకోవడం, వాటిని సేకరించుకోవడం వంటివి ఆమెకు అసలు తెలియదు. సినీ పరిశ్రమ, అభిమానుల అండదండలతో తన స్వర ప్రస్థానం అలా సాగిపోయిందని ఆమె చెబుతుంటారు. ఆమె పాటలంటే ముచ్చటపడే ఏడుగురు అభిమానులు సుశీలకు ‘గిన్నిస్’ ఘనత సాధించిపెట్టడంలో అవిశ్రాంతంగా పనిచేశారు. 1960 నుంచి లభ్యమైన పాటలను వీరు సేకరించారు. ఆమె పాటలను సేకరించేందుకు వీరు ‘పి.సుశీల డాట్ ఓఆర్‌జి’ అనే
వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అమెరికాలో ఉంటున్న తెన్‌రాజ, రాజేష్, చెన్నైకి చెందిన అద్దేపల్లి రాజగోపాల్, శ్రీరామలక్ష్మణ్, కమలా నారాయణన్, రాజేశ్వరి, కళై కుమార్ అనే అభిమానులు తాము సేకరించిన పాటలను ఆ వెబ్‌సైట్‌లో భావితరాల కోసం భద్రపరిచారు.
పాట ఏదైనా పరవశమే..
ఏ పాటకైనా ఒదిగే గొంతు కావడంతో సుశీల గానఝరి అప్రతిహతంగా కొనసాగింది. పిల్లల పాటలైనా, అల్లరి పాటలైనా, వలపు పాటలైనా, విషాద గీతాలైనా అలవోకగా ఆలపించడం ఆమెకే చెల్లింది. పదాలను స్పష్టంగా పలుకుతూ పాటలోని సాహిత్యానికి వనె్నలద్దడం ఆమెకే సాధ్యమైంది. దేశభక్తి, దైవభక్తి, జానపదాలు, బృందగీతాలు, జోలపాటలు, వీణపాటలు, కమ్మటి పాటలు, క్లబ్ పాటలు.. ఇలా అసంఖ్యాకం.. అన్నీ వైవిధ్య భరితం.
ఉత్తరాంధ్ర నుంచి
ఉన్నత శిఖరాలకు..
ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉన్న విజయనగరంలో పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు జన్మించిన సుశీల- ‘అందరికంటే భిన్నంగా ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం సంపాదించాల’ని చిన్నతనం నుంచి తపన పడేవారు. అప్పటికే ఎంతోమంది నిష్ణాతులను అందించిన విజయనగరంలోని మహారాజా సంగీత, నృత్య కళాశాలలో చేరిన సుశీల ద్వారం భావనారాయణ వద్ద శాస్ర్తియ సంగీతం అభ్యసించి అందులో డిప్లమో పొందారు. తన కుమార్తె ఎంఎస్ సుబ్బులక్ష్మి అంతటి సంగీత విద్యాంసురాలు కావాలని సుశీల తండ్రి ముకుందరావు భావించేవారు. అందుకు తగ్గట్టుగానే ఆమెను నిరంతరం ప్రోత్సహించేవారు. సినిమాల్లో పాడాలన్న అభిలాషతో ఆమె విజయనగరం నుంచి చెన్నై చేరుకున్నారు. అప్పటికే జిక్కి, లీల, ఎంఎల్ వసంతకుమారి, బాలసరస్వతీ దేవి వంటి గాయనీమణులు సినీరంగంలో ప్రతిభను చాటుకుంటున్నారు. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలలో ఆమె విద్యనభ్యసిస్తుండగా శ్రీకాకుళం జిల్లా యారగాం గ్రామానికి చెందిన బలిజేపల్లి రామ్మోహనరావు (మోహన్)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1952లో తొలిసారిగా ‘కన్నతల్లి’ చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ‘ఎందుకు పిలిచావెందుకు’ అనే పాటను ఎఎం రాజాతో కలిసి సుశీల ఆలపించారు. ఇలా ఒకటీ అరా అవకాశాలు వచ్చినా, చిన్న చిన్న పాత్రలకు పాటలు పాడినా- 1956లో ఆమె సినీ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అప్పటికే పెద్ద హీరోయిన్‌గా ఉన్న సావిత్రికి ‘తోడికోడళ్లు’లో పాడారు. ఆ తర్వాత ఆమె స్వర ప్రవాహం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉరకలు వేసింది. అప్పట్లో తెలుగులో ఆమె పాటలు లేని సినిమాలే లేవన్నట్లు ఉండేది. 1960 నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె కెరీర్ అత్యుత్తమంగా సాగింది. ప్రముఖ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుతో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు తెలుగువారిని రస ప్రవాహంలో ఓలలాడించాయి. ఆమె పాడిన సోలో పాటలూ శ్రోతల హృదయాలపై చిరస్థాయిగా నిలిచిపోయాయి.
మాధుర్యానికి మారుపేరు..
1960-70 మధ్య కాలం తెలుగు సినిమా పాటలకు స్వర్ణయుగం అనుకుంటే.. అపుడు సుశీల పాడిన గీతాలు ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో మార్మోగుతుంటాయి. ఆ రోజుల్లో ఆమె పాటలు కుర్రకారుకు చక్కిలిగింతలు పెట్టాయి. పిల్లల పాటలు, అల్లరి పాటలూ అలవోకగా ఆమె ఆలపించారు. మత్తెక్కించే పాటలే కాదు, మనసుల్ని పిండేసే పాటలూ పాడారు. విరహ గీతాలు, విషాద గీతాలు, వీణపాటలు వినిపించారు. భక్తిగీతాలు, దేశభక్తి గీతాలతో మైమరపించారు. ఏది పాడినా వైవిధ్యం ఆమె సొంతం. ‘మాయాబజార్’ (1957)లో ‘ఆహ నా పెళ్లియంట.. ఓహొ నాపెళ్లియంట’ పాట మహానటి సావిత్రి అభినయానికి మరింత చలాకీతనం తెచ్చింది. ‘మూగ మనసులు’లో ‘మానూ మాకును కాను’ పాటలో సాదాసీదా పదాల్లో రచయిత ఆచార్య ఆత్రేయ ఆశించిన భావాన్ని ఆమె తన గళంలో పరిపూర్ణంగా పలికించారు. ‘బడిపంతులు’లో బాలనటి శ్రీదేవికి ‘బూచాడమ్మా.. బూచాడు’ పాటను ఎంత సరదాగా పాడారో, అదే సినిమాలో అంజలీదేవికి ‘మీ నగుమోము’ పాటలో సన్నివేశానికి తగ్గట్టు ఆర్ద్రతను తన గానంలో ఆవిష్కరించారు. సుశీల గొంతులో స్వరాలు మాగమ్మత్తుగా గెంతులేస్తాయనడానికి నిదర్శనాలు కోకొల్లలు. ‘అలిగిన వేళనె చూడాలి..’, ‘బృందావనమిది అందరిదీ..’, ‘గాలికి కులమేది..’, ‘చల్లనిరాజా ఓ చందమామ’, ‘మీరజాలగలడా నా ఆనతి’, ‘మనసే అందాల బృందావనం’, ‘ఇది మల్లెల వేళయనీ’, ‘మనసా కవ్వించకే నన్నిలా’, ‘మల్లెపందిరి నీడలోన జాబిల్లి..’, ‘అనుభవాలకు ఆదికావ్యం..’, ‘సరిగమలు గలగలలు’, ‘ఝుమ్మంది నాదం’, ‘పాడనా తెనుగుపాట’, ‘కొమ్మకొమ్మకో సన్నాయి’, ‘నిదురించే తోటలోకి’, ‘ఆకులో ఆకునై’, ‘ఆకేసి పప్పేసి..’, ‘నిన్నటి దాకా శిలనైనా’, ‘గోరింటా పూచింది కొమ్మాలేకుండా’ .. ఇలా వందలు, వేల పాటల్లో నవరసాలనూ అద్భుతంగా తన గళంలో పలికించారు. సినిమా రంగానికి విరామం ప్రకటించాక ఆమె పలు భక్తిగీతాల ఆల్బమ్‌లకు పనిచేశారు. పుట్టపర్తి సాయిబాబాను ప్రగాఢంగా నమ్మే ఆమె గతంలో పలుసార్లు ‘ప్రశాంతి నిలయాని’కి వచ్చి భజనగీతాలు పాడారు.
వీణపాటల స్పెషలిస్టు
‘నీవు లేక వీణ’, ‘ఈ వీణకు శ్రుతి లేదు’, ‘ఎవరో రావాలి’, ‘ఏమని పాడెదనో ఈవేళ’, ‘మదిలో వీణలు మ్రోగే’, ‘పాడెద నీ నామమే గోపాలా’, ‘మ్రోగింది వీణ పదే పదే హృదయాల లోన’, ‘వేణుగాన లోలుని గన’, ‘పాడితే శిలలైన కరగాలి’.. వంటి వీణపాటలు ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో పదిలం. తెలుగు సినిమాల్లో ఆమె 70కి పైగా వీణపాటలు పాడి ఓ రికార్డు సృష్టించారు. ‘మనసెరిగిన వాడు మా రాముడు..’, ‘శ్రీరామనామాలు శతకోటి’.. వంటి అసంఖ్యాక భక్తిగీతాలు ప్రతి తెలుగువారింటా ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అనేక జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో సన్నివేశానికి తగ్గట్టు గాత్రమాధుర్యం పంచి, ఎంతోమంది నటీమణులకు, సంగీత దర్శకులకు, కవులకు పేరు రావడంలో ఆమె తనవంతు సహకారం అందించారు.
రికార్డుల గురించి తెలియదు..
‘నేనెన్ని పాటలు పాడానో నాకే గుర్తులేదు.. రికార్డుల గురించి తెలియదు, వాటి గురించి పట్టించుకున్నదీ లేదు..’ అని అమాయకంగా చెప్పే సుశీల ‘గిన్నిస్’ రికార్డు సాధించడం తన ఘనతేమీ కాదని, అది అశేష అభిమానుల గొప్పేనని అంటారు. గాయనిగా ఇనే్నళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇష్టమైన పాటలెన్నో ఉన్నా, కష్టమైన పాట ఏదీ లేదంటారు. నేపథ్య గాయని కావడం తనకు భగవంతుడిచ్చిన వరం అని ఆమె వినమ్రంగా అంటారు. అప్పట్లో ఇంతటి సాంకేతిక సౌకర్యాలు లేకపోయినా ఇష్టపడి, కష్టపడి పని చేసేవాళ్లమని, ఒక్కోసారి ఒకే పాట కోసం నెల, రెండు నెలలు సాధన చేసిన సందర్భాలున్నాయని ఆమె గత స్మృతులను గుర్తుచేస్తుంటారు. ‘నా భర్త మోహన్‌కు లతా మంగేష్కర్ పాటలంటే తెగ ఇష్టం.. నా గొంతు ఆమె గొంతులా ఉంటుందని నన్ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు.. ఇలా అన్నింటినీ నాకు సంగీతమే ఇచ్చింది..’ అని ఆమె చెబుతుంటారు. నేడు సినీ గీతాల్లో వాయిద్యాల హోరు ఎక్కువై అసలు పాటే వినిపించడం లేదన్న విషయాన్ని ఎవరైనా ఆమె వద్ద ప్రస్తావిస్తే- ‘కాలం మారుతోంది.. ట్రెండ్ బట్టి మనం మారాల్సిందే.. ఈ విషయంలో ఎవర్నీ తప్పు పట్టాల్సింది లేదు..’ అని అంటారు. పాటలు పాడడానికి వయసు ఎలాంటి అడ్డంకి కాదని, ఇప్పుడు సినిమా వాళ్లు ఎవరు వచ్చి అడిగినా గళం వినిపించేందుకు సిద్ధమేనంటారు. ‘నా కుమారుడు జయకృష్ణ వ్యాపార రంగంలో స్థిరపడ్డాడు.. నా స్వరవారసురాలు కోడలు సంధ్యనే.. ఇప్పటికే ఆమె కొన్ని సినిమాల్లో పాడింది.. అవకాశాలొస్తే ఆమె గాయనిగా రాణిస్తుంది’ అని తన అంతరంగాన్ని సుశీల ఆవిష్కరిస్తుంటారు. సంగీతానికి, పాటలు విని ఆనందించే అభిమానులకు తన జీవితం అంకితమని అంటారు. అభిమానులు మెచ్చుకునే పాటలన్నీ తనకూ ఇష్టమంటారు.
పురస్కారాలు..
ఉత్తమ నేపథ్యగాయనిగా 1969లో జాతీయ అవార్డును అందుకున్న సుశీల ఇప్పటి వరకూ అయిదుసార్లు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. తమిళ పాటలకు 1969, 1971లో జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచారు. 1978లో ‘ఝుమ్మంది నాదం’ (సిరిసిరిమువ్వ), 1982లో ‘ప్రియే చారుశీలే’ (మేఘసందేశం), 1983లో ‘ఎంత బీదవాడే గోపాలుడు’ (ఎమ్మెల్యే ఏడుకొండలు) పాటలకు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య పురస్కారం’తో, 2008లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డుతో ఆమెను సత్కరించాయి. ఇక దేశ,విదేశాల్లో ఆమెకు లభించిన సన్మానాలకు లెక్కేలేదు.
తరాలకు స్వరాల వారధి..
ఆరు దశాబ్దాలకు పైగా ఎన్నో తరాల శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించడమే కాదు, ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల కళాకారులతో పనిచేసి సుశీల తన ఘనతను చాటుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌తో, కెజె జేసుదాసుతో, ఆయన కుమారుడు విజయ్ జేసుదాసుతో ఆమె పాటలు పాడారు. నటి జయచిత్రకు, ఆమె తల్లి అమ్మాజీకి నేపథ్య గానం అందించారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన తనయుడు కార్తీక్‌రాజా స్వరరచనలో ఆమె గళం వినిపించారు.
అలలు కదిలినా పాటే
ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే..
.. మన జీవితంలో ప్రతి సందర్భానికీ సరిపోయేలా ఎనె్నన్ని పాటలు..! సుశీల గళం నుంచి వీటిని వింటూ మనం అనుభూతులకు లోనవుతుంటాం.. మన కోసమే ఆమె పాడిందా? అని అనుకుంటాం. ఇంతలా ‘రాగబంధం’ పెనవేసుకున్నందునే ఆమెను ‘తెలుగు కోయిల’ అంటున్నాం. అందుకే- ‘స్వర సామ్రాజ్ఞి’ అయిన ఆమెను ఎవరితోనూ పోల్చలేం. ఏ పురస్కారాల తూకం రాళ్లూ ఆమె ప్రతిభకు సరిపోవు. ఎన్ని అవార్డులు వరించినా, ఎంతటి కీర్తిశిఖరాలకు చేరుకున్నా- సినీరంగ ప్రవేశం తొలినాళ్లలో ఎలా ఉండేవారో ఇప్పటికీ అదే వినయం, అణకువ, నిరాడంబరత్వంతో కనిపిస్తుంటారని చిత్రసీమకు చెందిన ప్రముఖులు చెబుతుంటారు. ‘సినీ గ్లామర్’కు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ గానకోకిల- తెలుగు ఆడపడుచుకు నిలువెత్తు నిదర్శనం.
*
---
ఎనె్నన్ని ఆణిముత్యాలు..
గుబాళించే గులాబీ తోటలో వేలసంఖ్యలో పూలుపూస్తే ఎన్నని ఏరుకుంటాం..? సాగరంలో లెక్కలేనని ముత్యపుచిప్పలుంటే ఎన్నని తీసుకుంటాం..? ‘గానకోకిల’ గాత్రమాధుర్యాన్ని ఆస్వాదించాలంటే- ఆమె పాటల్ని ఎంపిక చేయడం సాధ్యమేనా..? భాష ఏదైనా పాటలోని పదాల్ని స్పష్టంగా పలకడం, శ్రావ్యంగా ఆలపించడం, శ్రోతలను మంత్రముగ్ధం చేయడంలో సుశీల ప్రతిభ అనితర సాధ్యం. వైవిధ్య భరితంగా సాగిన వేలాది పాటల్లో ఆమె స్వరం అనుపమానం. సినిమా పాటలు పాడడం ఒక మధురమైన ఆనందంగానే కాదు, అదొక పవిత్రమైన వృత్తిగా భావించి ఆమె తన కంఠానికి, మేధస్సుకు పదునుపెట్టుకున్నారు. పెండ్యాల, సాలూరు రాజేశ్వరరావు, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్ వంటి ఎందరెందరో ప్రఖ్యాత దర్శకులు, ఘంటసాల, ఎఎం రాజా, పిబి శ్రీనివాస్, మహ్మద్ రఫీ, ఎస్పీ బాలు, జేసుదాస్, బాలమురళీకృష్ణ వంటి గాయకులతో కలిసి పనిచేసిన సుశీల దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు.
---

చిలిపిపాటలతో గిలిగింతలు..
మధురగీతాలు, వీణపాటలే కాదు పలు సినిమాల్లో సుశీల పాడిన చిలిపి గీతాలు వింటే మనకు చక్కిలిగింతలు పుడతాయి. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘ఓలమీ తిక్కరేగిందా’, ‘ఆకుచాటు పిందె తడిసె’, ‘మామిళ్లతోపుకాడ పండిస్తే’ వంటి హుషారైన పాటలు ఎప్పుడు విన్నా గిలిగింతలు పెడతాయి. హీరోయిన్లకే కాదు, కొన్ని చిత్రాల్లో శృంగార భామల నృత్యాభినయానికి ఆమె గళం కలిపారు. ‘పుట్టింటోళ్లు తరిమేశారు’, ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ వంటి పాటలు పాడి స్వర వైవిధ్యాన్ని ఆమె చాటుకున్నారు. అందుకే ఆమెను- ‘సరస సరాగాల సుమరాణివి, స్వరస సంగీతాల సారంగివి’ అనాలి.
పాటకు ముందు హాయిగా సాగే ఆలాపన, పాటలో గమ్మత్తయిన గమకాలను అలవోకగా పలికించే సుశీలను చూసి- ‘సరిలేరు నీకెవ్వరు..’ అనాల్సిందే.
‘సలలిత రాగసుధ’గా జాలువారే ఆమె గానం వింటూంటే-
‘నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచి
పదాలు ఫలాలుగ పండె’ అన్న వేటూరి పదాలు గుర్తుకొస్తాయి.
ఆమె కంఠస్వరం-
నదులలో వీణమీటే తెమ్మెర..
అలలపై నాట్యమాడే వెనె్నల..
పాటలే ఆమె సర్వస్వం.. వాటి గురించి చెప్పాలంటే సరిపోదు ఏ జీవితం.

---

-పి.ఎస్.ఆర్.