ఈ వారం స్పెషల్

సర్కారీ ఉయ్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడే లేడను మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు...

- అన్నాడు ఓ సినీ కవి.
అమ్మ - ఆ పిలుపులోని మాధుర్యం, ఆ పదంలోని గొప్పతనం, ఆమెతో ఉన్న బాంధవ్యం ఎవరైనా ఎంతని చెప్పగలరు? ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎంతగా కీర్తించినా తక్కువే కదూ! నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచి, తన ప్రాణానే్న ఫణంగా పెట్టి, జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన అమ్మ - ప్రత్యక్ష దైవం కాక మరేమిటి? ఆమె ఒడే తొలి బడి... ఆమే తొలి గురువు.
ఆడశిశువు, బాలిక, యువతి, వివాహిత, తల్లి - ఇదీ స్ర్తిజాతి పరిణామ క్రమం. ఏ దేశమైనా, ఏ మారుమూల గ్రామమైనా, ఆధునికత సోకని ఆటవిక జాతిలోనైనా ఈ క్రమం అనివార్యం.
ఇప్పటి అమ్మ ఒకప్పటి ఆడశిశువు. ఆమె పుట్టుకలోనే అమ్మ వుంది. ఆమె ఎదుగుదలపైనే మానవ జాతి ఆధారపడివుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత వివక్షకు గురైనా అన్ని దశలనూ అధిగమించి తన జన్మకు సార్థకత చేకూరుస్తుంది. ప్రతి ఆడశిశువు ఆ స్థాయికి చేరాలన్నా, మానవ సమాజం మమతల పుట్టినిల్లు కావాలన్నా - జన్మించిన ప్రతి ఆడశిశువు జీవించాలి. క్రమేణా ఎదగాలి. ఎదిగేందుకు యావత్ సమాజం తోడ్పడాలి. అలాకాకుండా ఆ శిశువును పురిట్లోనే చిదిమేస్తే భావి తరానికి ఓ మాతృమూర్తిని దూరం చేసినట్లే.
మగపిల్లాడి మీద మమకారం, వరకట్నం, పేదరికం వంటి సవాలక్ష కారణాలతో ఆడపిల్ల భారమనే దురభిప్రాయమే బాలికల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం. బలవంతపు అబార్షన్లు జరిపించడం, ఆడపిల్లలను వదిలించుకోవడం వంటి చర్యలతో దీర్ఘకాలంలో నష్టపోయేది మానవ సమాజమే. నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచి జన్మనిచ్చింది శిశువును దూరం చేసుకోవడానికి కాదు. పెంచి పెద్ద చేసి స్ర్తి జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి. పుట్టింది ఆడపిల్ల కాదు, ఓ అమ్మ అని గుర్తించాలి.
మానవ సమాజం ఎంతగా పురోగమిస్తున్నా ఆడపిల్లను తొలి దశలోనే అంతమొందించే దురాచారం నేటికీ సమసిపోలేదు. ముళ్లపొదల్లోనో, ఫుట్‌పాత్‌ల మీదనో రాక్షసంగా వదిలివేయడం, కళ్లు తెరవకముందే నిర్దాక్షిణ్యంగా కాటికి పంపడం వంటి అనాగరిక రాక్షస కృత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని ఫలితమే బాలబాలికల నిష్పత్తిలో పెరిగిపోతున్న వ్యత్యాసం. 1961 సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది బాలురకు 976మంది బాలికలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 914కు పడిపోయంది. దశాబ్దాలు గడిచినా బాలికా వివక్ష ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. రైల్వే ట్రాక్‌లమీద, చెత్తకుప్పల్లో, ప్లాట్‌ఫాంలమీద, ఆసుపత్రుల వద్ద, మురికి కాలువల్లో ఆడశిశువులను నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులు వదిలి వెళ్లిపోతున్నారు. వీరి సంఖ్య ఏటా పదకొండు లక్షల పైమాటే. వీరిలో తొంభై శాతం ఆడశిశువులే కావడం గమనార్హం. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువు నిర్జన ప్రదేశంలో దర్శనమిస్తే చలించేవారెందరు? స్పందించేవారు ఎందరు? దయామయుల కంటబడితే బతుకుతున్నారు, లేకపోతే ప్రాణాలే వదులుతున్నారు. బాలికల విద్య కోసం, వారి వివాహాల కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావడం లేదు.
శిశు సంరక్షణలో తమిళనాడులో తొలి అడుగు
ఆడపిల్ల పుట్టగానే ముళ్లపొదల్లోనో, చెత్తకుప్పల్లోనే దర్శనమిచ్చే ఘటనలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. ఇప్పటికీ అలాంటి విషాద ఘటనలు వెలుగుచూడటం ఆడపిల్ల పట్ల వివక్షకు నిదర్శనం. బొడ్డూడని శిశువును ఏమాత్రం కనికరం లేకుండా విడిచిపెట్టి వెళ్లిపోవడం, కుక్కలు, పందులు పీక్కుతింటున్న ఘటనలు తరచూ జరుగుతున్నవే. వీటిల్లో కొన్ని మాత్రమే ప్రభుత్వ గణాంకాల్లో చేరుతుండగా, లెక్కలోకి రానివి లెక్కలేనన్ని. ఆడశిశువుల దీనావస్థను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వారి కోసం ఎక్కడా లేని విధంగా తొలి అడుగు వేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిపోతున్న శిశుహత్యలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం పాతికేళ్ల క్రిందటే ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. అనాధ శిశు కేంద్రాలను ఏర్పాటు శిశు హత్యల నివారణకు ‘క్రడిల్ బేబీ’ పథకంతో తొలి అడుగు వేసింది. 1992లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఉన్నతాశయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నవజాత శిశువులను బతికించాలని, దిక్కులేని చావు చావకూడదనే భావనే ఈ పథకానికి బీజం వేసింది. పేదలు ఎక్కువగా నివసించే 32 ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుచేసి ఆడ శిశువులను దక్కించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ కేంద్రాల్లో శిశు సంరక్షణ కోసం అన్ని సౌకర్యాలను కల్పించింది. శిశువుల సంరక్షణ కోసం బడ్జెట్‌లో ప్రతి ఏటా నిధులు కేటాయించి, వారి సంరక్షణ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు తమిళనాడులో 3,600మంది శిశువులను ఈ కేంద్రాలను బతికించాయంటే ఆశ్చర్యం కలగకమానదు. దీంతో రాష్ట్రంలో బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం గణనీయంగా తగ్గింది.
మూర్ఖత్వంతో ఆడశిశువుల ప్రాణాలు హరించకుండా ఉండేందుకు, తల్లిదండ్రుల్లో మార్పు తీసుకోవాలనేది కూడా ఈ పథకం ఉద్దేశం. పాతిక సంవత్సరాలుగా ఈ పథకం నిరాటంకంగా కొనసాగడం విశేషం. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యత కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు, మరికొన్ని ఎన్జీవోలకు అప్పగించడంతో ప్రతి ఏటా బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించడంతో ఎందరో ఆడశిశువులకు ఈ పథకం ప్రాణభిక్ష పెడుతోంది. ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులు, పెళ్లి కాకుండానే మోసపోయిన యువతులకు జన్మించిన శిశువులు ఈ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. పిల్లలు లేనివారు దత్తత తీసుకునే సౌకర్యం కూడా కల్పించడంతో ఈ పథకానికి ఆదరణ పెరిగింది. అంతేకాకుండా, కాన్పు జరిగిన వెంటనే శిశు సంరక్షణ కోసం ‘అమ్మ బేబీ కేర్ కిట్’ పేరుతో మరో పథకాన్ని కూడా జయలలిత ప్రవేశపెట్టారు. శిశు మరణాలు తగ్గించేందుకు, శిశు సంరక్షణకు తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన పథకాలు అనూహ్య ఫలితాలు అందించాయ. బలవంతంగానో, అయిష్టంగానో శిశువును విడిచిపెట్టినవారు కొన్ని సంవత్సరాల తర్వాత కన్నవారువచ్చి బిడ్డను తిరిగి తీసుకెళ్లిన ఘటనలు కూడా తమిళనాడులో చోటుచేసుకోవడం గమనార్హం.
అదే బాటలో రాజస్థాన్
లింగవివక్షకు, భ్రూణహత్యలకు పెట్టింది పేరైన రాజస్థాన్‌లోనూ ఆడశిశువులను బతికించుకునే కార్యక్రమం రూపుదాల్చింది. ఆశ్రయ్ పాల్నా యోజన పథకాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది క్రితం ప్రారంభించింది. నవజాత శిశువులను అంతమొందించకుండా చూడటమే ఈ పథకం లక్ష్యమని ప్రకటించింది. తమకు పుట్టిన శిశువును ఎక్కడపడితే అక్కడ విడిచిపెట్టకుండా ఈ కేంద్రాల్లో అప్పగిస్తే వారి సంరక్షణ ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించింది. రాజస్థాన్ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ పథకం కింద ఏడాది కాలంలో పదుల సంఖ్యలో శిశువులను రక్షించగలిగారు. రాష్టవ్య్రాప్తంగా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, దత్తత కేంద్రాలు వంటి చోట్ల 67 కేంద్రాలను నెలకొల్పింది. ఈ కేంద్రాల్లో
శిశువులను అప్పగించే తల్లిదండ్రుల పేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు, చట్టప్రకారం మూడేళ్ల జైలుశిక్షకు గురికాకుండా కాపాడుతున్నారు. దీంతో శిశువు వద్దనుకునే తల్లిదండ్రులు ఈ కేంద్రాల్లోని ప్రభుత్వ ఉయ్యాలలో విడిచివెళ్లిపోతున్నారు. ‘ఆడశిశువును మీరు వద్దనుకుంటే మాకు అప్పగించండి. మేం సంరక్షిస్తాం’ అని ఆరోగ్య శాఖ సలహాదారు దేవేంద్ర అగ్రవాల్ బహిరంగ ప్రకటనలే ఇస్తున్నారు. ‘తల్లిదండ్రుల వివరాలతో మాకు పనిలేదు. ఈ పథకంలోని ప్రత్యేకత అదే. వివరాలు చెప్పాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తే ఒక్క శిశువును కూడా రక్షించలేం’ అని అంటారాయన. శిశువులను బతికించేందుకు ప్రభుత్వం ముందు ఇంతకుమించి మార్గం లేదని, ఇది తాత్కాలిక పరిష్కారమనీ, ఆడపిల్లలపట్ల తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వారి ఆలోచనల్లో మార్పు వచ్చేవరకూ ఈ పథకం కొనసాగుతుందని, శిశువులను ఎట్టిపరిస్థితుల్లో మరణించనివ్వబోమని అగ్రవాల్ స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తే బాలికల సంఖ్యను పెంచడానికి, శిశు మరణాలను నిరోధించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడు, రాజస్థాన్‌తో పాటు హర్యానా, కేరళలో కూడా ఈ పథకం అమలులోకి వచ్చింది. సాధ్యమైనంత మేర శిశు మరణాలను తగ్గించడం, ఆడశిశువుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ పథకాలు ఆరంభమయ్యాయి. అయితే వీటి నిర్వహణలో లోపాలు పెరిగిపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం, సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేరళలో ప్రారంభమైన అమ్మతొట్టిల్ పథకం తొలి నాళ్లలో బాగానే పనిచేసినా, ఆ తర్వాత అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అలారం పనిచేయకపోవడం, తలుపులు మూసి వుంచడం వంటివి తరచూ జరుగుతుండటంతో ఆడశిశువులు సమీపంలోని అడవుల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఈ పథకం ఆశయం ఉన్నతమే అయినా అమలులో నిర్లక్ష్యం వహించడం పలు విమర్శలకు దారితీసింది. హర్యానా ప్రభుత్వం కూడా ప్రయోగాత్మకంగా కొన్ని కేంద్రాలను ప్రారంభించింది. అనంతర కాలంలో వీటిని విస్తరించే యోచనలో కూడా ఉంది.
విమర్శలు... ప్రశంసలు
అనాథ శిశువుల సంరక్షణకు ప్రభుత్వాలే ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయడం అటు విమర్శలతో పాటు ప్రశంసలూ అందుతున్నాయ. ఈ కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వమే ఆడశిశువులను విడిచిపెట్టే పద్ధతిని ప్రోత్సహిస్తోందని హక్కుల కార్యకర్తలు ధ్వజమెత్తు తున్నారు. రకరకాల కారణాలతో ఆడశిశువులను తల్లిదండ్రులకు దూరం చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల మరణాల సంఖ్య తగ్గినా ప్రభుత్వమే స్వయంగా ప్రోత్సహించడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయ. తల్లిదండ్రుల సంరక్షణలో ఎదగాల్సిన పిల్లలు ఆయాల సమక్షంలో పెరగడం వాంఛనీయం కాదని కార్యకర్తలు ప్రభుత్వ చర్యను విమర్శిస్తున్నారు. సంరక్షణ కేంద్రాల్లో శిశువులకు రక్షణ లేదనీ, పౌష్టికాహారం సరిగా అందక నిర్లక్ష్యానికి గురవుతున్నారని, నిధులు కేటాయ స్తున్నా అవి దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కేరళలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడిం దని, కేంద్రాలు నిరంతరం మూసే వుంటున్నాయని, పట్టించు కునే నాధుడు లేడని విమర్శలు వెల్లు వెత్తిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇక తమిళ నాడులో అక్రమంగా కొనసాగుతున్న అనాథ శరణాలయాల విషయంలో ఏం చర్యలు తీసుకుంటు న్నారని సాక్షాత్తూ హైకోర్టు ప్రశ్నించడాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు. సంరక్షణ కేంద్రాలు ఎంత సౌకర్యంగా ఉన్నా పిల్లలు తల్లిదండ్రులవద్దే పెరగాలని వారు గట్టిగా వాదిస్తున్నారు.
మరోపక్క నవజాత శిశువులు ముళ్లపొదలు, మురికిగుంటల పాలుకాకుండా ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రశంసలూ వెల్లువెత్తుతున్నాయ. సంతానాన్ని వద్దనుకునే తల్లిదండ్రులు శిశువులను ఎక్కడపడితే అక్కడ కనికరం లేకుండా పారేయడం కర్కశత్వానికి నిదర్శనమనీ, వారికి జీవించే హక్కును కల్పించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు వారికి ప్రాణభిక్షతో సమానమని ప్రశంసిస్తున్నారు.
మధ్యయుగం నుంచే...
తల్లిదండ్రులు తమ పిల్లలను అనాధలుగా వదిలివేయడం మధ్యయుగంలోనే మొదలైంది. గుట్టుచప్పుడు కాకుండా శిశువులను వదిలేసి, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేసే ఘటనలు కూడా ఇప్పటివి కావు. ఎప్పటికప్పుడు సామాజిక సమస్యగా ఇది మరింత బలపడుతోందే కానీ తగ్గలేదు. ఈ సమస్యకు సంబంధించి మధ్యయుగం నాటి కాలంలో ఎదురైన ప్రశ్నలే నేటికీ ఉత్పన్నం కావడం, అప్పటి సమాధానాలే ఇప్పటికీ వినిపిస్తున్నాయి తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం దొరకలేదు. రోమన్ల కాలంనుంచి ఇటలీలో శిశువులను వదిలేసే ప్రక్రియ మొదలైంది. దారినపోయేవాళ్లు వారిని తీసుకెళ్లడం, ఎదిగిన తర్వాత బానిసలుగా మార్చుకోవడం కూడా జరిగేది. ఎవరూ తీసుకెళ్లకపోతే ఆ శిశువుకు మరణమే దిక్కు. ఆనాటి పరిస్థితి అది. రోమ్‌కు ప్రధాన నీటి వనరు టైబర్ నదిలో మృత శిశువులు లభ్యం కావడం చూసి అప్పటి పోప్ ఇన్నోసెంట్-3 ఆశ్చర్యచకితుడయ్యాడు. దీనికి పరిష్కార మార్గంగా ఫౌండ్లింగ్ వీల్ (అనాధ శిశువుల సంరక్షణ కేంద్రం)ను నెలకొల్పాడు. ఇది 12వ శతాబ్దం నాటి మాట. తొమ్మిది శతాబ్దాల క్రితమే శిశువులను అనాధలుగా వదిలివేసే సంస్కృతి మొదలైందన్నమాట. చర్చిలు, కానె్వంట్లు, ఆసుపత్రుల వద్ద ఫౌండ్లింగ్ వీల్ ఏర్పాటు చేయడంతో అనాధ శిశువులకు వరంగా మారింది. తల్లిదండ్రులు సైతం శిశువులను నదిలో విడిచిపెట్టడమో, నిర్జన ప్రదేశాల్లో వదిలేయడమో చేయకుండా ఫౌండ్లింగ్ వీల్‌లోని ఉయ్యాలలో విడిచిపెట్టేవారు. రకరకాల పేర్లతో యూరప్‌లో విస్తృతంగా ఈ కేంద్రాలు వెలిశాయి. ఫౌండ్లింగ్ వీల్ కేంద్రాలు నేటికీ నిరాఘాటంగా కొనసాగడమే కాదు, మరింతగా ఆధునికతను సంతరించుకున్నాయి. ‘మీ శిశువును పారవేయకండి. మాకు అప్పగించండి’ అనే నినాదాలతో శిశు సంరక్షణకు విశేష సేవలందిస్తున్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాలోనూ ఈ సంస్కృతి వేళ్లూనుకుని ప్రశంసలందుకుంటోంది. శిశు హత్యలను నిరోధించే లక్ష్యంగా ఏర్పడిన ఫౌండ్లింగ్ వీల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో చాలా దేశాలు అలాంటి కేంద్రాలను ఏర్పాటుచేశాయి.
లండన్‌లోని 143 ఏళ్ల చరిత్ర కలిగిన ఫౌండ్లింగ్ హాస్పిటల్‌లోని శిశు కేంద్రం ఆధునిక హంగులు, సౌకర్యాలతో శిశు సంరక్షణలో తరిస్తోంది. జర్మనీలో ‘బేబీ హాచ్’ పేరుతో 100, పాకిస్తాన్‌లో 300 వరకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నట్లు అంచనా. జర్మనీలోని బేబీ హాచ్ కేంద్రాల్లో వదిలిన శిశువులకు ఎనిమిది వారాల వయసు వచ్చేలోపు మాత్రమే ఆ శిశువును తల్లి తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఆ శిశువు దత్తత జాబితాలోకి చేరిపోతుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 1638లోనే ఫౌండ్లింగ్ హోమ్ ఏర్పాటైనా అనంతర కాలంలో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. ప్రస్తుతం మాత్రం ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న మహిళలు శిశువు వద్దనుకుంటే అక్కడే విడిచి వెళ్లిపోవచ్చు. బేబీ బాక్సెస్ పేరుతో రష్యా 2011లో పది కేంద్రాలను ప్రారంభించింది. ప్రారంభమైన తొలి నాళ్లలోనే ముగ్గురు శిశువుల ప్రాణాలను ఈ కేంద్రాలు కాపాడాయి.
స్థానికంగా పేర్లు ఏవైనా వీటన్నింటి లక్ష్యం శిశు హత్యల నివారణ, శిశు సంరక్షణ. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25 దేశాల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. బేబీ బాక్స్, బేబీ క్రడిల్ బేబీ ఫ్లాప్ (జర్మనీ, కొరియా), లైఫ్ క్రడిల్, ఫౌండ్లింగ్ వీల్ (ఇటలీ), ద వీల్ (సిసిలీ), స్టార్క్స్ క్రడిల్ (జపాన్), బేబీ పోస్ట్, బేబీ సేఫ్టీ ఐలాండ్ (చైనా), ఝూలా (పాకిస్తాన్), మదర్స్ మోజెస్ బాస్కెట్ (బెల్జియం), విండో ఆఫ్ లైఫ్ (పోలాండ్), వీల్ ఫర్ ఎక్స్‌పోజ్డ్ వన్స్ (బ్రెజిల్, పోర్చుగల్), హోల్ ఇన్ ద వాల్ (దక్షిణాఫ్రికా), ఏంజెల్స్ క్రడిల్ (కెనడా), క్రడిల్ బేబీ (ఇండియా), టర్నింగ్ క్రడిల్ (్ఫలిప్పీన్స్) పేర్లతో ఏర్పాటయ్యాయ.
అనాథలకు ఆత్మబంధువు
పుట్టిన ప్రతి శిశువుకూ జీవించే హక్కును కల్పించేందుకు అనాథ శిశు పథకాలు ఆత్మబంధువులా మారాయి. దిక్కులేని మరణాన్ని రెప్పపాటులో తప్పించేందుకు ఈ పథకాలు పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. కన్నవారు వద్దనుకున్నా తామున్నామంటూ ప్రభు త్వ ఉయ్యాలలు ఆహ్వానం పలుకుతున్నాయి. రెప్ప తెరవకముందే జీవించే హక్కును కోల్పోతున్న వేలాది శిశువులు ప్రభుత్వ సంరక్షణలో ఎదుగుతున్నారు. పిల్లలు లేని దంపతులకు ఈ కేంద్రాలు సంతాన ప్రాప్తిని కలుగజేస్తున్నాయి. దత్తత తీసుకునే దంపతులు పెరుగుతుండటం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం తోడవడంతో పిల్లలు లేని దంపతులకు ఓ వరంలా మారింది.
తల్లిదండ్రులు అకాల మరణం చెందితే పిల్లలు అనాధలుగా మారతారు. కానీ తల్లిదండ్రులు ఉండి, అనాధలుగా మారుతున్నవారే అధిక సంఖ్యలో ఉండటం విషాదం కాక మరేమిటి? భారత్ వంటి దేశాల్లో ఆడపిల్లలను వద్దనుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నవజాత శిశువులు అనాధలుగా మారడమో, మరణించడమో జరుగుతోంది. తమిళనాడుతో మొదలైన అనాథ శిశు సంరక్షణ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటైతే శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముంది. అలాగే బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం కూడా తగ్గుముఖం పడుతుంద నడంలో సందేహం లేదు. పేగుబంధం తెంచుకుంటే తెగేది కాదు. ఎక్కడో ఒంటరిగా వదిలిపెట్టిన శిశువు ఏమైందోనన్న ఆందోళన తల్లిదండ్రులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటివారు తమ తప్పును తెలుసుకుని సంరక్షణ కేంద్రం నుంచి తమ బిడ్డను తిరిగి తెచ్చుకునే వీలు కూడా ఉంది. తాము కన్నబిడ్డ ఎక్కడో పరాయ పంచన పెరుగుతుంటే మాతృత్వ మమకారం వెంటాడుతూనే ఉంటుంది. బాలికా శిశు సంరక్షణ కోసం ఎన్నో పథకాలు, మరెన్నో నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తే మరణాల సంఖ్య తగ్గడమే కాదు, లింగవివక్ష కూడా క్రమేణా తగ్గుముఖం పట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.

అనాథల పాన్పు
ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రదేశాల్లో రోడ్డువైపు ఉన్న గోడకు ప్రత్యేకంగా పెద్ద కిటికీ లాంటిది ఏర్పాటుచేస్తారు. అందులో ఓ ఉయ్యాల ఉంటుంది. బయటినుంచి లోపలికి శిశువును సులువుగా విడిచిపెట్టే రీతిలో అమర్చారు. శిశువు ఉయ్యాలలోకి విడిచిపెట్టిన మూడు నిమిషాల వ్యవధిలోనే అలారం మోగుతుంది. అలారం వినగానే వైద్య సిబ్బంది వచ్చి శిశువుకు తక్షణ వైద్య సహాయంతో పాటు సంరక్షణ బాధ్యతలు చేపడతారు. ఇలాంటి పథకం మధ్యయుగం నాటి కాలంలో పశ్చిమ దేశాల్లో ప్రారంభమై క్రమేణా విస్తరించింది. పాతికేళ్ల క్రితం భారత్‌లో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర పభుత్వం ప్రారంభించి నిరాటంకంగా కొనసాగిస్తోంది.

- ఎస్. మోహన్‌రావు