ఈ వారం స్పెషల్

జగమంత కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏం చేద్దాం..? ఏం చేద్దాం..?
అనుకున్న మార్కులు రాలేదు...ఇంట్లో ఏమంటారో..?
చచ్చిపోవాలనిపిస్తోంది..!’
.. ఒత్తిడితో బాధ పడుతున్న ఓ యువతి ఆలోచనలు- ఆమెను భయం నుంచి మరణం వైపు లాక్కెళుతున్నాయి..
ఆ సమయంలో ఆమెకి కావల్సింది చక్కటి ఓదార్పు. ధైర్యాన్ని నింపే మాటసాయం.
అది ఎవరిస్తారు? తల్లి, తండ్రి లేదా అన్న.. చివరకి తాత లేదా అమ్మమ్మ.. ఎవరో ఒకరు...
***
ఒక మంచిమాట చెబితే చాలు- మనసుకు ఉపశమనం..
నా అన్నవారు నావెనుకున్నారన్న ధైర్యం..
మున్ముందు రాణించాలన్న స్ఫూర్తి.. బతుకుపై ఆశను కలిగిస్తుంది.
మార్కులు ఇవ్వని మార్పును మనసును తాకే మాట ఇస్తుంది..
మమకారం చేసే ఉపకారం ఇది. ఇది కుటుంబం అనే మొక్కకు పూచే కుసుమం.
***
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కోరుకునేది మరోరకం ఊరడింపు..
అలసిపోయి ఇంటికివచ్చిన ఇల్లాలికి కావలసినది మానసిక విశ్రాంతి...
ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలైన తల్లీదండ్రితో కొంతసేపైనా మాట్లాడితే చాలని పరితపించే పిల్లలు మరోవైపు..ఏతావతా వీరంతా ఉన్న ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరిస్తే అది- నిజంగా జగమంత కుటుంబమే. కానీ, ప్రస్తుత ప్రపంచంలో అలాంటి కుటుంబాలు తగ్గిపోతున్నాయి.
***
చక్కటి పొదరిల్లు...
ఆ ఇంట్లో ఓ కుటుంబం..
ఆనందంగా, ఆహ్లాదంగా గడిపేస్తూంటే...
చూసేవారికి ముచ్చటగానే ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి మంచికుటుంబాలు పెద్దసంఖ్యలోనే కన్పించేవి. ఈసడింపులు, ఈర్ష్య, అసూయ, చిన్నచిన్న స్పర్ధలు, ఆర్థిక చిక్కులు ఈ చక్కటి కుటుంబాల్లో చిచ్చురేపినమాట కాదనలేం. ఈ దెబ్బకు ఉమ్మడి కుటుంబాలు ముక్కలైపోయిన మాటా నిజమే. కానీ, కాలపరీక్షలో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ భారతీయ కుటుంబం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారింది. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు చెదరగొడుతూంటే భారతీయ సమాజంలో ప్రేమాభిమానాలు అల్లుకున్న కుటుంబం వర్థిల్లుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే అప్పుడున్నంత విస్తృతంగా నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇప్పుడు చిన్నకుటుంబాలదే రాజ్యం. ఈ పరిణామం వల్ల ఆర్థికంగా ‘్ఫ్యమిలీ’ ఎదుగుతున్నా మానసికంగా బలహీనపడుతోంది. ఈ పరిణామాలు కొన్ని కుటుంబాలను దెబ్బతీస్తున్నాయి. పరిమిత కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇంటి పెద్దలపై పనిభారం పెరిగిపోతోంది. లంకంత ఇల్లయినా మహిళలు, పిల్లలు, పెద్దలకు ఒంటరితనం తప్పడం లేదు. మనదేశంలో ఈ విపరిణామం స్వల్పస్థాయిలోనే ఉంది. కానీ, పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాలు కకావికలమైపోతున్నాయి. భారతదేశంలో కుటుంబ వ్యవస్థను పరిశీలించి, అనుసరించేందుకు ఇప్పుడు ఎనె్నన్నో దేశాలు ఉత్సాహం చూపుతున్నాయి.
‘వసుధైక కుటుంబం’ అన్న మాట
మనం వేల ఏళ్లక్రితం నుంచి చెబుతున్నదే. నేటి ఆధునిక ప్రపంచం ‘కుటుంబం’ విలువేమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే మనదేశంలో అల్లుకున్న కుటుంబ బంధం అంత సులువుగా తెగిపోయేదికాదు. కొనే్నళ్ల క్రితం ‘చిన్నకుటుంబం...చింతలేని కుటుంబం’ అన్న ప్రకటన జనసామాన్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అందరికీ గుర్తే. జనవిస్ఫోటనాన్ని అదుపుచేసేందుకు తలపెట్టిన కార్యక్రమాల ప్రచారం కోసం చేసిన ఆ ప్రకటన లక్ష్యం కుటుంబాన్ని పరిమితం చేసుకోవడమే. ఉమ్మడి కుటుంబాలతో విలసిల్లిన భారతావనిలో ఆర్థికభారం, పాశ్చాత్య జీవనశైలి, తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాలు ‘చిన్నబోయిన’ మాట వాస్తవమే అయినా ఇప్పుడిప్పుడే వాటి విలువ ఏమిటో, వాటి అవసరం ఏమిటో చాలామంది అనుభవంలో తెలుసుకుంటున్నారు. ‘నిండుకుటుంబం’ కోసం తహతహలాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి, అలా చేయకపోతే కలిగే సామాజిక వైఫల్యాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచడానికి ఐక్యరాజ్యసమితి సైతం నడుం బిగించింది.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే సమాజంలో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో ఐక్యరాజ్య సమితి గ్రహించింది. ఒంటరితనం, వ్యసనాలకు బానిసలు కావడం, మానసిక కుంగుబాటు, పెద్దలు, పిల్లలను పట్టించుకునేవారు లేకపోవడం, మహిళలపై పనిభారం పెరిగిపోవడం, వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. సగటు కుటుంబంలో యజమాని సంపాదన బాధ్యత తీసుకుంటే ఇల్లాలు కుటుంబాన్ని నిర్వహించడాన్ని బాధ్యతగా తీసుకుంటోంది. ఆధునిక ప్రపంచంలో ఇల్లాలు కూడా సంపాదనలో పడుతోంది. ఇంట్లో దంపతులు ఇద్దరూ పనికి వెళ్లినప్పుడే సమస్యలు మొదలవుతున్నాయి. పిల్లల పెంపకం, వృద్ధులను చూసుకోవడం పెద్దసమస్యగా మారుతోంది. కుటుంబ బంధాన్ని ఈ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. సమాజంలో కుటుంబ వ్యవస్థను కుదిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని కాపాడుకునే బృహత్తర బాధ్యతను ఐక్యరాజ్య సమితి నెత్తికెత్తుకుంది. కుటుంబ వ్యవస్థను ఎందుకు కాపాడుకోవాలో వివరిస్తూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ఏటా మే 15వ తేదీని ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’గా పరిగణించి ప్రజాచైతన్యానికి విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ఏటా ఒక అంశాన్ని ‘్థమ్’గా ప్రకటిస్తోంది. ఈ ఏడాది నినాదం- ‘హెల్తీ లైవ్స్ అండ్ సస్టెయినబుల్ ఫ్యూచర్’. ఆరోగ్యకరమైన జీవితాలు, స్థిరమైన భవిష్యత్తుతోకూడిన కుటుంబం కోసం జనచైతన్యానికి ఐరాస కదులుతోంది, అందర్నీ కదిలిస్తోంది.
కుటుంబం అంటే...
ఓ ఆడామగ జంట, వారికి పుట్టిన సంతానం ఓ చోట నివసిస్తూంటే దానిని ‘కుటుంబం’గా చెబుతారు. కొన్ని తరాల వారంతా కలసి ఉంటే ‘ఉమ్మడి కుటుంబం’గా చెప్పుకుంటాం. భారతీయ సంస్కృతిలో కుటుంబానికే ప్రాధాన్యం. ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అనురాగ బంధం అల్లుకుంటుంది. కష్టసుఖాలను పంచుకోవడం, ఒకరికొకరు తోడునీడగా ఉండటం, బరువుబాధ్యతల పంపకం, పని విభజన అంతా దాదాపుగా సంప్రదాయంగా వస్తున్న పద్ధతుల్లో సాగిపోతూంటుంది. ఆధునిక జీవనవిధానంలో కొన్ని మార్పుల ఫలితంగా పరిమిత కుటుంబాలు ఎక్కువయ్యాయి. అవసరాలు పెరిగిపోయాయి. కుటుంబంలో ఎక్కువమంది పనిచేయాల్సి వస్తోంది. ఖాళీగా కూర్చునే రోజులు పోయాయి. ప్రతి ఒక్కరూ సంపాదనపై దృష్టి పెడుతున్నారు. దీంతో ఇంటిపట్టున ఉండే కుటుంబ సభ్యుల ఆలనాపాలనా చూడటం కష్టమవుతోంది. చూడటానికి ఇది చిన్న సమస్యగానే ఉంటుంది. కానీ- సమాజపరంగా ఇదో పెద్ద విపత్తు. అదెలా అంటే బోలెడంత కథ.. వ్యథ..
ఏం జరుగుతోంది...
ప్రపంచం ఇప్పుడు ఎంతో మారిపోయింది. ప్రగతిపథం వైపు జనజీవన రథం పరుగులు పెడుతోంది. ముందుకు వెళ్లాలంటే మనం కూడా పరుగుపెట్టాల్సిందే. ఆ పరుగులో అలసిపోయినప్పుడు, మనవాళ్లకు దూరంగా వెళ్లినప్పుడు కుటుంబం గుర్తుకువస్తుంది. మనకి దూరంగా ఉండిపోయిన కుటుంబ సభ్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి లేదా ఇష్టాయిష్టాలమేరకు ఓ కుటుంబంలోని ఆడామగ (దంపతులు) పనిచేయాల్సి వస్తోంది. పనివేళలు, ఒత్తిడి వారిపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లోని మిగతా సభ్యుల కోసం తగినంతగా సమయం వెచ్చించలేకపోతున్నారు. మనసులో ఉన్నా ఆ మమకారాన్ని వ్యక్తం చేసే తీరిక ఉండటం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఇది పెద్ద సమస్య. పిల్లల ఆలనాపాలన, ఆరోగ్యం, చదువువంటి అంశాలపై ప్రత్యక్షంగా తల్లిదండ్రుల పాత్ర తగ్గిపోతోంది. బిజీ లైఫ్‌లో ఇది తప్పడం లేదు. ఆప్యాయంగా సుద్దులు, బుద్ధులు చెప్పాల్సినది ‘రొటీన్’ వ్యవహారంగా మారిపోవడంతో పిల్లలు మానసికంగా ఒంటరివారవుతున్నారు. యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నారు. ఇక ఇంట్లో వృద్ధులు ఉంటే వారికి కాలక్షేపం కష్టమైపోతోంది. పలకరించేవారు, పట్టించుకునేవారు లేరన్న దిగులు వారిని మరింత కుంగదీస్తోంది. తమ కొడుకు, కోడలు మంచివారే అయినా, బాగోగులు చూసేవారే అయినా వారికి తీరిక లేక- వృద్ధులు ఓల్డేజ్ హోంలలో గడపాల్సి వస్తోంది. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కుటుంబంలో అందరూ కలసి, హాయిగా గడపాల్సిన చోట హడావుడిగా, చిరాకుగా గడపడం తప్పడం లేదు. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం, బాధ్యతలు పంచుకోవడం, మానసికంగా నేనున్నాననే భరోసా ఇవ్వడం వంటి లక్షణాలు కుటుంబ సభ్యులకు ఉపశమనాన్ని ఇచ్చే అంశాలు. పాశ్చాత్య సంస్కృతిలో ఇది లోపించింది. అక్కడ అన్ని కుటుంబాలు అలా ఉన్నాయని కాదు. చాలా కుటుంబాల్లో పరిస్థితి అది. ఇక్కడ ఒకరికోసం ఒకరు అన్న రీతిలో కుటుంబ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. అక్కడ ఆర్థిక, వ్యక్తిగత ఇష్టాలకే ప్రాధాన్యం. అందువల్ల బలమైన కారణాలు లేకుండానే విడిపోతున్న దంపతులు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. వారికి పుట్టిన పిల్లలు మానసికంగా దెబ్బతింటున్నారు. ఈ పరిణామం సమాజంపై పెనుప్రభావం చూపిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం ఇలా విడిపోయిన కుటుంబాలకు చెందిన పిల్లల్లో 45 శాతం మంది వ్యసనాలకు బానిసలవుతున్నారు. 75శాతం మంది యువత తల్లిదండ్రులతో కలసి ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నప్పటికీ, అలా ఉంటున్నవారి సంఖ్య 40 శాతం లోపే. ముఖ్యంగా అమెరికాలో ఈ పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మహిళలు ఉద్యోగాల్లో చేరినప్పుడు కుటుంబంలో ‘బ్యాలెన్స్’ తప్పుతోంది. కుటుంబ బాధ్యతలతోపాటు ఉద్యోగాలు చేయాల్సి రావడంతో మహిళలపై ఒత్తిడి పెరుగుతోంది.
బాధ్యతలు పంచుకుంటే..
‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు మహిళలూ సంపాదనలో ముందుంటున్నారు. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో విద్య, ఉద్యోగ రంగాల్లో వారికి దండిగా అవకాశాలు వస్తున్నాయి. ఇంటిపట్టునే ఉండటం నచ్చక కొందరు, అవసరమై కొందరు, సరదాగా కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలకు ప్రాధాన్య ఉండే రంగాల్లో ఉద్యోగాలూ పెరిగాయి. ఇల్లాలు ఉద్యోగానికి వెళ్లినపుడు ఇంట్లో ఉండే పిల్లలను ఎవరు చూస్తారన్నది ఇప్పుడు పెద్ద సమస్య. ఈ విషయంలోనే ఆలుమగల మధ్య అంతరాలు పొడసూపుతున్నాయి. అత్తమామల విషయమూ సమస్యగానే మారిపోయింది. ఉద్యోగం చేసే మహిళకు ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ఇప్పుడు ఓ పెద్ద రిలీఫ్. లేదంటే ఆమెపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఉద్యోగినులకు ఇచ్చే సెలవుల విషయంలోనూ మార్పులు రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మెటర్నిటీ లీవ్ విషయంలో మార్పులు రావాల్సి ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పుడిప్పుడే ఇలాంటి మార్పులకు అవకాశం ఇస్తున్నాయి. మెటర్నిటీ సెలవులు పెంచడం, ఆ సమయంలో భర్తకూ సెలవులు మంజూరు చేయడం, పూర్తి జీతంతోపాటు అలవెన్సులు వంటి రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఒకటీ అరా సంస్థలు కాకుండా, అన్నిచోట్లా ఇలాంటి మార్పులు విస్తృతం కావాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలను పట్టించుకునే అవకాశం లేకపోవడంవల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. తగినంతగా సెలవులు దొరకనందున బాలింతలు అనారోగ్యానికి గురవుతున్నారు. భర్త లేదా కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందకపోవడంవల్ల ఇల్లాలు మానసికంగా కుంగిపోతోంది. ఇవన్నీ సమాజానికి భారమవుతున్నాయి. ఒంటరితనాన్ని ఎదుర్కొనే పిల్లలు, పని ఒత్తిడిలో ఉంటున్న మహిళలకు ఇటీవల వస్తున్న చట్టాల వల్ల కొంతలోకొంత మేలు జరుగుతోంది. 1997లో వచ్చిన ‘రీ రిప్రొడక్టివ్ అండ్ ఛైల్డ్ హెల్త్’ (ఆర్‌సిహెచ్) చట్టం, ఆ తరువాత వచ్చిన ‘ది చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్‌హుడ్’ (సిఎస్‌ఎస్‌ఎమ్) చట్టంవల్ల తల్లులు, పిల్లల ఆరోగ్యం, సంరక్షణ మెరుగైంది.
ఇక ఓల్డేజ్ హోంలలో చేరుతున్న పెద్దల మనసులోని భారాన్ని తగ్గించడం ‘కుటుంబం’ వల్లే సాధ్యమవుతుంది కానీ- సమాజం వల్ల కానేకాదు. పిల్లల అల్లరిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులకు దక్కే ఆనందానికి విలువకట్టే షరాబులు ఇంకా పుట్టలేదు. ఆ మధ్య ఓ సినిమాలో వచ్చిన పాటలో పేర్కొన్నట్లు- ‘జగమంత కుటుంబం నాది’.. అన్న భావన అందరిలో పెరుగుతోంది. అలా అనుకోకపోకపోతే- ‘ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ విషాదగీతం ఆలపించుకోక తప్పదు.
*

అమ్మానాన్నతో...

కుటుంబంతో కలసి జీవించడాన్ని ఇప్పుడు అమెరికా యువత ఎక్కువగా కోరుకుంటోంది. విడిపోతున్న తల్లిదండ్రుల వల్ల పిల్లలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అలాంటి పిల్లల విచిత్ర మనస్తత్వం వల్ల సమాజానికి ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం- కుటుంబ వ్యవస్థ వర్థిల్లడమేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థల సర్వేలో తేలిన అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
అమెరికాసహా చాలా దేశాల్లో 56శాతం యువత ఇంటిపట్టున అంటే కుటుంబంతో కలసి ఉండాలని కోరుకుంటోందని ఓ అధ్యయనంలో తేలింది. చిన్నచిన్న మానసిక సమస్యలకు చిటికెలో కుటుంబ సభ్యుల నుంచి పరిష్కారం లభిస్తుందని వారంటున్నారు. కుటుంబంతో కలసి ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని వారంటున్నారు. ఇక దాదాపు అన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లి ప్రేమాభిమానాల కోసం తపించిపోతారట. దాదాపు 63శాతం మంది పిల్లలు తల్లితో చనువుగా, మనసువిప్పి మాట్లాడాలని అనుకుంటారట. అలాంటి తల్లి ఉద్యోగబాధ్యతల్లో మునిగిపోతూంటే వీరంతా విలవిలలాడిపోతున్నారన్నమాటేగా. ఇక 43 శాతం మంది పిల్లలు తండ్రితో చనువుగా, స్నేహంగా ఉండాలనుకుంటున్నారని తేలింది. మిగతా ప్రపంచానికి భిన్నంగా అమెరికాలో కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతోంది.. అదీ ఎంతో వేగంగా. అక్కడ అలా కుటుంబం నుంచి విడిపోయిన వారి (దంపతులు) సంఖ్య 1.8 మిలియన్లు. అక్కడ 67 శాతం మంది పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అదృష్టవశాత్తూ భారతదేశ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అయితే ఇప్పుడిప్పుడే పాశ్చాత్య పోకడలకు కొందరు ఆకర్షితులవుతూండటంతో ఇక్కడి కుటుంబాల్లోనూ కలకలం మొదలవుతోంది.

రావమ్మా మహాలక్ష్మి..

మహిళలే మహరాణులన్నమాట ఇప్పుడు నిజం. ఉద్యోగాల్లో మహిళలకు రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచంలో మహిళలకు ఉద్యోగాలు కల్పించడం ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా 1996లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతం మహిళలకు ఉద్యోగాలు పెరిగాయి. ఇది ఆర్థిక పరంగా శుభసూచకమే అయినా కుటుంబ వ్యవస్థకు ఇది పెద్ద సవాలు విసిరింది. ఇంటిని, కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకునే ఇల్లాలు ఉద్యోగానికి వెళ్లడంతో వారంతా ఒంటరితనాన్ని భరించాల్సి వస్తోంది. అమెరికాలో ఇది పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ప్రపంచంలో మహిళలకు ఉద్యోగాల్లో ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్న దేశాల్లో స్కాండినేవియా మొదటిస్థానంలో ఉండగా కెనడా రెండో స్థానంలో ఉంది. అమెరికా మూడోస్థానంలో ఉంది. ఈ రెండు దేశాల్లోకన్నా అమెరికాను ఈ పరిణామం ఎక్కువ కలవరపరుస్తోంది.

-కృష్ణతేజ