ఈ వారం స్పెషల్

కలల బేహారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలలు నిజమవుతాయా?
ఎవరు చెప్పొచ్చారు అంటే కుదరదు..
ఇప్పటి తరం కంటున్న కలలు నిజమవుతున్నాయి మరి.
అవి నిజమయ్యేవరకు కలలోకూడా వారు ఆ విషయాన్ని మరచిపోవడం లేదు. లక్ష్యం చేరేవరకు వారు అసలు పడుకుంటే కదా. కొత్త కలలు రావడానికి, పాత కలను మరచిపోవడానికి.. జీవితం ఎలా ఉండాలో, తను భవిష్యత్‌లో ఎలా బతకాలో, అందుకు ఏం చేయాలో అనే విషయంలో యువతరం పెద్దకలలే కంటున్నారు. అతికష్టమైన లక్ష్యాలనే ఎంచుకుంటున్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
తొలి ప్రయత్నంలో రాకపోతే నిరుత్సాహపడటం లేదు. పట్టువదలని విక్రమార్కుల్లా...అనుకున్నది సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెండోసారి, మూడోసారి ఇలా ఎన్ని అవకాశాలుంటే అన్నీ వదలకుండా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. తమ గమ్యం చేరడానికి ఏవీ వారిని అడ్డుకోలేకపోతున్నాయి. వైకల్యం, అనారోగ్యం, పేదరికం, కులం, మతం, ప్రాంతం, లింగబేధం.. ఇవేవీ వారికి అడ్డంకి కావడం లేదు. ఉన్నత లక్ష్యం, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నవారికి గతంకన్నా సమాజం నుంచి మద్దతు, స్ఫూర్తి, తోడ్పాటు పుష్కలంగా అందుతున్నాయి కూడా. అందుకే తమ కలలను వారు దాచుకోవడం లేదు. తామేం చేయాలనుకుంటున్నారో, ఎలా సాధించాలనుకుంటున్నారో తల్లిదండ్రులకు ముందే చెప్పేస్తున్నారు. వారిలో సందేహాలుంటే వీరే ధైర్యం చెబుతున్నారు. రంగంలోకి దిగుతున్నారు. ఆర్థికసహాయం కావాలంటే నోరు విడిచి అడుగుతున్నారు. శిక్షణ కావాలంటే వందల మైళ్ల దూరం వెళ్లి నేర్చుకుంటున్నారు. ఇంటాబయటా సమస్యలు చుట్టుముడుతున్నా... అదరకబెదరక అడుగు ముందుకే వేస్తున్నారు. ఇవన్నీ నిరూపితమైన వాస్తవాలు. పదవతరగతి విద్యార్థి నుంచి సివిల్స్‌కు పరీక్షలు రాసిన అభ్యర్థులలో ఎందరో తమ కలలను సాకారం చేసుకున్నవారు ఉన్నారు. ఈ ప్రయత్నాలలో ఏదో ఒక ఉన్నతస్థాయి ఉద్యోగం వచ్చినా, చేస్తున్నా అంతటితో ఆగిపోక, తృప్తిపడిపోక.. తమ అసలు కలను నిజం చేసుకునేందుకు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరికొందరికి ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా వాటిలో ఇమిడిపోయి ఇరుక్కుపోక.. తమ లక్ష్యం చేరేందుకు ప్రయత్నాలు మానడం లేదు. చివరకు చాలామంది తమ కలలను నిజం చేసుకుంటున్నారు. వారి విజయగాథలు ఈ విషయాలను నిరూపిస్తున్నాయి. ఉత్తేజం నింపుతున్నాయి. అమెరికాలో డాలర్లు కురిపిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదలి సేంద్రియ వ్యవసాయం చేసేందుకు దేశానికి తరలివస్తున్న కుర్రాళ్లు రైతులుగా మారిపోయి లాభాలు పండిస్తున్నారు. నిరక్షరాస్యులైన రైతుల పిల్లలు మెడిసిన్ సీటు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఊహించడానికే ఇష్టపడని పేదలు.. వారి పిల్లలు ఇప్పుడు విశ్వాసంతో పెద్దలక్ష్యాలతో యుద్ధమే చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పోకడలున్నా ఎక్కడో ఒకరూఇద్దరూ సంచలనాలు రేపేవారు. ఇప్పటి తరం అలా లేదు. అవకాశాలు పెరిగాయి, వాటిని అందిపుచ్చుకునేందుకు ఏ ఛాన్స్‌నూ వదులుకోడానికి ఈ తరం సిద్ధంగా లేదు. వేర్పాటువాదం, తీవ్రవాదంతో అట్టుడుకుతున్న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఏడాదిలో చదువు సాగేది కొద్దిరోజులే. స్వేచ్ఛగా అడుగు బయటపెట్టడమే కష్టంగా భావించే కాశ్మీర్ కుర్రకారు ఆలోచనా ధోరణిలో పెద్దమార్పే కనిపిస్తోంది. అక్కడి విద్యాసంస్థలకు నెలలకు నెలలు సెలవులే. కానీ ఈసారి సివిల్స్ ఫలితాలు పరిశీలిస్తే ఆశ్చర్యంతో కళ్లు విప్పారుతాయి. అక్కడి నుంచి పరీక్షలు రాసిన 11మందికి సివిల్స్‌లో అవకాశం వచ్చింది. ఇక జెఇఇ పరీక్షల్లో పెద్దసంఖ్యలోనే అక్కడి యువతరం అవకాశాలు దక్కించుకుంది. ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ పరీక్షలకూ వారు పెద్దసంఖ్యలోనే హాజరవుతున్నారు. అంతెందుకు మావోయిస్టుల ఆగడాలతో తల్లడిల్లే బస్తర్ ప్రాంతం (చత్తీస్‌గఢ్)నుంచి అమ్మాయిలు సివిల్స్ పరీక్షలకు శ్రద్ధగా సిద్ధమవుతున్నారు. అక్కడి కలెక్టర్ సౌరభ్ అలా ప్రిపేర్ అవుతున్నవారికి స్వయంగా మెలకువలు బోధిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాకు చెందిన నమ్రత ఈసారి సివిల్స్ (2016)లో 99వ ర్యాంకు సాధించింది. రెండో ప్రయత్నంలో ఆమె ఈ విజయం సాధించారు. భిలాయ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకుంది. రక్తపాతంతో తడిసిముద్దయిన తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తనలాంటివారు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో చేరాలన్నది ఆమె భావన. అదే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా ఆమెకు అండగా నిలిచారు. ఆమెలా పెద్దలక్ష్యాలతో సిద్ధమైన యువతరానికి ‘లక్ష్య’ పేరుతో శిక్షణ, మోడల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిజానికి నమ్రత సివిల్స్ పరీక్షలు రాసేందుకు శిక్షణ కోసం ఢిల్లీలో కొన్నాళ్లు ఉన్నారు. కానీ నక్సల్స్ చర్యలతో సతమతమయ్యే తన సమాజంలో వాస్తవాలు స్వయంగా తెలుసుకోవాలన్న అభిలాషతో ఆమె మళ్లీ జిల్లాకు వచ్చి ‘లక్ష్యా’న్ని పూర్తి చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు పలాస శివారు గ్రామానికి చెందిన చెందిన రోణంకి గోపాలకృష్ణ సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నిరక్షరాస్యులైన వెనుకబడిన వర్గానికి చెందిన రైతుకుటుంబం నుంచి వచ్చి, గ్రామం కట్టుబాట్ల కారణంగా వివక్షకు గురై ఒంటరి కుటుంబంతో గడిపి ఈ ఏడాది సివిల్స్‌లో మూడోర్యాంకు సాధించిన గోపాలకృష్ణ తెలుగుభాష మాధ్యమంలో పరీక్షలు రాశారు. ఇంటర్వ్యూకూడా అదే మాధ్యమంలో ఎదుర్కొన్నాడు. చివరకు మూడో ప్రయత్నంలో ఐఎఎస్‌కు అత్యుత్తమ ర్యాంకు (3)తో ఎంపికయ్యాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆయన ఈ ఘనత సాధించాడు. గ్రామంలో ఎదురైన కష్టాలు, పేదరికం, వెనుకబడినవర్గం అన్న ఆత్మన్యూనత దరిచేరనివ్వకుండా తెలుగు భాషపై అపారమైన మమకారంతో పట్టు సాధించి తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకున్న గోపాలకృష్ణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాడు. ఇష్టపడి, కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనన్నది అతడి విశ్వాసం. అతడి విషయంలో అది నిరూపితమైందికూడా. స్వాభిమానం, దేశభక్తి, మాతృభాషాభిమానం ఆయనకు ఆయుధాలైనాయంటే నమ్మాలి. సరే, అలాంటి గోపాలకృష్ణకు స్ఫూర్తిదాతగా, మార్గదర్శిగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన బాలలత మల్లవరపు సాధించిన విజయానికి వెలకట్టలేం. ఆమె దివ్యాంగురాలు. నాగోల్‌కు చెందిన 35 ఏళ్ల బాలలత 2009లో సివిల్స్ రాశారు. అప్పుడు 399 ర్యాంకు వచ్చింది. ఐఎఫ్‌ఎస్‌లో శిక్షణ పొంది ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌కు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నవారికి ఆమె మెంటార్‌గా వ్యవహరించేవారు. వెంటపడి వారిని ప్రోత్సహిస్తూ సందేహాలు నివృత్తి చేసేవారు. గత ఏడేళ్లుగా ఆమె ఈ పనిచేస్తూనే ఉన్నారు. అక్కడితో ఆమె ఆగిపోలేదు. తన అసలు లక్ష్యం ఐఎఎస్. అందుకే 2016 సివిల్స్ రాశారు. గోపాలకృష్ణ ఇంటర్వ్యూకు వెళ్లినరోజే ఆమెకు కూడా అవకాశం వచ్చింది. ఈసారి ఆమె 167వ ర్యాంకు సాధించారు. దేశంలో మహిళలు, ముఖ్యంగా దివ్యాంగులపట్ల సమాజవైఖరిలో గుణాత్మక మార్పు తీసుకురావడం తన లక్ష్యమని ఆమె చెబుతారు. గోపాలకృష్ణకు ఆమె కేవలం విద్యాంశాలే కాకుండా వ్యక్తిత్వ పాఠాలు చెప్పారు. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన పంజాబ్‌కు చెందిన అన్‌మోల్ షేర్‌సింగ్ బేడి తొలిప్రయత్నంలోనే సివిల్స్ రెండోర్యాంకు సాధించాడు. ఇంటర్‌లో ఉండగానే అతడి దృష్టి సివిల్స్‌పైకి మళ్లింది. ఇంజనీరింగ్‌పై ఆసక్తి ఉన్నా చదువుపూర్తయ్యేసరికి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో చేరితే ఏదైనా సాధించవచ్చనుకున్నాడు. ఆ దిశగా తొలిప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఇక ఈ ఏడాది సివిల్స్‌లో తొలిర్యాంకు సాధించిన నందిని కథ చాలామందికి స్ఫూర్తినిస్తుంది. కర్నాటకలోని కోలార్‌కు చెందిన నందిత ఇంటర్, ఉన్నతవిద్యలో గోల్డ్‌మెడల్స్ సాధించింది. సివిల్ సర్వీసుల్లో చేరాలన్నది ఆమె లక్ష్యం. మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడో ప్రయత్నంలో 849వ ర్యాంకు వచ్చింది. 2014లో ఆమె ఐఆర్‌ఎస్‌లో చేరి ప్రస్తుతం శిక్షణ కొనసాగిస్తోంది. ఫరీదాబాద్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్, నార్కొటిక్స్‌లో ఆమె ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఎఎస్ కావాలన్న కలను నిజం చేసుకోమని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో గత ఏడాది నాలుగోసారి సివిల్స్ రాశారు. ఇక్కడ ఓ విశేషం చెప్పుకోవాలి. మధ్యతరగతి ఒబిసి వర్గానికి చెందిన నందిన తల్లి గృహిణి. తండ్రి ప్రభుత్వ టీచర్. ఆంధ్రకు చెందిన గోపాలకృష్ణ మాదిరిగానే స్వభాష కన్నడ మాధ్యమంలో ఆమె పరీక్షలకు హాజరైంది. ఏకంగా మొదటి ర్యాంకును కొట్టేసింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆమె అసలు కల నిజం చేసుకోవడంలో విజయం సాధించింది. ఏదో ఒకచోట ఆగిపోకుండా తమ కలను నిజం చేసుకోవాలన్న తపన గత పదేళ్లుగా యువతరంలో పెరిగింది. ఇప్పుడు అది మరింత విస్తృతమైంది. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండిగా పనిచేస్తున్న డాక్టర్ క్రిస్టినా జడ్. చొంగ్తు అలాంటి ఉదాహరణే. ఆమె వైద్యవిద్య అభ్యసించారు. కానీ సివిల్స్ లక్ష్యం. ఈశాన్య భారతంలోని మిజోరానికి చెందిన ఆమె తల్లిదండ్రులతో అనంతపురం జిల్లాలో ఉండేది. తండ్రి ఐపిఎస్ అధికారి. ఆమె చదువంతా అనంతపూర్, గుంతకల్‌లో సాగింది. ఆ తరువాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ కలెక్టర్‌గా రాణిస్తున్న యోగితారాణా కూడా అంతే. ఆమె మొదట ఎంబిబిఎస్ చేశారు. ఆ తరువాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. కాశ్మీర్‌కు చెందిన యోగిత ఇప్పుడు తెలంగాణలో అత్యుత్తమ అధికారిగా పేరుపొందారు. మెడిసిన్ పూర్తిచేసిన చాలా సంవత్సరాల తరువాత ఆమె సివిల్స్‌కు వెళ్లి నెగ్గడం విశేషం. ఢిల్లీకి చెందిన ఆర్యన్ మిశ్ర అనే పద్నాలుగేళ్ల కుర్రాడు మరో ఉదాహరణ. అతడి తండ్రి పేపర్లు పంచే హాకర్. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. కానీ ఆర్యన్‌కు సైన్స్ అంటే ఇష్టం. అంతరిక్ష పరిశోధనలంటే మక్కువ. మామూలు చదువులు పూర్తి చేసి కొడుకు నాలుగురాళ్లు సంపాదిస్తే చాలు అని తల్లిదండ్రుల భావన. కానీ ఆర్యన్ ఆగలేదు. తల్లిదండ్రులను ఒప్పించి ఇంటర్ చదువుతూనే జాతీయ స్థాయిలో జరిగిన ఆస్టరాయిడ్స్‌ను కనిపెట్టే పోటీలో పాల్గొని మొదటి బహుమతి పొందాడు. అంతవరకు అతడి ఊరూపేరూ తెలీని ప్రపంచం అతడివెంట పడటం ప్రారంభించింది. పద్నాలుగేళ్ల వయసులో అతడు ఎవరూ గుర్తుపట్టని, భూమికి చేరువుగా తిరుగుతున్న ఓ ఆస్టరాయిడ్‌ను గుర్తించడమే అతడిని హీరోను చేసింది. ఇప్పుడు ఇప్పుడు శిక్షణ పొందుతున్న వ్యోమగాములు, అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన వ్యోమగాములు, నాసా, ఇస్రో శాస్తవ్రేత్తలతో తరచూ భేటీ అవుతూంటాడు. మరెందరికో సందేహాలు తీరుస్తూంటాడు. మిశ్రా తల్లిదండ్రుల ఆనందానికి హద్దేలేదు. ఆర్యన్ ప్రస్తుత వయస్సు 17 ఏళ్లు. తీరికలేని శాస్తవ్రేత్త. ఇదీ జీవితం అంటే నిరూపించిన పేదింటి పిల్లాడు అతడు. అలాంటివారికి మనదేశంలో కొదువేలేదు. యువతరంతో ఉరకలు వేస్తున్న నవభారతంలో మునుముందు అంతులేని ఆవిష్కరణలకు శుభసూచకాలు ఇవన్నీ. కాదని ఎవరనగలరు చెప్పండి.
*
విధిని ఎదిరించిన విజేతలు
ఒక్క సివిల్స్ అనేకాదు. ఇతర పరీక్షల్లోనూ యువత అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. రాంచికి చెందిన తుషార్ రిషి, కృష్ణగిరికి చెందిన ఎం.వి.దర్శన సిబిఎస్‌సి 12వ తరగతిలో ఈ ఏడాది అద్భుత విజయం సాధించారు. తుషార్ బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. గతేడాది దీనివల్ల పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. కానీ ఈసారి 96.2 పర్సంటైల్‌తో విజయం సాధించాడు. 11 నెలల కీమోథెరపీ తీసుకున్నాక పరీక్షలు రాసి ఫలితం సాధించాడు. ఇక దర్శన దృష్టిదోషంతో బాధపడుతున్నా అత్యుత్తమ పర్సంటైల్‌తో ఆ పరీక్షల్లో విజయం సాధించి దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంది.
*
విజయాల్లో సూపర్ 30
ఐఐఎమ్‌లలో చేరిక కోసం జెఇఇ పరీక్షలు రాయాలనుకునే పేద, నిమ్నవర్గాలకు చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న సంస్థ ‘సూపర్-30’. ఆనంద్‌బాబు అనే యువకుడు ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. బిహార్‌లోని పాట్నా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. దేశంలో ఏ ప్రాంతం వారైనా పేదలై, ప్రతిభ ఉండి కోచింగ్ తీసుకునే ఆర్థికస్థోమత లేనివారిలో అన్ని ప్రాంతాలకు చెందిన 30మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. ఆనంద్‌బాబు తల్లి వీరందరికీ వండిపెట్టడం మరో విశేషం. ఈ సంస్థ ప్రారంభమైన తరువాత ఒకటి, రెండు బ్యాచ్‌లలో సగానికి పైగా సీట్లు సాధించగలిగితే ఆ తరువాత దాదాపు అన్నిసార్లు ప్రతిబ్యాచ్‌లో అందరూ జెఇఇ సీట్లు సాధించారు. ఈసారి ఏకంగా మొదటి ర్యాంకుతోపాటు అందరూ అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. సూపర్ 30 నిర్వాహకుడివల్ల వ్యాపారం దెబ్బతిన్నవారు అతడిని హతమార్చేందుకు దాడులు చేసి బెదరించినా అతడు, అతడి తల్లి వెనక్కుతగ్గలేదు. బిహార్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. ప్రభుత్వ నిధులను తిరస్కరించిన ఆనంద్‌బాబుపై సూపర్ 30 సీట్ల సంఖ్యను పెంచాలన్న ఒత్తిడి ఉంది. అయినా అతడు తన లక్ష్యాన్ని మార్చుకోలేదు.
*
ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైనా...
ఐఎఎస్ నా లక్ష్యం. 2015లో సివిల్స్ రాశా. మెయిన్స్‌లో విఫలమయ్యా, 2016లో ఐఎఫ్‌ఎస్‌కు ఆలిండియా 29వ ర్యాంకు సాధించా. ఎస్‌ఎస్‌సికి సెలక్ట్ అయ్యా. ఇవేవీ నా లక్ష్యం కాదు. ఐఎఎస్ సాధించాలంతే. తండ్రి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే బలం. హైదరాబాద్‌లోని లక్ష్మయ్య ఐఎఎస్ స్టడీసర్కిల్‌లో కోచింగ్ తీసుకుంటున్నా. ఈసారి అనుకున్నది సాధిస్తానన్న నమ్మకం ఉంది.
-షణ్ముఖకుమార్, హైదరాబాద్
*
స్మార్ట్ జనరేషన్
దేశంలో ప్రస్తుత యువతం ‘స్మార్ట్’గా వ్యవహరిస్తోంది. లక్ష్యంపై వారికి స్పష్టమైన దృక్పథం ఉంది. కష్టపడే తత్వమూ ఉంది. నిరుత్సాహాన్ని దగ్గరికి రానివ్వకుండా, ప్రణాళికాబద్ధంగా చదివితే సివిల్స్‌లో చోటు సాధ్యమే. ఈ పరీక్షలకు ప్రిపేర్ అవడం వల్ల నష్టపోయేది ఏమీ ఉండదు. ఈ శిక్షణ ఇతర పరీక్షలకు ఉపయోగపడుతుంది. నావరకు నేను ఎంబిబిఎస్ చేసినా, సివిల్స్ లక్ష్యాన్ని మరువలేదు. సాధించేదాకా ప్రయత్నిస్తూనే ఉన్నా. డాక్టర్‌గా ఉన్న అనుభవానికి ఐఎఎస్‌గా అధికారం తోడవడంతో ప్రజాసమస్యల పరిష్కారం సులవుతోంది. ప్రజలకు మేలు చేయగలుగుతున్నా
-యోగితారాణా, కలెక్టర్, నిజామాబాద్
*
ఎంబిబిఎస్ చేసినా..
ఎంబిబిఎస్ పూర్తిచేసి రెండేళ్లయింది. ఎందులోనూ చేరలేదు. ఐఎఎస్ సాధించడమే నా గోల్. అందుకోసమే ప్రిపేర్ అవుతున్నా. 2016 సివిల్స్‌లో 282 ర్యాంకు సాధించా. ఈ ర్యాంకుకు సివిల్ సర్వీసుల్లో ఏదో ఒకటి వస్తుంది. కానీ నా లక్ష్యం ఐఎఎస్. సాధిస్తాననే విశ్వాసం ఉంది. పట్టుదలతో, సమయం వృథా చేసుకోకుండా చదివితే సాధ్యమే.
-డాక్టర్ జి.పూజిత, హైదరాబాద్
*
ఒక ప్రయత్నం విఫలమైనా..
ఐఎఎస్ సాధించడమే లక్ష్యం. ఢిల్లీలోని వాజిరామ్ అండ్ రవి శిక్షణ కేంద్రలో చేరా. 2015 ప్రిలిమ్స్‌లో నెగ్గా. మెయిన్స్‌లో కొద్దిలో ఛాన్స్ మిస్ అయ్యా. ఈసారి తప్పక సాధిస్తానన్న విశ్వాసం ఉంది. తండ్రి ఎంజారప్ప తెలుగు, కన్నడ సినీరంగాల్లో నిర్మాత. తమ్ముడు కార్తీక్ సినీనటుడు. నాకు మాత్రం ఆ రంగంపై ఆసక్తిలేదు. దృష్టంతా సివిల్స్‌పైనే.
బి.ఇ.హితేష్, బెంగళూరు.

-ఎస్.కె.రామానుజం ఇన్‌పుట్: నాగవాణి, జావిద్