ఈ వారం కథ

పిల్లల నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీల్ ముభావం లలితను కలవరపెడుతున్నది. ఎన్ని సార్లు పిలిచినా అంతగా మాట్లాడడం లేదు. అడిగిన దానికి జవాబు చెబుతున్నాడు. పెట్టింది తింటున్నాడు. స్కూల్‌కు వెళ్తున్నాడు. వస్తున్నాడు. ఆటలు ఆడడానికి కూడా వెళ్లడం లేదు. ఎందుకురా అంటే ‘నీవే గదా చదువుకో అన్నావు అందుకే ఆటకు వెళ్లడం లేదు’అన్నాడు.
అన్నీ సజావుగా ఉన్నట్టే ఉన్నాయి కాని నాకే మనసు అనీల్ చుట్టూనే తిరుగుతోంది. నా వల్లనే ఈ అనీల్ ఇలా తయారు అయ్యాడా పదేపదే నా మనసు నన్ను ప్రశ్నిస్తోంది.
ఆఖరికి నిద్రపోతున్నా కూడా ఈ ఆలోచన నన్ను వదలడం లేదు.
అంతలో అమ్మ దగ్గర నుంచి ఫోన్. అమ్మ చెప్పిన మాటలు విని నేను మాన్ప్రడి పోయాను. అసలు నమ్మలేదు. ‘ఏంటమ్మా నీవు చెప్పేది నిజమేనా ’పదిసార్లు అడిగాను. అమ్మ ఎన్నిసార్లు చెప్పను అంది. అమ్మవాళ్లకు ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రతిమ అని అమ్మ నాన్న అంటుంటే నేను అసలు ఆ చిన్న పిల్లకు అసలు ఏమైంది నా మనసు ఆందోళనగా మారిపోయింది. పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చేసాను.
నేను వచ్చేసరికి ‘వెరీగుడ్. చెప్పినట్టు చేశావు. ఇప్పటికీ మేటర్ ఇక్కడి దాకా వచ్చి ఉంటుంది. సాయంత్రానికి కానీ నా దాకా రాదు. మంచిది ఇప్పుడు తిక్క కుదురుతుంది’అంటున్నాడు. బెల్ మోగించి బోయిన నేను అనీల్ మాటలు విని ఆగిపోయాను. సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసిన శబ్దం విన్నాను. లోపలికి అడుగు పెట్టాను.
అనీల్ ముఖాన్ని చూశాను. ఏదో సాధించానన్న ధీమా కనిపిస్తోంది వాడి ముఖంలో. ఏదో తృప్తి.. మరేదో సంతోషం వాడి ముఖంలో దాద్దామన్నా ఆగకుండా కనిపిస్తోంది.
కాని చాలా మామూలుగా ఉన్నాడు. కనీసం తొందరగా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అనుకొన్నాను. కానీ వాడేమీ అనలేదు. పైపెచ్చు పుస్తకాలు పట్టుకుని కూర్చున్నాడు.
ఇక నేనేమీ అనలేదు.
***
పరమేశ్వర్ వచ్చాడు. అంతా మామూలే. తినడం, మాట్లాడడం అయిపోయాయి. బెడ్ చేరాము. పరమేశ్వర్‌నే అడిగాడు. ‘ఏంటి ముభావంగా ఉన్నావు. ఏదైనా సమస్యనా?’ నాకు చెప్పాలని కాని, చెప్పబల్లేదని కానీ లేదు. ఏం చెప్పాలో తెలియడం లేదు. అందుకే ఏంటంటే దగ్గరే ఆగిపోయాను.
‘సమస్య ఏంటో చెబితే నేను పరిష్కార మార్గం చూపడానికి ప్రయత్నిస్తాను’అన్నాడు పరమేశ్వర్.
‘అది కాదండీ.. ఏంటంటే అనీల్ .. ’ అనబోతుండగానే
‘ఆఁ నాకు తెలుసు... వాడు నీమాట వినడంలేదు. ఆటలు ఎక్కువైయ్యాయి. చదువులో వెనుకబడి ఉన్నాడు’ అన్నాడు
‘అదికాదండీ వాడు చదువుతున్నాడు. నా మాట కూడా వింటున్నాడు. కానీ ఈమధ్య ఎందుకో ముభావంగా ఉంటున్నాడు’అన్నాను.
‘నీకు ఎందుకు ఎప్పట్నుంచి అనిపిస్తోంది ’అన్నాడు
‘అదే వాళ్ల నానమ్మ తాతయ్య ఊరికి వెళ్లిపోయారు కదా అప్పట్నుంచి’ అంతే పరమేశ్వర్ కూడా వౌనంగా ఉన్నాడు.
‘ఓహో మీకు కూడా నామీద కోపంగా ఉందా. తెలిసింది. మీరే వాడికి చెప్పారా’ అన్నాను.
‘అదికాదు లలితా. నేనంటే నువ్వు చెప్పినట్లు వినడం అలవాటు చేసుకొన్నాను. వాడింకా చిన్నవాడు కదా. అందుకే వాడిని ఎక్కువగా దగ్గరకు తీసే నాన్నమ్మ దూరంగావెళ్లేసరికి వాడికి బాధగా ఉన్నట్టుంది. పోనీలే కొద్దిరోజులు తర్వాత వాడు బాగయి పోతాడు. నీవు పట్టించుకోకు’ అంటూనే అటు తిరిగి పడుకొండిపోయాడు.
ఇక నాకేమీ చెప్పాలనిపించలేదు.
***
తెల్లవారింది. ఎప్పటిలా అన్నీ పనులు సజావుగా సాగిపోతున్నాయి. నేనూ ఆఫీసుకు వచ్చాను. అమ్మ దగ్గర నుంచి కాల్. ‘అమ్మా.. ’ ‘ఆఫీసుకు చేరావనుకొంటాను. మీఅత్తగారు వాళ్లు మీ ఆడబడుచుదగ్గర సెటిల్ అయ్యారా’ అంది. ‘లేదమ్మా! వాళ్లు మేము పల్లెలో ఉంటాం అని వెళ్లిపోయారు. ’అన్నాను. ‘అవునా. నిజమే వాళ్లకైతే పొలం పుట్రా ఉన్నాయి. చిన్నదో పెద్దదో ఇల్లుంది. కానీ మాకే.. మీ నాన్న ఆఫీసు లో ఉద్యోగం అంటూ ఊరూరు తిరిగారు. మేము మీకు పెళ్లిళ్లు పేరంటాలు చేసేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. సరే కొడుకు ఉన్నాడు కదా మాకేం దిగులు అని ఇన్నాళ్లు ఉన్నాం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీ అనే్న ఎప్పుడైనా మమ్ముల్ను విసుక్కున్నాడు కానీ కోడలు ఎప్పుడూ విసుక్కోలేదు. మాకు కావలసినవి వండి పెట్టేది. అన్నీ బాగోగులు చూసేది. మా కోడలు బంగారం అని మేము అందరికీ చెప్పుకునేవాళ్లం. కానీ ఇపుడే పిదప కాలం పిదప బుద్ధులు వచ్చాయి. ’ అమ్మ అడ్డు అదుపూ లేకుండా చెబుతూనే ఉంది. మధ్యలో అమ్మ వాక్ ప్రవాహానికి అడ్డుకట్టవేసి నేను ఆఫీసు పనిలో పడ్డాను. కానీ నాకు ప్రతిమ అన్నదన్న మాటలే కొరుకుడు పడడం లేదు. ఆ పిల్ల కేమైంది. నాన్నమ్మమీద ఎందుకంత కక్ష.
ఆరోజు ఒంట్లో బాగోలేదన్న కారణంతో ఇంటికి వచ్చాను. ‘ఏం కాలేదు. తెలిసినట్టు లేదు. తెలిసినా ఏం చేయాలో అనుకుంటున్నాదేమో అగ్గువైతే అంగట్లోకి వస్తుంది గదా అనేది మా నాన్నమ్మ. తొందరలేదు. నేను చెప్పినట్టే నీవు చేయి’ అనీల్ గొంతు మళ్లీ
నాకు విషయం అర్థం కావడంలేదు. అంతలో అమ్మ ఫోను.
నేను అమ్మవాళ్లను రమ్మని చెప్పాను రాత్రి పడుకుంటూ పరమేశ్ తో అన్నాను. ‘దానికి నాకు చెప్పడం ఎందుకు ’ అన్నాడు పరమేశ్వర్
‘అంటే వాళ్లు వచ్చేది నన్ను చూడడానికి కాదు. ఇక్కడే ఉంటారు. వాళ్లకు వాళ్ల కొడుకుకోడలితో పడడం లేదట. ఇక్కడ కూడా అత్తయ్య వాళ్లు లేరు కదాఅందుకనీ...’ అన్నాను.
‘నాకు నిద్రవస్తోంది’ అనేసి అటు తిరిగి పడుకున్నాడు పరమేశ్వర్
ఇంతకీ ఇతనికి వాళ్లు రావడం ఇష్టమా కాదా అని నాకు తెలియలేదు. అయినా నేను మా అమ్మను నాన్నను చూడాలి కదానాకు నేను చెప్పుకున్నాను.
పొద్దునే్న అనీల్ తో ‘నాన్నా! మీ అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు. నీవు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్లు వచ్చేస్తారు. ’అన్నాను.
‘వాళ్లు ఎప్పుడు వెళ్తారు అమ్మా’ వాడి కొశ్చిన్ విని నేను నిలబడిపోయాను. షూ వేసుకొంటున్న పరమేశ్వర్ కూడా ఒక్కక్షణం ఆగాడు.
‘అదేంటిరా అలా అనేశావు. వాళ్లు నీకోసమే వస్తున్నారు.’
‘నాకోసమా? నేను బాగానే ఉన్నాను కదా. అయినా వాళ్లు వచ్చి నాకు చేసేది ఏముంది?’ అన్నాడు.
ఇదేంటి వాళ్లు రావడం వీడికి ఇష్టం లేదా నా మనసు రొద చేస్తోంది.
***
సాయంత్రం నేను వచ్చేసరికి అనీల్ వాళ్ల అమ్మమ్మ తాతయ్యతో మాట్లాడుతున్నాడు. నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం నా కల్లోల మనసుకు హాయినిచ్చింది.
పొద్దునే్న అమ్మకు కాఫీ ఇస్తున్నపుడు ‘లలితా! మేము సాయంత్రానికి బయలుదేరుతాం తల్లీ. నువ్వు వచ్చేటప్పటికీ మాకు బస్ టైమ్ అవుతుంది. అందుకే ఇప్పుడు చెబుతున్నా’అంది. నేను ఒక్క నిముషం ఏమాట్లాడలేకపోయాను.
అదేంటమ్మా మీరు ఎక్కడకు వెళ్తారు అన్నాను వస్తున్న కన్నీటి ఆపుకుని ఆ సంగతి మళ్లీ నీకు ఫోన్ చేసి చెబుతాలేం అమ్మా. నీవు జాగ్రత్త అల్లుడిని అనీల్‌ను జాగ్రత్తగా చూడు అంది.
పరమేశ్వర్ అంతలో నాకోసం హారన్ కొట్టాడు.
‘అమ్మా రేపు వెళ్లచ్చులే. నేను వచ్చాక మాట్లాడుతాను ఇప్పుడుటైం అయింది’ అనేసి వచ్చేసాను.
మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాను. కానీ ఆఫీసులోకుదరలేదు.
సాయంత్రం కూడా లేట్ అయింది. ఇంటికి వచ్చాను.
అమ్మవాళ్లు లేరు. అనీల్ చదువుకుంటున్నాడు.
పరమేశ్వర్ ‘నీకు లేట్ అవుతుందని హోటల్ నుంచి రాత్రికి తిండి తెప్పించాను’అన్నాడు.
‘అమ్మా వాళ్లు ఏరి’అన్నాను.
‘వెళ్లిపోయారు’ వెంటనే చెప్పేశాడు అనీల్.
నాకెందుకో సంతోషంగా చెబుతున్నాడు అనిపించింది.
రెండు రోజులైనా అమ్మ దగ్గర నుంచి ఫోన్‌లేదు.
వారం గడిచింది. అయినా కాల్ రాలేదు.నా మనసు వేదనతో నిండిపోయింది. నేను చేసినా ఆ ఫోన్ స్విచ్చాప్ అని వస్తోంది. ఈ ముసలి వయస్సులో ఎక్కడ ఉన్నారో ఏమిటో అనుకుంటూ ఉన్నాను.
నా మనసు నీవు ప్రవర్తించిన దాని వల్లనే ఇలా జరిగింది’అని అంటోంది.
అంతలో ఫోన్ మోగింది. చూశాను.అమ్మ.
కన్నీళ్లతో అడిగాను. ఎక్కడ ఉన్నారు. ఎలా ఉన్నారు అని అమ్మ ఏదోలేమ్మా.. ఉన్నాము. అంతే. అంది.
మాటలు సాగలేదు. నేను వచ్చి చూస్తాను అమ్మా.
ఇప్పుడే వద్దులేమ్మా తర్వాత చెబుతాను అపుడు వద్దువుగానీ అంది
***
ఆఫీసునుంచి ముందుగానే వచ్చేశాను,
‘చూశావా ప్రతిమా! అమ్మ లో మార్పు రానేలేదు. ఎప్పటికీ వాళ్ల అమ్మనాన్న గురించే ఆలోచిస్తోంది. వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని తెగ ఆరాట పడుతోంది. కానీ అదే మా నాన్నమ్మ తాతయ్య విషయంలో ఆరాటం కాదుకదా అసలే తప్పు చేశానన్న భావనే లేదు. ఇట్లాంటి అమ్మ గురించి నీవు చెబుతున్నావు. నీకు తెలియదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు.. నాన్న ఉత్త వేస్టు. గంగిరెద్దులా తలాడిస్తాడు ’ అనీల్ గొంతు స్పష్టంగా ఉంది.
ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకొంటూ అక్కడే ఆగాను. అంతలో పరమేశ్ కూడా వచ్చాడు. ఇద్దరమూ తలుపు బయటే ఉన్నాం.
లోపల నుంచి మళ్లీ అనీల్ గొంతు..
‘నీకు తెలియదు ప్రతిమా. అంతా నాన్న వల్లే ముందునుంచే అమ్మ చేసేటపుడు ఇది తప్పు చేయకు అని గట్టిగా చెప్పి ఉంటే అమ్మ ఇంతగామారేది కాదు కదా. ఇద్దరిదీ తప్పు. నువ్వు ఎంత చెప్పినా నేను వీరిని క్షమించను. ఇక రేపట్నుంచి నేను మా నాన్నమ్మ దగ్గరకు వెళ్లిపోతాను. అయినా వీళ్లకు బుద్ధి రాదు. నీతో తర్వాత మాట్లాడుతాలే. ఇక వీళ్లు వచ్చేవేళ అయింది ఒకే బాయ్’
అన్నాడు. ఇద్దరమూ లోపలికి నడిచాము.
పరమేశ్ ‘ఏం అనీల్. ఎందుకురా ఇంత కోపమా.. ’అన్నాడు.
‘కోపమా ఎవరికి ఎందుకు’అంటున్నాడు అనీల్
‘నువ్వు ఎవరితో మాట్లాడావు ఇంతసేపు’అన్నాను నేను ‘నేను ఎవరితో మాట్లాడాలో కూడా నీవే నిర్ణయిస్తావా. నేను నాన్న ను కాదు. నాకు తెలుసు నేను ఎవరితో మాట్లాడాలో కూడదో. నా నిర్ణయాలు నేను తీసుకొంటాను’ వాడు గట్టిగా చెప్పేశాడు.
నేను నివ్వెరపోయాను. ‘నువ్వు ఇంకా పదోక్లాస్‌నే. ఇంకా ఎంతో చదవాలి. దానికి మా అండ నీకుండాలి. పైగా రేపొద్దున్న నీవే మమ్ముల్ను చూస్తావని మేము అనుకొంటూ ఉంటే ఇప్పుడే ఇలా సమాధానాలు చెబుతున్నావు అంటూ నా ఉక్రోషాన్ని వెళ్లగక్కాను.
అనీల్ వెంటనే ‘ఏంటి నేను చూసేది. నీవు ఎవరిని చూశావు. నీ అండ నాకు అక్కర్లేదు. ఎలాగోలా నేను బతుకుతాను. చదువుతాను . రేపే ఇల్లు వదలి వెళ్లిపోతున్నాను’ అన్నాడు
నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది.
‘ఎక్కడకు పోతావు. బెదరిస్తున్నావా’ కోపంగా అన్నాను
‘నేనుబెదిరించడం లేదు. చేయబోయే విషయం మాట వచ్చింది కనుక చెబుతున్నాను’అన్నాడు అనీల్
‘లలితాకాస్త ఆగుతావా. వాడికెందుకు కోపం వచ్చిందో తెలుసుకోకుండా నీవేమిటి ఇంత రాద్దాంతం చేస్తున్నావు’అన్నాడు పరమేశ్.
‘నాకు నీ సపోర్ట్ అక్కర్లేదు నాన్న. ఎప్పటిలా గంగిరెద్దులా తలాడించు ఆవిడ గారి మాటలకు ’అన్నాడు.
‘ఓరేయ్’ అన్నాను. వాడు విసురుగా లేచి లోపలికి వెళ్లాడు.
అంతే వేగంగా బ్యాగ్ పట్టుకుని వచ్చి ఇదిగో నేను పోతున్నాను. మీరు కొనిచ్చిన ఈ బట్టలు, పుస్తకాలకు కొద్ది రోజుల తర్వాత డబ్బు పంపిస్తాను. నాకు మీకు ఎటువంటి రిలేషన్స్ లేవు అనేసి బయటకు వెళ్లిపోయాడు.
ఈ హఠాత్ సంఘటనకు నేను అవాక్కు అయ్యాను. పరమేశ్ మాటలు రానట్టు ఉండి పోయాడు.
దీనికి కారణం ఏమిటా అనుకొన్నాను.
అంతలో ప్రతిమ ఫోన్ చేసింది. నేను ఫోన్ తీసుకున్నాను. అనీల్ అనుకొంది ఏమో‘అనీల్ నీవు తొందరపడకు. నేను ఆలోచించి ఏమి చేయాలో చెబుతాను’అంది.
నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఇపుడు దీని వెనుక ప్రతిమ ఉందన్న విషయం నాకు తెలిసింది.
అంతే మా అన్నయ్యకు ఫోన్ చేశాను. చడామడా తిట్టేశాను.
ఏమనుకొంటున్నావు. కన్న తల్లిదండ్రులను చూడడం పోయి నా ఇంట్లో నాకు నా కొడుకు కానీయ్యకుండా నీకూతురు ఏం చెబుతోంది. ఇదంతా మీ ఆవిడ ఆడిస్తోందా? నీవు దద్దమ్మవు అయ్యావు అనేశాను
ఫోన్ ఎప్పుడు పెట్టేశాడో తెలియదు. నేను అరుస్తూనే ఉన్నాను.
అంతలో పరమేశ్వర్ వచ్చి నా చేతిలో ఫోను తీసుకొని పక్కన పెట్టేశాడు.
‘కాస్త నిదానించు. మనింట్లో జరిగేవాటికి మీ అన్నయ్యవాళ్లు ఏం చేస్తారు.’ అన్నాడు
కాదండీ అంతా మా వదినే చేస్తోంది. ఆమె మాట్లాడక ప్రతిమతో ఆడిస్తోంది నాటకం అన్నాను.
నేను నిజమే చెబుతున్నాను. ఇపుడు కూడా అనీల్‌ను ఆమె పిలిపించుకుని ఉంటుంది అని నా అక్కసునంతా వెళ్లబుచ్చుకోబోయాను.
‘ఆపుఆపు నీవనుకొంటున్నది నిజం కాదు. ప్రతిమ నాకు ముందే అంతా చెప్పింది.నీకొడుకుకే నీ ప్రవర్తన పట్ల మండింది. వాడి ఆలోచన ప్రకారమే చేస్తున్నాడు. ఇదంతా మీ అమ్మనాన్నకు కూడా తెలుసు. వాళ్లు ఎక్కడికి పోలేదు. మా అమ్మనాన్నల దగ్గరే ఉన్నారు. నీవు మా అమ్మనాన్నలను కావాలని బయటకు పంపించావు. వాళ్లు నీకు చేదోడుగా ఉన్నా నీవు వారిని సహించలేకపోయావు. మీ అమ్మనాన్నలను కూడా అట్లా చూడకపోతే ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్‌గా తెలియాలని అనీల్ చేశాడు. నువ్వు అది తెలుసుకోలేదు కానిప్రతిమను అంటున్నావు. ప్రతిమనే అనీల్ ఆవేశాన్ని తగ్గించింది. లేకపోతే వాడు ఎప్పటికీ మనకు కాకుండా పోయేవాడు. ఇంకా ఏదో చెప్పబోతున్న పరమేశ్‌ను ఆపేశాను. అంతా అర్థమైంది అన్నాను.
***
పరమేశ్ కన్నా ముందే నిద్రలేచి కారు తీసుకొని అత్తయ్యవాళ్ల దగ్గరకు వెళ్లాను. ముసలివాళ్ల నలుగురు వాకిట్లో కూర్చుని కబుర్లు చెబుకుంటున్నారు. ప్రతిమ వారికి కాఫీలు అందిస్తోంది. అనీల్ కు ఏవో చెబుతున్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు.
అత్తయ్య దగ్గరకు వెళ్లి ఆమె పాదాలను పట్టుకున్నాను.
ఆమె కన్నీళ్లతో నన్ను దగ్గరకు తీసుకొంది.
అంతలో మామయ్య వచ్చారు. అమ్మా వచ్చింది. నావీపుపై చేయి వేసింది.
నేను అపుడే బయలుదేరుదామని అన్నాను.
కాని వాళ్లు ఇక్కడే రెండురోజులు ఉండి తర్వాత మీ దగ్గరకు వస్తాం అన్నారు. అంతలో పరమేశ్వర్ కూడా వచ్చాడు. అంతా కలసి రెండురోజులు హాయిగా పల్లె వాతావరణంలో ఉన్నాం.
***
అపుడే నిర్ణయం తీసుకొన్నాను.
కాదు వాళ్ల నిర్ణయానికి నేను తలూపాను. పరమేశ్వర్ అమ్మనాన్న, మా అమ్మనాన్న నలుగురూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. మేమూ వారితోనే ఉంటున్నాం.
నా మనసు ఇపుడు ప్రశాంతంగా ఉంది.
***
జరిగింది నాకొలిగ్ శ్రావ్యకు చెప్పాను. ‘నిజమే పిల్లలు అనుకొంటాం కాని, ఇప్పటి పిల్లలు నిర్ణయాలు తీసుకునే స్టేజీలో ఉన్నారు. వారికి తప్పొప్పులు తెలియడం కాదు. అవి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలుసుకొంటున్నారు’
అంది శ్రావ్య.
నేనూ తలూపాను.

- మానస